శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
ఇటీవల బ్లాగ్ లో వచ్చిన కొన్ని వ్యాఖ్యానాల దృష్ట్యా వైజ్ఞానిక సాహిత్యంలో పరిభాషకి సంబంధించిన సమస్య గురించి చర్చించుకోవలసిన అవసరం కనిపించింది.

కొందరు బ్లాగర్లు ’లంబం’, ’అభిఘాతం’ అన్న పదాలకి ఇంగ్లీషు అనువాదాలని ఇస్తే బావుంటుందని అంటే, మరో బ్లాగరి (నా చిరకాల మిత్రుడు, వృత్తి రీత్యా శాస్త్రవేత్త) cerebrospinal fluid ని మస్తిష్కమేరు ద్రవం అని అనువదించాలని సూచించాడు. పరస్పర వ్యతిరేకంగా కనిపించే ఈ రెండు సూచనలలోను కొంత సత్యం ఉంది.

ఏ భాషలోనైనా జనరంజక వైజ్ఞానిక సహిత్యంలో రచన కత్తి మీద నడక లాంటిది. అందరికీ అర్థం కావాలి కనుక ’మామూలు’ రోజూవారీ పదాలతో, అవసరమైతే భావాన్ని కాస్తంత కల్తీ చేస్తూ రాయవలసి వస్తుంది. కాని అలా రాస్తే శాస్త్రరంగంలో ఉన్న వారికి నచ్చదు. ఈ రెండు వర్గాల వారిని సమాధానపరుచుకుంటూ జాగ్రత్తగా రాసుకుపోవాలి. శాస్త్ర సాహిత్యం నిండుగా ఉన్న ఇంగ్లీష్ లాంటి భాషలోనే ఈ సమస్య ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లో ఉండే సాహితీ సముద్రంతో పోల్చితే నాలుగు బొట్లు కూడా లేని తెలుగులో శాస్త్ర రచన చెయ్యడం కొంచెం ఇబ్బందే అవుతుంది.

దానికి కొన్ని సామాన్య కారణాలు ఉన్నాయి, కొన్ని వ్యక్తిగత పరిమితులు కూడా ఉన్నాయి.
(వ్యక్తిగత పరిమితులు: మీలో చాలా మంది లాగానే నేనూ ఇంగ్లీష్ మీడియం చదువులు వెలగపెట్టినవాణ్ణే. తెలుగుని కేవలం ఒక భాషగా మాత్రమే నేర్చుకున్నాను. శాస్త్రీయ పరిభాష ఇటీవలి కాలంలో కష్టపడి నిఘంటువులతో కుస్తీపడి నేర్చుకున్నది. కనుక కొన్ని చోట్ల పొరపాట్లు దొర్లవచ్చు. క్షమించాలి.)

సామాన్య కారణాలు:
ఇంగ్లీష్ లో శాస్త్ర సాహిత్యంలోనే కాదు, మరే ఇతర రంగంలో నైనా కఠిన పదాలని రచయితలు సంధర్భోచితంగా వాడడం, దాన్ని పాఠకులు సునాయాసంగా అర్థం చేసుకోవడం, ఆదరించడం పరిపాటి. కాని తెలుగులో రచయితకి ఆ వెసులుబాటు లేదు. కనుక ఒక విధంగా తెలుగు సజీవ పదజాలం కాస్త తక్కువనే అనుకోవాలి. నిఘంటువులలో ఎన్ని పదాలు ఉన్నాయన్నది లెక్క కాదు. సజీవంగా, చలామణిలో ఉన్న సాహితీ వాహినిలో ఎన్ని పదాలు పాల్గొంటున్నాయి అన్నదే ఆ భాషలో శబ్ద సంపదకి కొలబద్ద. తెలుగు రచనలలో ఎప్పుడూ అతి సామాన్యమైన, ’బుజ్జి బుజ్జి’ పదాలు మాత్రమే వాడాలి అని నియమం పెట్టుకుని రాస్తే ఇక ఓ అర్థశతాబ్దంలో తెలుగే లేకుండా పోతుంది.

దీనికి తోడు తెలుగు రచనలలో కూడా ఇంగ్లీష్ పదాలు విరివిగా వాడడం ఓ రివాజు అయిపోయింది. ’థ్రిల్లింగ్ గా వుంది’, ’ఇరిటేటింగ్ గా అన్నాడు” (ఇరిటేటెడ్ గా అనాల్సింది పోయి!), మొదలైనవి మన మేటి నవలా రచయితలు కూడా అలవాటుగా రాస్తుంటారు. అసలు అలా రాయడం ఒక విధంగా సమకాలీనతకి, ఆధునికకి చిహ్నం అన్నట్టుగా అయిపోయింది. ఇక కొందరు ఎన్.ఆర్.ఐ. రచయిత(త్రు)లు రాస్తుంటే అది తెలుగు కథా, లేక తెలుగు లిపిలో రాసిన ఇంగ్లీష్ కథా అని అనుమానం వస్తుంది. (అంత ’ఇది’గా ఉంటే ఏకంగా కథేదో ఇంగ్లీష్ లోనే రాయొచ్చు కదా? అనిపిస్తుంది. కాని తీరా ఇంగ్లీష్ లో రచనకి పూనుకుంటే అసలు భండారం బయటపడుతుంది.)

మరి ఇంగ్లీష్ లో వారికి ఎలా చెల్లిపోతుంది? మామూలు నవళ్లలో కూడా అంత గంభీరమైన భాషలో, చక్కని సందర్భోచితమైన శబ్దపుష్టితో, లోతైన విషయాలని రచయితలు రాసుకుపోతుంటారు. మిలియన్ల కొద్దీ పాఠకులు ఆ పుస్తకాలు కొని చదువుకుపోతుంటారు. ఇక ఇంగ్లీష్ లో వైజ్ఞానిక సాహిత్యం కూడా కాదు, కాల్పనిక విజ్ఞానంలో కూడా ప్రమాణాలు ఎంత ఎత్తున ఉన్నాయో ప్రదర్శించడానికి, ఓ సమకాలీన కాల్పనిక విజ్ఞాన నవల నుండి ఓ పేరాని కింద ఇస్తున్నాను.

Alistair Reynolds అనే బ్రిటిష్ కాల్పనిక విజ్ఞాన రచయిత రాసిన “Galactic North” అనే కథాసంకలనం నుండి, “Great Wall of Mars” అనే కథ నుండి ఓ పేరా (కొంచెం కఠినమైన పదాలని UPPERCASE లో ఇస్తున్నాను):

“The Wall was the most AUDACIOUS and visible of Voi’s projects. The logic had been INESCAPABLE: a means to avoid the millennia-long timescales needed to TERRAFORM Mars via such conventional schemes as COMETARY BOMBARDMENT or ICE-CAP THAWING. Instead of modifying the whole atmosphere at once, the Wall allowed the initial effort to be concentrated in a relatively small region, at first only a thousand kilometers across. There were no CRATERS deep enough, so the Wall had been completely artificial: a vast ring-shaped atmospheric dam designed to move slowly outward, ENCOMPASSING ever more surface area at the rate of twenty kilometers per year. The Wall needed to be very tall because the low Martian gravity meant that the column of atmosphere was higher for a fixed surface pressure than on Earth. The RAMPARTS were hundreds of meters thick, dark as GLACIAL ice, sinking great TAPROOTS deep into the LITHOSPHERE to harvest the ores needed for the Wall’s continual growth. Yet two hundred kilometers higher, the Wall was a DIAPHANOUSLY thin membrane only microns wide, completely invisible except when rare optical effects made it hang like a frozen AURORA agains the stars. Eco-engineers had seeded the liveable area CIRCUMSCRIBED by the Wall with TERRAN GENESTOCKS DEFTLY altered in ORBITAL labs. FLORA and FAUNA had moved out in VIVACIOUS waves, LAPPING eagerly against the constraints of the Wall.”

పై పేరా అర్థం కావాలంటే ఇంగ్లీష్ లో మంచి శబ్దజ్ఞానం ఉండాలి. Diaphanous, deftly లాంటి పదాలు తెలియాలంటే ఇంగ్లీష్ లో మంచి ప్రవేశం ఉండాలి. కాని అది ఉన్నా సరిపోదు. పై పేరా అర్థం కావాలంటే సైన్స్ లో కూడా మంచి పట్టు ఉండాలి. ఒక్కొక్క వాక్యం వెనుక ఉన్న విజ్ఞానాన్ని వివరించాలంటే పేరాలపేరా వ్యాఖ్యానం అవసరం. లేకపోతే పదాలు తెలిసినట్టే ఉంటాయి గాని, వాక్యం చదివితే తలాతోకా అర్థం కాదు. ఓ గోడ (Wall) ఏంటో, ఆ గోడు ఏంటో, తల గోడకేసి బాదుకున్నా అర్థం కాదు!

పోనీ ఇదేదో పీజీ కోర్సు కి చెందిన సైన్స్ టెక్స్ట్ పుస్తకం నుండి తీసుకున్న పేరా కూడా కాదు. ఓ రైల్వే స్టేషనులోనో, ఓ విమానాశ్రయంలోనో పుస్తకాల కొట్టులో ప్రయాణంలో కాలక్షేపం కోసం కొనుక్కుని సరదాగా చదువుకునే నవల నుండి తీసుకున్న అంశం.

నాకు ఇలాంటి రచన చూసినప్పుడు కుళ్లుగా ఉంటుంది. తెలుగులో మన పరిస్థితితో పోల్చుకుని బాధపడతాను. “ఆహ్! అందరికీ తినడానికి తిండి, తాగడానికి నీరు లేని మన దేశంలో ఇలాంటి విడ్డూరపు కాల్పనిక విజ్ఞానం లేకపోతే కొంపలేం అంటుకుపోవు” అంటారేమో. కాల్పనిక విజ్ఞానం ఉందా లేదా అన్నది ప్రశ్న కాదు. అలాంటి రచయితలు, రచనలు, పాఠకులు ఉన్న సమాజంలో విద్యాప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉండి ఉండాలో ఒక్క సారి ఆలోచించాలి.

మరి అది తెలుగులో ఎందుకు జరగదు? మన కథలలో, నవలలలో, సమకాలిన సాహిత్యంలో, సినిమాలలో ప్రతిభ, విజ్ఞత, పరిజ్ఞానం, లోతైన పాండిత్యం మొదలైన మాటలకి అర్థం లేకుండా ఎందుకు పోతోంది? (ఏవో కొద్ది పాటి మినహాయింపులు తప్ప) మూస పొసినట్టు ఒకే రకమైన భావాలని, భావోద్వేగాలని మళ్లీ మళ్లీచూపిస్తూ, వాటి గురించే రాసుకుంటూ, చదువుకుంటూ, వాటినే భజిస్తూ, వాటి కోసమే తపిస్తూ, దశాబ్దాలుగా కాలక్షేపం చేస్తున్నట్టు అనిపిస్తుంది.

మన దేశం గురించి, మన సమాజ పరిస్థితుల గురించి ఏం “అన్నా” దాన్ని “తిట్టడం” గా తీసుకుని, కొంత మంది (కొంత మందేం, చాలా చాలా మంది) విరుచుకు పడిపోతుంటారు. మన వాళ్ల ఈ అర్థం లేని సాంస్కృతిక అహంకారం (cultural chauvinism) గురించి “A better India, a better world” అన్న పుస్తకంలో ఇటీవలి కాలంలో ఇన్ ఫోసిస్ నారాయణ మూర్తి చాలా పదునుగా విమర్శించారు.

వర్తమాన పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రస్తుతం మన దేశంలో వస్తున్న మార్పుల జోరు చూస్తే 2040 కల్లా మన దేశం గుర్తుపట్టలేనంతగా మారిపోతుందని అనిపిస్తుంది. అక్షరాస్తత 99% కి పెరిగి, విజ్ఞానం సమాజం లోకి లోతుగా చొచ్చుకుపోతుందని అనిపిస్తుంది.

అప్పుడిక సైన్స్ రచయితలు ఎంత “లంబంగా” రాసినా ఆ “అభిఘాతానికి” పాఠకులు తట్టుకుని, ఆ భాషని, భావాన్ని అర్థం చేసుకుని ఆనందించే రోజు వస్తుందని ఆశిస్తున్నాను.

చక్రవర్తి.

8 comments

  1. "నాకు ఇలాంటి రచన చూసినప్పుడు కుళ్లుగా ఉంటుంది" నాక్కూడా అలాగే అనిపిస్తుంది :(

     
  2. చాలామందికి మీరు ఉదహరించిన "పేరాగ్రాఫ్" కలిగిన నవలలు చదివి మరిన్ని ఆంగ్ల పదాలు నేర్చుకోవడానికి ఏ మాత్రం జంకరు కానీ తెలుగులో ఇలా శాస్త్రీయ ఆంగ్ల పదాల కోసం కొత్త పదాలని వాడినప్పుడల్లా వారికి అపహాస్యంగా తోస్తున్నది. నేను అలాంటి వారిని చూసి సిగ్గు పడుతున్నాను. వాళ్ళకు ఆ పదాలు నచ్చకపోతే సరి, దానిని హేళన చేయడం పరిపాటి అయిపోయింది. పోనీ మరింత వ్యావహారికమైన పదం సూచిస్తారా అంటే అదీ లేదు.చేసిన వాళ్ళను ఎగతాళి చేస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు మన భాషకు మనమే శత్రువులమా అనిపిస్తుంది.

     
  3. Anonymous Says:
  4. మన విద్యావిధానం ఇంకా కొన్ని దశాబ్దాలు తెలుగుమీడియమ్ లోనే కొనసాగి ఉంటే, ఆ మీడియమ్ లోనే మనవాళ్ళని నూటికి నూరుశాతం అక్షరాస్యుల్ని కూడా చేసి ఉంటే మీరు కోరుకున్న చక్కని అభివృద్ధి చెందిన తెలుగు మారుమూలలక్కూడా పాకిపోయి ప్రతివాడూ మంచి ప్రామాణికమైన తెలుగు మాట్లాడుతూ, చదువుతూ అందులోనే ఆలోచిస్తూ ఉండేవాడు. కొత్త తెలుగు పదాల్ని ఇలా విదేశీశబ్దాలుగా చూసే దురవస్థ తప్పి ఉండేది. దురదృష్టవశాత్తు ఈ జాతి అక్కడిదాకా రాకుండానే ఈ రాష్ట్రంలో తెలుగు మీడియం విద్యని నిర్దాక్షిణ్యంగా వ్యవస్థీకృతంగా హత్య చేసేశారు, ప్రభుత్వమూ, ప్రజలూ అందరూ కలిసి ! మీరు ప్రామాణిక పదాలంటున్నారు, అసలు మామూలు తెలుగు పదాలే అర్థం కాని పరిస్థితి వచ్చేసింది దీనిమూలాన ! ఉదాహరణకి - ఈరోజు ఎంతమంది తెలుగుపిల్లలకి తెలుగు అంకెలు, తెలుగు రంగులు, తెలుగులో జంతువుల పేర్లు, తెలుగు వావివరుసలూ తెలుసు ? తల్లిదండ్రులే పనిగట్టుకొని మూడేళ్ళ బుజ్జిగాళ్ళకి పిల్లి అని నేర్పకుండా Cat అని నేర్పుతున్నారు.

    మన అసలు సమస్య మన తరతరాల రాజకీయ బానిసత్వంలో ఉంది. మన తెలుగుజాతి గత 300 ఏళ్ళుగా పరాయిజాతుల రాజకీయ ఆధిపత్యంలో బతుకుతూ వస్తోంది. (ఇప్పటికీ మనం హిందీవాళ్ళకి సామంతులం) తెలుగు రిపబ్లిక్ అంటూ చరిత్రలో ఏదీ లేదు. కాబట్టి మనం అన్నివిధాలా (భాష విషయంతో సహా) అణగారిపోవడం చాలా సహజం. ఈ బాధలు ఇంగ్లీషుజాతికి ఎప్పుడూ లేవు కదా ? మనమే కాదు, ఇంత సుదీర్ఘకాలం పాటు పరాయిపాలనలో ఉండే ఏ జాతయినా ఏదో ఒకనాటికి నామరూపాలు లేకుండా సంపూర్ణంగా సర్వనాశనమైపోతుంది. కానీ అమెరికన్ లు గత 230 ఏళ్ళ నుంచి స్వతంత్రులుగా ఉన్నారు. కానీ అంతకుముందు కూడా వాళ్ళు తమవాళ్ళ పాలనలోనే ఉన్నారు. ఇంగ్లీషువాళ్ళు గత 750 సంవత్సరాల నుంచి స్వతంత్రులుగా ఉన్నారు. అలా ఉన్నారు కనుక అన్నీ తమ భాషలోకి తెచ్చుకొని, తమ భాషని తమ గడ్డమీద తిరుగులేని అధికారభాషగా మార్చుకొని తదుపరికాలంలో దాన్ని ఇతరజాతుల నెత్తిమీద కూదా రుద్దగలిగారు. ఏదీ మనకా అవకాశం ?

    ఇప్పుడు మంచి తెలుగు మాట్లాడితే/ రాస్తే దాన్ని నన్నయగారి భాషగా చూసే పరిస్థితి వచ్చింది. ఈ మార్పు కేవలం గత ఇరవయేళ్ళలో వచ్చింది. అంతకుముందు లేదు. చూడబోతే మనం దక్షిణ అమెరికాకి చెందిన రెడ్ ఇండియన్ జాతుల మార్గంలో నడుస్తున్నట్లు కన్పిస్తున్నది.

     
  5. Anonymous Says:
  6. This comment has been removed by the author.  
  7. gaddeswarup Says:
  8. I studied in Telugu medium but that was long ago and now I find that I write badly both in Telugu and English. Apart from that, the problem I find about writing science topics in Telugu is the vocabulary. Often there are no equivalent words in Telugu ( possibly some have gone out of use) and I am not sure whether there are systematic rules for finding new words from roots as in Samskrit. Though I am very fond of achatelugu, I am beginning to feel that it may be useful to adopt Samskrit words for technical vocabulary for uniformity and at the same time give the common English words in brackets. If one is prepared to use Samskrit words, some state governments (like Karnataka) produced technical dictionaries which may be useful. The ones produced by A.P. govt. are very unsatisfactory ( I checked about three years ago and they said they were planning to revise them. There are also some efforts at site called telugupadam. Long ago there was an attempt by Digavalli Sivarao which can be found at google books). At the same time for technical words which are also used in newspapers etc it is desirable to see what common people use and perhaps even English words can be used with Telugu ebdings like in 'railu'. Howvever any effort will be too much for one person (unless he is a Panini) who has also other professional obligations and may be it is best at the moment to use what comes naturally to the author until some efforts by the A.P. govt are completed.

     
  9. Swarup garu:
    This is exactly how I too feel about the problem of cleaning up technical terms in Telugu . It is a job for the AP govt, Telugu Academy etc. Once they begin to organize the effort, some of us can participate and contribute in various ways. It certainly cant be an individual effort.

     
  10. Enimidi Says:
  11. I appreciate your efforts in bringing Science articles in Telugu.

     
  12. తార Says:
  13. అసలు ఈ గొడవంతా లేకుండా, చక్కగా సంజ్ఞలు ఇవ్వండి, ఏ గొడవా వుండదు. నాలాంటి వాడికి ఇంకా సులభంగా అర్ధం ఐపోతుంది.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts