శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

భూమి గుండ్రంగా ఉంది-1

Posted by నాగప్రసాద్ Tuesday, May 5, 2009
రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.

ఓ పడవలో ఇద్దరు జాలర్లు, మామ, అల్లుళ్లు సముద్రం మీద విహరిస్తుంటారు. మామ వల విసుర్తుంటే అల్లుడు తెడ్డు వేస్తుంటాడు. ఇంతలో మామ విసిరిన వలలో రొయ్యల పంట పండుతుంది.

మామ - ఓరయ్యో రొయ్య! (పెద్దగా కేక పెడతాడు).
పడిందిరో రొయ్య
పులుసులో వెయ్య
పళ్లెంలో పొయ్య
పండగలే చెయ్య! (పాడుతూ గెంతుతుంటాడు మామ)
(అందించిన మూట అందుకుని ఆనందించకుండా అల్లుడు ఎటో చూస్తుంటాడు.)

మూట అట్టుకో ఎహే!
(మామ కసుర్తాడు. మూట ఇటు అందిస్తే, అల్లుడు చేయి అటు, అటు అందిస్తే చేయి ఇటు చాచుతాడు అల్లుడు. మామకి చిర్రెత్తుకొస్తుంది.)
మామ - అందుకోమంటే ఎకసెక్కే లాడతానవేట్రా? ఏటి ఇసయం?
అల్లుడు - నాకు అదొద్దు మామా.
మామ - మరేటి కావాలి, చాపలా?
అల్లుడు - కాదు.
మామ - మరేటి పీతలా?
అల్లుడు - ఊహు.
మామ - మరేటి కావాల్రా? (గొంతు పెద్దది చేస్తూ)
అల్లుడు - నాకూ అల్లది కావాల! (దూరంగా ఉన్న సూర్యుణ్ణి వేలితో చూపిస్తూ. మామకి ఏం చూపిస్తున్నాడో అర్థం కాదు. అపార్థం చేసుకుంటాడు.)

మామ - ఏటీ ఆ గెద్దలా?తప్పు రొరేయ్. గరుత్మంతుడు. తింటానన కూడదు! కల్లు పోతయ్!
అల్లుడు - అబ్బ! నీకెప్పుడూ తిండి గోలే మామా! నాకూ ఆ సూరీడు కావాల!
మామ - ఏటీ? సూరీడు కావాలా? మతి గాని పోయిందేట్రా? తప్పు. లెంపలేస్కో. సూరీడంటే ఏటి?
సూర్నారాయన మూర్తి. మనందరికీ, ఈ సముద్రానికి, చేపలకి, పీతలకి, ఈ (మూటని మురిపెంగా ముద్దు పెట్టుకుంటూ) రొయ్యలకి అందరికీ ఆరే దేముడు.

అల్ల్లుడు - లేదు మామా. చాలా కాలంగా చూస్తాన్నను మామా. ఈ సూరీడు రోజూ ఉదయానే ఆ తూర్పు కొండల ఎనకాల్నుండి టంగున పైకి లేస్తడు. పొద్దంతా తెప్ప ఏరు దాటినట్టు ఆకాసమంతా మెల్లంగ దాటుతాడు. సాయంకాలానికి అల్లక్కడ నీట్లో బుడుంగున మునుగుతడు. పద మామా ఆడికి పోయి యాడ మునిగాడో చూసి ఆణ్ణి అట్టుకుందాం. ఇయాల ఎట్టాగయినా ఆ సూరీణ్ణి అట్టుకుంటే గాని ఇంటికిపొయ్యేదే లేదు.

మామ - నా కూతురు చెప్తా ఉండేది - మా ఆయనికి పిచ్చని. నిజంగా కాస్త ఉండాది.
సూరీడు యాడ మునిగాడో పోయి చూసొస్తావా? నీ కోసం ఆడ ఆయన కాసుక్కూసుంటాడు అనుకున్నావేటి?
అల్లుడు - మరేటి అవుతాడు మావా?
మామ - ఏటవుతాడేటి? ఏట్లో మునిగిపోతడంతే!
అల్లుడు - అదే మావా! మునిగిపోయి ఏటవుతాడూ అని అడుగుతుండ.
మామ (గొంతు పెద్దది చేస్తూ) - మునిగిపోయి ఏటవుతాడేటి? నీట్లోపలికి దూరిపోయి ఆళ్ళమ్మ పెట్టిన బువ్వ తిని తొంగుంటడు. లేకపోతే ఏటా యదవ ప్రశ్న.
అల్లుడు - (ఒక్క క్షణం మౌనంగా ఉండి) మరయితే...ఇయాల ఆడ(పడమటి కేసి చూపిస్తూ) మునిగినోడు, మరుసట్రోజు ఆడ (తూర్పు కేసి చూపిస్తూ) ఎట్టా తేల్తాడు మావా?
మామ - ఇయాల నీకు చెప్పాల్సిందేనంటావ్?

అల్లుడు - (బింకంగా చూస్తూ) సముద్రం గురించి నీకు అంతా తెలుసంటావ్ కద మావా?
మామ - సముద్రం గురించి తెలుసన్నాగాని సూరీడు గురించి తెలుసన్లేదు కదరా! అసలు నిజం చెప్పాలంటే ఒరేయ్! చిన్నప్పుడు ఓ సారి నాకూ సరిగ్గా ఇదే డౌటు ఒచ్చిందన్నమాట. అప్పుడు మా తాత నడిగా. ఆయనేటన్నాడంటే సాయంకాలం సూరీడు మునిగిపోగానే ఆడ ఓ పెద్ద పడవ ఉంటాదట. అచ్చి, ఇలాంటిది కాదు (వాళ్ళున్న పడవ చూపిస్తూ) పేద్దది. అందులో సూరీణ్ణి ఎక్కించుకుని రాత్రి రాత్రికి ఆయన్ని సముద్రానికి ఈ చివర్నుండి ఆ చివరికి అట్టుకెళ్లి ఉదయానే ఒదిలేస్తరట. అప్పుడు మనకి తెలారుద్దట.

అల్లుడు - అట్టాగా? (కళ్ళలో కాంతులు కనిపిస్తాయి). అయితే మావా నాకో చిన్నకోరిక.
మామ - ఏటో?
అల్లుడు - ఇయాల రాత్రికి ఈడే ఉండిపోదాం మావా.
మామ - ఎందుకో?
అల్లుడు - సూరీణ్ణి ఈ దారి ఎంబటే పట్టుకుపోతారని చెప్పావు కద మావా? ఈడ చీకట్లో దారి కాసి ఆణ్ణి పట్టుకుందాం మావా?
మామ - ఈ సూరీడు పిచ్చేంట్రా బాబో! (మొత్తుకుంటాడు)
(తనే మళ్లీ) ఒరే పిచ్చి సన్నాసీ!(ఫిలసాఫికల్ నవ్వు నవ్వి) నేను చెప్పడం బాగుంది. నువ్వు యినడం బాగుంది. పడవలో సూరీణ్ణి ఎక్కిస్తే పడవ బుగ్గయిపోదా? పెద్దోళ్లు ఏదో అంటారు. ఇని ఊ కొట్టాల. అంతే.
అల్లుడు - అంటే, ఇంత సేపు నాకు చెప్పింది ఉత్తిది అన్నమాట (బింకంగా).
మామ - అసలు నిజానికి మా తాత ఏం చెప్పాడంటే...
అల్లుడు - అదేటి. ఇందాక మరేదో చెప్పాడన్నావ్?
మామ - ఓ అదా? ఆడు వేరు. ఈడు మరో తాత. ఏం చెప్పాడంటే... ఇప్పుడు మన గుడిసె కాడ ఓ మందార చెట్టు లేదూ?
అల్లుడు - ఉంది.
మామ - దానికి రోజూ పొద్దున్నే తెల్లని మందార పూలు పొడుస్తాయా?
అల్లుడు - ఔను.
మామ - ఆ పూలు సాయంకాలానికి ఏటవుతాయి?
అల్లుడు - రాలిపోతయ్.
మామ - కదా? ఈ సూరీడు కూడా అంతే. తెల్లారే ఆ కొండల కాడ పొడుస్తడు. పొద్దుటేళకి నీట్లో రాలిపోతడు. మరి పైకి రాడు.
అల్లుడు - అట్టాగయితే రేపు ముందే బయల్దేరి ఆడు పడుతూంటే చుటుక్కున అట్టుకుందాం.
మామ - పనీ పాట లేదేట్రా? చేపలు అట్టుకోమంటే సూరుణ్ణి అట్టుకుంటానంటాడేటి? ముందు ఈ మూట అట్టుకో. బేగి ఇంటికి పోవాల.
అల్లుడు - లేదు మామా. ఇయాల ఎట్టాగయినా సూరీణ్ణి ఇంటికి అట్టుకుపోవాల.
మామ - కుదరదహే!
అల్లుడు - మామా, మామా! (కాళ్లా వేళ్లా పడుతుంటాడు)
మామ - ఓరేయ్ చంపుతున్నావ్! అసలు ఇసయం ఏటంటే అసలు సూరీడు భూమ్మీద లేడు. భూమికి దూరంగా ఆకాసంలో ఉంటాడు.
అల్లుడు - అవును. గాని సాయంకాలానికి సముద్రంలో మునుగుతాడని ఇందాకేగా అన్నావ్?
మామ - అంటే అదంతా ఏదో మా తాతలు చెప్పింది చెప్పా. అసలు నిజం ఏటంటే...
అల్లుడు - అదేటి మరి ఇదెవరు చెప్పేరు?
మామ - ఇది మరో తాత చెప్పేడు.
అల్లుడు - అదేటి నీకు ఉన్నది ఇద్దరు తాతలేగా?
మామ - ఈడు వేరు (అని నాలుక కరుచుకుంటూ) తాతల జోలి మనకెందుకులే గాని, అసలు ఇసయం ఏటంటే సూరీడు నీట్లో మునగడు. ఆకాసంలోనే ఉంటాడు. సాయంకాలానికి భూమి అడుక్కి పోయి దాక్కుంటాడు.

అల్లుడు - అదేటి పడవకి అడుగు ఉన్నట్టు భూమికి అడుగు ఉంటాదా?
మామ - బంగారంలాగ ఉంటాది. ఇప్పుడు ఈ గంప భూమి (ఓ గంప ఎత్తి పట్టుకుంటూ).
మనం మధ్యలో ఈ చేపల్లాగ ఉన్నాం. చూట్టూ సముద్రం. సముద్రం సివార్లో భూమి అంచు ఉంటాది.
సూరీడు ఈ గంపకి దూరంగా ఇక్కడున్నాడన్న మాట.
అల్లుడు - అంటే అంచుకాడికి ఎళ్లి తొంగి చూస్తే కింద సూరీడు కనిపిస్తాడా మామా?
మామ - అంచు కాడికి పొయ్యే లోపు పానం పోదూ? అబ్బో ఎంత దూరం. ఎంత దూరం!
అల్లుడు - ఓ మైలు ఉంటాదా?
మామ - మైలా? హ్హహ్హ! మరో మాట చెప్పు.
అల్లుడు - పోనీ నాలుగు మైళ్ళు.
మామ - ఒకటి,రెండు కాదేస్! చానా చానా మైళ్లు ఉంటాది.
అల్లుడు - అసలెవరైనా అంచుకాడికి పోయి చూసొచ్చారా మామా?
మామ - చూసినోళ్లు ఉండొచ్చు. చూసి ఒచ్చినోళ్లు లేరు.
అల్లుడు - పోనీ మీ తాత? అదే తాతలు?
మామ - మా తాతలు ఊసు ఒద్దన్నానా.ఆలీసెం అవుతున్నాది. ఇంటికి పోదాం పద.
అల్లుడు - భూమి అంచుకాడికి పోయి ఓ సారి ఇట్టా తొంగి చూడాలనుంది మామా!
మామ - ఎట్టా?
అల్లుడు - ఇట్టా (తొంగి చూపిస్తాడు. ఇదే ఛాన్సని మామ అల్లుణ్ణి సముద్రంలోకి నెట్టుతాడు. వాడు మొత్తుకుంటూ ఉంటాడు.)
మామ - ఏట్రా అరుస్తున్నావ్. ఏటి కావాల?
అల్లుడు - రక్షించు మామ, రక్షించు!
మామ - ఏం, సూరీడు ఒద్దా?
అల్లుడు - ఛస్తే ఒద్దు. పైకి లాగు మామా, సొరచేప కాలట్టుకుంటది.
మామ - అట్టారా దారికి.

(అల్ల్లుణ్ణి పైకి లాగుతాడు. అప్పటికే చీకటి పడుతూ ఉంటుంది. పూర్తిగా తడిసిన అల్లుడు చలికి వణుకుతూ పడవలో కూర్చుంటాడు. మళ్లీ పడవ సంగీతం.)
అల్లుడు - మామా...
మామ - మళ్లీ ఏట్రా?
అల్లుడు - చలేస్తాంది. కాస్త సూరీడు ఉంటే బావుంటాది మామా!
మామ - (తలపట్టుకుంటాడు).

ఆ విధంగా భూమి గురించి, సూర్య చంద్రుల గురించి వెర్రి మొర్రి ఆలోచనలు చలామణి అవుతున్న దశలో ఓ గ్రీకు తాత్వికుడు ఈ విషయం గురించి లోతుగా ఆలోచించసాగాడు. అతడే అనాక్సీమాండర్.

మరికొంత వచ్చే టపాలో...

3 comments

  1. మూఢనమ్మకాలు, అజ్ఞానం చాలా ఎక్కువగా ఉన్న రోజుల్లో భూమి గుండ్రంగా ఉంటుందని ఊహించడం నిజంగా గొప్పే. అనాక్సిమాండర్ భూమి cylindrical ఆకారంలో ఉంటుందనుకున్నాడు. భూమి గుండ్రంగా ఉంటుందని మొదట ఊహించినది పైథాగొరస్ శిష్యులే.

     
  2. Nrahamthulla Says:
  3. మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

    * పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
    * పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
    * బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
    * జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
    * అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
    * చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
    * చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
    * కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
    * బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
    * తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
    * కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
    * నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
    దేశంలో కొన్ని మూఢనమ్మకాలు
    * ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.
    * మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
    * కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
    * నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
    * గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

     
  4. మన దేశంలో మూఢనమ్మకాల సమస్య గురించి ఒక అవగాహన ఉంది కాని, మీరు ఇచ్చిన వివరాలు చూస్తుంటే అదురు పుడుతోంది. ( మీరు చెప్పిన ఉదాహరణలు ఎక్కువగా గ్రామాలకి చెందినవి. కాని ఆడపిల్లే పుట్టేట్టయితే అబార్షన్ చెయ్యించే డబ్బున్న, చదువుకున్న మూఢుల సంగతి మరీ ఘోరం.)

    చదువు, ముఖ్యంగా విజ్ఞానం యొక్క వ్యాప్తి బాగా జరిగితే ఈ ’వ్యాధి’ నయం అవుతుంది అని ఒక నమ్మకం. అనుభవం ద్వార వైజ్ఞానిక విషయాలు ఎవరికి వారు పరీక్షించుకుని, నిర్ధారించుకోగలిగితే ఆ జ్ఞానం ఈ మూఢనమ్మకాలని నాశనం చేస్తుంది. కాని సమస్య బాగా లోతుగా పాతుకుపోయింది. ఇలాంటి వాళ్ల మీద సూటిగా ధ్వజం ఎత్తడం వల్ల పెద్ద ప్రయాజనం ఉండదని అనిపిస్తుంది. దీర్ఘకాలిక పరిష్కారాలు ఆలోచించాలి. విద్య యొక్క ప్రభావం చేత నెమ్మదిగా వాళ్ల మనసులు సంస్కరింపబడాలి. దానికి సమయం పట్టినా అలాంటి మార్పే చివరికి నిలుస్తుంది.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts