శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


వివరాల కోసం: manchipustakam.in

తూలి పడకుండా నిలిపే నాలుక

Posted by V Srinivasa Chakravarthy Monday, April 25, 2011 5 comments



ఈ రోజు ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం.
http://www.andhrabhoomi.net/intelligent/naluka-547


కోట్ల ఏళ్ల పరిణామం తరువాత మనిషికి అబ్బిన ఓ అపురూపమైన లక్షణం – రెండు కాళ్లమీద నిటారుగా నించుకోగలగడం, కింద పడిపోకుండా సునాయాసంగా నడవడం. సమతూనిక కోల్పోకుండా నించోవడం, నడవడం మనం ఎంత సహజంగా చేస్తామంటే అదొక పెద్ద విశేషమైన సామర్థ్యం అనిపించదు. కాని ప్రమాదం వల్ల గాని, వ్యాధి వల్ల గాని ఆ సామర్థ్యాన్ని మనం కోల్పోయినప్పుడు దాని విలువేమిటో అనుభవం అవుతుంది. షెరిల్ షిల్జ్ అనే మహిళ విషయంలో సరిగ్గా అదే జరిగింది.

ఈమె అనుక్షణం ఎక్కడ పడిపోతానో అన్న భావనతో బిక్కుబిక్కు మని బతుకుతుంది. నడిచేటప్పుడు కాళ్లు బాగా ఎడంగా పెట్టి, చేతులు చాచి, అటూ ఇటు ఊగిపోతూ భయం భయంగా నడుస్తుంది. తన నడక తీరు చూస్తుంటే చుట్టూ ఎవరో అదృశ్యమైన దుండగులు చేరి తనని అటుఇటు తోస్తున్నారేమో ననిపిస్తుంది. నడవడానికి గోడ పట్టుకుని కష్టంగా నడుస్తుంది. ఎంత విశ్వప్రయత్నం చేసినా తరచు కింద పడుతూ ఉంటుంది. పోనీ కింద పడిపోయాక అయినా తూలిపోతున్న భావన పోతుందా అంటే అదీ లేదు. కింద పడ్డాక “ఏ క్షణాన కింద నేల విడిపోయి అగాధంలో పడిపోతానో అనిపిస్తుంది” అంటుంది.

మనం కింద పడిపోకుండా నించోడానికి, నడవడానికి ఉపయోగపడే సమతూనికా వ్యవస్థ (vestibular system) షెరిల్ లో దెబ్బ తిన్నది. ఈ వ్యవస్థలో vestibular apparatus అనే ముఖ్యమైన యంత్రాంగం మన చెవుల అంతర్భాగంలో ఉంటుంది. ఇందులో ద్రవం నిండిన మూడు అర్థవృత్తాకార కాలువలు (semi-circular canals) ఉంటాయి. వీటి పని తీరుని అర్థం చేసుకోడానికి కదులుతున్న కారులో కాఫీ కప్పుని చేతిలో పట్టుకున్న సన్నివేశాన్ని ఊహించుకోవాలి. కారు ఉన్నట్లుండి ఆగితే కప్పులోని కాఫీ సంచలనంగా కదిలి కింద చిందొచ్చు. అలాగే మనం అటు ఇటు కదిలినప్పుడు ఈ అర్థవృత్తాకార కాలువలలోని ద్రవం అటు ఇటు కదులుతుంది. ద్రవం యొక్క కదలికల వల్ల సీలియా అనే కణాలలో పుట్టిన విద్యుత్ సంకేతాలు మెదడుని చేరుతాయి. మెదడులోని మోటారు ప్రాంతం నుండి కండరాలకి తగు ఆజ్ఞలు వెళ్లి శరీరం కిందపడకుండా నిగ్రహిస్తాయి. ముప్పై తొమ్మిదేళ్ల వయసులో షెరిల్ కి హిస్టిరెక్టమీ ఆపరేషన్ లో గర్భసంచీ తీసేశారు. ఆపరేషన్ తరువాత సోకిన ఓ ఇన్ఫెక్షన్ ని అడ్డుకోడానికి గాను జెంటామైసిన్ అనే ఆంటీబయాటిక్ ఇవ్వడం జరిగింది. మందు డోస్ ఎక్కువై అందుకు దుష్ప్రభావంగా తన వెస్టిబ్యులర్ ఆపరేటస్ దెబ్బ తిన్నది. మందుల వల్ల తనలో కలిగిన ఈ వైకల్యం శాశ్వతంగా ఉండిపోతుందని తెలిసి నీరుగారిపోయింది షెరిల్.


నాటితో మొదలయ్యాయి తన ఇక్కట్లు. చేత్తో కెమేరా పట్టుకుని తీసిన వీడియో చిత్రంలో లాగా లోకం అంతా కదిలిపోతూ కనిపిస్తుంది. చుట్టూ ఉండే వస్తువులు నిలకడ లేనట్టుగా అస్థిరంగా కనిపిస్తాయి. కళ్లు తెరిచి ఉన్నంత సేపు కింద/పైన మొదలైన దిశలకి సంబంధించిన సమాచారం అందడం వల్ల నిలదొక్కుకునేది. కళ్లు మూసుకోగానే కుప్పకూలిపోయేది. నిటారుగా నించోడానికే ఇంత విశ్వప్రయత్నం అవసరం కావడం వల్ల సులభంగా అలిసిపోయేది. ఇలాంటి దుర్భర జీవితం గడుపుతున్న తరుణంలో వైద్యరంగంలో జరుగుతున్న కొన్ని పరిశోధనలు తనలో కొత్త ఆశ చిగురింపజేశాయి.

పాల్ బాక్ –ఇ-రీటా అనే పేరుమోసిన నాడీశాస్త్రవేత్త షెరిల్ విషయంలో ఓ విప్లవాత్మకమైన ప్రయోగం చెయ్యడానికి సిద్ధమయ్యాడు. అతడికి ఈ ప్రయత్నంలో యూరీ డానిలోవ్ అనే బయోఫిజిక్స్ నిపుణుడు సహాయపడ్డాడు. ప్రయోగంలో భాగంగా షెరిల్ తల మీద ఓ హ్యాట్ పెట్టారు. అందులో తన కదలికలని కొలిచే ఓ త్వరణమానిని (accelerometer) ఉంటుంది. మనలో సహజంగా అర్థవృత్తాకార కాలువలు చేసే పనే ఈ పరికరం చేస్తుంది. ఆక్సెలెరోమీటర్ నుండి కదలికలకి సంబంధించిన సంకేతాలు ఓ చిన్న ప్లాస్టిక్ బద్దకి చేరుతాయి. ఆ బద్దలో 144 చిన్న చిన్న ఎలక్ట్రోడ్ లు ఓ జల్లెడలా అమర్చి ఉన్నాయి. ఆ బద్దని షెరిల్ నాలుక మీద ఉంచి నడవడానికి ప్రయత్నించమన్నారు నిపుణులు. నాలుక మీద ఉంచిన బద్దలోంచి ప్రవహించే విద్యుత్తు వల్ల నాలుక మీద కాస్త చురుక్కు మంటుంది. నొప్పి కలుగదు గాని కోక్ తాగుతున్నప్పుడు నాలుక మీద కోక్ నురగలా కాస్త చురచురలాడుతుంది. షెరిల్ ముందుకు వంగినప్పుడు ఆక్సెలెరోమీటర్ సంకేతాలు ఆ బద్ద మీద ముందు భాగంలో విద్యుత్తు ప్రవహించేలా చేస్తాయి. అలాగే కుడి పక్కకి వొరిగినప్పుడు బద్ద మీద కుడిభాగంలో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఆ విధంగా తన నాలుక మీద చురచురల వినాసం బట్టి తన శరీరం యొక్క సమతూనిక ఎలా ఉందో తెలుసుకోగలిగింది షెరిల్. ఇలాంటి ఏర్పాటు వల్ల వెస్టిబ్యులర్ ఆపరేటస్ చేసే పనిని నాలుక తీసుకుంది అన్నమాట. ఒక ఇంద్రియం దెబ్బ తిన్నప్పుడు దానికి బదులుగా మరో ఇంద్రియాన్ని వాడుకునే ఈ పద్ధతినే ఐంద్రియ ప్రతిక్షేపం (sensory substitution) అంటాడు బాక్- ఇ – రీటా.


ఈ కొత్త, వింతైన పరికరాన్ని తగిలించుకుని నడవడానికి ప్రయత్నించింది షెరిల్. త్వరలోనే కళ్లు మూసుకుని కూడా పడిపోకుండా నిలవగలిగింది. నించున్నంత సేపు ఊగిసలలాట ఆగిపోయింది. ఎన్నో ఏళ్ళ తరువాత మొట్టమొదటి సారిగా కుదురుగా ఇరవై నిముషాల పాటు నించోగలిగింది. అనుక్షణం పడిపోతున్నట్టు అనిపించే అనుభూతితో తను పడుతున్న యాతన ఒక్కసారిగా తొలగిపోయింది. సంతోషం పట్టలేక ఏడ్చేసింది. తనకి ఇంత మేలు చేసిన డాక్టరు, ఇంజినీరు దేవుళ్లలా కనిపించారు.


ఇప్పుడు ప్రయోగంలో తదుపరి మెట్టు మొదలయ్యింది. కాసేపు ఆ పరికరాన్ని తగిలించుకున్నాక తీసేసి నడవడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? అదే ప్రయత్నించి చూసింది పరిశోధనా బృందం. పరికరాన్ని ఓ నిముషం పాటు తగిలించుకున్నాక తీసేస్తే, దాని సత్ప్రభావం మరో ఇరవై సెకనుల కాలం పాటు నిలిచింది. రెండు నిముషాలు తగిలించుకుంటే ఆ శేషప్రభావం నలభై సెకనుల కాలం నిలిచింది. మరి ఇరవై నిముషాలు తగిలించుకుంటే శేషప్రభావం ఏడు నిముషాలు ఉంటుందని పరిశోధనా బృందం ఆశించింది. కాని అందుకు వ్యతిరేకంగా శేషప్రభావం ఓ గంట సేపు ఉండడం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఆ అద్భుత పరికరాన్ని ఆగాగి తొడుక్కుంటూ ఇంచుమించు తన మునుపటి జీవితాన్ని తిరిగి దక్కించుకోగలిగింది షెరిల్.


ఓ అద్భుతంలా కనిపించే ఈ వృత్తాంతం వెనుక ఓ ముఖ్యకారణం మొదడు యొక్క ఓ ప్రత్యేక లక్షణం. అది మారే పరిస్థితులకి మెదడు యొక్క సర్దుకుపోయే గుణం. కొన్ని సార్లు ఆ సహజ సర్దుబాటు లక్షణం సరిపోనప్పుడు ఇలాంటి కృత్రిమ పరికరాలతో దానికి కొంచెం ఆసరా ఇవ్వవలసి ఉంటుంది. ఒక ప్రత్యేక క్రియకి అవసరమైన నాడీ మార్గాలు ఏ కారణం చేతనైనా దెబ్బ తింటే, ఇలాంటి కృత్రిమ పరిస్థితులు కల్పించడం వల్ల కొత్త, ప్రత్యామ్నాయ నాడీ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి ఏర్పడుతున్న కాలంలో కొంత బాహ్యమైన ఆసరా అవసరం. పూర్తిగా ఏర్పడిపోయాక అలాంటి ఆసరా ఇక అవసరం ఉండకపోవచ్చు. మెదడులో దానిని అది నయం చేసుకునే అపురూమైన లక్షణానికి దొహదం చేస్తూ తగిన సాంకేతిక నైపుణ్యాన్ని రూపొందించగలిగితే, ప్రస్తుతం అసాధ్యం అనిపించే ఎన్నో మెదడు రోగాల చికిత్సలో గొప్ప ప్రగతి సాధించే అవకాశం ఉంది.

నిన్న ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం- http://www.andhrabhoomi.net/intelligent/grahalanu-243


ఇతర గ్రహాల మీద మనిషిని పోలిన ప్రజ్ఞావంతులైన జీవుల కోసం వేట, చింతన ఎంతో కాలంగా సాగుతోంది. మన సౌరమండలంలో (భూమి కాని) ఇతర గ్రహాల మీద, ఉపగ్రహాల మీద జీవరాశులు – అదీ ప్రజ్ఞ గల జీవరాశులు - ఉండే అవకాశం బహు తక్కువ. కనుక ఇతర తారల పరిసర గ్రహాల మీద అలాంటి జీవులు ఉండొచ్చనే ఆలోచన సహజంగా స్పురిస్తుంది. ఆ ఆలోచనే సౌరమండలానికి బయట గ్రహాల కోసం అన్వేషణకి స్ఫూర్తి నిచ్చింది. అయితే మనకి అతి దగ్గరలో ఉండే సౌరమండలంలోనే దూర గ్రహాలైన యురేనస్, నెప్ట్యూన్ల ఆవిష్కరణ అంత సులభంగా జరగలేదు. స్థిరతారల నేపథ్యం మీద నెమ్మదిగా సంచరించే సన్నని చుక్కల కోసం విశ్వయవనికని అణువణువూ పరిశీలించిన మీదటే దూర గ్రహాలైన నెప్ట్యూన్, ప్లూటోలు దొరికాయి. గ్రహాలకి సహజ ప్రకాశం ఉండదు కనుక, సూర్యుడి నుండి ప్రతిబింబిత కాంతి సహాయంతో వాటిని కనుక్కోవడం దూర గ్రహాల విషయంలో కష్టం అవుతుంది. ఇక అలాంటప్పుడు ఎన్నో కాంతిసంవత్సరాల దూరంలో ఇతర తారావ్యవస్థలలో ఉండే గ్రహాలని కనుక్కోవడం దుస్సాధ్యం అనిపిస్తుంది.


అయితే అలాంటి లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని పరోక్ష పద్ధతులని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. వాటిలో మూడు ముఖ్యమైనవి –

• కోణీయ వేగ పద్ధతి (Method of angular velocity)

• ఖగోళ మాన పద్ధతి (Method of Astrometry)

• గోచార పద్ధతి (The Transit Method)



పరోక్ష పద్ధతులు అన్నిటిలోను మూలసూత్రం ఒక్కటే. ఒక తార చుట్టూ ఒక గ్రహం తిరుగుతున్నప్పుడు, ఆ గ్రహానికి (ముఖ్యంగా అది భారీ గ్రహం అయితే) తార మీద కొంత ప్రభావం ఉంటుంది. ఆ కారణం చేత తార నుండి వచ్చే సమాచారంలో కొన్ని ఆటుపోట్లు కనిపిస్తాయి. వాటిని బట్టి గ్రహం యొక్క ఉన్కిని తెలుసుకోవడానికి వీలవుతుంది.


ఒక తార చుట్టూ ఓ భారీ గ్రహం తిరుగుతున్నప్పుడు, కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రం (conservation of angular momentum) వల్ల తార కూడా నెమ్మదిగా అటుఇటు ఊగిసలాడుతుంది. దీని సారూప్యంగా షాట్ పుట్ బంతిని విసిరే ఓ క్రీడాకారుణ్ణి ఊహించుకుందాం. గొలుసు కట్టి ఉన్న షాట్ పుట్ ని విసరడానికి ముందు క్రీడాకారుడు ఆ గొలుసు పట్టుకుని గిరగిరా తిరుగుతాడు. షాట్ పుట్ కి, దాన్ని తిప్పుతున్న క్రీడాకారుడికి మధ్య ఉండే సామాన్య గురుత్వ కేంద్రం చుట్టూ ఇద్దరూ తిరుగుతుంటారు. అదే విధంగా ఓ తార చుట్టూ ఓ భారమైన గ్రహం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, గ్రహం ప్రభావం వల్ల తార కూడా చిన్న కక్ష్యలో తిరుగుతుంటుంది. అయితే సాధారణంగా గ్రహంతో పోల్చితే తార బరువు బాగా ఎక్కువగా ఉంటుంది కనుక, తార తిరిగే కక్ష్య చిన్నదిగా ఉంటుంది. దూరం నుండి చూసే పరిశీలకులకి ఆ తార స్థిరంగా ఉండక ఒక కేంద్ర బిందువు చుట్టూ చిన్నగా కదులుతున్నట్టు ఉంటుంది. ఈ కదలికని ఆధారంగా చేసుకుని పై పద్ధతులలో మొదటి రెండు పని చేస్తాయి.



కోణీయ వేగ పద్ధతి తార నుండి వచ్చే కాంతి విశ్లేషణ మీద ఆధారపడుతుంది. చిన్న కక్ష్య మీదుగా కదులుతున్న తార, భూమి నుండి చూస్తున్న పరిశీలకులకి, కొంత కాలం భూమిని సమీపిస్తూ, కొంత కాలం భూమికి దూరంగా జరుగుతూ కదలడం కనిపిస్తుంది. భూమి దిశగా వస్తున్నప్పుడు డాప్లర్ ప్రభావం వల్ల దాని నుండి వచ్చే కాంతి కాస్త నీలి ఛాయని సంతరించుకుంటుంది. భూమికి దూరంగా జరుగుతున్నప్పుడు ఆ కాంతి కాస్తంత ఎర్ ర బారుతుంది. ఆ విధంగా తార నుండి వచ్చే కాంతి యొక్క వర్ణంలో లయబద్ధమైన మార్పులు వస్తున్నప్పుడు, దాని చుట్టూ ఏదైనా భారమైన గ్రహం ఉందేమో నని అనుమానించవలసి వస్తుంది.



ఇక రెండవదైన ఖగోళమాన పద్ధతిలో తార యొక్క కదలికలని నేరుగా దూరదర్శినిలో చూసి కొలుస్తారు. అయితే భూమి మీద ప్రతిష్ఠించబడ్డ దూరదర్శినిల సహాయంతో, పృథ్వీ వాతావరణం అడ్డురావడం వల్ల, అంత చిన్న చలనాలని కొలవడం కష్టం. కాని అంతరిక్షంలో సంచరించే దూరదర్శినులతో ఈ ఇబ్బంది ఉండదు. ప్రఖ్యాత 'హబుల్ అంతరిక్ష దూరదర్శిని' సహాయంతో అలాంటి పరిశీలనలు విజయవంతంగా జరిగాయి. అలాగే యూరొపియన్ స్పేస్ ఏజెన్సీ 2012 లో పంపబోయే ‘గయా’ అనబడే వాతావరణ ఉపగ్రహం సహాయంతో సౌరమండలానికి బయట పది నుండి యాభై వేల బృహద్ గ్రహాలని కనుక్కునే ఆస్కారం ఉందని నిపుణులు అంటున్నారు.


ఓ గ్రహం దాని పితృ తార ముందు నుంచి దానికి అడ్డుగా ప్రయాణం చేసినప్పుడు, ఆ గ్రహం తార ముఖం మీద ఓ కదిలే నల్లని చుక్కలా కనిపిస్తుంది. అలాంటి కదలికనే గోచారం (transit) అంటారు. ఉదాహరణకి సూర్యుడికి అడ్డుగా వీనస్ కదలికని ‘వీనస్ గోచారం’ అంటారు. ఆ పద్ధతిలోనే మొట్టమొదట భూమి నుండి సూర్యుడి దూరం కొలవగలిగారు. ఈ గోచార పద్ధతితో ఇతర తారల వద్ద గ్రహాల ఉన్కిని తెలుసుకోవచ్చు. ఓ తార ముందు నుండి దానికి అడ్డుగా ఓ బృహద్ గ్రహం ప్రయాణం చేసినప్పుడు పరిశీలకులకి ఆ తారా కాంతి కాస్తంత తగ్గినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకి దూరానున్న ఓ తార ముందు నుండి మన బృహస్పతి అంత పెద్ద గ్రహం ప్రయాణిస్తే ఆ తారాకాంతిలో 1% తగ్గుదల కనిపిస్తుంది. అది చాలా చిన్న మార్పు కనుకే ఈ పద్ధతితో పాటు కోణీయ వేగ పద్ధతిని కూడా వినియోగించి నిర్ధారణ చేసుకుంటారు. కాంతిలో ఇంత తక్కువ మార్పును కనుక్కోగల పరికరాలు ఉన్నా, ఈ పద్ధతిలో చాలా పెద్ద గ్రహాలనే కనుక్కోవడానికి వీలవుతుంది. భూమి లాంటి చిన్న గ్రహాలు ఈ పద్ధతిలో పట్టుబడవు.


ఇవి కాకుండా కాంతి యొక్క ధృవీకరణ (polarization) మీద ఆధారపడే పద్ధతులు, అనేక దూరదర్శినులని కలిపి ఓ పెద్ద దూరదర్శినిలా ప్రయోగించే పద్ధతులు మొదలైన ఎన్నో అధునాతన పద్ధతులని ఈ సౌరేతర గ్రహ (extrasolar planets) అన్వేషణలో వినియోగిస్తున్నారు. గత వారం నాటికి ఐదొందలకి పైగా సౌరేతర గ్రహాలు కనుక్కోబడ్డాయి. ఇంత భారీ ప్రయత్నం జరుగుతున్నా ప్రజ్ఞావంతులైన జీవుల ఉన్కిని పసిగట్టే సుముహూర్తం మనకి దగ్గరి భవిష్యత్తులో ఉన్నట్టు కనిపించడం లేదు.

ప్రీస్లీ కనుక్కున్న "ఫ్లాగిస్టాన్ రహిత గాలి" నిజంగానే రూథర్ఫర్డ్ కనుక్కున్న "ఫ్లాగిస్టానీకృత గాలి"కి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించింది. రూథర్ఫర్డ్ కనుక్కున్న గాలిలో ఎలుకలు చచ్చిపోయేవి. అదే ప్రీస్లీ కనుక్కున్న గాలిలో మరింత చురుగ్గా మసలేవి. "ఫ్లాగిస్టాన్ రహిత" వాయువుని ప్రీస్లీ కాస్త పీల్చి చూసి "హాయిగా, తేలిగ్గా" అనిపించిందని తన అనుభూతిని వర్ణించాడు.

అయితే ప్రీస్లీ, రూథర్ఫర్డ్ ల కన్నా ముందే ఈ ఆవిష్కరణలు చేసినా, పేరు పెద్దగా పైకి రాని మరో గొప్ప రసాయనికుడు ఉన్నాడు. స్వీడెన్ దేశానికి చెందిన ఇతగాడి పేరు కార్ల్ విల్హెల్మ్ షీలే (1742-1786). పద్దెనిమిదవ శతాబ్దంలో వైజ్ఞానిక రంగంలో స్వీడెన్ దేశాన్ని ఓ ఎత్తుకు తీసుకెళ్లిన కొందరు మేటి రసాయనికులలో ఒకడితడు.

ఈ స్వీడిష్ రసాయనికులలో మరొకడైన జార్జ్ బ్రాండ్ 1730 ప్రాంతంలో ఓ నీలిరంగు ఖనిజాన్ని అధ్యయనం చేశాడు. పోలికలో ఈ ఖనిజం ముడి రాగికి దగ్గరగా ఉంది. కాని ముడి రాగి నుండి రాగిని వెలికి తీయడానికి అవసరమైన సంస్కారాలన్నీ ప్రయోగిస్తే ఇందులోంచి రాగి వెలికి రాకపోవడం చూసి ఖనిజకారులు ఆశ్చర్యపోయారు. ఆ ముడి ఖనిజానికి ఏదో దెయ్యం పట్టిందని అనుకున్నారు. భూమిని ఆవహించి బతికే ఆ దెయ్యాలని "కోబోల్డ్" లు అని పిలిచేవారు. ఆ ముడి ఖనిజం మీద అధ్యయనాలు చేసిన బ్రాండ్ అందులో ఉన్నది రాగి కాదని, మరో కొత లోహమని కనుక్కున్నాడు. "కోబోల్డ్" దెయ్యం పేరు మీద ఆ లోహానికి కోబాల్ట్ అని పేరు పెట్టాడు.

1751 లో ఏక్సెల్ ఫ్రెడెరిక్ క్రోన్స్టెడ్ (1722-1765) అనే మరో రసాయనికుడు అలాంటిదే మరో లోహాన్ని కనుక్కున్నాడు. యోహాన్ గోట్లీబ్ గాన్ (1745-1818) 1774 లో మాంగనీస్ ని శుద్ధి చేశాడు; పీటర్ జేకబ్ హెల్మ్ (1746-1813) 1782 లో మాలిబ్డెనమ్ ని శుద్ధి చేశాడు. స్వీడిష్ దేశస్థులు కనుక్కున్న ఈ కొత్త మూలకాలన్నీ ఖనిజవిజ్ఞానంలో ఆ దేశం సాధించిన ప్రగతికి తార్కాణాలు.


ఉదాహరణకి క్రోన్స్టెడ్ ఖనిజ విజ్ఞానంలో ఊదుడుగొట్టం (blowpipe) యొక్క వినియోగాన్ని పరిచయం చేశాడు. ఇందులో కూసుగా ఉండే కొస గల ఓ పొడవాటి గొట్టం ఉంటుంది. నోరు వెడల్పుగా ఉండే కొస నుండి ఊదితే కూసుగా ఉండే కొస నుండి సన్నని వాయు ధార వేగంగా బయటికి వస్తుంది. ఈ వాయు ధారని అగ్ని మీదకి సారిస్తే ఆ అగ్ని మరింత ప్రజ్వలంగా మండుతుంది. అలా తీవ్రతరమైన జ్వాలకి, ఖనిజానికి మధ్య సంపర్కం కలిగిస్తే, ఆ చర్య వల్ల జ్వాల యొక్క రంగులో వచ్చే మార్పుని బట్టి, అందులోంచి పుట్టుకొచ్చే ఆవిరుల తత్వాన్ని బట్టి, చర్య తరువాత మిగిలే లోహ పదార్థాల ఆక్సయిడ్ల బట్టి, ఖనిజం యొక్క లక్షణాలని అంచనా వెయ్యడానికి వీలవుతుంది. ఆ విధంగా ఓ శతాబ్ద కాలం పాటు రసాయనిక విశ్లేషణలో ఊదుడుగొట్టం ఓ ముఖ్యమైన సాధనంగా చలామణి అయ్యింది.

(సశేషం...)

సౌరమండలానికి పొలిమేరలు ఎక్కడ?

Posted by V Srinivasa Chakravarthy Wednesday, April 13, 2011 2 comments


మొన్న సోమవారం ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం -

http://www.andhrabhoomi.net/intelligent/sowramandalaniki-397




రెండు శతాబ్దాల క్రితం వరకు కూడా సూర్యుడి చుట్టూ ఆరు గ్రహాలే (భూమితో కలుపుకుని) తిరుగుతున్నాయని అనుకునేవారు. ఆ గ్రహాలు – మెర్క్యురీ, వీనస్, భూమి, మార్స్, జూపిటర్, సాటర్న్. అంటే నాటి చింతన ప్రకారం సౌరమండలానికి పొలిమేరలు సాటర్న్ యొక్క కక్ష్య వద్ద ఉన్నాయన్నమాట. సౌరమండలం గురించి ఇలాంటి దృక్పథం కొన్ని వేల ఏళ్ల కాలంగా చలామణిలో ఉంది. అటు ప్రాచీన గ్రీకు విజ్ఞానంలోను, ఇటు సాంప్రదాయక భారతీయ ఖగోళవిజ్ఞానంలోను కూడా సౌరమండలం పట్ల అలాంటి అవగాహనే ఉండేది. 1781 లో విలియమ్ హెర్షెల్ అనే ఖగోళశాస్త్రవేత్త సాటర్న్ కి ఆవల యురానస్ అనే కొత్త గ్రహాన్ని కనుక్కోవడంతో సౌరమండలం పొలిమేరలు గణనీయంగా విస్తరించాయి. సూర్యుడి నుంచి గ్రహాల దూరాలని ఖగోళఏకాంకంతో (Astronomical Unit – A.U.) కొలుస్తారు. సూర్యుడికి భూమికి మధ్య దూరంతో సమానమైన ఈ కొలమానం విలువ సుమారు 93 మిలియన్ మైళ్లు. అంతవరకు సూర్యుడికి అతి దూరమైన సాటర్న్ దూరం 10 ఏ.యు.లు అయితే, యురేనస్ దూరం 20 ఏ.యు.లు అని తేలింది. ఆ దెబ్బతో మనకు తెలిసిన సౌరమండలం యొక్క వ్యాసం ఒక్కసారిగా రెండింతలు అయ్యింది.


న్యూటన్ కనిపెట్టిన మెకానిక్స్ సహాయంతో యురేనస్ కక్ష్యని విశ్లేషిస్తే, పరిశీలించబడ్డ కక్ష్యకి, గణించిన కక్ష్యకి మధ్య కొన్ని తేడాలు కనిపించాయి. దానికి కారణం యురేనస్ కి ఆవల, అంతవరకు తెలీని గ్రహమేదో, యురేనస్ మీద చూపుతున్న గురుత్వ ప్రభావమే కావచ్చునని కొందరు ఖగోళశాస్త్రవేత్తలు సూచించారు. ఆ సూచన మేరకే తదనంతరం 1846 లో 30 ఏ.యూ. ల దూరంలో నెప్ట్యూన్ గ్రహాన్ని కనుక్కోవడంతో సౌరమండలపు సరిహద్దులు మరింత విస్తరించాయి. కాని నెప్ట్యూన్ ఆవిష్కరణ తరువాత కూడా యురేనస్ కక్ష్యకి సంబంధించిన సమస్యలు పూర్తిగా తేలలేదు. కనుక నెప్ట్యూన్ కి ఆవల మరేదైనా గ్రహం ఉండొచ్చుననే ఆలోచనతో కొత్త గ్రహం కోసం వేట మొదలయ్యింది. ఆ వేటకి ఫలితంగా 1930 లో ప్లూటోని కనుక్కున్నారు. అయితే ఇతర గ్రహాలతో పోలిస్తే ప్లూటో కక్ష్య బాగా దీర్ఘవృత్తీయంగా (elliptical) ఉంటుంది. సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినప్పుడు (perihelion) దాని దూరం 29 ఏ.యూ,లు అయితే, అతి దూరంగా పోయినప్పుడు (aphelion) 49 ఏ.యూ.లు. ఆ విధంగా సౌరమండలం యొక్క వ్యాసార్థం ఇంచుమించు 50 ఏ.యూ.ల మేరకు విస్తరించింది.



ప్లూటో ఆవిష్కరణ తరువాత, సూర్యుడు కేంద్రంగా ప్రదక్షిణ చేసే నవగ్రహాల కూటమే సౌరకుటుంబం అన్న భావన కొంత కాలం స్థిరంగా నిలిచింది. ఇలా ఉండగా 1970 లో సాటర్న్ కి యురేనస్ కి నడిమి ప్రాంతంలో 2060 కైరన్ అనే ఓ బుల్లి గ్రహం కనుక్కోబడింది. ఇది ప్లూటో కన్నా బాగా చిన్నది. కనుక దీన్ని ‘లఘు గ్రహం’ (minor planet) కింద జమకట్టారు. తదనంతరం నెప్ట్యూన్ కి ఆవల, అంటే 30 ఏ.యూ.లకి 55 ఏ.యూ.లకి నడిమి ప్రాంతంలో అలాంటి ఎన్నో చిన్న వస్తువులు కనుక్కోబడ్డాయి. ఆ ప్రాంతానికి దాన్ని కనుక్కున్న నిపుణుడి పేరిట కైపర్ వలయం (Kuiper belt) అని పేరు పెట్టారు. 1992 లో దీన్ని గుర్తించిన నాటి నుండి జరిగిన అధ్యయనాల వల్ల ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో 100 కిమీల పైగా వ్యాసం ఉన్న వస్తువుల సంఖ్య 70,000 పైచిలుకు ఉన్నట్టు తెలుస్తోంది. ప్లూటో లాంటి మరెన్నో లఘుగ్రహాలకి ఈ కైపర్ వలయమే పుట్టినిల్లు అని అర్థమయ్యింది.

అయితే కైపర్ వలయానికి అవతల అంటే 55 ఏ.యూ.ల కన్నా దూరంలో ఎన్నో పెద్ద పెద్ద వస్తువులు ఉన్నట్టు గత ఒకటి రెండు దశాబ్దాల పరిశోధనల్లో తేలింది. జనవరి 2005 లో ప్లూటో కన్నా భారమైన ఓ లఘుగ్రహం కనుక్కోబడింది. ఎరిస్ (Eris) అనబడే ఈ వస్తువు సూర్యుడి నుండి సుమారు 100 ఏ.యూ. ల దూరంలో ఉంది. అసలు 1996 నుండే ఇంత దూరాలలో ఉండే వస్తువులని కనుక్కోవడం మొదలెట్టారు. ఈ వస్తువులన్నిటికీ పుట్టినిల్లయిన మరో ప్రాంతం కైపర్ వలయానికి అవతల ఉందని తెలుసుకుని దానికి ఛిద్ర వర్తులం (scattered disc) అని పేరు పెట్టారు. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం, సౌరమండలం యొక్క తొలిదశలలో ఉన్నది కేవలం విస్తృతంగా వ్యాపించిన తారాధూళి మాత్రమే. ఆ విశాల సౌరనీహారిక దాని కేంద్రం చుట్టూ నెమ్మదిగా పరిభ్రమిస్తుండగా, కేంద్రంలోని పదార్థం సాంద్రమై సూర్యుడుగా రూపొందింది. కేంద్రానికి దూరంగా ఉండే పదార్థం కూడా సంఘననం చెంది గ్రహాలు ఏర్పడ్డాయి. అయితే సూర్యుడి నుండి మరీ ఎక్కువ దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఆ సంఘననం పూర్తిగా జరగలేదు. అలాంటి ప్రాంతానికి చెందినదే ఈ ఛిద్ర వర్తులం.


మరి 100 ఏ.యూ. ల దూరం వరకు వ్యాపించిన ఈ ఛిద్ర వర్తులం కన్నా దూరంలో ఇంకా ఏవైనా ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే మనం తోకచుక్కల జన్మస్థానం గురించి ఆలోచించాలి. హాలీ తోకచుక్క లాంటి తోకచుక్కలు ఎంతో దూరం నుండి వచ్చి సూర్యుడి చుట్టూ ఓ “యూ టర్న్” చేసి వెనక్కు వెళ్లిపోతుంటాయని మనం వింటూంటాం. అయితే ఇవి ఇంతకీ ఎక్కణ్ణుంచి వస్తాయి? తోకచుక్కల ద్రవ్యరాశి ఎంత? అవి ఎన్నేళ్ళకి ఒకసారి వస్తుంటాయి? మొదలైన విషయాలని విశ్లేషించి ఇవి కైపర్ వలయానికి, ఛిద్ర వర్తులానికి ఆవల ఎంతో దూరంలో ఉన్నఓ విశాల ప్రాంతం నుండి వస్తుంటాయని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.


ఆ ప్రాంతం యొక్క అంచులు సూర్యుడి నుండి 50,000 ఏ.యూ.ల దూరంలో ఉంటాయని అంచనా. అంటే ఇంచుమించు ఓ కాంతిసంవత్సరం అన్నమాట! అంతకు నాలుగు రెట్లు దూరం వరకు పోతే మనకి అతిదగ్గరి తార అయిన ప్రాక్సిమా సెంటారీని చేరుకుంటాం! అంటే సూర్యుడికి ఓ కాంతిసంవత్సరం దూరంలో, గ్రహాలు కదిలే తలంలోనే కాక, అన్ని పక్కలా ద్రవ్యరాశి విస్తరించిన ఓ విశాల ప్రాంతం ఉందన్నమాట. దీని ఉన్కిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరిట దీన్ని ఒర్ట్ మేఘం (Oort cloud) అంటారు. అక్కడి నుండి సూర్యుడు ఓ చిన్న చుక్కలా కనిపిస్తాడు. సూర్యకాంతి సోకని ఆ పరమశీతల ప్రాంతంలో ఉన్నవి కేవలం నీరు, మీథేన్, అమ్మోనియా మొదలైన వాయువుల మంచుగడ్డలు. సౌరమండలంలో మనకు తెలిసిన గ్రహాలు ఉన్న ప్రాంతానికి అంచుల నుండి (50 ఏ.యూ.లు) ఈ ఒర్ట్ మేఘం వరకు (50,000 ఏ.యూ.లు) విస్తరించిన బృహత్తర ప్రాంతంలో శాస్త్రవేత్తలకి ఇంకా తెలీని రహస్యాలు వేలకి వేలు.

References:

http://en.wikipedia.org/wiki/Kuiper_belt
http://en.wikipedia.org/wiki/Scattered_disc
http://en.wikipedia.org/wiki/Oort_cloud

స్నేహగారు వాళ్ల ఆరేళ్ల అబ్బాయి గ్రహాల గురించి అడుగుతున్నాడని అడిగారు. అందుకు నాకు తోచిన వివరణ ఇస్తున్నాను. ఇంకా ఏవైనా సంగతులు ఉంటే ఇతర బ్లాగర్లకి కూడా సూచించమని మనవి. గ్రహాలు పెద్ద మట్టి బంతులు అని మొదలు పెట్టొచ్చు. భూమి అనే మట్టి బంతి మీద మనం ఉన్నామని చెప్పొచ్చు. ఓ గ్లోబ్ తెచ్చి దాని మీద మనం ఎక్కడ ఉన్నామో చూపించొచ్చు. మరి భూమి బంతిలాగా కనిపించదే? అన్న ప్రశ్న రావచ్చు. దాని బదులుగా కొన్ని వివరణలు ఇవ్వొచ్చు.


భూమి మన కన్నా చాలా పెద్దది కనుక, మన చుట్టూ ఉండే ప్రదేశం చదునుగా కనిపిస్తుంది గాని, తగినంత ఎత్తు నుండి చూస్తే వంపు తిరిగినట్టు కనిపిస్తుంది. భూమి యొక్క ఆత్మప్రదక్షణ గురించి చెప్పి, రాత్రి పగలు ఎలా వస్తాయో చెప్పాలి. భూమి చదునుగా పళ్లెంలా ఉంటే అన్ని దేశాల వాళ్లకి ఒక్కసారే పగలు రావాలి. కాని అలా జరగదని నిరూపించడానికి (మీరు ఇండియాలో ఉన్నట్లయితే) అమెరికాలో ఉన్న బంధువులకి పగటి (రాత్రి) పూట ఫోన్ చేసి అప్పుడు వాళ్లకి రాత్రి (పగలు) అవుతుందని వాళ్ల చేత మీ పిల్లవాడికి చెప్పించాలి.


భూమి స్థానికంగా చదునుగా కనిపించినా విస్తృత స్థాయిలో గోళాకారంలో ఉంటుందని చూపించడానికి “గూగుల్ ఎర్త్” బాగా పనికొస్తుంది. అందులో మీరు ఉంటున్న ప్రాంతంతో మొదలుపెట్టి క్రమంగా ‘జూమ్ అవుట్’ చేస్తే భూమి గోళంలా ఎలా ఉందో మీ అబ్బాయికి చూపించొచ్చు. (Google.Earth-2011.com)




సముద్రం తీరం దగ్గర్లో ఉంటే సముద్రం వద్ద, తీరం నుండి దూరం అయ్యే ఓడలు కనుమరుగయ్యే తీరు గురించి వివరించవచ్చు. ఆ విధంగా పిల్లవాడికి భూమి ఓ పెద్ద మట్టి బంతిలా ఉందని కొంత అవగాహన కలిగాక భూమి లాంటివే ఇతర (ఉప) గ్రహాలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు.


* ఉదాహరణకి చందమామని చూపించొచ్చు. మనకి పగలు, రాత్రి ఉన్నట్టే చందమామ మీద నల్లగా ఉన్న భాగం అక్కడి రాత్రి అని, ప్రకాశంగా (పసుపు పచ్చగా) ఉన్న భాగం అక్కడి పగలు అని చెప్పొచ్చు.


* మంచి బైనోక్యులర్ల్స్ ఉంటే చందమామ మీద విశేషాలు బాగా చూపించొచ్చు. చందమామని చూపించినప్పుడు, భూమి లాగానే అది కూడా అదో పెద్ద మట్టి గడ్డ అన్నప్పుడు మరో సందేహం కలగొచ్చుః 'చందమామ ఎందుకు కిందపడదు?'


*అప్పుడు 'కిందపడడం' అంటే ఏంటో వివరించాలి. పెద్దగా పరిభాషని వాడకుండా వస్తువులన్నీ ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటాయని, వస్తువు పెద్దదైన కొద్ది ఆకర్షణ పెరుగుతుందని, దూరం ఎక్కువైన కొద్ది ఆకర్షణ తగ్గుతుందని చెప్పాలి.


* అయస్కాంతం ఇనుప రజనుని ఆకర్షించినట్టే భూమి కూడా తన చుట్టూ ఉన్న వస్తువులని ఆకర్షిస్తుందని, అదే 'కిందపడడం' అని చెప్పొచ్చు. అయస్కాంతం కూడా కనీస దూరంలో ఉంటే తప్ప ఇనుప రజనుని ఆకర్షించనట్టే, చందమామ భూమికి కాస్త దూరంలో ఉంది కనుక భూమి మీద 'పడిపోద'ని చెప్పొచ్చు. (అయితే భూమి చుట్టూ కక్ష్యలో తిరగడం మొదలైనవి మరి కాస్త కఠినమైన విషయాలు. అవన్నీ అడిగినప్పుడు చూద్దాం!!!) అలా చందమామ కూడా ఓ పెద్ద మట్టి గడ్డ అని అర్థమయ్యాక, ఇతర గ్రహాల విషయానికి రావచ్చు.


* వీనస్ ని సులభంగా చూపించొచ్చు. తెల్లవారు జామున గాని (వేగుచుక్క), సాయంకాలం గాని అత్యంత ప్రకాశవంతమైన తారగా కనిపిస్తుంది. http://en.wikipedia.org/wiki/Venus_(planet) * వీనస్ కాకుండా, మార్స్, జూపిటర్, సాటర్న్ లని కచ్చితంగా ఏ దిశలో చూడాలో తెలిస్తే కంటితోనే చూడొచ్చు. ఈ సంవత్సరం ఏ ఏ కాలాలలో ఏఏ గ్రహాలు ఎక్కడ కనిపిస్తాయో ఆ వివరాలు ఈ సైట్ లో http://stardate.org/nightsky/planets


* ఇతర గ్రహాల కోసం టెలిస్కోప్ అవసరం అవుతుంది.


* దగ్గర్లో ఏదైనా ప్లానెటేరియమ్ ఉంటే, అక్కడ టెలిస్కోప్ లోంచి చూసే అవకాశం ఉంటే సాటర్న్ ని చూపించడానికి ప్రయత్నించండి. సాటర్న్ రింగ్స్ చూడడానికి మహా సొగసుగా ఉంటాయి!


http://www.lpi.usra.edu/education/skytellers/solar_system/activities/planet_viewing.shtml


1770 ల లో ప్రీస్లీ మరిన్ని వాయువులని అధ్యయనం చేశాడు. ఆ కాలంలో విజ్ఞాన శాస్త్రానికి తెలిసిన వాయువులు మూడు. వాటిలో ఒకటి గాలి, రెండవది ఫాన్ హెల్మాంట్ మరియు బ్లాక్ లు అధ్యయనం చేసిన కార్బన్ డయాక్సయిడ్, మూడవది కావెండిష్ కనుక్కున్న హైడ్రోజెన్. ఇక నాలుగవ్ వాయువుగా రూథర్ఫర్డ్ నైట్రోజెన్ ని పై వాయువుల జాబితాలోకి చేర్చనున్నాడు. కాని ప్రీస్లీ అక్కడితో ఆగక మరిన్ని వాయువులని అధ్యయనం చెయ్యసాగాడు.

కార్బన్ డయాక్సయిడ్ తో అతడి అనుభవం వల్ల వాయువులు నీటిలో కరుగుతాయని తెలిసింది. కనుక నీటి మీదుగా పట్టిన వాయువులలో కొంత నష్టం అయ్యే అవకాశం ఉంది. కనుక పాదరసం మీదుగా వాయువులని పట్టడానికి ప్రయత్నించాడు. ఈ కొత్త పద్ధతిలో నైట్రొజెన్ ఆక్సయిడ్, అమోనియా, హైడ్రోజెన్ క్లోరైడ్, సల్ఫర్ డయాక్సయిడ్ (ఇవన్నీ ఆ వాయువుల ఆధునిక నామాలు) మొదలైన ఎన్నో వాయువులని పాదరసం మీదుగా సేకరించగలిగాడు. ఈ వాయువులన్నీ నీట్లో బాగా కరిగిపోయేవే.

1774 లో పాదరసం మీదుగా వాయువులని పట్టే ఈ కొత్త పద్ధతి మూలంగా ప్రీస్లే తన అతి ముఖ్యమైన ఆవిష్కరణని సాధించగలిగాడు. పాదరసాన్ని గాల్లో వేడిచేస్తే ఓ ఇటుక రంగు పదార్థం తయారవుతుంది. (దీన్నే ప్రస్తుతం మనం మెర్క్యురిక్ ఆక్సయిడ్ అంటాము.) ప్రీస్లీ ఈ పదార్థాన్ని ఓ పరీక్షానాళంలో (test tube) లో వేసి, ఓ కటకం సహాయంతో సూర్యకాంతిని ఆ పదార్థం మీద కేంద్రీకరించాడు. ఆ చర్యలో ఆ ఎరుపు రంగు పదార్థం తిరిగి పాదరసంగా మారిపోయింది. పరీక్షా నాళపు పై భాగంలో మెరిసే పాదరసపు బొట్లు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఈ చర్య వల్ల ఆ పదార్థం లోంచి విచిత్రమైన లక్షణాలు గల ఓ వాయువు వెలువడింది. మండే వస్తువులు ఆ వాయువులు మరింత వేగంగా, ప్రజ్వలంగా మండడం కనిపించింది. ఆ వాయువు ఉన్న ఓ పాత్ర లోకి ఓ నిప్పుకణికని ప్రవేశపెడితే అది భగ్గున మండింది.

ఈ కొత్త చర్యని ప్రీస్లీ ఫ్లాగిస్టాన్ సిద్ధాంతంతో వివరించడానికి ప్రయత్నించాడు. ఈ వాయువులో వస్తువులు మరింత వేగంగా మండగలుగుతున్నాయి కనుక అవి మరింత సులభంగా ఫ్లాగిస్టాన్ ని వెలువరించ గలుగుతున్నాయి. బహుశ గాలిలోని ఫ్లాగిస్టాన్ ని తొలగించగా మిగిలినదే ఈ కొత్త వాయువేమో. అందుకే అది మండే వస్తువుల లోంచి వెలువడే ఫ్లాగిస్టాన్ ని వేగంగా స్వీకరిస్తోంది. అందుకే ఈ కొత్త వాయువుని ప్రీస్లీ “ఫ్లాగిస్టాన్ రహిత గాలి” (dephlogisticated air) అన్నాడు. (కొన్నేళ్ల తరువాత ఆ వయువుకి ఆక్సిజన్ అని పేరు పెట్టారు. ఆ పేరునే ప్రస్తుతం మనం వాడుతున్నాం.)


(సశేషం…)

బలమైన బంతి భవంతులు

Posted by V Srinivasa Chakravarthy Monday, April 4, 2011 0 comments

http://www.andhrabhoomi.net/intelligent/banti-bhavanalu-318

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts