శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

కల్లోలతా సిద్ధాంతం - పార్ట్ 11

ఆధునిక వాతావరణ నమూనాలు ఎలా పని చేస్తాయో ఓసారి చూద్దాం. రమారమి అరవై మైళ్ళ సమమైన ఎడం ఉన్న స్థానాలతో భూమి అంతా విస్తరించిన ఓ ఊహాత్మక గడిని తీసుకుంటారు. ప్రతీ స్థానంలోని వాతావరణాన్ని గురించిన సమాచారం పృథ్వీ కేంద్రాల నుండి, ఉపగ్రహాల నుండి వస్తుంది. అయితే కొన్ని కొన్ని స్థానాల నుండి - కేంద్రాలు లేకపోవడం చేతగాని మరే కారణం చేతగాని సమాచారం లభించకపోవచ్చు. అటువంటప్పుడు పొరుగుస్థానాలలో నమోదు అయిన సమాచారం బట్టి ఇక్కడి సమాచారాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ అంచనాల్లో దోషాల వల్ల వాతావరణ నిర్ణయంలో తప్పులు దొర్లుతాయి. ఆరంభస్థితిలో ఎంత దోషం ఉంటే భవిష్యత్ స్థితిలో అంత దోషం వచ్చే అవకాశం ఉంటుంది. పోనీ ఆరంభ స్థితి గురించి చాలా కచ్చితమైన సవివరమైన సమాచారం దొరికిందని అనుకుందాం. అంటే భూమి మొత్తాన్ని ఒక అడుగు పరిమాణం ఉన్న చదరపు గడితో నింపేసి, అలాగే ఊర్థ్వ దిశలో కూడా వాతావరణపు పైపొర వరకు ఒక్కొక్క అడుగునా సమాచారం దొరికింది అనుకున్నాం. అసలు అంత వివరమైన సమాచారం కావాలంటే ఎన్ని ఉపగ్రహాలు, ఎన్ని వాతావరణ కేంద్రాలు కావాలో చెప్పలేం. పోనీ అవన్నీ ఉన్నాయనుకుందాం. అంత సమాచారమూ ఒక ప్రత్యేకమైన రోజు మధ్యాహ్నం 12 గంటలకి దొరికింది అనుకుందాం. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని 12.01కి, 12.02కి, 12.03...ఇలా వరుసగా నిముష నిముషానికి వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పగలమా?

చెప్పలేం. మీకు నచ్చినా నచ్చకపోయినా సమాధానం అదే. అంత సమాచారం ఉన్నా కూడా ఉదాహరణకి వచ్చే నెల ఒకటో తారీఖున ఢిల్లీ విమానాశ్రయంలో పొగమంచు ఉంటుందా లేదా అని అడిగితే కంప్యూటర్ చెప్పలేకపోవచ్చు. ఏం, ఎందుకని? అరవై మైళ్ళ ఎడం ఉన్నప్పటి కన్నా అడుగు ఎడం ఉన్నప్పుడైతే నమోదు అయిన వాతావరణ సమాచారంలో దోషం తక్కువగా ఉంటుంది నిజమే. కాని అసలు దోషమే ఉండదని కాదుగా. వాతావరణ పరిణామం తీరు అత్యంత సంక్లిష్టంగా ఉండడం చేత ఆ అతి స్వల్ప దోషం కూడా ఇట్టే విస్తరించి, "ఇంతింతై" అన్నట్టు పెరిగిపోతుంది. ఓ వారం రోజుల తరువాత గగనంలో ఏం జరుగుతుందో చెప్పడం గగనం అయిపోతుంది. దీనికే "తూనీగ న్యాయం"
అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. మన పెరట్లో తూనీగ రెక్కలు అల్లారిస్తే ఎక్కడో బ్రహ్మపుత్రలో వరదలొచ్చాయట! అతి స్వల్ప కారణం పెరిగి పెచ్చరిల్లి పెనుఫలితానికి దారి తీయడమే ఈ తూనీగ న్యాయం. వాతావరణ పరిణామంలో ఉండే సంధిగ్ధతలకి అద్దం పడుతుందీ న్యాయం.

తక్కిన వ్యవస్థల్లోలా కాక వాతావరణం విషయంలో అలా స్వల్ప దోషం కూడా ఇట్టే పెరిగి పెచ్చరిల్లిపోవడం అన్న విషయం బాగా అనుభవం ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలకి కూడా మింగుడు పడేది కాదు. లారెంజ్‌కి రాబర్ట్‌వైట్ అని ఓ మిత్రుడు ఉండేవాడు. ఇతను ఎం.ఐ.టి. వాతావరణ విభాగంలో లారంజ్‌కి సహోద్యోగి. లారెంజ్ అతనితో తూనీగ న్యాయం గురించి, వాతావరణ నిర్ణయం గురించి చర్చించాడు. "వాతావరణాన్ని నిర్ణయించడవేం ఖర్మ, సుభ్రంగా నియంత్రించొచ్చు!" అన్నాడాయన ధీమాగా. నిజమే. స్వల్ప కారణాలు పెనుఫలితాలు
కలుగుజేసేట్టయితే నియంత్రణకేం తక్కువ?

కాని లారెంజ్ సమస్యని మరో కోణం నుండి చూశాడు. చిన్న చిన్న ప్రభావాలతో వాతావరణంలో పెద్ద పెద్ద మార్పులు తేవడం అసాధ్యం కాదు. కాని ఆ మార్పు మనకు అనువుగా ఉంటుందని ఏంటి నమ్మకం? వర్షాన్ని ఆకర్షించబోతే వరదలొచ్చి పడవని ఏంటి భరోసా?

లారెంజ్ ఆవిష్కరణ కేవలం యాదృచ్ఛికంగా జరిగింది. యాదృచ్ఛికమైన ఆవిష్కరణ అంటే అలనాడు స్నానాలతొట్టెలో నుండి లేచి దిసమొలతో వీధుల వెంట పరుగెత్తిన ఆర్కిమెడిస్సే గుర్తొస్తాడు. అయితే మన లారెంజ్ మరీ అంత సిగ్గు మాలిన వాడు కాడు. అనుకోకుండా తెలిసొచ్చిన విషయాన్ని అక్కడితో వదిలేయలేదు. గణితశాస్త్రం సంబంధమైన పద్ధతులతో ఆ విషయాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయడం మొదలెట్టాడు. ఆ భావాంకురాన్ని శ్రద్ధగా పోషించి ఓ మహాశాస్త్రవృక్షానికి రూపం పోశాడు.

మరికొంత వచ్చే టపాలో...

రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.

కంప్యూటర్ ఎంతో చిలక జోస్యమూ అంతే!

Posted by నాగప్రసాద్ Saturday, June 27, 2009 1 comments

కల్లోలతా సిద్ధాంతం - పార్ట్ 10

1980 లలో అమెరికన్ ప్రభుత్వం వాన్ నాయ్మన్ ఊహించిన లక్ష్యసాధన కోసం పెద్ద యెత్తున నిధులు కేటాయించింది. ఆ రోజుల్లో వాతావరణ నిర్ణయ విభాగం మేరీలాండ్ లో ఉండేది. అందులో ఓ పెద్ద సూపర్ కంప్యూటర్లో వాతావరణాన్ని సిములేట్ చేసే ప్రోగ్రామ్‌లు నడిచేవి. అయితే ఈ నమూనాకి లారెంజ్ వాడిన నమూనాకి అట్టే పోలిక లేదు. లారెంజ్ నమూనాలో కేవలం 12 సమీకరణాలే ఉన్నాయి. కాని అధునిక ధరావ్యాప్త నమూనాలో 500,000 సమీకరణాలు ఉంటాయి. లారెంజ్ వాడిన రాయల్‌మక్‌బీ కంప్యూటర్ సెకనుకి 60 గుణకారాలు చేస్తుంది. కాని వాతావరణ కార్యాలయం వాడే "కంట్రోల్ డాటా సైబర్ 205" సూపర్ కంప్యూటర్ సెకనుకి కొన్ని మిలియన్ల క్రియలు చేస్తుంది. సాటిలైట్ల నుండి, విమానాల నుండి, ఓడల నుండి ఇలా భూమి నలు మూలల నుండి వచ్చే సమాచారాన్ని పోగుచేసి అద్భుతంగా వాతావరణ నిర్ణయం చేస్తుంది. ఆ విధంగా అమెరికాకి చెందిన "జాతీయ వాతావరణ కేంద్రం" ప్రపంచంలో రెండవ గొప్ప వాతావరణ కేంద్రంగా పేరు తెచ్చుకుంది.

అయితే మొదటి స్థానం అమెరికాకి కాదు ఇంగ్లండుకి దక్కింది. "ఐరోపా మాధ్యమితి వాతావరణ నిర్ణయ కేంద్రం" లండన్‌కి దగ్గర్లో రీడింగ్ అన్న ఊళ్ళో ఉంది. అనేక రకాల చెట్ల నీడలో నిలుచుంది ఆ భవంతి. నానా దేశాల దాతృత్వంతో నడుస్తోంది ఆ కేంద్రం. యూరప్‌లో అన్ని రంగాల్లోనూ సమైక్యతా భావం పటిష్టం అవుతున్న రోజులవి. కఠినమైన వాతావరణ నిర్ణయ లక్ష్యం కోసం తమ శక్తి యుక్తులన్నీ కూడదీసి శ్రమించాలని నిర్ణయించుకున్నాయి ఐరోపా దేశాలు. వాతావరణ నిర్ణయంలో ఈ కేంద్రం అగ్రస్థానంలో ఉండడానికి కారణాలు రెండు. మొదటిది చేవ, తెగువ బలంగా ఉన్న కుర్రకారు సిబ్బంది. రెండవది "క్రే" సూపర్ కంప్యూటర్. అమెరికన్ సూపర్ కంప్యూటర్ కన్నా ఇది ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉండేది.

పెద్ద పెద్ద కంప్యూటర్ల వినియోగం వాతావరణ నిర్ణయంతోనే ఆగిపోలేదు. విమానాల ప్రొపెల్లర్ రూపకల్పనకి సంబంధించిన ద్రవ ప్రవాహాల పరిశోధన దగ్గర్నుండి, ఆర్థిక రంగంలో విత్త ప్రవాహ అధ్యయనం వరకు నానా రకాల సమస్యలలోను కంప్యూటర్ శక్తిని వాడుకోవడం జరిగింది. అసలు 1970, 80ల నాటికి ఆర్థిక రంగంలో భవిష్యత్ నిర్ణయానికి, వాతావరణ రంగంలో భవిష్యత్ నిర్ణయానికి మధ్య పోలిక కొట్టొచ్చినట్టు కనిపించింది. చిత్ర విచిత్రమైన సమీకరణాల జాలాలని కంప్యూటర్‌లో ప్రోగ్రామ్ చేసి నడిపించి భవిష్యత్ ఒరవడులు ఎలా ఉంటాయో పరిశీలించేవారు. పరిణామం మరీ ప్రకృతి విరుద్ధంగా ఉంటే సమీకరణాలలో తగు సవరణలు చేసుకుని, ప్రోగ్రాములు మార్చుకుని కృషి కొనసాగించేవారు. అయితే ఆర్థిక రంగంలో మాత్రం భవిష్యత్ నిర్ణయ ప్రయత్నం దారుణంగా విఫలమయ్యేది. అయినా కూడా ఎందుచేతనో ఈ రంగం తీరు తెన్నులు తెలిసిన వారు కూడా ఈ కంప్యూటర్ జాతకాలని నమ్మేవారు. పారిశ్రామిక ప్రగతి గురించి, నిరుద్యోగ శాతాల గురించి కంప్యూటర్ అంచనా వేసిన అంకెలని రెండు, మూడు దశమ స్థానాల వరకు ధీమాగా పేర్కొనేవారు. ఈ అర్థంలేని అంచనాల కోసం ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు బోలెడంత డబ్బు తగలేసేవి. ఆ అంచనాలని ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకునేవి. మరి "వినియోగదారుల ఆశాభావం" వంటి అనిర్దుష్ట రాశులని అంకెలతో వ్యక్తం చెయ్యడం ఎలా సాధ్యం? అలాంటి అనిర్దుష్ట రాశులకి డబ్బు, లాభం వంటి పరమ నిర్దుష్ట రాశులతో గల లంకె ఏమిటో చెప్పడం ఎలా సాధ్యం? ఈ అసాధ్యాలని, సాధ్యం చేస్తోంది, లేదా చేస్తున్నట్టు అనిపిస్తుంది కనుకనే ఆ కంప్యూటర్ జాతకాలకి అంత గిరాకి. కాని అలాంటి అంచనాలు ఎంత పెళుసైనవో, అవిశ్వసనీయమైనవో లోతుగా అర్థం చేసుకున్న వారు బహుకొద్ది మంది.

అంతవరకు కేవలం ఒక కళగా పరిగణించబడే వాతావరణ సమస్య కంప్యూటర్ రాకతో ఒక కచ్చితమైన శాస్త్రంగా రూపుదిద్దుకోసాగింది. అసలు ఏమీ లేని దానికన్నా కాస్త ఒప్పుతప్పులతో కూడుకున్న ఈ కంప్యూటర్ అంచనాలు ఎంతో మేలని, వాటి వల్ల ఏటా బిలియన్ల డాలర్లు ఆదా అవుతున్నాయని యూరోపియన్ కేంద్రం వ్యవహారాల బట్టి తేలింది. అయితే ఆ భవిష్యత్ నిర్ణయం రెండు మూడు రోజులని దాటి పోలేక పోయింది. భవిష్యత్తులో అంతకన్నా ఎక్కువ దూరం చూడాలంటే కంప్యూటర్ ఎంతో చిలక జోస్యమూ అంతే! ఎందుకంటే ప్రాంతీయ వాతావరణ నిర్ణయం చేయాలన్నా ధరావ్యాప్తంగా సమాచారం అవసరమవుతుంది. ఒక చోట జరిగిన నిర్ణయ దోషం చకచక ఇతర ప్రాంతాలకి వ్యాపించి, వర్తిస్తుంది. వాతావరణం మరీ పెళుసైన వ్యవహారం అని మొదట్నుంచి తెలిసిందే!

మరికొంత వచ్చే టపాలో...

రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.

పాతాళానికి ప్రయాణం - పార్ట్ 6

Posted by V Srinivasa Chakravarthy Friday, June 26, 2009 4 comments


మామయ్య ఆ అక్షరాల కేసి కళ్లజోడు సర్దుకుని తదేకంగా చూశాడు.
“ఇవి రూనిక్ అక్షరాలే. స్నోర్ టరెల్సన్ వ్రాసిన వ్రాతప్రతి లోని అక్షరాల మాదిరిగానే ఉన్నాయి. కాని ఇంతకీ వాటి అర్థం ఏమిటి?”

చిచిత్ర విచిత్రంగా మెలికలు తిరిగిపోతున్న ఆ అక్షరాలని చూస్తే అవి కచ్చితంగా అమాయక ప్రజలని తికమక పెట్టటానికి ఎవరో తెలివైన వాళ్లు పన్నిన పన్నాగం అనిపించింది నాకైతే.

“ఇది నిజంగా ప్రాచీన ఐస్లాండిక్ భాషే,” గొణుగుతున్నట్టుగా అన్నాడు మామయ్య.

చెప్పలేదు కదూ? మా మామయ్య బహుభాషా కోవిదుడు. అంటే భూమి మీద ఉండే రెండు వేల భాషలూ, పన్నెండు వేళ మాండలికాలూ అన్నీ ఆయనకి వచ్చని అనటం లేదు. భాషలలో ఆయనకి లోతైన పరిజ్ఞానం ఉందని మాత్రం విన్నాను.

ఇక ఏ క్షణం మిన్ను విరిగి మీద పడుతుందో నని భయపడుతున్న సమయంలో గడియారం రెందు కొట్టింది. అంతలో మార్తా తలుపు తెరిచి,

“భోజనం తయార్!” అని ఎలుగెత్తి చాటింది.

వేడి వేడి సూప్ ఆయన బల్ల మీద పెట్టి మార్తా చల్లగా జారుకుంది. నేను కూడా అక్కణ్ణుంచి మెల్లగా బయటపడి డైనింగ్ రూం కి వెళ్లి నేను ఎప్పుడూ కూర్చునే చోట కూర్చున్నాను.

కాసేపు ఎదురు చూసాను. మామయ్య రాలేదు. ఎంత పనిలో ఉన్నా భోజనం వేళకి మాత్రం వచ్చి అందరితో తినే అలవాటు ఉంది మామయ్యకి. పైగా ఈ రోజు భోజనం మరీ ఘుమ ఘుమ లాడుతోంది. పార్స్లే సూప్, సారెల్ ఆకులు అందంగా చల్లిన ఆంలెట్, కమ్మని లేడి మాంసం ... ఒకటా రెండా, వివాహ భోజనంలా నోరూరిస్తోంది.

మామయ్య ఎంతకీ రాడే! నిశ్చయంగా ఆ చిత్తు కాగితం మోజులో పడ్డాడు! మరేం చెయ్యను? ఒక బాధ్యత గల మేనల్లుడిగా ఆయన వంతు, నా వంతు కూడా నేనే తినటానికి ఉపక్రమించాను.

“భోజనం వేళకి అయ్యగారు రాకపోవటం ఇదే మొదటి సారి,” మార్తా అంది కంగారుగా.

“నిజమే నాకూ అర్థం కావటం లేదు,” నోట్లో ఉన్న పదార్థాన్ని అటు ఇటు సర్దుకుంటూ ఇబ్బందిగా అన్నాను.

“ఇవాళ ఏదో ఉపద్రవం జరగబోతోంది,” మార్తా మళ్లీ అంది భయంగా.

ఆయన వంతు భోజనం కూడా నేనే తినేశానని మా మామయ్యకి తెలిస్తే, ఈ ప్రపంచంలో అంతకన్నా ఉపద్రవం మరేదీ ఉండదు. అంతలో భీకరంగా మరో కేక వినిపిస్తే నోట్లో పెట్టుకోబోతున్న ఐస్క్రీం ని అలాగే వొదిలేసి దిగ్గున లేచాను.

అయస్కాంతం వైపు దూసుకుపోతున్న ఇనుప రజనులా మామయ్య స్టడీ రూం వైపుగా దూసుకుపోయాను.

(ఈ ' సీరియల్ ' (ప్రస్తుతానికి) సమాప్తం)

కల్లోలతా సిద్ధాంతం - పార్ట్ 9

Posted by V Srinivasa Chakravarthy Thursday, June 25, 2009 0 comments




ఇటువంటి చింతనకి ఊపిరి పోసిన వాడు జాన్ వాన్ నోయ్మన్. ఇతడే ప్రప్రథమ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ నిర్మాత. వాతావరణాన్ని నియంత్రించే ఉద్దేశంతోనే ఈ కంప్యూటర్ నిర్మాణానికి పూనుకున్నాడు. కంప్యూటర్ సహాయంతో వాతావరణాన్ని ఎలా శాసించవచ్చో వివరిస్తూ సంచలనాత్మక ఉపన్యాసాలిస్తూ భౌతిక శాస్త్రవేత్తలని సమ్మోహింపజేశాడు. తన ఉద్యమంలో ఎందరో వాతావరణ శాస్త్రవేత్తలు చేరారు. ‘క్షణ క్షణముల్’ అన్నట్టుండే వాతావరణాన్ని కంప్యూటర్ సహాయంతో నియంత్రించడం ఎందుకు సాధ్యం అన్న విషయం గురించి నాయ్మన్ వాదన ఏంటో చూద్దాం. వాతావరణాన్ని ఒక గతి సరణి (dynamic system) కింద ఊహించుకోవచ్చు. ఏ గతిసరణి కైనా కొన్ని అస్థిరతా బిందువులు (unstable equilibria) ఉంటాయి. అలాంటి బిందువుల వద్ద వ్యవస్థ యొక్క పరిణామం ఎలా ఉంటుందో చెప్పలేము. ఉదాహరణకి ఒక స్థూపానికి అగ్రస్థానంలో ఓ బంతి ఉందనుకుందాం. చిన్న తెమ్మెర వీచినా ఆ బంతి అక్కణ్ణుంచి దొర్లిపోయి ఎటో జారిపోతుంది. అది ఏ దిశలో జారిపోతుందో చెప్పలేం. అయితే మామూలుగా గణిత శాస్త్రవేత్తలు అధ్యయనం చేసే గతిసరణులలో అటువంటి అస్థిరతా బిందువులు అక్కడక్కడ ఉంటాయంతే. వాటి దరిదాపుల్లో వ్యవస్థ ప్రవర్తన ఎలా ఉంటుందో కంప్యూటర్ సిములేషన్ల సహాయంతో అర్థం చేసుకుంటే ఇక ఆ వ్యవస్థ పూర్తిగా మన చెప్పు చేతల్లోకి వచ్చేసినట్టే. దాన్ని కావలసినట్టు నియంత్రించుకోవచ్చు. ఇకనేం! కంప్యూటర్ చేతిలో ఉంది కనుక ముందుగా ద్రవ్య ప్రవాహాన్ని అభివర్ణించే నేవియర్-స్టోక్స్ సమీకరణాల సహాయంతో వాతావరణాని కూడా శుభ్రంగా, క్షుణ్ణంగా సిములేట్ చేసేయాలి. అందులో అస్థిరత ఎక్కడెక్కడ ఉందో తెలిసేసుకోవాలి. మబ్బులని ‘సీడింగ్’ చెయ్యడం, ఆకాశమంత పొగతెరలు సృష్టించడం మొదలైన విన్యాసాలతో వాతావరణాన్ని వశం చేసుకోవాలి. ఊహాగానం బనే ఉంది. కాని ఇక్కడ నాయ్మన్ ఓ ముఖ్యమైన విషయం విస్మరించాడు. వాతావరణ వ్యవస్థలో అస్థిరత కేవలం ‘అక్కడక్కడ’ లేదు. అది సర్వత్రా ఉంది. అసలు వాతావరణం ఓ ప్రత్యేక జాతికి చెందిన గతిసరణులలో ఒకటి. ఇలాంటి వ్యవస్థల్లో అస్థిరత అణువణువునా ఉంటుంది. అయితే ఆ విషయం బయటపడడానికి మరో రెండు దశాబ్దాలు అగాల్సి వచ్చింది.

పాతాళానికి ప్రయాణం - పార్ట్ 5

Posted by V Srinivasa Chakravarthy Wednesday, June 24, 2009 2 comments

“ఈ బుజ్జి తల్లి పేరా?” రెట్టించిన ఉత్సాహంతో అన్నాడు మామయ్య. “దీని పేరు ‘హైంస్ క్రింగా.’ రాసిన వాడు స్నోర్స్ టరెల్సన్ అని పన్నెండవ శతాబ్దానికి చెందిన ఐస్లాండ్ పండితుడు. ఐస్లాండ్ ని పాలించిన నార్వేజియన్ రాజవంశీయుల చరిత్ర ఇందులో ఉంది.”

“అయితే మరి ఇది జర్మను అనువాదమా?” అడిగాను.
“అనువాదమా? అనువాదంతో నాకేం పని?” కోపంగా అన్నడు మామయ్య. “ఇది ఐస్లాండ్ భాషలో వ్రాసిన మూలగ్రంథం. అనుపమాన ఉపమాలంకార ప్రయోగంతో, చక్కని వ్యాకరణ విశేషాలతో, సముచిత పదలాస్యంతో అద్భుతంగా వ్రాయబడ్డ పుస్తకం. “
“ఓహ్, భలే! అచ్చు కూడా బాగానే ఉందా?” ఇక ఏం అడగాలో తెలీక అడిగాను.
“అచ్చా?” ఆయన అరిచిన అరుపుకి ఒక అంగుళం ఎగిరి పడ్డాను. “ఒరే ఏక్సెల్ నీకు మతి గాని పోయిందా? అంత పాత పుస్తకం అచ్చు పుస్తకం ఎలా అవుతుంది? ఈది వ్రాతప్రతి. రూనిక్ భాషలో వ్రాసిన వ్రాతప్రతి.
“అవును కదూ? నిజమే,” కాస్త పశ్చాతాపం కనబరుస్తూ అన్నాను.
“ప్రాచీన ఐస్లాండ్ లో రూనిక్ లిపి వాడేవారు. ఆ లిపిని ఓడెన్ దేవత స్వయంగా రూపొందించాడని అంటారు. ఇదుగో చూడు. ఆ స్కాండినావియన్ దేవత స్వయంగా సృష్టించిన అక్షరాలు చూసి తరించు” అంటూ పుస్తకం నా ముందుకు తోశాడు.
ఎందుకొచ్చిందిరా దేవుడా, అంటూ ఆ పుస్తకం ముందు సాష్టాంగపడి లెంపలు వేసుకుందాం అని ఆయత్తం అవుతుంటే అంతలో... ఆ పుస్తకం లోంచి ఓ పాత కాగితం జారి నేల మీద పడింది.
“ఏయ్! ఏంటిది?” మామయ్య వంగి ఉత్సాహంగా ఆ కాగితాన్ని పైకి తీశాడు.
ఐదు అంగుళాల వెడల్పు, మూడు అంగుళాల పొడవు ఉన్న ఆ కాగితం ముక్క మీద ఏవో విచిత్రమైన అక్షరాలు రాసి వున్నాయి.
ఆ అక్షరాలే ప్రొఫెసర్ లీడెంబ్రాక్ ని, అతని మేనళ్లుణ్ణి పందొమ్మిదవ శతాబ్దం లోకెల్లా అత్యద్భుతమైన సాహసయాత్ర మీద పురికొల్పాయి.

ఇంతకీ భూమి ఎక్కడుంది?

Posted by V Srinivasa Chakravarthy Tuesday, June 23, 2009 2 comments

భూమి ప్రసక్తి ఎవరో తెస్తే ఒక జోక్ గుర్తుకొస్తోంది. ఇది నిజంగా జరిగిందని విన్నాను.
--
ఒక తండ్రి తన కూతురికి చీకటి ఆకాశంలో తారలు అవీ చూపిస్తున్నాట్ట.

“చూడమ్మా, అక్కడ తార లాగా మెరుస్తోందే, అది అసలు తార కాదు. వీనస్ గ్రహం. ఇంకా ఆ మూల కనిపిస్తోంది చిన్న ఎర్రని చుక్కలా, అది మార్స్ గ్రహం.”

“డాడీ, మరి మా పుస్తకంలో వీనస్ కి , మార్స్ మధ్య ఎర్త్ ఉంటుందని వుంది. ఇంతకీ భూమి ఎక్కడుంది డాడీ?”

--
పుస్తకాలకే పరిమితమైన మన బట్టీ చదువులకి మరో అసమాన తార్కాణం!

పాతాళానికి ప్రయాణం - పార్ట్ 4

Posted by V Srinivasa Chakravarthy Monday, June 22, 2009 0 comments

అధ్యాయం – 2
మా మామయ్య స్టడీ రూం చిన్న మ్యూజియం లా ఉంటుంది. ఖనిజ ప్రపంచంలో ఎక్కడలేని నమూనాలూ అక్కడ కనిపిస్తాయి. జ్వలనీయ ఖనిజాలు, లోహపు ఖనిజాలు, అశ్మకపు ఖనిజాలు ఇలా రకరకాల ఖనిజాలు -- మీద పేర్లు అంటించిన సీసాల్లో గది నిండా ఉంటాయి.

ఈ ఖనిజ శకలాలే నా ప్రియ నేస్తాలు. నా తోటి కుర్రాళ్లతో సరదాగా గడపకుండా ఎన్నో సార్లు ఈ గ్రాఫైట్లని, ఆంత్రసైట్లని, లిగ్నైట్, పీట్ మొదలైన బొగ్గు జాతులని దుమ్ము దులుపుతూ కాల క్షేపం చేస్తుంటాను. ఇక బిట్యుమెన్లు, రెసిన్లు, సేంద్రియ రసాయన లవణాలు – వీటినయితే చిన్న ధూళి కణం కూడా పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఈ ఖనిజ సమూహంలో బంగారం వంటి లోహాలు కూడా ఉన్నా, వాటికి సామాన్యంగా ఉండే హెచ్చు విలువ ఇక్కడ ఇవ్వబడదు. సామాజికమైన నిమ్నోన్నతలు లేకుండా ఇక్కడ ఒక విధమైన శాస్త్రీయమైన సర్వసమానత్వం చలామణి అవుతుంటుంది.

ఆదుర్దాగా మామయ్య గదిలోకి ప్రవేశించిన నేను ఇవేవీ ఆలోచించే పరిస్థితిలో లేను. నా కంగారు అంతా ఆయన నన్ను ఎందుకు పిలిచారన్న దాని గురించే. అంతలో తన చేతిలో ఉన్న పుస్తకం మీద నా దృష్టి పడింది.

“బ్రహాండమైన పుస్తకం,” చేతిలో ఉన్న పుస్తకాని మెచ్చుకుంటూ అన్నాడు మామయ్య. “ఏం పుస్తకం అనుకున్నవ్?”
మామ్మయ్య కి ఏదైనా మంచి పుస్తకం దొరికితే ఇక సంతోషం పట్టలేం.

“చూశావా? ఇది సామాన్యమైన పుస్తకం కాదు. ఇవాళ ఉదయం హెవేలియస్ అంగడికి పోతే కనిపించింది.”
“అబ్బ, భలే!” ఉత్సాహం తెచ్చి పెట్టుకుంటూ అన్నాను.
ఓ పాత, చింకి, చెదలు పట్టిన, కాగితాలు చిరిగి పీలికలుగా ఊడొస్తున్న ఆ చిత్తు పుస్తకం గురించి ఇంత హడావిడా?
కాని దాని పొగుడ్తూ మామయ్య చేస్తున్న అష్టోత్తరం మాత్రం నిరాఘాటంగా సాగుతూనే ఉంది.
“చూశావా?” ప్రశ్నలు, సమాధానాలు తానే చెప్పుకు పోతున్నాడు. “దీని బైండింగు ఎంత ధృఢంగా వుందో. దీని వయసు ఎంత అనుకున్నవు? ఏడొందల ఏళ్లు! ఏడొందల ఏళ్లు గడిచినా వన్నె తగ్గకుండా ఎలా నిగనిగ లాడుతోందో చూడు,” పుస్తకాన్ని తెరిచి, మూసి చేస్తూ అన్నాడు.

పుస్తకం బైండింగ్ గురించి అంతగా మురిసి పోవాల్సింది ఏముందో నాకైతే అర్థం కాలేదు. అందులో ఏవుందో తెలుసుకోవాలి అనిపించింది.

“ఇంతకీ ఆ పుస్తకం పేరేంటో?” ఉండబట్టలేక అడిగాను.
(సశేషం...)


ప్రఖ్యాత అమెరికన్ శాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ ఫెయిన్మన్ గురించి తెలియని వాళ్లు తక్కువ. కెయాస్ థియరీ మీద పుస్తకం రాసిన జేంస్ గ్లైక్ ఫెయ్న్మన్ జీవిత కథ కూడా "జీనియస్" అన్న పేరుతో రాశాడు. ఫెయిన్మన్ అసమాన ప్రతిభను తెలిపే ఘట్టాలతో బాటూ, అతని పట్టరాని చిలిపి చేష్టల వృత్తాంతాలతో ఈ పుస్తకం అద్భుతంగా ఉంటుంది. ఒక చోట ఒక సంఘటన తమాషాగా ఉంటుంది.

కాల్ టెక్ లో పని చేసే ముర్రే గెల్మన్ కి ఫెయిన్మన్ కి వృత్తిరీత్యా కొంత పోటీ ఉన్నా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవమే.

ఒకసారి ఫెయిన్మన్ రాసిన ఓ పేపర్ ని గెల్మన్ శిష్యుడు ఎక్కడో చూసి బావుందని తెచ్చి గెల్మన్ కి చూపిస్తాడు. అది చూసి గెల్మన్

“ఇది ఫెయిన్మన్ తన పద్ధతిలో చేశాడు. సమస్యలని మనం అలా పరిష్కరించం. మన పద్ధతి వేరు,” అన్నాడు.
శిష్యుడి ముఖం చిన్న బోయింది.
“ఇంతకీ ఏంటా ఫెయిన్మన్ పద్ధతి?” అడిగాడు శిష్యుడు.
“ఫెయిన్మన్ పద్ధతా? ముందు సమస్యని బోర్డు మీద రాయాలి. తరువాత పిడికిలి బిగించి, ఓ సారి నుదుటి మీద ఆనించి, కొద్దిగా భృకుటి ముడి వెయ్యాలి. ఒక్క క్షణం ఆలోచించాలి. వెంటనే పరిష్కారం బోర్డు మీద రాసేయాలి. అదీ ఫెయిన్మన్ పద్ధతి!” అని వివరించాడు.
శిష్యుడి ముఖం మీద నవ్వు పువ్వులు విరిశాయి.

కల్లోలతా సిధ్ధాంతం - పార్ట్ 8

Posted by V Srinivasa Chakravarthy Saturday, June 20, 2009 0 comments


మామూలుగా చూస్తే లారెంజ్ చేసినది సబబే ననిపిస్తుంది. ఆ రోజుల్లో వాతవరణ సాటిలైట్లు సెంటిగ్రేడులో వెయ్యో వంతు నిర్దుష్టతతో సముద్రాల ఉష్ణోగ్రత కొలవగలిగితే చాలా గొప్ప. కనుక కొలవబడ్డ ఫలితాల్లోనే అంత దోషం ఉన్నప్పుడు అంత కన్నా చిన్న దశమ స్థానాలతో పనేముంది అనుకోవడం సమంజసమే అనిపిస్తుంది. పోనీ ఏ నాలుగో స్థానంలోనో, ఐదో స్థానంలోనో కాస్తంత దోషం ఉంటే, ఫలితాల్లో కూడా కాస్తంత దోషం మాత్రమే వస్తుందని ఆశిస్తాం. లారెంజ్ చిత్రం 1 లోని గ్రాఫులని కాస్త క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆ గ్రాపుల్లో ఒక దాన్ని ఒక పారదర్శక ప్లాస్టిక్ కాగితం మీద అచ్చు వేసి, ఆ కాగితం రెండవ గ్రాఫు మీద అమర్చి రెంటి మధ్య తేడా ఎక్కడొస్తోందో పరిశీలనగా చూశాడు. పటంలో ఇంచు మించు సగం వరకు రెండు గ్రాఫులు చాలా దగ్గర దగ్గరగా నడుస్తున్నాయి . కాని మధ్య నుండి వేరుపడటం మొదలెట్టాయి. గణిత శాస్త్రంలో అందరూ అనుకునేట్టు “ఆరంభంలో చిన్న దోషం ఉంటే అంతంలో కూడా చిన్న దోషం ఉంటుంది” అన్న సూత్రం ఇక్కడ దారుణంగా వమ్మవుతోంది. మరి ఎందుచేతనో లారెంజ్ పరిశోధిస్తున్న ఈ వాతావరణ నమూనాలో, ఆ నమూనాని వర్ణించే సమీకరణాలలో చిన్న దోషాలు కూడా ప్రమాదకరంగానే పరిణమిస్తున్నాయి. తన సమీకరణాలు ఎంతో సరళీకరింప బడినవని అతడికి బాగా తెలుసు. అయినా వాతావరణ గతులలోని సారాన్ని ఈ సమీకరణాలు పట్టుకున్నాయని అతడి నమ్మకం. మరి ఈ వైఫల్యానికి కారణం? లరెంజ్ నీరుగారి పోయాడు. ఇంత సంక్లిష్టమైన పరిణామం గల వాతావరణాన్ని అంచనా వెయ్యడం జరగని పని అని అప్పటికి ఊరుకున్నాడు.

“అంతకు ముందు వాతావరణ నిర్ణయంలో నెగ్గిన వారు ఎవ్వరూ లేరు. దీంతో గణిత శాస్త్ర పరంగా ఆ వైఫల్యానికి ఒక సంజాయిషీ దొరికింది,” అన్నాడు లారెంజ్ తన ప్రథమ ఫలితాల గురించి మాట్లాడుతూ. “అసలు వాతావరణాన్ని పూర్వ నిర్ణయం చెయ్యొచ్చు నన్న నమ్మకం ఎందుకు కలుగుతోంది అంటే భౌతిక ప్రపంచంలో ఎన్నో మార్పులని మనం కచ్చితంగా ముందే ఊహించొచ్చు. ఉదాహరణకి గ్రహణాలు, గ్రహగతులు, కెరటాల రాకపోకలు – మొదలైన వాటన్నిటినీ కచ్చితంగా నిర్ణయించొచ్చు. అసలు కెరటాల రాకపోకల నిర్ణయం అయితే అదొక సమస్య అనే ఎప్పుడూ అనుకోలేదు. అది కేవలం వాస్తవ జ్ఞానం అనుకునేవాణ్ణి. అలల గతి కూడా వాతావరణం లాగానే చాలా క్లిష్టమైనదే. రెండిట్లోనూ రాశులు చక్రికంగా మారుతుంటాయి. వచ్చే ఏడాది కూడా ఎండా కాలంలో చలికాలంలో కన్నా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అది వాస్తవ జ్ఞానం. అదే నమ్మకంతో వాతావరణసమస్యను కూడా ఎదుర్కోవడం మరి సహజమే.”

1950లు, ’60 లలో వాతావరణం మీద సంపూర్ణ విజయం సాధించే దినం దగ్గర పడుతోందన్న ఆశాభావం బలంగా ఉండేది. వాతావరణ పూర్వనిర్ణయంలోనే కాదు, నియంత్రణలో కూడా రకరకాల ఊహాగానాలతో పత్రికలు హోరెత్తిపోయేవి. రెండు ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాలు పక్వానికి వస్తున్న రోజులవి. ఒకటి కంప్యూటర్ పరిజ్ఞానం, రెండవది సాటిలైటు పరిజ్ఞానం. ఈ రెండిటి మేళవింపులో ఉన్న బలం సత్ర్పయోజనాలకి దారి తీస్తుందన్న గుర్తింపులోనే ‘విశ్వజనీన వాతావరణ పరిశోధనా పథకానికి’ శ్రీకారం చుట్టటం జరిగింది. అనుకున్న పరిణతులన్నీ జరిగితే ఇక ప్రకృతి ఆట కట్టే! తుఫానులు, భూకంపాలు వీటి పేరుతో ప్రకృతి చేసే అరాచకాలలో ఇకపై క్రిమికీటకాల్లా మనిషి నశించడు. మనుపటి బానిసత్వాన్ని విడిచి అధినేత అవుతాడు. ప్రకృతికి ప్రభువవుతాడు. నియంతగా ప్రకృతి గతులని శాసిస్తాడు. తటపటాయిస్తున్న వర్షామేఘాన్ని చిటపటమని కురవమని చిటికేసి చెప్పొచ్చు. మన ఆశలకి అనువుగా విశ్వమంతటినీ వీలుగా మలచుకోవచ్చు. దేవుళ్లా దర్జాగా బతకొచ్చు!

పాతాళానికి ప్రయాణం - పార్ట్ 3

Posted by V Srinivasa Chakravarthy Friday, June 19, 2009 0 comments

ఇవన్నీ కాక మా మామయ్య ముక్కోపి అని ముందే చెప్పాను. నడుస్తున్నప్పుడు కూడా గట్టిగా పిడికిలి బిగించి, ఏదో గొణుక్కుంటూ (మరి ఖనిజాల పేర్లు జపిస్తున్నాడో, మనసులో ఎవరినో శపిస్తున్నాడో తెలీదు), పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తాడు. ఇలాంటి మనిషితో మా మార్తా ఎలా వేగుతోందో మీకూ అర్థం కావడం లేదు కదూ?

జర్మను ప్రొఫెసర్ అయినా మా మామయ్య కొద్దో గొప్పో ఆస్తిపరుడే అని చెప్పాలి. తన సొంత ఇల్లు ఉంది. ఆ ఇంట్లోని సభ్యులు – ఆయన, ఆయన పెంపుడు కూతురు గ్రౌబెన్, ఓ పదిహేడేళ్ల పనిపిల్ల, మార్తా, నేను. అనాథ నైన నేను ఆయన ప్రయోగశాలలో సహచరుడిగా పని చేస్తుంటాను.

చిన్నప్పట్నుంచి కూడా నాకు భౌగోళిక శాస్త్రం అంటే ఇష్టం. ఖనిజ శాస్త్రం మా రక్తంలో ప్రవహిస్తోంది కాబోలు. ఇక వేరే స్నేహితులు ఎవరూ పెద్దగా లేకపోయినా ప్రయోగశాలలో ఆ ఖనిజ నమూనాల సమక్షంలో హాయిగా జీవితం వెళ్ల బుచ్చుతూ ఉంటాను.

దీని బట్టి మనకి అర్థం అయ్యేది ఏంటంటే కోనిగ్స్ స్ట్రాసే సందులో, ఆ చిన్న ఇంట్లో కూడా మనుషులు సుఖంగా బతక గలరన్నమాట. మా మామయ్య ఎంత ముక్కోపి అయినా ఆయనకి నేనంటే ప్రాణం. అయితే చిక్కేంటంటే ఆ పెద్ద మనిషికి నిరీక్షణ అన్న పదానికి అర్థం తెలీదు. కిందటి ఏప్రిల్ లో ఆయన కిటికీ బయట బావుంటుంది కదా అని మిగ్నొనెట్ పూల మొక్కల జాడీలు వీలాడదీశాను. మొక్కలు వేగంగా పెరగాలని వాటి ఆకులని రోజూ కొద్ది కొద్దిగా సాగదీయడం మొదలెట్టాడు! ఆయన వేగం ముందు ప్రకృతిది మరీ మంద గతి అన్నమాట. ఇక అలాంటి మనిషితో వ్యవహరించాలంటే చెప్పింది చప్పున చెయ్యడం తప్ప వేరే మార్గాంతరం లేదు.

అందుకే ఆయన రంకె వినిపించగానే భక్తిగా ఆ రంకె వచ్చిన దిశలో పరుగు అందుకున్నాను.
(ఒకటవ అధ్యాయం సమాప్తం)

మానవ చరిత్రలో ఎంతో కాలం - సముద్రపు లోతుల మాట దేవుడెరుగు - సముద్రం పై పొరలలో కూడా ఏముందో మనిషికి తెలియదు. సముద్రం ఎంత లోతు ఉందో, ఆ లోతుల్లో ఏముందో ఎంతో కాలం మనిషికి తెలియలేదు.

నదులలో, సరస్సులలో జీవరాశులు ఉన్నట్లే, సముద్రంలో కూడా జీవరాశులు ఉన్నాయని మనిషికి తెలుసు. ఎన్నోరకాల చేపలు ఉంటాయి. ఆలుచిప్పలు, రొయ్యలు, పీతలు మొదలైన ఎన్నో రకాల జీవులు ఉంటాయి. ఆదిమవాసులు కూడా చేపలని ఆహారంగా తీసుకునేవారు. కొన్ని ప్రాంతాల్లో జలచరాలు ఆహారంలో ముఖ్యభాగం అయిపోయాయి. సముద్రపు లోతుల్లో ఎంత లోతు వరకు చేపలు మొదలైన జలచరాలు దొరుకుతాయో పాతకాలపు బెస్తవారికి తెలుసునంటారా? సాగరంలో అడుగంటా జలచరాలు ఉంటాయని అనుకుని ఉంటారు. కాని అది నిజమో కాదో తెలుసుకోవడం ఎలా?

జలకన్యలు జీవించే మహార్ణవపు లోతుల్లో
మా ఎదురులేని సాధనం తవ్వుకుంటు పోతుంది
నీటి నట్టింట నడయాడే ఏ వస్తువునైనా
అది ఇట్టే పట్టేస్తుంది.

మసలే, కదిలే, మెదిలే,
గిలగిలమనే జీవి ఏదైనా
ఇది అట్టే ఆకర్షిస్తుంది
పరిశోధనా భాండాగారాలని పూరిస్తుంది.
ఐసాక్ అసిమోవ్ ఆంగ్లంలో వ్రాసిన How Did We Find Out About Life in the Deep sea? అనే పుస్తకాన్ని
డా. వి.శ్రీనివాస చక్రవర్తి గారు తెలుగులోకి చక్కగా అనువదించారు. ఆ పుస్తకాన్ని ఇక్కడి నొక్కి డౌన్‌లోడ్ చేసుకోండి. (Click here to download) లేదా పుస్తకం హస్తభూషణమనుకునే వారు ఈ క్రింది చిరునామాల యందు సంప్రదించి కొనుగోలు చేయవచ్చును. ధర కేవలం రూ. 15/- మాత్రమే.

మంచి పుస్తకం
12-13-452, వీధి నెం.1,
తార్నాక, సికింద్రాబాద్ - 500 017.

జన విజ్ఞాన వేదిక
జి. మాల్యాద్రి, కన్వీనర్, ప్రచురణల విభాగం
ఇంటి నెం. 8-1-6, బాలాజీరావు పేట,
తెనాలి - 522 202
ఫోన్: 94405 03061.

కల్లోలతా సిధ్ధాంతం - పార్ట్ 7

Posted by నాగప్రసాద్ Thursday, June 18, 2009 0 comments

బాగా సరళీకృతమైన వాతావరణ నమూనా ప్రోగ్రాముని తన కంప్యూటర్లో నడిపిస్తున్నాడు లారెంజ్. ప్రోగ్రాము సరళమైనదైనా అది ప్రదర్శించే వాతావరణ లక్షణాలు ఎంతో సహజమైనవిగా ఉన్నాయి. పడి లేచే పీడనాలు, ఉష్ణోగ్రతలు, తేమలు, అటు ఇటు విను వీధుల వెంట పచార్లు చేసే ఋతుపవనాలు – వీటి గతులన్నిటినీ ప్రోగ్రాము చక్కగా కంప్యూటర్ ప్రింటవుట్ మీద చిత్రిస్తోంది. వివిధ వాతావరణ సంబంధిత రాశులు ఆ ప్రింటవుట్లో లయబద్ధంగా మారుతున్నాయి. అవును. ఆ మార్పులో ఒక లయ ఉంది. ఒక రచన ఉంది. ఒక విన్యాసం ఉంది. అలాగని చక్రికంగా జరుగుతోందని కాదు. ఒకసారి జరిగింది మళ్లీ అదే సందర్భంలో, అదే పరిస్థితుల సంయోగంతో మళ్లీ జరగడం లేదు. చిన్ని అవకతవకలతో కూడుకున్న స్థిర విన్యాసం అన్నమాట. ‘క్షణక్షణికం’ అయిన ప్రకృతి కాంత చిత్తంలా!

ఒకసారి 1961 లో అలాగే శీతాకాలంలో తన కంప్యూటర్ సిములేషను నడిపిస్తున్నాడు లారెంజ్. కొంత కాలం పాటు సిములేషన్ నడిచాక ఆపి చూశాడు. మరి కొంత సేపు నడిపిస్తే ఏమవుతుందో చూడాలని అనిపించింది అతనికి. మళ్లీ మొదట్నుంచీ నడిపించడం దండుగ అని క్రిందటి సారి ఎక్కడైతే ప్రోగ్రాము ఆగిపోయిందో అప్పటి ఫలితాలను తీసుకుని వాటిని ఆరంభ స్థితులుగా ప్రోగ్రాములో ఎంటర్ చేశాడు. కంప్యూటర్ మళ్లీ పన్లోకి దిగింది. ఆ రొద భరించలేక కాస్త కాఫీ తాగుదామని కాంటీనుకి వెళ్లాడు. తిరిగి వచ్చాక ఫలితాలు ఎలా వస్తున్నాయోనని ఓ సారి అలవోకగా ప్రింటవుట్ కేసి చూశాడు. ఆ కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందాడు!

విజ్ఞాన శాస్త్రంలో ఓ కొత్త అధ్యాయం తెరుచుకుంది.

పైన చిత్రంలో రెండు గ్రాఫులు కనిపిస్తున్నాయి. అవి ఒకే ఆరంభ స్థితి నుండి మొదలైన ఓ రాశి యొక్క కాలానుగత పరిణామాన్ని సూచించే గ్రాఫులు. ఆరంభ స్థితి ఒకటే అయినా తదనంతర పరిణామంలో వైవిధ్యం ఎలా వచ్చింది? న్యాయంగా అయితే రెండు గ్రాఫులు సరిసమానంగా ఊండాలి. పోనీ ఆరంభ స్థితిని కంప్యూటర్లోకి ఎంటర్ చెయ్యడంలో లారెంజ్ ఏమైనా పొరబాటు చేశాడా అంటే అలాంటిది ఏమీ జరగలేదు. మళ్లీ సరి చూసుకున్నాడు కూడా. లారెంజ్ కి కాసేపు ఏమీ అర్థం కాలేదు. కంప్యూటర్ లో ఏదో పాడయ్యి ఉంటుంది అనుకున్నాడు. కాని అంతటితో ఆగక కాస్త జాగ్రత్తగా పరీక్షించాడు. అప్పుడు అర్థమయ్యింది. కంప్యూటర్లో ఏ లోపమూ లేదు. సమస్య తను ఎంటర్ చేసిన అంకెల లోనే ఉంది. కంప్యూటర్ మెమరీ లో అంకెలు ఆరు దశాంశ స్థానాల వరకు వ్యక్తమై ఉంటాయి – ఉదాహరణకి 0.347102. కాని తను మూడు దశాంశ స్థానాల వరకే ఎంటర్ చేశాడు – 0.347 అని అన్నమాట. అంటే రెండు అంకెలకీ మధ్య భేదం వెయ్యో వంతు కన్నా తక్కువ అన్నమాట. ఆ కాస్త భేదం ఉంటే ఏం కొంపలు అంటుకుపోవులే అనుకున్నడు. అదే అతను చేసిన పొరబాటు!

ఆ పొరబాటు ఏంటో వచ్చే టపాలో చూద్దాం.

రచయిత: డా. వి.శ్రీనివాస చక్రవర్తి.

సరే చివరికి ఆ సూక్ష్మదర్శిని వచ్చింది. దాని కోసం ఎదురుచూసే సమయంలో పిల్లలు మరికొన్ని అధ్యయనాలు కూడా చేశారు. పార్శిలు చూడగానే దాన్ని తెరవాలనే ఉత్కంఠ ఎక్కువయ్యింది. జాగ్రత్తగా పార్శిలు విప్పి, దాన్ని ఎలా వాడాలో చెప్పే ఆదేశాలు చదివారు. ఉతక్క ముందు, ఉతికిన తరువాత ఉన్ని దారాలు ఎలా ఉంటాయో చూడడానికి ఆ దారాలు కొన్ని తెచ్చి సూక్ష్మదర్శినిలోకి ఎక్కించారు. ఉన్ని దారాలని గొలుసుకట్టుగా కలిపే కొన్ని సంధులు ఉంటాయి. ఉతికినప్పుడు మరి ఎందుచేతనో ఆ దారాలలోని భాగాలు ఒకదాని మీద ఒకటి జారి (టెలిస్కోప్ లోని భాగాలలా) దారం కుంచించుకుపోతుంది. ఉన్నిని చూశాక లినెన్, పత్తి, రేయాన్ ఇలా మరిన్నిరకాల దారాలతో నేయబడ్డ బట్టని కూడా తెచ్చి అలాగే సూక్ష్మదర్శినిలో చూశారు. బట్ట కనిపించే తీరు అందులో దారం అల్లబడ్డ తీరు మీద ఆధారపడుతుందని గుర్తించారు. ఇలా మెల్లగా పిల్లల ధ్యాస నేత మీదకి మళ్ళింది. వాళ్ళంతకు వాళ్ళు ఏదైనా బట్టని నేయాలనుకున్నారు. అందుకి చిన్న చిన్న పరికరాలు ఏవైనా ఉన్నాయా అని ఆలోచించారు. మళ్ళీ ఉత్తరాలు వ్రాశారు. కొంత కాలానికి ఆ పరికరాలు కూడా రానే వచ్చాయి. ముడి ఉన్నితో కాస్తంత బట్టని నేయడానికి కావలసినంత సరంజామా అమరింది. ఉన్నితో పని చెయ్యడం సులభం కనుక దాన్ని ఎంచుకున్నారు. పైగా స్క్లూలు సమీపంలోనే ఉండే ఓ గొర్రెల కాపరి దగ్గర్నుండి ముడి ఉన్ని కూడా సంపాదించగలిగారు. దాన్ని ఉతికి, ఆరేసి, ఏకులు చేసి, బట్టగా నేశారు. ముడి ఉన్నిని బట్టగా మార్చడానికి ఎంత శ్రమ అవసరమవుతుందో తెలుసుకోవాలని క్లాసులో ఎవరికో అనిపించింది. దశల వారీగా సాగే ఈ ప్రయాసలో ఒక్కొక్క దశకి ఎంతెంత సమయం పడుతుందో జాగ్రత్తగా నోట్సు తీసుకుంటూ వచ్చారు. ఆ ప్రయత్నంలో అనుకోకుండా మనుష్యఘడియలు (man - hours) అన్న భావనని వాళ్ళంతకు వాళ్ళే కనుక్కున్నారు. ఈ భావన అర్థశాస్త్రంలో చాలా ముఖ్యమైన భావన అని మనందరికీ తెలిసిందే.

ఓ చిన్న చదరపు ఉన్ని బట్ట నెయ్యడానికి డెబ్బై రెండు మనుష్య ఘడియలు పట్టింది. అంత చిన్న బట్టకి డెబ్బై రెండు గంటలా? ఇక ఇలా అయితే మొత్తం సూటుకి కావలసిన బట్ట నెయ్యడానికి ఇంకెంత సమయం పడుతుందో? ఈ సమస్యకి సమాధానాన్ని కనుక్కోవడానికి బోలెడంత అంకగణితాన్ని వాడాల్సి వచ్చింది. ముఖ్యంగా క్రమమైన ఆకారం లేని తలాల విస్తీర్ణం కనుక్కునే సమస్యని సాధించాల్సి వచ్చింది. ఆ విధంగా సూటుకి కావలసినంత బట్టని నెయ్యడానికి ఎంత సమయం పడుతుందో తెలిసింది. మరి అలాంటప్పుడు అమెరికా ఖండానికి యూరప్ నుండి మనుషులు వలస వచ్చిన తొలిరోజుల్లో తమ బట్టలు తాము నేసుకోడానికి ఎంత శ్రమపడేవారో ఆలోచిస్తే అమితాశ్చర్యం కలుగుతుంది. ఇవన్నీ చూశాక సమర్థవంతంగా పనులు చెయ్యడానికి ప్రత్యేకీకరణ ఎంత అవసరమో, శ్రమని తగ్గించే పరికరాల వల్ల ఎంత ఉపయోగమో పిల్లలకి అర్థమయ్యింది.

ఈ బట్ట నేసే ప్రాజెక్టు తో బయలుదేరి పిల్లలు ఎన్నో దిశలలో పురోగమించారు. నేసిన బట్టకి రంగు వేద్దాం అనుకున్నారు. కనుక సహజ వర్ణాలని ఎలా తయారుచేస్తారు, ఎలా వాడుతారు మొదలైనా విషయాల గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఈ రంగుల్లో చాలా మటుకు మొక్కల నుండి వచ్చేవే కనుక కథ వృక్షశాస్త్రం మీదకి మళ్ళింది. తరువాత కొన్ని రంగులు తయారుచేసి వాటిని పరీక్షించారు. ఇతర రకాల ఉన్ని బట్ట మీదకి కూడా వారి ధ్యాస మళ్ళింది. వాళ్ళు కష్టపడి తయారుచేసిన ఉన్ని బట్ట, అంగళ్ళలో కొనుక్కుని వేసుకునే ఉన్ని దుస్తుల్లోని బట్టలా లేదు. ఎక్కడొస్తోంది తేడా? ఉన్ని ఎన్ని రకాలు? అప్పట్నుంచి ఉన్ని బట్టలు వేసుకున్న ప్రతీ ఒక్కర్ని పట్టుకుని అది ఎలాంటి ఉన్ని అని అడిగి తెలుసుకోవడం మొదలెట్టారు? వాకబు చెయ్యగా ఎన్నో రకాల ఉన్ని ఉందని తెలిసింది. ఉన్నిని ఏఏ జంతువులు ఇస్తాయి, అవి ప్రపంచంలో ఎక్కడెక్కడ దొరుకుతాయి మొదలైన విషయాలు క్లాసులో ఎవరో కనుక్కుని వచ్చారు. ఈ సందర్భంలో కొన్ని రకాల ఉన్ని, ఇతర రకాల ఉన్ని కన్నా ఎందుకు ఖరీదెక్కువ అన్న ప్రశ్న బయల్దేరింది. దాని గురించి ఇంకా చర్చించి, చదివి వాళ్ళు అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఉన్ని ఖరీదు అది ఇచ్చే జంతువు మీద, దాన్ని సాకడానికి అయ్యే ఖర్చు మీద, అలా వచ్చిన ఉన్నిని నెయ్యడానికి అయ్యే ఖర్చు మీద, నేసిన చోటి నుండి అమ్మే చోటికి రవాణా చేసే ఖర్చు మీద, ఆధారపడుతుంది అన్న విషయం అర్థమయ్యింది. అలా బోలెడంత అసలుసిసలైన అర్థ శాస్త్రం, కొసరుగా కొంచెం భౌగోళిక శాస్త్రం వాళ్ళ అధ్యయనంలో చోటు చేసుకున్నాయి.

అదే సమయంలో వాళ్ళకి ఉన్నికి, వోర్ స్టెడ్ (worsted) లకి మధ్య తేడా (ఆ తేడా ఏంటో నాకూ తెలీదు) మీదకి, నేసే ప్రక్రియ మీదకి, నేత పరిశ్రమ మీదకి ఆసక్తి మళ్ళింది. మరింత మేలైన నేత యంత్రాలు ఉంటే నేసిన బట్ట ఖరీదు ఎలా తగ్గుతుందో అర్థం చేసుకోగలిగారు. ఇంతకీ అంత ఉపయోగకరమైన యంత్రాలని కనుక్కున్నదెవరు? ఈ సమాధానాలు తేల్చుకోడానికి జిల్లా గ్రంథాలయం నుండి పుస్తకాలు అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఒక్క ఏడాదిలో క్లాసులో ఉన్న ముప్పై ఐదు మంది పిల్లలు కలిసి ఏడొందలు పుస్తకాలు అరువు తెచ్చుకున్నారని వాళ్ళ టీచరు డా. గార్డన్ చెప్పింది.

తొలి దశల్లో ఎన్నో యంత్రాలని ఇంగ్లండ్ లోనే కనుక్కున్నారని తెలుసుకున్నారు పిల్లలు. ఏమిటి దానికి కారణం? ఇంగ్లండ్ లో అప్పటికే కొంతవరకు శ్రమ విభజన సాంప్రదాయం నెలకొంది. కనుక పారిశ్రామిక పద్ధతిని అవలంబించడానికి ఆ దేశం సిద్ధంగా ఉంది. మరి పరిశ్రమలంటే ఎలా ఉంటాయి? ఆ విషయాన్ని తెలుసుకోడానికి న్యూ జర్సీలో బట్టల మిల్లుకి వెళ్ళారు. తొలి పరిశ్రమల గురించి, అందులో శ్రామికుల పరిస్థితుల గురించి చదివారు. నిరుద్యోగం మీద యంత్రాల ప్రభావం ఎలా ఉంటుందో చర్చించుకున్నారు. దగ్గర్లోనే ఉన్న చిన్న ఊళ్ళో యంత్రాల ప్రభావం ఎలా ఉందో పరిశీలించారు. అలా చర్చ మెల్లగా శ్రామికుల యూనియన్ల వైపు, శ్రామికుల హక్కుల వైపు మళ్ళింది.

అయితే ఇందులో ప్రతీ దశలోను పిల్లలంతా పాల్గొన్నారని కాదు. అంతేగాక ఆ ఏడాది పొడవునా పిల్లలు ఇది మాత్రమే చేశారనీ కాదు. ఈ ప్రశ్నలని శోధించే ప్రయత్నంలో మరెన్నో ఇతర ప్రశ్నలని శోధిస్తూ పోయారు. ఉదాహరణకి తొలి నేత యంత్రాల గురించి అధ్యయనాలు చేసింది కొంత మంది పిల్లలే. కాని వాళ్ళు తెలుసుకున్న విషయాలని వచ్చి తక్కిన వారితో పంచుకునేవారు. ఆ విధంగా కొత్త విషయాలు తెలుసుకున్న వారు ఆ విషయాలని అందరితోనూ పంచుకోవడం జరిగింది.

అలాంటిదే మరో ప్రాజెక్టు కూడా ఈ పిల్లలు చేపట్టారు. కాస్త పెద్ద పిల్లలు స్కూలుకి ప్రత్యేకంగా ఓ వార్తాపత్రిక రూపొందించారు. ఆ పత్రిక కొన్ని వారాలకొకసారి వెలువడుతుంది. " ఈ చిన్న పత్రికని ప్రచురించడానికి ఇంత కాలం పడుతుంటే మరి రోజూ అంత లావుపాటి దినపత్రికలని ఎలా ప్రచురిస్తారు?" అని ఓ పిల్లవాడికి సందేహం వచ్చింది. ఆ ప్రశ్న క్లాసుకి నచ్చింది. ఆ విషయం లోకి ఇంకా లోతుగా శోధించాలని అనుకున్నారు. కొన్ని ఉత్తరాలు రాశాక ఓ పెద్ద వార్తాపత్రికా కార్యాలయాన్ని సందర్శించడానికి అవకాశం దొరికింది. టైప్సెట్టింగ్, ప్రింటింగ్ వంటి ప్రక్రియలు ఎలా జరుగుతాయో తెలుసుకున్నారు. దాంతో ఇంకా ఉత్సాహం పెరిగి ఈ ప్రక్రియల చరిత్రలోకి కూడా కొంత తవ్వి తెలుసుకున్నారు. అలాగే వ్రాత మీదకి, వ్రాత పరికరాల మీదకి కూడా ధ్యాస మళ్ళింది. మొట్టమొదటి లిపి గురించి, వ్రాతకి ఉపయోగించే తాళపత్రాలు మొదలైన మాధ్యమాల గురించి కూడా తెలుసుకున్నారు. కొంత కాలం పోయాక వాళ్ళంతకు వాళ్ళే ఓ పూర్తి పుస్తకాన్ని రాసి, టైపు చేసి, బైండు చెయ్యాలని నిశ్చయించుకున్నారు. వ్రాత యొక్క, ముద్రణ యొక్క, పుస్తకాల తయారీ యొక్క సంపూర్ణ చరిత్ర గురించి పుస్తకం వ్రాయాలనుకున్నారు. ఇది చాలా పెద్ద పని. స్కూలు సంవత్సరం ముగిసే సమయానికి ఆ బృహత్ యత్నం పూర్తి కాలేదు. చాలా మంది పిల్లలు అదనంగా మరో వారం ఉండి ఆ పుస్తకాన్ని పూర్తి చెయ్యడానికి ప్రయత్నించారు. డా. గార్డన్ వాళ్ళు రాసిన పుస్తకం నాకు చూపించింది. అమూల్యమైన సమాచారంతో, చక్కని శైలితో, అందమైన బొమ్మలతో, బలమైన బైండింగ్ తో పిల్లల చేతిలో అద్భుతంగా ఊపిరిపోసుకుందా పుస్తకం. ఆధునిక కాగితంతో మొదలుపెట్టి వ్రాత అనే ప్రక్రియ యొక్క పుట్టుపూర్వోత్తరాలని క్షుణ్ణంగా శోధిస్తుందా పుస్తకం.

ఈ కథల వల్ల పిల్లలు ఎలా నేర్చుకుంటారు అన్న విషయం గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ప్రపంచాన్ని విభాగాలుగా విభజించకుండా సమగ్రంగా దర్శిస్తారు. కనుక ఒక విషయం నుండి మరో విషయానికి సహజంగా గంతు వెయ్యగలరు. పూర్తిగా భిన్నంగా కనిపించే విషయాల మధ్య సంబంధాలని పొడచూడగలరు. మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో సాగే క్లాసుల్లో ఇలాంటి అవకాశం ఎంతో అరుదుగా మాత్రమే వస్తుంది. అజ్ఞాతంలోకి మనం ఊహించను కూడా ఊహించలేని క్రొంగొత్త బాటలని వేసుకుంటూ ధైర్యంగా ముందుకి సాగిపోతారు. అంటే పిల్లలకి ట్రోజన్ యుద్ధం గురించి, పురావస్తు పరిశోధనల గురించే నేర్పించదలచుకుంటే ముందు స్క్యూబా డైవింగ్ మొదలెట్టాలనా? ససేమిరా కాదు. చాలా మంది పిల్లలకి అది శ్రేయస్కరం కాదు. పైగా పిల్లలు వాళ్ళ లక్ష్యాలని వాళ్ళు ఎంచుకుంటూ, వాళ్ళ ఆసక్తిని అనుసరిస్తూ ముందుకి సాగిపోతుంటే ఇంకా వేగంగా పురోగమిస్తారు. మనం ప్రణాళికా బద్ధంగా వాళ్ళకి నేర్పించాలని ఎంత చూసినా అంతగా పురోగమింపజేయలేము.

పిల్లల్ని వాళ్ళకి ఇష్టం వచ్చింది నేర్చుకోమని వదిలేస్తే ఓ చిన్న రంగంలో నిష్ణాతులై, పరిమిత పరిజ్ఞానం గల నిపుణులుగా మారే ప్రమాదం ఉందని కొందరు కోపంగా వ్యతిరేకించారు. క్రికెట్ స్కోర్లు, సినిమా కబుర్లు వంటి పనికిమాలిన చెత్త మాత్రమే నేర్చుకుంటారన్న భయం వ్యక్తం చేస్తారు. కాని అలా జరగదు. మన విశ్వవిద్యాలయాలు అలాంటి పటిష్టమైన సంకుచితమైన కోటలలో బందీలుగా ఉండే అలాంటి నిపుణులతో నిండిపోయాయి. కాని పిల్లలు, ఆరోగ్యంగా సక్రమంగా ఎదిగే పిల్లలు, అలా నేర్చుకోరు. వాళ్ళ చదువు వారిని జీవితంలో అనేక దిశలలో పురోగమింపజేస్తుంది. నేర్చుకుంటున్న కొద్దీ వాళ్ళ ఉత్సాహం మరింత బలపడుతుంది. మనం చేయవలసిందల్లా వారి ఆకలికి తగ్గ పోషణని అందివ్వడమే.

పోషణని అందివ్వడం అంటే, వాళ్ళకి కూర్చోబెట్టి తినిపించడం కాదు. ఆ ఆహారాన్ని వాళ్ళ అందుబాటులో ఉంచడం. ఆహారం మంచిదైతే, అందులో తగినంత పోషణ ఉంటే, వైవిధ్యం ఉంటే, ఏం తినాలో ఎంత తినాలో వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు.

ఇది "how children learn" by John Holt, పుస్తకంలోని ఒక భాగం యొక్క అనువాదం.

రచయిత: డా. వి.శ్రీనివాస చక్రవర్తి.

జాన్ హోల్ట్ ఒక ప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్త. ఇతడి రచనలు విద్యారంగంలో ఓ విప్లవాన్ని లేవదీశాయి. "హౌ చిల్డ్రెన్ ఫెయిల్," (How children Fail) "హౌ చిల్డ్రెన్ లెర్న్"(How Children learn) మొదలైన రచనలలో పిల్లలు ఎలా నేర్చుకుంటారు అన్న విషయాన్ని సున్నితంగా శోధిస్తాడు. పిల్లలలో సహజంగా నేర్చుకునే తత్త్వం ఉంటుంది అంటాడు. అలా సహజంగా, స్వతహాగా నేర్చుకోవాలన్న తపనని గుర్తించి మనం సున్నితంగా ఆసరా ఇస్తే చాలు. మనం దూకుడు మీద అడ్డమైన “విద్యా ప్రణాళికలూ” తయారు చేసి వాళ్ల నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తే వాళ్లలో నేర్చుకోవాలన్న ఆదిమ తపన అణగారిపోతుంది.

పెద్దల అనవసరమైన జోక్యం లేకుండా పిల్లలు స్వేచ్ఛగా అధ్యయనాలు చేసుకూంటూ పోతుంటే ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఎదుగుతారో ఎన్నో ఉదాహరణలిస్తూ తన పుస్తకాలలో చర్చిస్తాడు హోల్ట్. ఆ సత్యాన్ని ధృవపరిచే ఇతర విద్యావేత్తల అనుభవాలని కూడా ఎన్నో చోట్ల పేర్కొంటూ ఉంటాడు. అలాంటి ఓ వృత్తాంతమే “హౌ చిల్డ్రెన్ లెర్న్” అన్న పుస్తకంలో వర్ణిస్తాడు.

అది గార్డన్ వెబర్ అనే టీచరు నడిపించే ఓ చిన్న పల్లె బడి. పెద్ద పెద్ద పరికరాలు, సదుపాయాలు లేని పేద బడి. అలాంటి చోట కూడా సరైన విద్యా సూత్రాలని అనుసరించటం వల్ల చదువు ఎంత అద్భుతంగా సాగుతుందో వర్ణిస్తుందా రచయిత్రి. మన కోచింగ్ సెంటర్లలో, ట్యూషన్లలో లెక్కలు కూడా బట్టీ పట్టించే దౌర్భాగ్యపు పద్ధతికి, వెబర్ నడిపించే బడిలో సాగే చదువుకి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. ఆ వృత్తాంతానికి అనువాదం కింద ఇస్తున్నాం.

ఇలాంటి వృత్తాంతాల నుండి స్ఫూర్తి ని తీసుకుని మన పల్లె బడులని (పట్నం బడులు మహ బావున్నాయని కాదు!) అందంగా తీర్చిదిద్దుకోగలం అన్న ఆశతో…

--------

ఓ చిన్న పెల్లెబడిలో పాఠాలు చెప్పే జూలియా వెబర్ (ఇప్పుడామె పేరు జూలియా గార్డన్). “మా పల్లెబడి ఆవర్జా” అన్న పుస్తకంలో ఆమె తన కృషిని గురించి వివరించింది. ప్రస్తుతం ఆ పుస్తకం ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. ప్రచురణకర్త “హార్పర్ అండ్ రో” మరో ముద్రణ వేసే అవకాశం ఉంది.

డెల్టా ముద్రణగా ఆ పుస్తకం కొంత కాలం మళ్ళీ అచ్చయ్యి వచ్చింది. దానికి నేను పరిచయం కూడా వ్రాశాను. ప్రస్తుతం ఆ ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. ఈ సారి మళ్ళీ మూడవ ముద్రణకి వస్తుందని ఆశిస్తున్నాను. బోధన గురించి, బోధకుల గురించి చెప్పే అత్యంత ప్రధానమైన పుస్తకం. బడిలో జరగాల్సిన పనులెన్నో జరక్కపోవడానికి కారణం డబ్బు లేకపోవడం అనే కుంటి సాకికి ఈ పుస్తకం గట్టి సమాధానం.

బళ్ళో పిల్లలు 1-8 తరగతుల మధ్య ఉంటారేమో. అవసరం కొద్దీ వాళ్ళు ఎక్కువగా స్వతంత్రంగానే పనిచేసుకునే వారు. మిగతా సమయాల్లో అందరూ కలిసి ఓ క్లాసులా ఎన్నో విషయాలు చర్చించుకునేవారు. ఈ చర్చల్లో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అలాంటి ప్రశ్నల్లో సమాధానాలు దొరకని వాటిని పెద్ద పెద్ద కాగితాలు మీద వ్రాసి గోడ మీద అంటించడం మిస్. వెబర్ కి ఓ అలవాటు.

ఆ కాగితాలు పిల్లలకి ఆ ప్రశ్నలని రోజూ గుర్తు చేస్తూ ఉంటాయి. పిల్లలు ఈ ప్రశ్నలకి సమాధానాలు కనుక్కోవాలన్న నియమమేం లేదు. అవి ప్రణాళికలో భాగం కాదు. హోమ్ వర్కు కూడా కాదు. కాని వాటిలో నచ్చిన ప్రశ్నలని వారంతకు వారు స్వేచ్ఛగా శోధించవచ్చు. కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. మరి కొన్ని ప్రశ్నలు పిల్లల మనసును ఆకట్టుకుంటాయి. విశాల అన్వేషణా మార్గాల వెంట వారిని ముందుకి తోస్తాయి.

ఓసారి అలాగే ఓ వసంతంలో, శీతాకాలపు దుస్తులని అటకెక్కించే వేళ, ఓ ప్రశ్న ఉదయించింది. చలి దుస్తులని దాచేసే ముందు వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే వాటిని ఎందుకు ఉతకకూడదు అని ఎవరో అడిగారు. ఉతికితే ఆ దుస్తుల్లోని ఉన్ని కుంచించుకుపోతుంది అని చాలా మందికి తెలుసు. కాని ఉన్ని ఎందుకు కుంచించుకుపోతుందని, కుంచించుకుపోతే ఏమవుతుందని మరో ప్రశ్న పుట్టుకొచ్చింది. సమాధానం ఎవరికీ తెలీలేదు. బహుశ ఉన్నిని సూక్ష్మదర్శినిలో చూస్తే సమాధానం తెలుస్తుందేమో. అయితే దురుదృష్టవశాత్తు వాళ్ళ వద్ద సూక్ష్మదర్శిని లేదు. కొనుక్కునే స్తోమత కూడా ఆ స్కూలుకి లేదు. కాని ఆ పరికరాన్ని ఎక్కణ్ణించయినా అరువు తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఓ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఓ సూక్ష్మదర్శిని కొంతకాలం పాటు కావాలంటూ ఉత్తరం వ్రాశారట. ఆ స్కూల్లో పిల్లలు అలాంటి ఉత్తరాలు తరచు వ్రాస్తుంటారట. వారిది చిన్న స్క్లూలు కనుక పుస్తకాల కోసం, పరికరాల కోసం దాతలని అడుగుతూ ఉత్తరాలు వ్రాస్తుంటారు.

ఈ రోజుల్లో బాగా చలామణిలో ఉన్న ఓ మూఢనమ్మకానికి ఇక్కడే ఓ మంచి సమాధానం దొరుకుతుంది. ఈ నమ్మకానికి ఆయువుపోసిన వాళ్ళు డా.కోనంట్ మొదలైనవారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లాంటి పాఠశాలలు కావాలంటారు వీళ్ళు. ఎందుకంటే అధునాతన పరికరాలు లేని స్కూలు స్కూలే కాదని వీళ్ళ అభిప్రాయం. స్కూళ్ళని ఇంకా ఇంకా పెద్దవి చెయ్యడం వల్ల మనం సాధించిన దాని కన్నా కోల్పోయిందే ఎక్కువ. స్కూలు నిండా ఖరీదైన పరికరాలని నింపి సాధించినదాన్ని, అంత వ్యయంతో పనిలేని ఇతర మార్గాల్లో సాధించడానికి వీలవుతుంది.

కొన్ని కేంద్ర గ్రంథాలయాలు ఉంటే సరిపోతుంది. అలాంటి గ్రంథాలయాలు ఇప్పటికీ మన దేశంలో ఎన్నో చోట్ల ఉన్నాయి. అలాంటి గ్రంథాలయాల నుండి పుస్తకాలని, పరికరాలని అరువు తెచ్చుకోవచ్చు. లేదా కదిలే గ్రంథాలయాలు, ప్రయోగశాలలు స్కూళ్ళకే వచ్చి పుస్తకాలని, పరికరాలని సరఫరా చెయ్యవచ్చు. విద్యారంగంలో చేసే ప్రతీ పని పెద్ద ఎత్తున జరగాలన్న మన అపోహ తొలగిపోతే, ఇలాంటి భావాలకి ప్రాణం పోయగలుగుతాం.

మరికొంత వచ్చే టపాలో...

రచయిత: డా. వి.శ్రీనివాస చక్రవర్తి.

పాతాళానికి ప్రయాణం - పార్ట్ 2

Posted by V Srinivasa Chakravarthy Monday, June 15, 2009 0 comments

మా మామయ్యకి ఈ దౌర్బల్యం ఉందని త్వరలోనే అందరికీ తెలిసిపోయింది. ఆయన క్లాసులో పాఠం మొదలుపెట్టగానే పిల్లలంతా సరైన అదను కోసం ఎదురుచూసేవారు. ఆయన మాటలో నత్తి ఛాయలు తొంగి చూడగానే క్లాసంతా పగలబడి నవ్వుతుంది. ఆయన ప్రసంగించినప్పుడు ఆడిటోరియం లు కిక్కిరిసిపోయేవి. అయితే ఆ వచ్చిన వాళ్లలో ఎంత మంది ఆయన చెప్పేది నేర్చుకోవడానికి వచ్చారో, ఆయన నత్తి చూసి నవ్వుకోడానికి వచ్చారో ఆ దేవుడికే తెలియాలి.

కాని ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మా మామయ్య అపారమైన పాండిత్యం, పరిజ్ఞానం ఉన్నవాడు. ఇటు భౌగోళిక శాస్త్రవేత్త ప్రతిభ, అటు ఖనిజ శాస్త్రవేత్త సూక్ష్మదౄష్టి తనలోనే పోతపోసుకున్న ఘనుడు. సమ్మెట, దిక్సూచి, స్టీలు కడ్డీ, బ్లోపైప్, నైట్రిక్ ఆసిడ్ సీసా మొదలైన పరిశోధనా సామగ్రి చేతబట్టుకున్నడంటే ఇక మొత్తం ఖనిజ విజ్ఞాన లోకంలో మామయ్య సాటి రాగల ధీరుడు ఈ భూగోళం మీద ఇంకా పుట్టలేదు. ఇప్పటి వరకు కనుక్కొబడ్డ 63 మూలకాలూ అయ్యనకి పేరు పేరునా తెలుసు. అవి పెళుసుగా ఉంటాయా, కఠినంగా ఉంటాయా, వాటి రూపురేఖలు ఎలా ఉంటాయి, వేడికి సులభంగా కరుగుతాయా, కరగవా, దెబ్బ కొడితే మోగుతాయా లేదా, వాటి రంగేమిటి, రుచి ఏమిటి, వాసన ఏంటి – ఈ వివరాలన్నీ ఆయన మనసులో ఎప్పుడూ మెదుల్తూ ఉంటాయి.

వైజ్ఞానిక సదస్సులలో, సమావేశాలలో లీడెంబ్రాక్ పేరు, ప్రస్తావనలు పదే పదే వస్తుంటాయి. హంఫ్రీ డేవీ, హంబోల్ట్, కేప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్, జనరల్ సబీన్ వంటి ప్రముఖులు హాంబర్గ్ మీదుగా పోయినప్పుడు తప్పకుండా లీడెంబ్రాక్ ని సందర్శించి తీరవలసిందే. బెకరెల్, ఏబెల్మాన్, బ్రూస్టర్, డ్యూమాస్, మిల్నె-ఎడ్వర్డ్స్, సెయింట్ క్లార్ డెవిల్ వంటి మహామహులు కూడా రసాయన శాస్త్రంలో ఏదైనా సందేహం వస్తే మామయ్యనే సంప్రదిస్తారు. 1853 లో మామయ్య రాసిన “రసాయన దర్పణం’’ అనే గ్రంథం వెలువడింది. ఆది పండితులకి శిరోధార్యం అని వేరే చెప్పనక్కర్లేదు.

ఇవన్నీ కాక మా మామయ్య ఓ ఖనిజ మ్యూజియం కి అధికారి కూడా. ఈ మ్యూజియం ని ఎం.స్ట్రూవ్. అనే రష్యన్ రాయబారి స్థాపించాడు. ఖనిజాల మీద ఇలాంటి మ్యూజియం మొత్తం యూరప్లో మరెక్కడా లేదని చెప్పుకుంటారు.

ఇదండి ఇందాక నన్నలా రంకెలేసి పిలిచిన మా మామయ్య చరిత్ర. ఆయనది పొడవైన, ధౄఢమైన శరీరం. వయసు అరవై దగ్గర ఉంటుంది. ఆ పెద్ద పెద్ద కళ్ల జోళ్ల వెనుక కళ్లెప్పుడూ చంచలంగా కదులుతుంటాయి. ముక్కు కత్తిలా సూదిగా ఉంటుంది. అయితే ఆ ముక్కు సూదంటు రాయి లాంటిదని, దానికి అయస్కాంత షక్తి ఉందని, ఇనుప రజను దగ్గరికి తెస్తే చటుక్కున అకర్షిస్తుందని పోకిరి పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు. వట్టి ఆకతాయిలు! లేకపోతే ముక్కు ఇనుముని ఆకర్షించడం ఏమిటండి? మా మామయ్య ముక్కు ఆకర్షించే పదార్థం ఒక్కటే – అది ముక్కుపొడుం!

కల్లోలతా సిధ్ధాంతం - పార్ట్ 6

Posted by V Srinivasa Chakravarthy Sunday, June 14, 2009 1 comments


1950 లలో అమెరికా లో, న్యూ జర్సీ రాష్ట్రంలో, ప్రిన్స్టన్ విష్వవిద్యాలయంలో జాన్ వన్ నాయ్మన్ అనే గొప్ప భౌతిక శాస్త్రవేత్త అధ్వర్యంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రూపుదిద్దుకోసాగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ రహస్య సంకేతాలని భేదించడం, అమెరికా మిసైళ్ల గతులని లెక్కించడం మొదలైన ప్రయోజనాల కోసం ఈ కంప్యూటర్ని తయారు చేస్తున్నారు. కాని వాతావరణ శాస్త్రంలో కూడా కంప్యూటర్కి ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి నాయ్మన్ గుర్తించకపోలేదు.

అందుచేత ప్రకౄతి ధర్మాలని గణిత సమీకరణాలుగా వ్యక్తం చేయొచ్చు. ఆ సమీకరణాలతో లెక్కలు కట్టి రేపు ఏం జరుగుతుందో అంచనా వేయొచ్చు. లెక్కలు మరీ జటిలం అయితే కంప్యూటర్లు వాడుకోవచ్చు. తగినంత పెద్ద కంప్యూటర్ ఉంటే ఎంత పెద్ద లెక్కనైనా లెక్క చెయ్యకుండా ఇట్టే పరిష్కరించొచ్చు. విజ్ఞాన రంగానికి పునాదిగా ఉన్న ఆలోచనా సరళి ఇది. కాని ఇందులో చిన్న దోషం ఉంది. ఓ అనాధారిత నమ్మకం మీద ఈ ఆలోచన ఆధారపడి ఉంది. సామాన్యంగా ఆ దోషాన్ని ఎవరూ గుర్తించరు. ఆ దోషం ఏమిటో చూద్దాం.

ఒక వ్యవస్థ యొక్క ప్రస్తుత స్థితి తెలిస్తే దాని భవిష్యత్తును నిర్ణయించగలం అంటున్నాం. బాగానే ఉంది. కాని ఆ ప్రస్తుత స్థితిని తెలుసుకోవడం ఎలా? దాందేవుంది? ప్రయోగాలు చేసి కొలుస్తాం, అంటారు మీరు. కాని ఒక రాశిని ప్రయోగాత్మకంగా కొలిచినప్పుడు ‘ప్రయోగ దోషం’ అని ఒకటి ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ధర్మామీటరు పెట్టి ఉష్ణోగ్రత కొలుస్తాం. మామూలు పాదరసం ధర్మామీటరు సహాయంతో 101 డిగ్రీలనో, 101.1 డిగ్రీలనో చెప్పగలం. కాని 101.05647 డిగ్రీలని చెప్పలేం కదా? అదే డిజిటల్ ధర్మామీటర్ అయితే రెండు దశాంశ స్థానాల వరకు కచ్చితంగా చెప్పొచ్చు. కాని అంతకు మించి చెప్పలేం. అంతకు మించి చెప్పలేనంత మాత్రాన కొంపలేం అంటుకుపోవోయ్ అని మీరు అనొచ్చు. నిజమే 101.985 జ్వరం ఉన్నవాడికి 98 అని ధర్మామీటరు చెప్తే ఇబ్బంది గాని, 102 అని చెప్తే పెద్ద చిక్కేం ఉండదు. చికిత్స లో మర్పే ఉండదు. అంటే ప్రయోగ దోషం ఉన్నా అది తగినంత ‘చిన్నది’ అయితే ఆ సమస్య ఉండదు అని అర్థం. కొంపలు అంటుకుపోవని తాత్పర్యం.

అలాగే ఇప్పుడు హాలీ తోకచుక్కనే తీసుకుందాం. ఈది 76 ఏళ్లకి ఒకసారి వస్తుంది. 1910లో ఓ సారి కనిపించింది. కనుక మళ్లీ 1986లో కనిపించింది. 1910లో దాన్ని చూసినప్పుడు దాని స్థితిని అంచనా వెయ్యడంలో చిన్న దోషం జరిగింది అనుకుందాం. ఆ సమాచారం ప్రకారం 1986 నాటికి దాని స్థితిని అంచనా వేసినప్పుడు అందులో చిన్న దోషమే వస్తుంది. అంటే ఆదిలో చిన దోషం ఉంటే అంతంలో కూడా చిన్న దోషమే ఉంటుందన్నమాట. ఈ మూల సూత్రం ప్రయోగాత్మక భౌతిక శాస్త్రం అంతటికీ పునాది. పూర్తిగా దోషరహితమైన ప్రయోగ ఫలితాలు ఉంటే గాని సిద్ధాంతీకరించలేం అనుకుంటే ఇక విజ్ఞాన శాస్త్రం ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేదు. చిన్న కారణాలకి పర్యవసానంగా వచ్చే ఫలితాలు కూడా చిన్నవే అయ్యుంటాయి అన్నది మనకి తెలిసినంత వరకు ప్రకౄతి సహజమైన విషయం. కనుక ఆ నాటి వాతావరణ పరిశోధకులు కూడా ఆ నమ్మకంతోనే ముందుకు సాగారు.

పాతాళానికి ప్రయాణం -- పార్ట్ 1

Posted by V Srinivasa Chakravarthy Saturday, June 13, 2009 1 comments


అధ్యాయం 1

ప్రొఫెసర్ గారిల్లు

మే 24, 1863

ప్రొఫెసర్ లీడెంబ్రాక్ తటాలున తన ఇంట్లోకి దూసుకొచ్చాడు. ఆ ఇల్లు హాంబర్గ్ లో పాత బస్తీలో, ఒక చిన్న సందులో ఉంది.

వంట ఇంకా పూర్తి కాలేదని బెంబేలు పడుతోంది ఆయా మార్తా. భోజనాన్ని ఒవెన్ లో పెడుతూ తన అదౄష్టాన్ని బేరీజు వేసుకుంటోంది.

“ఇలాంటి సమయంలో ఆ పెద్ద మనిషి ఇంటి కొస్తే అంతే!’’ మనసులోనే అనుకున్నాను.

“ఓరి దేముడా! ఈ మనిషి అప్పుడే ఇంటికి వచ్చేశాడా?” నిట్టూర్చింది మార్తా. ఆమె భయపడినట్టే అయ్యింది.

“అయ్యో మార్తా! వంట ఇంకా అయ్యుండదే. గడియారం ఇప్పుడే ఒంటిగంట కొట్టింది. రెండు కి గాని వంట సిద్ధం కాదు,’’ అన్నాన్నేను ఆదుర్దాగా.

“మరి ఈయన ఈరోజు ఇంత త్వరగా ఎందుకొచ్చినట్టు?” అనడిగింది మార్తా.

“ఏమో ఆయన్నే అడుగుదాం.”
“అదేదో నువ్వే అడుగు బాబూ. నేను పోయి దాక్కుంటాను,’’ పడక గదిలోకి మెల్లగా జారుకుంది.

నేను ఒంటరిగా వంట గదిలో మిగిలాను.

మా ప్రొఫెసర్ మామయ్య అసలే ముక్కోపి. ఈ సమయంలో ఇక్కడ ఉండటం అంటే సముద్ర తీరంలో నించుని సునామీని సాదరంగా ఆహ్వానించినట్టే! మెల్లగా నేను కూడా మేడ మీది గదిలోకి జారుకోవడానికి ప్రయత్నించాను.

ఇంతలో తుఫాను తోసినట్టు వీధి తలుపు తెరుచుకుంది. బలమైన పదఘట్టనలతో ఎవరో లోపలికి వస్తున్న చప్పుడు. ముందు గది లోంచి ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ లా దూసుకుపోతూ, తన చేతి కర్రని ఒక మూలకి విసిరేస్తూ, కళ్ల జోడు బల్ల మీద విసిరేస్తూ, తన శరీరాన్ని స్టడీ రూం లోని సోఫా లో విసిరేస్తూ, “ఒరేయ్, ఏక్సెల్!’’ అని గావు కేక పెట్టాడు.

పర్జన్య గర్జన లాంటి ఆ కేకకి నేను ఇంకా తేరుకోనే లేదు. అంతలోనే “ఎక్కడున్నావ్ రా?” అంటూ మరో రంకె వినిపించింది.

లోక విఖ్యాత భౌగోళిక శాస్త్రవేత్త, ఇంటి యజమాని, మా మామయ్య, గురువు దైవం అయిన ప్రొఫెసర్ లీడెంబ్రాక్ గదిలోకి తోక ముడుచుకున్న పిల్లిలా ప్రవేశించాను.

ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ జొహానియం లో పనిచేస్తాడు. ఈయన క్లాసులు విచిత్రంగా ఉంటాయి. క్లాసు చెపుతూ ఉన్నట్టుండి ఏదో భావావేషం పెల్లుబికి పూనకం వచ్చిన వాడిలా ఘోషిస్తూ పోతాడు. అది విద్యార్థులు వేగంగా నేర్చుకోవడం లేదన్న బాధా అంటే కాదు. అసలు వాళ్లు పాఠం వింటున్నరా లేదా అన్న పట్టింపు కూడా ఆయనకి వుండదు. పోని ఆయన పడే శ్రమ వల్ల ఏదైనా స్థూల లాభం ఒరుగుతుందా అన్న లక్ష్యం కూడా ఆయనకి లేదు. ఆయన దౄష్టిలో ఇవన్నీ చాలా చిన్న విష్యాలు. ఈ రకమైన బోధనని జర్మను తాత్వికులు ‘’ఆత్మాశ్రయ’’ బోధన అంటారు. అంటే తన కోసం, తన సంతౄప్తి కోసం తను చెప్పుకునే బోధన. ఆయన అహంభావి. అయితే మనసు విజ్ఞానపు ఊట. కాని అందులోంచి జ్ఞానం రాబట్టడం అంత సులభం కాదు. ఆయన వైజ్ఞానిక పిసినారి!

జర్మనీ లో ఇలాంటి ప్రొఫెసర్లు అరుదు.

కాని దురదౄష్టం ఏంటంటే మా మామయ్యకి కాస్త వాక్పటుత్వం తక్కువ. మాట తడపడుతుంది. ఊరికే తత్తరపడతాడు. ఇంట్లో ఎలా మాట్లాడినా ఫరవాలేదు. కాని బయట ప్రసంగించినప్పుడు మాట తడబడితే కష్టం. అయితే ఒకటి. ఖనిజ శాస్త్రం లో పెద్ద పెద్ద గ్రీకు, లాటిన్ పారిభాషిక పదాలు ఉంటాయి. ఎంత వాణీ కటాక్షం ఉన్న వాడికైనా అవి సులభంగా లొంగవు. కవితా ఛందస్సులో ఇంపుగా ఇమడవు. అంత పెద్ద శాస్త్రాన్ని విమర్శించడానికి నేనెంతటి వాణ్ణి కాని, ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. రాంబోహెడ్రల్ స్ఫటికాలు, రెటినాస్ఫాల్టిక్ రెసిన్లు, గెహ్లెనైట్లు, ఫస్సాయైట్లు, మాలిబ్డెనైట్లు, మెగ్నీషియం టంగ్స్టనైట్లు, జిర్కోనియం టైటనైట్లు వంటి ఖనిజ రాజాల పేర్లు ఉచ్ఛరించాలంటే ఎంతడి సహస్రావధానికైనా మనసు పొరబడదా, మాట తడబడదా, నాలుక మడతబడదా?


జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్
ప్రఖ్యాత ఫ్రెంచ్ కాల్పనిక విజ్ఞాన రచయిత, జూల్స్ వెర్న్ రాసిన ‘వొయాష్ ఒ ల సెంత్ర్ ద ల టెర్’ అనే నవల 1864 లో ప్రచురితం అయ్యింది. తదనంతరం అది ఇంగ్లీషులో కూడా అనువదించబడింది. ఆ థీం మీద ఒక ఇంగ్లీష్ చిత్రం కూడా గత సంవత్సరం విడుదల అయ్యింది.

ఈఇ నవలలో కథానాయకుడు ఓటో లీడెంబ్రాక్ అనే ఓ జర్మన్ ప్రొఫెసరు. భౌగోళిక శాస్త్రం లో ప్రొఫెసరైన ఈ పెద్దమనిషికి అగ్నిపర్వతాలలో భూ గర్భం లోతుల్లోకి తీసుకుపోయే రహస్య సొరంగ మార్గాలు ఉన్నయని ఒక నమ్మకం. అతడు, తన మేనల్లుడు ఏక్సెల్, సహచరుడు హన్స్ లు కలిసి భూగర్భంలో చేసిన సహసాల వౄత్తాంతమే ఈ నవల.

భూ గర్భం ఆదిమ జీవ రాశులతో కిటకిటలాడటం చూసి వీళ్లు ఆశ్చర్య పోతారు. అక్కడ ఎన్నో అద్భుతమైన అనుభవాలు పొంది చివరికి దక్షిణ ఇటలీ లో ఓ సొరంగ మార్గం ద్వారా బయట పడతారు. ఆధునిక భూభౌగోళిక శాస్త్రం దౄష్ట్యా ఈ కథలో చెప్పినట్టు భూ గర్భంలో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు ఉండటం, ప్రాచీన జీవ రాశులు ఉండటం వంటివి సాధ్యం కాని విషయాలు. కాని భూగర్భంలో ఖాళీలు, జీవరాశులు ఉన్నాయనే భావన గతంలో ఎంతో మంది రచయితల ఊహా శక్తిని ఆకట్టుకుంది. కనుక శాస్త్రీయ ధౄవీకరణ మాట ఎలా ఉన్నా, ఈ పుస్తకం కాల్పనిక వైజ్ఞానిక సాహిత్యంలో ఒక ముఖ్య స్థానాన్ని ఆక్రమిస్తోంది.

ఇందులో మొదటి రెండు అధ్యాయాల అనువాదాన్ని క్రమంగా పొస్త్ చెస్తాం. పాఠకుల ఆసక్తి, స్పందనను బట్టి ఆ ప్రయత్నం కొనసాగిస్తాము.
http://en.wikipedia.org/wiki/Journey_to_the_Center_of_the_Earth


చాలా మంది వాతావరణ శాస్త్రవేత్తలకి వాతావరణ భవిష్యత్ నిర్ణయం ఒక శాస్త్రమే కాదు. ఒక ఆర్.ఎం.పి డాక్టరు రోగానికి మందులు ఇచ్చినట్టు, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, పాత ఒరవడులు జ్ఞాపకం పెట్టుకుని, ఏదో ఊహించి చెప్పే ఉజ్జాయింపు వ్యవహారం. ఇంతకు ఇంతైతే, అంతకు అంత అని శాస్త్రీయంగా కోసినట్టు చెప్పగలిగే అవకాశం ఇక్కడ తక్కువ. ఇందులో వ్యక్తి యొక్క అనుభవానికే (కావలిస్తే దానికి కాస్త ఊహాశక్తి జోడించొచ్చు!) ప్రాధాన్యత. శాస్త్రీయమైన ఆధారం అంతగా ఉండదు. పైగా రేపు ఏం జరుగుతుందో కంప్యూటర్ల సహాయంతో లెక్కలు వేసి చెప్పగలిగే పద్ధతి అప్పటికి ఇంకా లేదు. అసలు కంప్యూటర్ల పరపతి అంతంత మాత్రంగానే ఉన్న రోజులవి. చాలా మంది కంప్యూటర్ల షక్తి సామర్థ్యాలని నమ్మే వాళ్లు కారు. దీనికి తోడు అసలు వాతావరణాన్ని నిర్ణయించే సమస్యే చాలా జటిలం కావడంతో ఎవరో లారెంజ్ వంటి ఏకాంత వీరులు తప్ప అటువంటి సమస్య జోలికి పోయేవారు కారు. పోలిక కోసం గ్రహగతులని నిర్ణయించే సమస్యని తీసుకుందాం. వాతావరణంతో పోల్చితే ఇదంత కష్టం కాదు. గ్రహగతులని నిర్ణయించే సమీకరణాలు న్యూటన్ కాలం నుండి కచ్చితంగా పాశ్చాత్య లోకానికి తెలుసు. ఇక మన దేశంలో జ్యోతిష్య షాస్త్రం ఎన్నో సహస్రాబ్దాలుగా గ్రహగతుల లెక్కలు కట్టి తిథి, వార నక్షత్రాలు నిర్ణయిస్తోందంటే ఆ పరిజ్ఞానం మరో రూపంలో మనకీ ఎప్పట్నుంచో ఉందన్నమాటే. ఆది ఎందుకు సాధ్యం అవుతోందంటే గ్రహగతుల స్వభావం అటువంటిది. వాటి పరిణామం తీరు అటువంటిది. ప్రస్తుతం గ్రహస్థితులేంఇటో కచ్చితంగా తెలిస్తే, భవిష్యత్తులో వాటి గతులు ఎలా ఉంటాయో కచ్చితంగా అంచనా వేయొచ్చు. అంటే గ్రహగతులు నిర్దే శ్య మైనవి ( దెతెర్మినిస్తిచ్) అన్నమాట. కాని లోకంలో మార్పు గల రాశు లన్నీ నిర్దే శ్యా లు కావు. కొ న్ని కొన్ని రాషులు మా రే తీరు ఎంత క్లిష్టంగా ఉంటుందంటే వాటి గతిని నిర్దేశించడం కష్టమవుతుంది. మరి ఎందుచేతనో వాతావరణ సమస్యలు అంత సులభంగా కొరుకుడు పడేట్టు లేవు. ఏం? వాతావరణపు గతులు నిర్దేశ్యాలు కావా? రేపు మన ఊళ్లో వర్షపు విందు వసుధపై వెల్లువై వెల్లివిరుస్తుందో లేదో చెప్పటం నిజంగా అంత కష్టమా?

ఫద్దెనిమిదవ శ తాబ్దపు యూరప్ లో లాప్లాస్ అని ఓ గొప్ప గణిత శా స్త్రవేత్త ఉండేవాడు. న్యూటన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ, మొదలైన యాంత్రిక సూత్రాలంటే ఇతడికి గొప్ప నమ్మకం. ఈ సూత్రాల సహాయంతో ఈ వి శ్వంలో ఏ ప్రక్రియనైనా క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు అని అతడి ధీమా. విష్వం యొక్క ప్రస్తుత స్థితి తెలిస్తే ఈ సూత్రాల సహాయంతో వి శ్వం యొక్క జాతకం అంతా చెప్పేయొచ్చునని బోధించేవాడు. అలా చెప్పటానికి అతడికి కావలసిందల్లా పెద్ద పెద్ద లెక్కలు చెయ్యగల సామర్ధ్యం – అంటే ఆ రోజుల్లో లేని మన ప్రస్తుత కంప్యూటర్ వంటి యంత్రం. కా ని ఐనిస్టీను ప్రతి పా దించిన సాపేక్ష సిద్ధాంతం, హైసెంబర్గ్ ప్రతిపాదించిన అనిశ్చితత్వ సూత్రం మొదలైనవన్నీ చూస్తుంటే లాప్లాసు ప్రద ర్శిం చిన ధీమా కేవలం ఓ అమాయకపు ఆ శ మాత్రమే అనుకోవాలి. కాని ఎన్ని అని శ్చితత్వ సూత్రాలు మన వి శ్వా సం మీద దెబ్బ కొట్టినా విజ్ఞానం భవిష్యత్తుని నిర్ణయించే ప్రయత్నం నుండి సులభంగా విరమించుకోదు. ఎందుకంటే ‘తరువాత ఏం జరుగుతుంది?’ అన్న ప్ర శ్నకి సమాధానం వెతకడమే వైజ్ఞానిక కృ షి అంతటికీ నిర్వచనం అని చెప్పుకోవచ్చు. మరి రేపు ఏం జరుగుతుందో కనుక్కోవాలంటే లెక్కలు కట్టాలి. విషయాన్ని బట్టి ఆ లెక్కలు చాలా జటిలంగా ఉండొచ్చు. అలాంటి లెక్కలని భేదించడానికి తగిన యంత్రాలు కావాలన్న గుర్తింపే మొట్టమొదటి కంప్యూటర్ల్ నిర్మాణానికి స్ఫూర్తి నిచ్చింది.

ఆడ మెదళ్ళు - మగ మెదళ్ళు

Posted by నాగప్రసాద్ Thursday, June 11, 2009 0 comments


ఇంకా పెద్దవా? బలమైనవా? వేగవంతమైనవా? ఆడ మెదళ్ళకి, మగ మెదళ్ళకి మధ్య నిజంగా ఏమైనా తేడాలు ఉన్నాయా? స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలకే కాదు సామాన్యులకి కూడా ఆసక్తి ఉంటుంది. స్త్రీలకి, పురుషులకి మధ్య ప్రవృత్తిలో తేడా ఉంటుంది కనుక, ఆ తేడా మెదడు నిర్మాణంలోను, క్రియలలోను కూడా ప్రతిబింబిస్తుందా? మరి తేడాలేమిటి? మెదడులో ఏ భాగాల్లో ఆ తేడాలు కనిపిస్తాయి?


కొన్ని వందల ఏళ్ళుగా స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి అన్వేషిస్తూ వచ్చారు మనుషులు. తొలి దశలలో జరిగిన కొన్ని పరిశోధనలలో స్త్రీ మెదళ్ళు కొంచెం చిన్నవి అని తెలియడంతో, ఆ విషయాన్ని పురుషాధిక్యతకి సమర్థింపుగా వాడుకోవడం జరిగింది. అయితే ఆ "సమర్థన" అంత హేతుబద్ధమైనది కాదని ముందు ముందు మీరే చూస్తారు. స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి నేటికీ గొప్ప వివాదం చెలరేగుతోంది. మెదడు నిర్మాణ పరంగానే కాదు, మెదడు క్రియల పరంగా మెదళ్ళలో ఈ తేడాలకి అర్థం ఏమిటి?

ఎదిగే పిండంలో ఉండే హార్మోన్ల మీద ఆ పిండం యొక్క మెదడు ఆడ మెదడు అవుతుందా, మగ మెదడు అవుతుందా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. ఆడ, మగ మెదళ్ళ మధ్య తేడాలని గమనించే అధ్యయనాలు ఈ కింది లక్షణాల మీద, లేదా భాగాల మీద దృష్టి సారించాయి.

1. మెదడు పరిమాణం
2. కార్పస్ కల్లోసం
3. హైపోథాలమస్


మెదడు పరిమాణంలో తేడాలు?

పుట్టినప్పుడు ఆడపిల్ల మెదడు కన్నా, మగపిల్లవాడి మెదడు పెద్దగా ఉంటుందని అన్ని అధ్యయనాలు ఒప్పుకుంటున్నా యి. పుట్టుకతో సగటు మగ పిల్లల మెదడు, ఆడపిల్ల మెదడు కన్నా 12-20% పెద్దగా ఉంటుంది. మగ పిల్లల తలల చుట్టు కొలత కూడా కాస్త పెద్దగానే (2%) ఉంటుంది. కాని శరీరం బరువుకి, మెదడు బరువుకి మధ్య నిష్ప్తత్తి దృష్టితో చూస్తే మగపిల్లలకి, ఆడపిల్లలకి మధ్య పెద్దగా తేడాలేదు. అంటే ఒకే బరువు ఉన్న ఆడపిల్ల, మగపిల్లల మెదళ్ళ బరువు కూడా ఒకటే అవుతుంది అన్నమాట.

అదే విధంగా ఎదిగిన వారిలో కూడా, పురుషుల సగటు మెదడు బరువు స్త్రీల సగటు మెదడు బరువు కన్నా 12% ఎక్కువ ఉంటుంది. అయితే పురుషుల బరువు సగటున స్త్రీల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది అన్న విషయం మరచిపోకూడదు. పైగా మెదడు బరువుకి, తెలివితేటలకి మధ్య ఖచ్చితమైన సంబంధం కూడా ఏమీ లేదు. ప్రవర్తనలో కూడా స్త్రీలకి, పురుషులకి మధ్య కొన్ని తేడాలు గమనించబడ్డాయి. ఉదాహరణకి కొన్ని భాషా సంబంధిత శక్తులలో స్త్రీలదే పై చేయి అని తెలిసింది. అదే విధంగా దూరం, దిక్కులు మొదలైన స్థానానికి సంబంధించిన సామర్థ్యాలలో పురుషులు ఆధిక్యులు. ప్రవృత్తిలో ఈ తేడాలని వివరించడానికి కుడి ఎడమ అర్థగోళాల మధ్య తేడాలు ఎత్తి చూపడానికి ప్రయత్నించారు కొందరు. అయితే అలాంటి అధ్యయనాలలో స్త్రీ పురుషుల మధ్య బహు కొద్దిపాటి తేడాలు మాత్రమే కనిపించాయి. నిజానికి తేడాల కన్నా పోలికలే ఎక్కువగా కనిపించాయి.

-- డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.

తెలిసిన వైజ్ఞానిక ధర్మాలని ఆధారంగా చేసుకుని, కంప్యూటర్ని ఓ సాధనంగా వాడుకుంటూ తన లక్ష్య సాధనలో మునిగిపోయాడు లారెంజ్. కంప్యూటర్ వాతావరణ నిర్మాణానికి ఉపక్రమించాడు.

బయటి వాతావరణాన్ని దేవుడి సృష్టించాడేమో గాని ఆ కంప్యూటర్ వాతావరణానికి తనే స్రష్ట. తనకి ఇష్టం వచ్చినట్టు ప్రకృతి ధర్మాలని మార్చుకోవచ్చు. అపర విశ్వామిత్రుడిలా తనకు నచ్చిన తీరులో ప్రకృతిని మలచుకోవచ్చు. ఉష్ణోగ్రత, పీడనం వంటి భౌతిక రాశుల మధ్య సంబంధాలని తెలిపేవే ప్రకృతి ధర్మాలు. ఆ ధర్మాలని గణిత సమీకరణాలుగా వ్యక్తం చేసి, వాటినే ప్రోగ్రాం రూపంలో కంప్యూటర్లో నడిపిస్తే, ఆకాశమంతా వ్యాపించే వాతావరణం నట్టింట నాట్యం చేస్తుంది! ఆ నాట్యం చేయించే పని మీదే ఉన్నాడు లారెంజ్!

లారెంజ్ ఓ వాతావరణ శాస్త్రవేత్త. చాలా మంది వాతావరణ శాస్త్రవేత్తల్లా కాక వాతావరణం అంటే చాలా ఇష్టం ఉన్నవాడు. దాన్ని లోతుగా శోధించాలనే కుతూహలం ఉన్నవాడు. ఫుట్టింది అమెరికాలో, కనెక్టికట్ రాష్ట్రంలో, వెస్త్ హార్ట్ ఫోర్డ్ అనే చిన్న ఊళ్లో. చిన్నతనంలో బయటికి వెళ్లి నేస్తాలతో ఆడే ఆటల కన్నా తన తండ్రితో కలిసి లెక్కల పజిల్స్ చెయ్యడం మీదే ఎక్కువ మక్కువ చూపించేవాడు. ఒకసారి వాళ్ళిద్దరికీ చాలా కఠినమైన చిక్కు లెక్క ఎదురయ్యింది. తర్వాత అసలు ఆ లెక్కకి పరిష్కారమే లేదని తేలింది. ఓ లెక్కకి పరిష్కారం లేదని నిరూపించటం కూడా ఒక విధంగా ఆ లెక్కని పరిష్కరించటమే అవుతుందని తండ్రి బోధపరిచాడు. 1938 లో జూనియర్ కాలేజి పూర్తి చేసి డార్ట్ మౌత్ కాలేజిలో లెక్కల్లో బియస్సీ చెయ్యాలని అనుకున్నాడు. కాని విధి రెండవ ప్రపంచ యుద్ధ రూపంలో అతడి తలుపు తట్టింది. వాయు సేనా విభాగంలో వాతావరణ సూచనలిచ్చే అధికారిగా వేశారు. వాతావరణ శాస్త్రంలో ఇదే అతడి మొదటి పరిచయం. యుద్ధం పూర్తయ్యాక వాతావరణ శాస్త్రాన్ని గణిత శాస్త్రపరంగా ఇంకా లోతుగా అధ్యయనం చెయ్యాలనుకున్నాడు. ముందుగా వాతావరణంలో వాయుసంచారం వంటి పాత సమస్యలను తీసుకుని అందులో సిద్ధాంతాలు వ్యాసాలు ప్రచురించాడు. అయితే వాతావరణం ఇలా ఎందుకుంది అన్నదానికి శాస్త్రీయ వివరణ ఇవ్వడం ఒక ఎత్తు. "వివరణ ఏదైతే ఎవడిక్కావాలి? ఇంతకీ రేపు ఏం జరుగుతుందో అది చెప్పు" అన్న ప్రశ్నకి సమాధానం చెప్పగలగడం మరో ఎత్తు. కనుక వాతావరణ మార్పులో జరగబోయేది చెప్పటం – భవిష్యత్ నిర్ణయం ( forecasting) – ఇదీ అసలు సమస్య. ఈ సమస్యనే సవాలుగా తీసుకుని ముందుకి సాగాడు లారెంజ్.

మరికొంత వచ్చే టపాలో...

రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.

గదంతా మసక మసకగా ఉంది. నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పరికరాల సన్నని ఝుంకారం వినిపిస్తోంది. స్పీకర్ లో నుండి ఏవో విచిత్రమైన శబ్దాలు వినవస్తున్నాయి. కంప్యూటర్ మానిటర్ మీద ఆకుపచ్చని రేఖలేవో తళుక్కు మంటున్నాయి. నెమ్మదిగా ఓ ఎలక్ట్రోడ్ మెదడు ధాతువులోకి దిగింది. ఓ నాడి కణాన్ని ఛేదించిన ఆ ఎలక్ట్రోడ్ సమయం వృథా చెయ్యకుండా చకచకా ఆ నాడీ కణం యొక్క క్రియ గురించిన సమాచారాన్ని కంప్యూటర్ కి చేరవేస్తోంది. మన నాడీశాస్త్ర వేత్త దినచర్య మొదలయ్యింది.

నాడీ శాస్త్రవేత్త లంతా ఈ విధంగా రోజంతా చీకటి గదుల్లో మానిటర్ల కేసి గుడ్లప్పగించి చూస్తూ శేష జీవితమంతా వెళ్ళబుచ్చుతూ ఉంటారని కాదు. కొందరు అమేజాన్ అడవులలో మెదడు వ్యాధులని నయం చేసే మూలికల కోసం గాలిస్తుంటారు. మరి కొందరు వైద్య కేంద్రాలలో మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగులకి చికత్స చేస్తుంటారు. మరి కొందరు సూక్ష్మదర్శినుల కింద అతిసన్నని మెదడు పరిచ్ఛేదాలని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఇంకా కొందరు ప్రత్యేక పరిస్థితులలో మనుషుల, జంతువుల ప్రవృత్తిని అధ్యయనం చేస్తూ ఉంటారు.

మరి 1.4 కిలోల బరువు ఉన్న ఈ మాంసపు ముద్దని, మనం మెదడు అని మురిసిపోయే ఈ అపురూపమైన అవయవాన్ని అధ్యయనం చెయ్యడానికి ఎలాంటి పరికరాలు కావాలి? నాడీశాస్త్ర వేత్తలు అసలు ఏం చేస్తారు? మనిషికి మానవత్వాన్ని ఆపాదించే ఈ అద్భుతమైన అవయవాన్ని నిజంగా వైజ్ఞానికంగా అధ్యయనం చెయ్యటానికి వీలవుతుందా?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఇక్కడ నొక్కండి (Click here).

రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.

కేయాస్ థియరీ - పార్ట్ 3

Posted by V Srinivasa Chakravarthy Tuesday, June 9, 2009 1 comments

1. గోరొంతలు కొండంతలు అయితే…

అక్కడి ఆకాశంలో కారుమబ్బులు ఉండవు. అక్కడి భూమి మీద మిట్టపల్లాలు ఉండవు. ఛుర్రు మనిపించే రవ్వలు రువ్వడు రవి. ‘నిలు’ అంటే నిలిచిపోతాడు అనిలుడు. అక్కడి మధుమాసంలో మావిచిగుళ్లు ఉండవు. గ్రీష్మంలో మార్తాండ తాండవం కనిపించదు. శీతాకాలపు చలి పెట్టే గిలిగింతలు ఉండవు. వర్షాలు, వాగులు, వరదలు – అసలివేవీ ఉండవు. అదో విచిత్రమైన వాతావరణం. కృత్రిమమైన వాతావరణం. మనిషి ఊహలో ప్రాణం పోసుకుంటున్న వాతావరణం. గుడ్డులోంచి పిట్ట బయటపడుతున్నట్టు కంప్యూటర్ లో మెల్లమెల్లగా రూపం పోసుకుంటున్న వాతావరణం.

ఆ కంప్యూటర్ ఎడ్వర్డ్ లారెంజ్ కి చెందింది. మసాచుసెట్స్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎం. ఐ. టి.) లో తన ఆఫీస్ గదిలో ఇంచుమించు సగ భాగం ఆ కంప్యూటరే ఆక్రమించింది. కుంభకర్ణుడి లాంటి ఆ మహా కంప్యూటర్ పేరు రాయల్ మక్బీ. ఇప్పటి పెంటియంలలా కిమ్మనకుండా పని చేసుకుపోయే తత్వం కాదు దీనిది. దాని రొదతో లారెంజ్ చెవులు హోరెత్తిపోతున్నాయి. అయినా పాపం ఓపిగ్గా అది ఇవ్వబోయే ఫలితాల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కంప్యూటర్ లో తను సిములేట్ చేసే వాతావరణం నిజం వాతావరణాన్ని పోలి ఉందంటే తన కలలు ఫలించినట్టే. స్త్రీ మనసులా ఒక పట్టాన అంతు బట్టని వాతావరణ రహస్యం ఇన్నాళ్ళకి తన చేతి కి చిక్కినట్టే.

1960 లో తన రాయల్ మక్బీ కంప్యూటర్ మీద వాతావరణాన్ని సిములేట్ చేసే ప్రోగ్రాం రాశాడు లారెంజ్. వేవేల చదరపు కి.మీ.ల విస్తీర్ణత గల భూమి ఉపరితలం మీద, వందలాది కి.మీ. ల మందం ఉన్న వాతావరణపు పొరలో, ఉష్ణోగ్రత, వాయుపీడనం మొదలైన ఎన్నో శక్తులు ఆడించే బరు బృహన్నాటకం అసలు వాతావరణం. దాని పరిణామాన్ని అంచనా వెయ్యడం అసాధ్యం అంటే ఆశ్చర్యం లేదు. కాని ఆ నిజం వాతావరణం అంత విచిత్రంగాను, అనిశ్చితంగాను ఉంది లారెంజ్ సిముల్లేట్ చేస్తున్న కృత్రిమ వాతావరణం. ఈ వార్త వాళ్ల డిపార్ట్ మెంటు అంతా పొక్కింది. సహోద్యోగులు, పీజీలు కంప్యూటర్ చుట్టూ మూగి పందేలు కాసేవారు. ప్రోగ్రాం ఏం చెబుతుంది? ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటుందా? రేపు వర్షం పడొచ్చా? అది చెదురు మొదురు జల్లా, పెను తుఫాను అవుతుందా? ప్రోగ్రాం నడక ఎంత పరిశీలించినా ఇక ముందు ఒరవడి ఇలా ఉంటుంది అని చెప్పటం కష్టం అవుతోంది. అందుకే పందేల ఆట మహా జోరుగా సాగుతోంది.

‘క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్’ అన్నట్లు, ఎట్నుంచి, ఎటుపోతుందో చెప్పలేని అనిశ్చిత పరిణతి గల వాతావరణం అంటే లారెంజ్ కి చిన్నప్పట్నుంచి ఒక విధమైన ఆకర్షణ. ఒకసారి జరిగిన ఒరవడి మళ్లీ జరగకుండా ఊహించరాని మారుదలతో కూడుకున్న వాతావరణపు గతులని ఎప్పటికైనా భేదించాలని అతడి జీవితాశయం. దాని కల్లోలిత గతుల మాటున ఉన్న లయలని వినాలని అతడి ఆశ. దాని అనిశ్చిచిత పరిణామం వెనుక నిశ్చయమైన రహస్య ధర్మాలేవైనా ఉన్నాయేమో తెలుసుకోవాలని అతడి ఆకాంక్ష.

మరికొంత వచ్చే టపాలో...

రచయిత: డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.

కల్లోలతా పరిశోధనలలో కంప్యూటర్ల వినియోగం ఒక కొత్త ఎత్తుకి ఎదిగింది. సంక్లిష్టతకి అంతర్లీనంగా ఉండే అద్భుతమైన ఆకృతికి అద్దం పట్టే అతి సుందర గ్రాఫిక్ చిత్రాలు వైజ్ఞానిక కళావస్తువుల స్థాయికి ఎదిగాయి. ఫ్రాక్టల్స్ (fractals) గురించి “బైఫర్కేషన్ల” (bifurcation) గురించి, “ఇంటెర్మిటెన్సీల” (intermittency) గురించి, తువ్వాలు-మడత “డిఫియోమార్ఫిజమ్” (diffeomorphism) ల గురించి పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఒక ఫ్యాషను అయిపోయింది. ఈ పదాలన్నీ చలనాన్ని అభివర్ణించే సరికొత్త పరిభాష అయిపోయాయి.

చూడటం మొదలెట్టారు కనుక కల్లోలం ప్రతీ చోట సాక్షాత్కరించసాగింది. సన్నని ధారగా ఎగసే సిగరెట్ పొగ కోటి పాయలుగా విడిపోతుంది. గాలికి రెపరెపలాడే జెండా తెగ మెలికలు తిరుగుతుంది. కొళాయి నుండి కింద పడే నీటి ప్రవాహం మొదట్లో సమంగానే ఉన్నా హఠాత్తుగా ఒక ఎత్తులో సంక్షోభంగా (turbulent) మారిపోతుంది. వాతావరణ పరిణామాలలో, ఎగిరే విమానం చుట్టూ మసలే వాయు తరంగాలలో, రహదారి మీద “జామ్” అయ్యే ట్రాఫిక్ ఒరవడులలో, భూగర్భ గొట్టాలలోని చమురు ప్రవాహంలో – ఇందుగలదందు లేదనకుండా ప్రకృతిలో ప్రతిచోటా కల్లోల తాండవమే కనిపించింది.

వివిధ వైజ్ఞానిక రంగాల మధ్య ఉండే కచ్చితమైన సరిహద్దులని అట్టే లక్ష్యపెట్టదు ఈ కల్లోలం. ఇది వ్యవస్థల యొక్క సార్వజనీన లక్షణాలకి సంబంధించినది కనుక బాగా వైవిధ్యం ఉన్న రంగాలకి చెందిన నిపుణులని దగ్గరికి తెచ్చింది. “పదిహేనేళ్ల క్రితం అతిశయమైన ప్రత్యేకీకరణ అనే దురవస్థ దిక్కుగా సైన్సు పరుగెత్తసాగింది. కాని ఆ ప్రత్యేకీకరణ పద్ధతి కల్లోలం యొక్క ఆగమనంతో పూర్తిగా మారిపోయింది.” అని డాక్టర్లు, భౌతిక శాస్త్రవేత్తలు, జీవశాస్త్రవేత్తలు మొదలైన వాళ్ళున్న ప్రేక్షకవర్గాన్ని ఉద్దేశించి ఒకసారి ఒక నౌకాదళ అధికారి అన్నాడు. సంక్లిష్టత యొక్క సార్వజనీన లక్షణాల గురించి చెప్తుంది కల్లోలం. ప్రప్రథమ కల్లోలాతా సిద్ధాంతులు అంతా కొన్ని మూల భావాల విషయంలో ఏకీభవించారు. వారికి ఆకృతిని గుర్తుపట్టగలిగే ప్రత్యేక దృష్టి ఉండేది. ఒకే ఆకృతి వివిధ విస్తృతులలో (scales) ఎలా కనిపిస్తుందో వాళ్ళకి చక్కని ఊహ ఉండేది. గజిబిజిగా నడిచే గతులంటే వాళ్లకి మక్కువ ఉండేది. పరిణామం అంటే ఏంటి? స్వేచ్చ అంటే ఏంటి? చైతన్యం అంటే ఏంటి? వంటి ప్రశ్నలు సరదాగా ఒకరికొకరు వేసుకుంటూ ఉండేవారు. అంతవరకు (అది ఇప్పటికీ బలంగానే ఉంది) ఒక వ్యవస్థను దాని మూలాంశాల (క్వార్క్లులు, క్రోమోజోమ్లు, న్యూరాన్లు ఇలా) వరకు విశ్లేషించి, ఆ మూలాంశాల లక్షణాలను బట్టి వ్యవస్థ ప్రవర్తనను అర్థం చేసుకునే పద్ధతి సైన్సులో బలంగా ఉండేది. దీనినే రిడక్షనిజమ్ అంటారు. భాగం మీద నిలిచిపోక వారి దృష్టి సమస్తం వరకు విస్తరించింది.

ఇక కల్లోలం యొక్క వీరాభిమానులని అడిగితే ఇరవయ్యవ శతాబ్దపు సైన్సు యొక్క ఘన విజయాలు మూడే నంటారు: సాపేక్షతా వాదం, క్వాంటం సిద్ధాంతం, కల్లోలం. కల్లోలం గత శతాబ్దంలో జరిగిన మూడవ మహోన్నత వైజ్ఞానిక విప్లవం అంటారు వాళ్ళు. ఆ మొదటి రెండు విప్లవాల లాగానే ఇది కూడా సాంప్రదాయక న్యూటోనియన్ విజ్ఞానాన్ని సవాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఒక భౌతిక శాస్త్రవేత్త ఇలా వివరిస్తాడు: “నిరపేక్షమైన దేశకాలాలనే న్యూటోనియన్ భ్రాంతిని సాపేక్షతా వాదం కూలగొట్టింది. కచ్చితంగా నియంత్రించగల కొలమాన ప్రక్రియ అనే న్యూటోనియన్ స్వప్నాన్ని క్వాంటం సిద్ధాంతం తుడిచివేసింది. సునిర్దేశ్యమైన నిర్ణయాత్మకత అనే లాప్లాసియన్ ఊహాగానాన్ని కల్లోలం పటాపంచలు చేసింది.” ఈ మూడు శాస్త్రవిభాగాలలోను ఒక్క కల్లోలం మత్రమే మనుష్య స్థాయిలో మనం రోజూ చూసే, అనుభూతి చెందే ప్రపంచానికి వర్తిస్తుంది. బాహ్య ప్రపంచం యొక్క ప్రత్యక్ష అనుభూతి నుండి, అవగాహన నుండి సైద్ధాంతిక భౌతిక శాస్త్రం అందనంత దూరంగా వచ్చేసిందన్న అభియోగం ఎప్పట్నుంచో ఉంది. ఆ అభియోగాన్ని అబద్ధం చెయ్యడానికి కల్లోలం ఒక వరంలా దొరికిందని ఎంతో మంది అభిప్రాయపడ్డారు.

అంతవరకు తెర మాటున తారట్లాడిన కల్లోలం ఒక దశలో వేదిక మీద అడుగుపెట్టింది. ఇరవయ్యవ శతాబ్దపు భౌతిక శాస్త్రంలో అధికభాగం కణవిజ్ఞానానికే అంకితమయ్యింది. పదార్థం యొక్క అంతరంశాలను అత్యధిక శక్తుల వద్ద, అతిసూక్ష్మ మితుల వద్ద, అతి క్లుప్తమైన వ్యవధుల వద్ద శోధిస్తూ వచ్చారు. ప్రకృతిని పాలించే మూల శక్తుల గురించి, విశ్వం యొక్క మూలరహస్యాన్ని గురించి కణ విజ్ఞాన శాస్త్రవేత్తలు సిద్ధాంతాలు నిర్మించారు. కాని వారిలో నవ్యతరానికి చెందిన భౌతిక శాస్త్రవేత్తలలో ఈ రంగం యొక్క పురోగతి పట్ల అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. క్వాంటం సిద్ధాంతపు చెణుకులతో, అధిక శక్తి కణాల మెరుపులతో అల్లకల్లోలంగా ఉన్న భౌతిక శాస్త్రానికి కల్లోలం ఓ కొత్త వెలుగు తెచ్చిపెట్టింది.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యూటన్ అధికార పీఠాన్ని అలంకరించిన మేటి ఖగోళ శాస్త్రవేత్త స్టెఫెన్ హాకింగ్ ఒకసారి భౌతిక శాస్త్రం యొక్క భవిష్యత్తు గురించి ఉపన్యసించారు. 1980 లో “సైద్ధాంతిక భౌతిక శాస్త్రానికి అంతు కనిపిస్తోందా?” అన్న అంశం మీద మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు.

“దైనిక జీవితంలో మన అనుభవాలని పాలించే భౌతిక ధర్మాల గురించి ఇప్పుడు మనకు బాగా తెలుసు… గొప్ప ప్రయోగ సాధనాలు, బోలెడంత ధనం వెచ్చించి చేసే ప్రయోగాల ఫలితాలను కూడా ముందుగా మనం నిర్ణయించలేకున్నాం అంటే సైద్ధాంతిక భౌతిక శాస్త్రం ఎంతగా పురోగమించిందో మనం ఊహించుకోవచ్చు.” అయితే సూక్ష్మకణాల స్థాయిలో ప్రకృతి ధర్మాలను అధ్యయనం చేసినా ఆ అవగాహనను అత్యంత సరళమైన వ్యవస్థలకి మాత్రమే వర్తింపజేయడానికి సాధ్యమయ్యింది. త్వరణ యంత్రంలో ప్రచండ వేగాన్ని పుంజుకున్న రెండు కణాలు మేఘమందిరంలో (cloud chamber) ఢీకొనడాన్ని ముందుగా నిర్ణయించడం వేరు. మరిగే ద్రవంలో, వాతావరణంలో, నాడీమండలంలో జరిగే సంక్లిష్ట సంఘటనలని ముందుగా నిర్ణయించడం వేరు.

హాకింగ్ వర్ణించిన భౌతిక శాస్త్రం నోబెల్ బహుమతులని తెచ్చిపెట్టింది. పరిశోధనలకి గొప్ప నిధులని సమకూర్చింది. వైజ్ఞానిక విప్లవంగా అభివర్ణించబడింది. కొన్ని సన్నివేశాలలో భౌతిక శాస్త్ర ప్రయాస అంతటికీ చరమ లక్ష్యం అయిన “గ్రాండ్ యూనిఫైడ్ థియరీ” చేయి చాచితే అందేంత దగ్గరలో ఉన్నట్లు కనిపించింది. విశ్వం పుట్టిన తొలి క్షణాలలో శక్తి, పదార్థం ఎలా పరిణామం చెందాయో భౌతికశాస్త్రం అర్థం చేసుకోగలుగుతోంది. కాని ప్రపంచ యుద్ధం తరువాత వచ్చిన కణ భౌతిక శాస్త్రాన్ని విప్లవం అనవచ్చునా? అంతకు ముందు సాపేక్షతకి, క్వాంటం సిద్ధాంతానికి పునాదులు వేసిన ఐనిస్టయిన్, బోర్ మొదలైన మూలకర్తల భావాలకి ఈ ఆధునిక విజ్ఞానం కేవలం ఓ విస్తృత రూపమే కదా? అణుబాంబు నుండి ట్రాన్సిస్టర్ వరకు ఆధునిక విజ్ఞాన ఆవిష్కరణలు నిజంగానే ఇరవయ్యవ శతాబ్దపు నేపథ్యాన్ని సమూలంగా మార్చివేశాయి. అయినా కూడా కణ భౌతిక విజ్ఞానపు పరిధులు ఇంకా ఇంకా కుంచించుకు పోతున్నాయనే చెప్పాలి. సామాన్యులు ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరులో గొప్ప పరివర్తన పుట్టించగల మౌలిక భావాలు పుట్టి ఇంచుమించు రెండు తరాలు దాటిపోయాయనే చెప్పాలి.

ప్రకృతిని గురించి కొన్ని ముఖ్య ప్రశ్నల సమాధానాలను శోధించకుండానే హాకింగ్ వర్ణించిన భౌతిక శాస్త్రం తన మార్గాంతాన్ని చేరుకునేట్టుగా ఉంది. జీవం ఎలా ఉద్భవించింది? ద్రవాలలో సంక్షోభం అంటే ఏమిటి? ఎంట్రొపీ చేత పాలించబడే ఈ ప్రపంచంలో, వర్ధమాన గందరగోళం అయిన విశ్వగోళంలో, క్రమం ఎలా ఉత్పన్నమవుతోంది? దైనిక జీవన అనుభవంలో మనకు ఎదుటపడే వస్తువులకి మనం ఎంతగా అలవాటు పడిపోయాం అంటే అవన్నీ మనకు బాగా తెలిసిన విషయాలని భ్రమపడతాం. అది భ్రమ అని గుర్తించం. అలా ఈ కల్లోలత విప్లవం కొనసాగుతుండగా, మానవ స్థాయిలో అర్థం గాని ఎన్నో చిక్కుసమస్యల గురించి శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇక తారావళుల జోలికి పోకుండా మేఘాల అధ్యయనం మొదలెట్టారు. క్రే సూపర్ కంప్యూటర్ లేకపోయినా బుల్లి బుల్లి మాకింటోష్ల మీదే గణనీయమైన కంప్యూటర్ పరిశోధనలు చెయ్యగలుగుతున్నారు. కొరుకుడు పడని క్వాంటం సిద్ధాంతపు పత్రాలతో పాటు, బల్ల మీద గెంతుతున్న బంతి యొక్క విచిత్ర గతి గురించి పత్రాలని కూడా శాస్త్ర పత్రికలు ప్రచురించడం ఆరంభించాయి. అతి సరళమైన వ్యవస్థలలో కూడా భవిష్యత్తును నిర్ణయించడం అంత కఠినమని మెల్లగా అర్థం అవుతోంది. అలాంటి వ్యవస్థలలో కూడా క్రమం పుడుతుంది. కల్లోలం, క్రమం వీడని తోబుట్టువులు. ఏ రంగంలోనైనా ఏకాంకాల – ఒక అణువు, ఒక న్యూరాన్, ఒక కణం ఇలాంటివి – ప్రవర్తనకి, అలాంటి ఎన్నో ఏకాంకాలు కలగలిసిన సమిష్టి ప్రవర్తనకి మధ్య చెప్పలేని వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలంటే ఓ కొత్త సైన్సు కావాలి. ఆ సైన్సే కల్లోలం అనిపించింది ఎంతోమందికి.

జలపాతం నేల మీద పాదం మోపిన స్థానంలో పక్కపక్కగా కొట్టుకుపోతున్న రెండు నురగ తునకలని గమనించండి. జలపాతం పుట్టిన చోట ఆ నురగ తునకలు ఎంత దూరంలో ఉండుంటాయో ఊహించలేం. జలపాతంలోని నీటి గతి ఎంత సంక్లిష్టంగా ఉంటుందంటే ఆ నురగల తునకల జాతకం ఆ భగవంతుడు కూడా చెప్పలేడేమో! సాంప్రదాయక భౌతిక శాస్త్రంలో ఒక వ్యవస్థ ప్రవర్తన చాలా సంక్లిష్టంగా ఉందంటే అసలు వ్యవస్థే చాల సంక్లిష్టంగా ఉండి ఉండాలన్నమాట. సరళ వ్యవస్థలో సంక్లిష్ట ప్రవర్తన అన్నది జరగని మాట. కాని 1960 లలో చెలరేగుతున్న కల్లోలతా ఉద్యమంలో అర్థమైనదేమిటి అంటే చాల సరళమైన గణిత సమీకరణాలలో కూడా ఆశ్చర్యకరమైన సంక్లిష్టత చూడవచ్చన్న విషయం. ఆరంభ స్థితులలో (initial conditions) చిన్న మార్పు ఉన్నా తదనంతర పరిణామం చాలా భిన్నంగా ఉంటుంది. దీనినే “ఆరంభ స్థితుల మీద సునిశితంగా ఆధారపడడం” అంటారు. ముఖ్యంగా వాతావరణం విషయంలో ఈ నియమం బాగా వర్తిస్తుంది. దీనికే “తూనీగ న్యాయం” అని ఒక తమాషా పేరు కూడా ఉంది. తూర్పు గోదావరిలో తూనీగ రెక్కలు అల్లారిస్తే తిరువనంతపురంలో తుఫాను చెలరేగిందట! అతి సూక్ష్మమైన కారణాలకి అతి పెద్ద పర్యవసానాలు ఉండడాన్ని సూచిస్తుంది ఈ న్యాయం. అలాంటి ధోరణి కల్లోలంలో ప్రథమ లక్షణం.

ఈ కల్లోలతా శాస్త్రానికి నాట్లు పెట్టి స్వహస్తాలతో పెంచిన పురోగాములు ఎందరో ఉన్నారు. వారు చేసిన సాహసాల మాలికే ఈ వ్యాస పరంపర.

రచయిత: డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.

ఇరవయ్యవ శతాబ్ద విజ్ఞానం లో విప్లవాలు అనుకోదగ్గ సిద్ధాంతాలు ప్రధానంగా రెండు ఉన్నాయి - ఒకటి సాపేక్ష సిద్ధాంతం, రెండవది క్వాంటం సిద్దాంతం. ఇవి కాకుండా మూడోది కేయాస్ థియరీ లేదా కల్లోలతా సిద్ధాంతం అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కేయాస్ థియరీ ని ఈ మధ్యన మన కమలహాసన్ గారు తన దశావతారం చిత్రంలో తెలివిగా వాడుకున్నారు. కేయాస్ థియరీ మీద జేమ్స్ గ్లయిక్ ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం తో ఆ సిద్దాంతం గురించి, ఆధునిక విజ్ఞానం మీద దాని ప్రభావం గురించి సామాన్యులకి కూడా తెలిసింది. ఆ పుస్తకం పరిచయం లో ఆ సిద్దాంతం గురించి, అది కనుగొనబడ్డ నేపథ్యం గురించి, దాని ప్రభావం గురించి వివరిస్తాడు గ్లయిక్. ఆ పరిచయానికి అనువాదం ఇదుగో...

---
అది అమెరికా లోని న్యూమెక్సికో రాష్ట్రం లోని లాస్ అలమోస్ నగరం. 1974 సంవత్సరం. ఎడారి హృదయంలో కుదురుగా ఉన్న ఆ ఉళ్ళో రాత్రి వేళల్లో నగర వీధుల వెంట ఎవరో అజ్ఞాత వ్యక్తి సంచరిస్తూ ఉన్నాడని పోలీసు వాళ్ళకి వార్త వచ్చింది. తారాకాంతి లో నిశ్శబ్దంగా నిద్దరోతున్న ఆ చీకటి వీధుల్లో రగిలే తన సిగరెట్ వెలుగుని చిందిస్తూ పొద్దు పోయేదాకా గమ్యం తెలీకుండా సంచరించే ఆ విచిత్ర వ్యక్తి ఎవరు అని తల బాదుకుంటున్నది కేవలం పోలీసులు మాత్రమే కాదు. లాస్ అలమోస్ జాతీయ ప్రయోగశాలలో ( Los Alamos National Laboratory ) పని చేసే తన తోటి సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలకి కూడా ఈ విషయం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఇటీవలే తమ సంస్థ లో చేరిన ఈ కొత్త సహోద్యోగి రోజుకి ఇరవై ఆరు గంటలు పని చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయం మీద పరిశోధనలు చేస్తున్నాట్ట! ఇక రాత్రంతా కాళ్ళరిగేలా ఊళ్ళన్నీ ఊరేగుతున్నాడంటే ఆశ్చర్యం ఎందుకు? కాస్త తేడాగా కనిపించే సహోద్యోగులు ఉండటం భౌతిక శాస్త్రవేత్తలకి కొత్తేమీ కాదు. కాని మరీ ఇంత తేడానా?

అలౌకికమైన న్యు మెక్సికో ఎడారి ప్రాంతాన్ని అణుబాంబు నిర్మాణం కోసం జే. రాబర్ట్ ఓపెన్ హైమర్ ఎన్నుకున్న నాటి నుండి మూడు దశాబ్దాలు తిరక్కుండానే లాస్ అలమాస్ జాతీయ ప్రయోగశాల ఇంతింతై అన్నట్టుగా ఎదిగిపోయింది. కణ త్వరణ యంత్రాలు, వాయు లేజర్లు, రసాయన కర్మాగారాలు, ఒక్కటేమిటి భౌతిక శాస్త్ర పరిశోధనకి కావలసిన నానా విధ వస్తు సంజాతమూ అక్కడ పోగయ్యింది. ముఖ్యంగా సూపర్ కంప్యూటర్ల అడవే వెలిసింది అక్కడ. కాస్త సీనియర్ శాస్త్రవేత్తలకి 1940 లలో చక చక కట్టిన చెక్క బంగళాలు ఇంకా గుర్తు. కాని టీ-షర్టు, జీన్సు వేసుకుని కాలేజి కుర్రకారులా తిరిగే కొత్త ఉద్యోగులు ఇక్కడే మొట్ట మొదటి అణుబాంబు తయారు చేశారు అంటే కళ్ళింత చేస్తారు. ఆ ప్రయోగశాలలో సైద్ధాంతిక విభాగాన్ని టీ - విభాగం అంటారు, కంప్యూటర్ల విభాగాన్ని సి -విభాగం అంటారు. అస్త్ర విభాగాన్ని ఎక్స్-విభాగం అంటారు. నూటికి పైగా భౌతిక, గణిత శాస్త్రవేత్తలు టీ -విభాగంలో పనిచేస్తారు. వీళ్ళకి జీతాలు బాగా ఇస్తారు. పాఠాలు చెప్పాలని, పేపర్లు రాయాలని విశ్వ విద్యాలయాలలో లాగ వీళ్ళ మీద ఒత్తిడి ఉండదు. స్వేచ్ఛగా తమ పరిశోధనా కార్యక్రమాల్లో మునిగిపోవచ్చు. ప్రతిభ అంటే ఏంటో, పరిజ్ఞానం అంటే ఏంటో బాగా తెలిసిన వాళ్లు. వీళ్ళను మెప్పించడం కష్టం.

కాని మిచెల్ ఫైగేన్ బౌమ్ కథ వేరు. అప్పటి దాక అతడు రాసిన పేపర్ల సంఖ్య ఒక్కటి అంటే ఒక్కటి. ఇంతకీ దేని మీద పరిశోధన చేస్తున్నావయ్యా అంటే ఏదో విడ్డూరం సమాధానం వస్తుంది. జుట్టంతా బాగా చెదిరి, కనుబొమ్మల మీదుగా ప్రవహిస్తూ, పాతకాలపు జర్మను వాగ్గేయకారుడిలా ఉంటాడు. కళ్ళలో ఏదో చమక్కు కనిపిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు వెనుక ఎవరో తరుముతున్నట్టు వేగంగా మాట్లాడతాడు. పని చేస్తున్నప్పుడు పిచ్చిగా పని చేస్తాడు. చేయనప్పుడు పురవీధుల వెంట పిచ్చిగా పొద్దనక రాత్రనక ( పొద్దనక కన్నా రాత్రనకే ఎక్కువట ) తిరుగుతుంటాడు. రోజుకి ఇరవై నాలుగు గంటలేనా అని తల్లడిల్లి పోతుంటాడు.

ఇరవై తొమ్మిదేళ్ళ వయస్సులో సైన్సు, ఇంజినీరింగ్ రంగాల్లో మహామహుల మధ్య మరో మహామహుడిగా చేరిపోయాడు. ఎవరికి ఏ చిక్కు సమస్య వచ్చినా సంప్రదింపులకి ఇతడి వద్దకే వస్తారు - అదీ అతడు చేతికి చిక్కినప్పుడు. ఒక రోజు ఇతడు ఆఫీస్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆ ప్రయోగశాల డైరెక్టర్ అయిన హారొల్ద్ ఆగన్యు అప్పుడే పని ముగించుకుని ఇంటికి పోతున్నాడు. ఈ ఆగన్యు చాలా పరపతి గలవాడు. ప్రయోగాశాలకి మూలకర్త అయిన ఓపెన్ హైమర్ శిష్యుడు. మొట్ట మొదటి అణుబాంబుని హిరోషిమా మీద వేసిన సమయంలో బాంబుని మోసుకు పోయిన విమానంతో పాటూ మరో అనుబంధ విమానంలో కూర్చుని ఆ నగరం మీద సర్వే చేసిన వాడు.

"నువ్వు చాలా తెలివైన వాడివని విన్నాను” సూటిగా విషయానికి వస్తూ ఫైగేన్ బౌమ్ తో అన్నాడు ఆగన్యు. “మరి అంత తెలివైన వాడివి అయితే లేజర్ సంలీనం ( laser fusion ) మీద పని చెయ్యొచ్చుగా?"

పొద్దంతా పరోపకారం చేస్తూ కూర్చోవటం తప్ప తనంతకు తానూ ఏదైనా పరిశోధన చేస్తాడా అని ఫైగేన్ బౌమ్ మిత్రులు కూడా విచారించడం మొదలెట్టారు. క్షణంలో అవతలి వాళ్ళకి సమస్యా పూరణం చేసి పెడుతుంటాడు, కాని తనకై తానూ ఏమీ చెయ్యడే. కొంత కాలం ద్రవాల, వాయువుల ప్రవాహంలో సంక్షోభం గురించి ఆలోచించాడు. మరి కొంత కాలం కాలం గురించి - కాలం అవిచ్చిన్నంగా ప్రవహిస్తుందా, డిస్కోతెక్కు తళుక్కులతో ఆగాగి కనిపించే డాన్సర్ల దృశ్యం లాగా విచ్చిన్నంగా ప్రవహిస్తుందా అని ఆలోచించాడు. అనంతకోటి నామ రూప వర్ణాలతో తొణికిసలాడే ఈ క్వాంటం ప్రపంచంలో మన కళ్ళు ఖచ్చితంగా రంగుని, రూపాన్ని ఎలా గుర్తుపడుతున్నాయి అని ప్రశ్నించాడు కొంతకాలం. విమానం కిటికీ లోంచి చూస్తున్నప్పుడు మేఘాల ఆకృతి గురించి ఆలోచించేవాడు (1975లో తిరుగుడు మరీ ఎక్కువయ్యిందన్న కారణం చేత తన యాత్రా పారితోషికం రద్దయ్యాక ఈ పరిశోధన నిలిచిపోయింది).

భౌతిక శాస్త్రంలో మూడు రకాల సమస్యలు ఉన్నాయని పండితులు అంటారు. మొదటి తరగతి సమస్యలు “ఓస్ ఇంతేనా?” అనుకునే సమస్యలు. కాస్త సత్తా ఉన్న భౌతిక శాస్త్రవేత్తలు కొంచెం గట్టిగా ఆలోచిస్తే తేలిపోయేవి అన్నమాట. ఉదాహరణకి మబ్బుల ఆకృతి ఫలానా విధంగా ఎందుకు ఉంది? వంటి సమస్యలు అన్నమాట. రెండవ తరగతి సమస్యలు ఓస్ ఇంతేనా అనలేని సమస్యలు. ఇలాంటి సమస్యలని సాధిస్తేనే నోబెల్ బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇక మూడవ రకం సమస్యలు దశాబ్దాల తరబడి విశ్వం లోతుల్లోకి చూస్తూ లెక్కలు కడుతూ తేల్చుకునే బాపతు సమస్యలు. వీటిని “ప్రగాఢ” సమస్యలు అంటారు. 1974 లో తెలీకుండానే ఫైగెన్ బౌమ్ ఓ ప్రగాఢ సమస్య మీద పని చెయ్యడం మొదలెట్టాడు. దాని పేరే కల్లోలం ( Chaos ).

కల్లోలం మొదలైన చోట సాంప్రదాయక భౌతిక శాస్త్రం నిలిచిపోతుంది. ప్రకృతి నియమాల గురించి ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆలోచిస్తూ వచ్చారు. వాతావరణంలో గాని, తుళ్ళె కెరటంలో గాని, జీవరాశుల సంఖ్యలో ఆటుపోట్లలో గాని, హృదయ లయలలో గాని, మెదడు సంకేతాల రచనలో గాని – క్రమంలేని, గజిబిజి నడక ఎక్కడ కనిపించినా శాస్త్రవేత్తలు దానినొక తలనొప్పిగానే భావించారు. ప్రకృతి యొక్క ఈ క్రమ రహిత పార్శ్వం వారికి ఒక విడ్డూరంగాను, వైపరీత్యంగాను తోచేది.

కాని 1970 లలో అమెరికాలోనూ, యూరప్ లోనూ కొంతమంది ప్రతిభావంతులు ఈ క్రమరాహిత్యపు కారడవి ద్వారా తీరైన బాటలు వేయడం ప్రారంభించారు. వారిలో గణిత, భౌతిక, జీవ, రసాయన శాస్త్రవేత్తలు ఉన్నారు. వివిధ రకాల క్రమరాహిత్యం మధ్య, అనావర్తక ( aperiodic ) ప్రవర్తనల మధ్య సంబంధాలను వాళ్లు శోధిస్తున్నారు. హఠాత్తుగా గుండె ఆగి చనిపోయిన వారిలో మరణానికి కొన్ని గంటల ముందు హృదయకంపనల గతి (సహజంగా కల్లోలంగా ఉండే గతి) క్రమబద్ధంగా మారిపోవటం గమనించారు భౌతిక శాస్త్రవేత్తలు. ఒక ప్రత్యేక జాతి మిడత రాశుల సంఖ్యలో హెచ్చు తగ్గులని అధ్యయనం చేస్తున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. స్టాక్ మార్కెట్ ఒరవడులని శోధిస్తున్నారు ఆర్థిక శాస్త్రవేత్తలు.

లాస్ ఆలమోస్ ప్రయోగశాలలో ఫైగెన్ బౌమ్ కల్లోలం గురించి గట్టిగా ఆలోచిస్తున్న రోజుల్లో ఆ రంగంలో పరిశోధన చేస్తున్నవారు చెదురుమొదురుగా పట్టుమని పిడికెడు మంది కూడా ఉండరు. కాలిఫోర్నియాలో, బెర్కిలీ లోని విశ్వ విద్యాలయం లో ఒక గణిత శాస్త్రవేత్త తన చుట్టూ ఒక గుంపును పోగేసి “గతిసరణుల” (dynamic systems) మీద పని చేసుకుంటున్నాడు. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ఒక జనాభా జీవశాస్త్రవేత్త (population biologist) అత్యంత అల్పమైన వ్యవస్థలలో కూడా పొంచి ఉన్న అత్యంత క్లిష్టమైన ప్రవర్తనను కాస్త శ్రద్ధగా తిలకించమని ప్రపంచ వైజ్ఞానిక సమాజాన్ని అభ్యర్థిస్తున్నాడు. పేరు మోసిన కంప్యూటర్ సంస్థలో పని చేస్తున్న ఓ జ్యామితి కారుడు గజిబిజిగా, కరుకుగా, కొంకర్లు పోయిన ప్రత్యేక రూపాల రహస్యాన్ని శోధిస్తూ ప్రకృతి ఆకృతి మీద ఒక కృతి రాయనున్నాడు. ఓ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ద్రవాల ప్రవాహాలలో కనిపించే సంక్షోభానికి , తాను “విచిత్ర ఆకర్షిణి” అని పిలిచే ఓ చోద్యపు కాల్పనిక నిర్మాణానికి మధ్య లోతైన సంబంధం ఉందని ప్రపంచానికి వెల్లడి చేస్తున్నాడు.

ఒక దశాబ్దం తిరిగే లోగా కల్లోలం అనేది వేగంగా వ్యాపిస్తూ వైజ్ఞానిక సాంప్రదాయాలని సమూలంగా సరిదిద్దుతున్న ఒక విప్లవానికి సార్థక నామం అయిపోయింది. కల్లోలపు సమావేశాలు, కల్లోలపు పత్రికలు, కల్లోలపు సదస్సులు కుప్పలు తెప్పలుగా వెలసాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ మొదలైన ప్రభుత్వ విభాగాలు కల్లోలతా పరిశోధనల మీద ధనాన్ని కుమ్మరిస్తూ వచ్చాయి. పేరున్న ప్రతి విశ్వవిద్యాలయం లోను, పరిశోధనా కేంద్రం లోను కల్లోలతా పరిశోధనలు ఆ సంస్థల ముఖ్య లక్ష్యాలలో చేరిపోయాయి. కల్లోలత గురించి, తదితర అనుబంధిత అంశాల గురించి పరిశోధనలు జరపటానికి లాస్ ఆలంఓస్ లో కూడా “అరేఖీయ అధ్యయనాల కేంద్రం” (center for nonlinear studies) ఒకటి నెలకొంది.
Justify Full
మరికొంత వచ్చే టపాలో...

రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి

సాలీడుకి జ్యామితి తెలుసా?

Posted by నాగప్రసాద్ Sunday, June 7, 2009 5 comments

అతగాడు భావుకుడు. కవి తాను అల్లుకున్న అందమైన భావజాలంలో విహరించినట్టు తాను అల్లుకున్న అందమైన ఆకాశ హర్మ్యంలో హాయిగా కొలువు ఉంటాడు. అతడు శాస్త్రవేత్త. శాస్త్రజ్ఞుడు తాను రూపొందించిన సైద్ధాంతిక నిర్మాణం నుండి విశ్వాన్ని దర్శించినట్టు, అతడు తాను పేనుకున్న మేలిమి మస్లిన్ భవంతి నుండి నిశ్చింతగా ప్రపంచాన్ని తిలకిస్తూ ఉంటాడు. కళాకారుడి కుంచే విసురులని మించిపోతాయి అతడు గీసే దారాల దారులు. అతడే అసలు స్పైడర్ మాన్!

కీటక ప్రపంచంలో సాలీడుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం బూజులు అని దులిపి పారేసే అంశాలే అటు శాస్త్రవేత్తలకి, ఇటు చిన్న పిల్లలకి కూడా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే నిత్యాద్భుతాలు. రోజూ పరిపాటిగా చూస్తుంటాం గనుక అలవాటు పడిపోతాం గాని, ఆ అలవాటు పడిపోవటం అనే దురలవాటుని మానుకుని అటు శాస్త్రవేత్త లాగానో, ఇటు చిన్న పిల్లవాడి లాగానో ఓ సారి సాలిగూడు కేసి పరిశీలనగా చూస్తే, దాన్ని నేసిన "సాలెవాడి" సత్తా ఏమిటో అర్థం అవుతుంది.

సాలె పురుక్కి అంత ప్రత్యేకతని ఆపాదించే విషయం (స్పైడర్ మాన్ లో కూడా మనను భలే ఆకట్టుకునే విషయం) అది వెలువరించే పట్టుదారం. అసలు జంతు ప్రపంచం లోనే సాలెపురుగు దారం ఓ అద్భుత సృష్టి. చూడటానికి పలుచగా, నాజూకుగా కనిపిస్తుంది గాని ఆ దారాన్ని తక్కువ అంచనా వేయకండెం. శాస్త్రీయ అంచనాల ప్రకారం ఈ దారం స్టీలు తాళ్ళ కన్నా గట్టిది. సాలె పురుగు దారాన్ని ఉపయోగించి పెన్సిలు మందం ఉన్న ఒక కట్టగా అల్లితే ఆ తాడు కదిలే బోయింగ్ 747 విమానాన్ని ఆపగలదని అంచనా!

సాలీడు దాని దైనిక జీవితం లో ఈ తాడుని ఎన్నో విధాలుగా ఉపయోగించు కుంటుంది. దాంతో తన గూడు అల్లుకుంటుంది. తన గుడ్లని పదిలంగా దాచుకోవటానికి సంచీలు కుట్టుకుంటుంది. దాని జాలంలో చిక్కుకున్న ఆహారాన్ని నుజ్జు చేస్తుంది. ప్రమాద పరిస్థితులలో ఆ దారాన్ని ఆధారంగా పట్టుకుని కిందకి దూకి పారిపోతుంది. ఆ ఒక్క దారంతో అంత గ్రంధాన్ని నడిపించగల గొప్ప "సూత్ర" దారి సాలీడు.

ఆ దారాన్ని సుక్ష్మంగా పరిశీలిస్తే ఫిబ్రిన్ అనే ప్రోటీన్ యొక్క గొలుసు కట్టు నిర్మాణం కనిపిస్తుంది. సాలీడు దారంలో ఫిబ్రిన్ ప్రోటీన్ అణువులు ఎంతో క్రమబద్ధంగా అమరి ఉండటం కనిపిస్తుంది. దారం యొక్క పటుత్వంలోని రహస్యం క్రమబద్ధమైన ఆ అణువిన్యాసం లోనే ఉంది.

దుపంట్ అనే కెమికల్ ఇంజినీరింగ్ కంపెని ఫిబ్రిన్ ని రికంబినంట్ డీ.ఎన్.ఎ. టెక్నాలజీ ని ఉపయోగించి తయారు చేసి, సాలీడు దారాన్ని పోలిన దారాన్ని కృత్రిమంగా తయారు చెయ్యగలిగింది. అలాంటి దారానికి వాస్తవ ప్రపంచంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆ కంపెనీ విశ్వాసం.

మరి అలాంటి అపురూపమైన దారంతో అంతటి సంక్లిష్టమైన, సౌష్టవమైన గూడు ఎలా నిర్మించ గలుగుతోంది? సాలీడుకి జ్యామితి తెలుసా? ఏ ఆర్కిటెక్ట్ సహాయమూ లేకుండా, మేస్త్రీలని పురమాయించ కుండా, కూలి వాళ్ళని పెట్టుకోకుండా ఒంటరిగా అంతటి ఇంటిని ఎలా కట్టు కుంటోంది?

సాలీడు చలనాన్ని సుక్ష్మంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు దాని గమనంలో ఒక క్రమాన్ని, ఒక వ్యూహాన్ని గుర్తించారు. అయితే అన్ని సాలీళ్ళు ఒకే రకమైన ఇళ్ళు కట్టుకుంటాయని లేదు. వాటికీ రకరకాల రుచులు, అభిరుచులు ఉన్నాయన్న మాట! అరానియాస్ దయాదేమాతాస్ అనే జాతి సాలీడు సైకిల్ చక్రం లాంటి కొంచెం సరళమైన గూడుని అల్లుకుంటుంది. ఆ నిర్మాణంలో క్రమం ఇలా ఉంటుంది.

ఆ నిర్మాణంలో మొట్ట మొదటి మెట్టుగా నిలువుగా నిశ్చలంగా ఉన్న రెండు ఆధారాల మధ్య ఓ దారాన్ని బట్టలు ఆరేసుకునే దండెం లా అడ్డుగా వేలాడ దీయటం. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. ఒక పక్కన నించుని దారాన్ని గాల్లోకి వెలువరించినా, ఆ దారాన్ని రెండవ పక్కకి చేరవేసేదేలా? ఒక గట్టు నుండి అవతలి గట్టుకి స్పైడర్ మాన్ లా గెంతు తుందా? కాదు. దారం యొక్క ఒక కొసని పట్టుకునే ఉంటూ, అవతలి కొసని అలా గాలికి వొదులుతుంది. దారం యొక్క అవతలి కొస గాలికి ఊగి ఊగి అకస్మాత్తుగా అవతలి గట్టుని తాకింది అంటే, దారం జిగురుగా ఉంటుంది కనుక అవతలి గట్టుని తాకిన చోట అతుక్కుపోతుంది . దాంతో మొదటి దశ పూర్తవుతుంది. "దండెం" సిద్ధం అయ్యింది.

అలా ఏర్పడ్డ దండెం మీద దొమ్మరి వాడిలా అటు ఇటు నడిచి మరిన్ని పేటల దారాన్ని దానికి జోడించి, అ దండెం ని బలపరుస్తుంది. దండెం బాగా బలపడిన తరువాత "తోరణాలు" కట్టుకునే సమయం వచ్చింది అన్నమాట! కాస్త వొదులుగా ఉండే దారాన్ని దండెం రెండు కోసల నుండి తోరణంలా వేలాడేలా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు తోరణం యొక్క కనిష్ట బిందువు నుండి మరో దారాన్ని నిలువుగా కిందికి వేలాడదీసి "Y " ఆకారపు నిర్మాణాన్ని తయారు చేస్తుంది. ఆ "Y " నిర్మాణంతో తక్కిన సాలెగూడు నిర్మాణం సాఫీగా సాగిపోవడానికి ఒక చట్రం వంటిది ఏర్పడింది అన్నమాట. ఆ "Y " లోని మధ్య బిందువే పూర్తిగా తయారైన సాలెగూటికి కేంద్రం అవుతుంది.

కేంద్రం, చట్రం ఏర్పడ్డ తరువాత పని ముమ్మరంగా సాగిపోతుంది. ముందుగా కేంద్రాన్ని పరిధితో సంధిస్తూ వ్యాసార్థాలు లాంటి పలు దారాలని వేస్తుంది. వ్యాసార్థాల రచన పూర్తయ్యాక కేంద్రం నుండి సుళ్ళు తిరుగుతూ పరిధి వైపుగా సాగే సర్పిలం (spiral) లాంటి బాటను వేసుకుంటూ పోతుంది. సర్పిలం పూర్తి అయ్యిందంటే ఇక పాలు పొంగించు కోవచ్చు నన్నమాట!

తీరుగా తయారైన ఇంట్లో చక్కగా కొలువు తీరి, రాత్రంతా ఆహారం కోసం ఎదురు చూస్తూ గడుపుతుంది సాలీడు. తన వలలో చిక్కుకున్న క్రిమికీటకాలని తన బాహువుల్లో బంధించి సంహరిస్తుంది. అలా రాత్రంతా సాగిన దారుణ మారణ కాండతో ముందు రోజు కట్టుకున్న ఇల్లు బాగా దెబ్బ తింటుంది. దెబ్బ తిన్న ఇంటిని నిశ్చింతగా ఆరగిస్తుంది సాలీడు! మొట్ట మొదట నిర్మించిన దండెం ని మాత్రం విడిచిపెడుటుంది. ఆ దండెమే మళ్ళీ సాయంకాలం ఆరంభం అయ్యే గృహనిర్మాణ కార్యక్రమానికి పునాది రాయి అవుతుంది.

- చక్రవర్తి

మరింత సమాచారం కోసం:
http://www.xs4all.nl/~ednieuw/Spiders/InfoNed/webthread.html
http://www.xs4all.nl/~ednieuw/Spiders/Info/SilkBoeing.html

ఓ ఆదర్శ సైన్స్ టీచర్

Posted by V Srinivasa Chakravarthy Saturday, June 6, 2009 4 comments


ఆ మధ్యన ఓ సైన్స్ టీచర్ ని కలుసుకోవటం జరిగింది.

ఈయన తిరుపతి దగ్గర ఓ చిన్న ఊళ్ళో, ఓ తెలుగు మీడియం స్కూల్లో సైన్స్ టీచరు. (ఆయన పేరు గాని, ఆ ఊరి పేరు గాని గుర్తుపెట్టుకోని నా నిర్లక్ష్యానికి నన్ను నేనే చెడా మడా తిట్టుకున్నాను!) ఈయన ఆరో క్లాసు పిల్లలకి సైన్సు చెప్తూ ఉంటే "విశ్వం" అన్న అధ్యాయంలో పిల్లలకి కొంత సమస్యగా ఉందని గుర్తించాడు.

(www.kagayastudio.com/space/stars/l_01_galaxy.htm)

గెలాక్సీ అంటే అసలేమిటి? అందులో సూర్యుడి స్థానం ఏమిటి? సౌరమండలంలో మనిషి స్థానం ఏమిటి? అలాగే ఋతువులు ఎలా ఏర్పడతాయి? Equinoxes, solstices మొదలైన పదాలకి అర్థం ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? ఇవన్నీ ఏదో బట్టీ పట్టి పిల్లలు పరిక్షలు తెగ రాసేస్తారు గాను నిజంగా అవి పిల్లల ఉహలకి అందడంలేదని గుర్తించాడా ప్రతిభాశాలి.


ఏదో చెయ్యాలని అనుకున్నాడు. దానికి అనువైన బోధనా సామగ్రిని తయారుచెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అయితే అ సామగ్రి మరీ ఖరిదైనదిగా ఉండకూడదు. పిల్లలు కావాలంటే వాళ్ల అంతకి వాళ్లు ఇళ్ళలో ఈ పరికరాలని చేసుకునేవిగా ఉండాలి.

మొదటి పరికరం భూమి పరిభ్రమణాన్ని ప్రదర్శిస్తుంది. పేపర్ మాష్ పద్దతితో ఓ బంతిని తయారు చేశాడు. దానికి కావలసింది ఓ బెలూన్, కొంత జిగురు, ఓ న్యూస్ పేపరు. ఈ బంతి మిద ఇప్పుడు ప్రపంచ పటాన్ని అంటించి భూగోళం నమూనాని తయారుచెయ్యాలి. అయితే సమతలం మీద ఉండే పటాన్ని గోళం యొక్క వంపు తిరిగిన ఉపరితలం మీద అంటిస్తే మడతలు పడుతుంది. కనుక ముందు మ్యాపుని కోణాకారపు విభాగాలుగా కోయాలి. ఈ విభాగాలని వేరు వేరుగా బంతి మీద అంటించాలి. కర్తోగ్రాఫర్లకి (మ్యాపులు తయారుచేసే వారికీ) ఈ రహస్యం బాగా తెలుస్తుంది.

ఇప్పుడా బంతి "ధ్రువాల" వద్ద కన్నాలు పెట్టి ఓ అక్షాన్ని ఏర్పాటు చేశాడు. అక్షం చుట్టూ ఓ రబ్బర్ బ్యాండ్ చుట్టి, దాని అవతలి కొసని బంతి ఆధారానికి (base) కి చుట్టాడు.

అలా తయారైన భూగోళం నమూనాని అనేక సార్లు చుట్లు తిప్పి వదిలేస్తే , కీ ఇచ్చిన బొమ్మలా, మెల్లగా అది దాని అక్షం మీద పరిభ్రమిస్తుంది. ఇప్పుడు సూర్యుడి స్థానంలో ఓ టార్చిలైటు ని అమర్చాలి. పరిభ్రమిస్తున్న భూగోళం మీద కాంతి పడి రాత్రి, పగలు ఎలా మారుతాయో చూడొచ్చు. భూమి వాలుని బట్టి ఎక్కడ ఎండా కాలమో, ఎక్కడ సీతాకాలమో సులభంగా చెప్పొచ్చు. ఇక equinoxes, solstices వంటి ఇబ్బందికరమైన అంశాలని కూడా ఆ నమూనాలో స్పష్టంగా ప్రదర్శించవచ్చు.

సరే ఇక భూమి పరిభ్రమణం మాట అటుంచి, అలా ఓ సారి మన మిల్కి వే గెలాక్సీ వైపు వెళ్దాం. దీనికీ ఓ చక్కని పరికరాన్ని తాయారు చేశాడా అ అజ్ఞాత మేధావి.

ఓ కొబ్బరి కాయని రెండు చిప్పలుగా కోశాడు. లోపలి గుజ్జు అంతా దోలిచేసి ఎండబెట్టాడు. ఓ గెలాక్సీ చిత్రాన్ని నల్లని వృత్తాకారపు అట్ట మీద అంటించాడు. ఆ వృత్త కేంద్రంలోంచి ఓ నల్లని కడ్డీ ని దూర్చి, ఆ వృత్తం తో బాటు ఆ కడ్డీ ని ఇందాకటి కొబ్బరి చిప్ప గోళానికి అక్షంగా అమర్చాడు. ఇక్కడ కూడా రబ్బర్ బ్యాండ్ టెక్నాలజీనే వాడటం జరిగింది.
పై చిప్పలో రెండు కన్నాలు పెట్టాడు. ఒక కన్నం లోంచి పెన్ టార్చ్ తో లైటు వేస్తె అది గెలాక్సీ చిత్రం మిద పడుతుంది. రెండవ కన్నం వద్ద కన్ను పెట్టి లోంచి లోపల ఏం జరుగుతోందో చూడొచ్చు.

చీకటి నేపథ్యంలో కాంతి పడి మెరుస్తూ పరిభ్రమిస్తున్న అ గెలాక్సీ ని చూస్తుంటే ఉన్నట్లుండి ఓ లక్ష కాంతి సంవత్సరాలు (పాల పుంత వ్యాసం) దూరం లోంచి ముద్దొచ్చే మన పాలపుంతకి ఏకాంత ప్రేక్షకుడై నిలిచి చూస్తున్న కమ్మని అనుభూతి కలుగుతుంది.


ఈ విధంగా ప్రతిభతో, పరిజ్ఞానంతో, ప్రేరణతో బోధనా రంగంలో గొప్ప కృషి చేస్తున్న టీచర్లు లేకపోలేదు. కానీ వాళ్ళ సంఖ్య తక్కువే. "మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో నైనా మంచిసైన్సు టీచర్లు అరుదే," అంటాడు ప్రఖ్యాత science popularizer శ్రీ అరవింద్ గుప్త (www.arvindguptatoys.com).

అందుకే నేడు అందరికీ అందుబాటులో ఉండే ప్రసార, సమాచార మాధ్యమాలని వాడుకుంటూ, మేటి సైన్స్ టీచర్ ల సృజనాత్మకత కృషి ఫలితాలు నలుగురికీ అందేలా తగిన ఏర్పాట్లు చెయ్యాలి.
- చక్రవర్తి

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts