శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

మొక్కలోని పదార్థం ఎక్కణ్ణుంచి వస్తుంది?

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, January 30, 2011 0 comments

న్యూటన్ చేసిన మాహత్తర కృషికి తదనంతరం ఓ శతాబ్దం గడిచాక కూడా అలాంటి సంఖ్యాత్మక కొలమాన పద్ధతి రసాయన శాస్త్రంలో చోటుచేసుకోలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు న్యూటనే ఒక పక్క ఖగోళ శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో లోతైన సౌందర్యంతో, గొప్ప ధృడత్వంతో కూడుకున్న సైద్ధాంతిక నిర్మాణం చేస్తూ ప్రపంచాన్ని మురిపిస్తూనే, మరో పక్క తానే రహస్యంగా పరుసవేద పరిశోధనలని కొనసాగించేవాడు. నిమ్న లోహాల నుండి బంగారాన్ని తయారుచెయ్యడనికి పనికొచ్చే రూపాంతరీకరణ రహస్యాల కోసం యూరప్ అంతా ఆత్రంగా గాలించేవాడు.

అలా అంత కాలంగా తప్పుదోవ నుండి మళ్లకుండా ముందుకు సాగుతున్నారంటే అందులో తప్పంతా రసాయనికులదే అనడానికి కూడా లేదు. గెలీలియో, న్యూటన్ తదితరులు రూపొందించిన సంఖ్యాత్మక, గణిత పద్ధతులని స్వీకరించి, తమ రంగానికి వర్తింపజేయడంలో రసాయనికులు కాస్త మందకొడిగా ఉండడానికి ఓ మౌలిక కారణం ఉంది. భౌతిక శాస్త్ర రంగంతో పోల్చితే రసాయనిక రంగం చాలా భిన్నమైనది. భౌతిక శాస్త్రంలో చేసినట్టుగా గణితాన్ని వినియోగించి రసాయనిక విషయాలని వర్ణించడం అంత సులభం కాదు.

అలాంటి పరిస్థితుల్లో కూడా రసాయనికులు కొంత ప్రగతి సాధించకపోలేదు. అసలు గెలీలియో కాలంలోనే అలాంటి రసాయనిక విప్లవం యొక్క తొలి ఆనవాళ్లు కనిపించాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఫ్రెమిష్ వైద్యుడు జాన్ బాప్టిస్టా ఫాన్ హెల్మాంట్ (1577-1644) కృషిలో అలాంటి పరిణామాలు తొంగిచూశాయి. ఎదుగుతున్న మొక్కలోని పదార్థం ఎక్కణ్ణించి వస్తుందో ఇతడు తెలుసుకోవాలని అనుకున్నాడు. మొక్క ఎదుగుతుంటే వివిధ దశలలో క్రమబద్ధంగా మొక్క బరువు, అది ఉన్న తొట్టెలోని మట్టి బరువు కొలుస్తూ పోయాడు. ఈ ప్రయోగంలో అతడు సంఖ్యాత్మక కొలమాన పద్ధతి కేవలం రసాయన శాస్త్రంలోనే కాదు, జీవశాస్త్రంలో కూడా ప్రయోగిస్తున్నాడన్న విషయం గమనించాలి.

ఆ రోజుల్లో మనుషులకి తెలిసిన వాయువు మన చుట్టూ కనిపించే గాలి ఒక్కటే. ఘనపదార్థాలతో, ద్రవాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా కనిపిస్తుంది. అందుకే మరి గ్రీకులు దీన్ని ఒక మూలతత్వంగా పరిగణించేవారు. అయితే రసాదులు కూడా అప్పుడప్పుడు “గాలుల” గురించి “ఆవిరుల” గురించి మాట్లాడుతూ ఉంటారు గాని, అవి పేరు ఊరు లేని అనామక పదార్థాలు. వాటి లక్షణాలని తేల్చి చెప్తూ కచ్చితమైన ప్రయోగాలు జరిగిన దాఖలాలు లేవు. అందుకని వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకునేవాళ్ళు కారు.

(సశేషం...)

వైజ్ఞానిక చరిత్రలో ఓ కొత్త పర్వం

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, January 28, 2011 0 comments


ఆ విధంగా వైజ్ఞానిక చింతన అంటే గిట్టని వాళ్లు కూడా కేవలం ఆర్థిక కారణాల వల్ల కొన్ని విషయాలని ఒప్పుకోవలసి వచ్చింది. బంగారం పట్ల అంతులేని, అర్థంలేని వ్యామోహాన్ని పక్కనపెట్టి ఖనిజాల, ఔషధాల విజ్ఞానాన్ని మరింత పెంపొందింపజేస్తే ఎంతో మేలని, లాభదాయకమని రసవాదులకి అర్థం కాసాగింది.


అందుకేనేమో పదిహేడవ శతాబ్దం అంతానికల్లా పరుసవేదం యొక్క ప్రాముఖ్యత తగ్గడం కనిపిస్తుంది. పద్దెనిమిదవ శతాబ్దానికల్లా ఆ రంగం ప్రస్తుతం మనం రసాయనశాస్త్రం అని పిలుచుకునే రంగంగా రూపాంతరం చెందింది.

అధ్యాయం 3

సంక్రమణ దశ

కొలమాన పద్ధతులుదృక్పథంలో కొంత మార్పు వచ్చినా రసాయన విజ్ఞానం మాత్రం తక్కిన వైజ్ఞానిక రంగాలతో పోల్చితే కొంత వెనకబడి ఉందనే చెప్పుకోవాలి.


ఖగోళవిజ్ఞానాన్నే తీసుకుంటే సంఖ్యాత్మకమైన కొలమానం, గణితపద్ధతుల వినియోగం మొదలైనవి ఎంత ముఖ్యమో మనుషులు ప్రాచీన కాలం నుండే అర్థం చేసుకున్నారు. దానికి కారణం ఒకటి కావచ్చు. ప్రాచీన కాలంలో మనుషులు తలపడ్డ ఖగోళ సమస్యలు అంత కఠినమైనవేమీ కావు. కాస్తంత తల జ్యామితిని ప్రయోగిస్తే తేలిగ్గా తెగే సమస్యలవి.

భౌతిక శాస్త్రంలో గణితం యొక్క వినియోగం, కచ్చితమైన కొలమానం అనే పద్ధతులకి ఊపిరి పోసినవాడు ఇటాలియన్ వైజ్ఞానికుడు గెలీలియో గెలీలీ (1564-1642). 1590 ల దరిదాపుల్లో ఇతడు కింద పడే వస్తువుల మీద పరిశోధనలు చేశాడు. ఆ ప్రయోగ ఫలితాలే తదనంతరం ఐజాక్ న్యూటన్ (1642-1727) అనే ఇంగ్లీష్ శాస్త్రవేత్త చేసిన సైద్ధాంతిక శోధనలకి ఊతనిచ్చాయి. 1687 లో ప్రచురితమైన ప్రిన్సిపియా మాథమాటికా అనే పుస్తకంలో న్యూటన్ మూడు చలన నియమాలని ప్రతిపాదించాడు. రెండు శతాబ్దాల పాటు ఈ నియమాలు యాంత్రిక శాస్త్రానికి (mechanics) పునాదులు అయ్యాయి. అదే పుస్తకంలో న్యూటన్ తన గురుత్వ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం కూడా రెండు శతాబ్దాల పాటు విశ్వచలనాలని విజయవంతంగా వర్ణించగలిగింది. మానం సాధించగల వాస్తవ వేగాల వద్ద ఇప్పటికీ ఈ సిద్ధాంతం కచ్చితంగానే పనిచేస్తోంది. ఈ సిద్ధాంత నిర్మాణం కోసం న్యూటన్ క్యాక్లులస్ అనే ఓ కొత్త గణిత విభాగాన్ని రూపొందించి గ్రహ చలనాల శోధనలో ఆ గణితాన్ని అద్భుతంగా వినియోగించాడు.


న్యూటన్ విజయాలతో వైజ్ఞానిక విప్లవం పరాకాష్టని చేరుకుంది. ఇక ఆ నాటి నుండి ప్రాచీన గ్రీకుల పట్ల, లేదా ఇతర ప్రాచీన సంస్కృతుల పట్ల అచంచల భక్తి పూర్తిగా మాయమయ్యింది. వైజ్ఞానిక విషయాలలో ప్రాచీన గ్రీకులని మించిపోయింది అర్వాచీన పాశ్చాత్య యూరప్. ఇక సమర్ధన కోసం గతం వైపు చూసుకునే అవసరం లేకపోయింది.


(సశేషం...)

రెండు కొత్త పుస్తకాలు

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, January 25, 2011 0 comments
’మంచి పుస్తకం’ ప్రచురణలు
manchipustakam.in

ఆంద్రియాస్ లిబావ్ - జర్మన్ పరుసవేది

Posted by శ్రీనివాస చక్రవర్తి Monday, January 24, 2011 2 comments


ఉదాహరణకి 1597 లో ఆంద్రియాస్ లిబావ్ అనే జర్మన్ పరుసవేది (ఇతడికి లిబావియస్ అనే లాటిన్ పేరు కూడా ఉంది) ఆల్కెమియా అనే పుస్తకం రాశాడు. గతంలో పోగైన పరుసవేద సారం మొత్తాన్ని ఆ పుస్తకంలో పొందుపరిచాడు. రసాయన శాస్త్రంలో అది మొట్టమొదటి పాఠ్యగ్రంథం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఎలాంటి తత్వజ్ఞానాన్ని జోడించకుండా శుద్ధ వైజ్ఞానిక పరిభాషనే వాడాడు. పైగా పారాసెల్సస్ అనుయాయులు ప్రచారం చేసిన పాత, బూజుపట్టిన భావాల మీద దుమ్మెత్తి పోశాడు. అయితే పరుసవేదం యొక్క ముఖ్యలక్ష్యం బంగారం తయారుచెయ్యడం కాదని, వైద్య చికిత్సకి చేదోడువాదోడుగా ఉండడం అనే నమ్మకంలో ఇతడు పారాసెల్సస్ లో ఏకీభవించాడు.

హైడ్రోక్లోరిక్ ఆసిడ్, టిన్ టెట్రాక్లోరైడ్, అమోనియమ్ సల్ఫేట్ మొదలైన రసాయనాల తయారీని మొట్టమొదట వర్ణించిన వాడు ఈ లిబావియస్. అక్వారెజియా (“రాచనీరు”) తయారీని కూడా ఇతడు వర్ణించాడు. నైట్రిక్ ఆసిడ్, హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ల మిశ్రమం అయిన ఈ ద్రావకం బంగారాన్ని కూడా కరిగించగలదు. అందుకే దానికా పేరు. ఒక ద్రావకం ఆవిరి అయినప్పుడు మిగిలే స్ఫటికాల (crystals) ఆకారాల బట్టి ఖనిజాలని వర్గీకరించొచ్చని కూడా ఇతడు భావించాడు.

అయితే లోహాల రూపాంతరీకరణ సాధ్యమేనని ఇతడు నమ్మేవాడు. కనుక బంగారం యొక్క తయారీకి సంబంధించిన రసాయనిక పద్ధతుల రూపకల్పన ఓ ముఖ్యమైన రసాయనిక లక్ష్యంగా భావించేవాడు.

1604 లో యోహాన్ థోల్డె అనే జర్మన్ ప్రచురణ కర్త మరింత సవిరమైన, ప్రత్యేకమైన పుస్తకాన్ని ప్రచురించాడు. (ఈ పుస్తక రచయిత అని తప్ప ఈ వ్యక్తి గురించి మరే ఇతర వివరాలు లేవు). ఈ పుస్తకాన్ని రాసింది బాసిల్ వాలెంటీన్ అనే సాధువు అని చెప్పుకున్నాడు ఆ ప్రచురణ కర్త. అయితే ఆ కలంపేరుతో ప్రచురణకర్తే ఆ పుస్తకాన్ని రాసి ఉండే ఆస్కారం కూడా ఉంది. “ఆంటిమనీ రథపు జైత్రయాత్ర (The triumphal Chariot of Antimony) అని పేరు గల ఈ పుస్తకంలో ఆంటిమనీ యొక్క వైద్య ప్రయోజనాల గురించి, దాని సంయోగాల (compounds) గురించి చెప్పబడింది.

ఆ తరువాత వచ్చిన యోహాన్ రడోల్ఫ్ గ్లౌబర్ (1604-1668) అనే జర్మన్ రసాయనికుడు సల్ఫరిక్ ఆసిడ్ కి, మామూలు ఉప్పుకి మధ్య జరిగే చర్య సహాయంతో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ పుట్టించే పద్ధతిని కనుక్కున్నాడు. ఈ పద్ధతిలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ తో పాటు సోడియమ్ సల్ఫేట్ అవశేషంగా మిగులుతుంది. దీన్నే నేటికీ మనం “గ్లౌబర్ సాల్ట్” అంటాం.
గ్లౌబర్ తను కనుక్కున్న ఈ కొత్త పదార్థాన్ని లోతుగా శోధించాడు. దాని విరేచనకారక (laxative) లక్షణాలని గుర్తించాడు. దానికి “సాల్ మిరాబీల్” (అద్భుత లవణం) అని పేరు పెట్టాడు. అది సర్వరోగనివారిణి అని, అమృతతుల్యమైన పదార్థమని చాటేవాడు. ఈ పదార్థంతో పాటి ఔషధ లక్షణాలు గల మరి కొన్ని పదార్థాలని కూడా భారీ ఎత్తున ఉత్పత్తి చేసే వ్యాపారంలోకి దిగాడు. ఆ విధంగా బాగా సంపాదించాడు. బంగారం ఉత్పత్తి కన్నా ఇది మరింత ఐహికమైన, వాస్తవికమైన వ్యాపకం కావడమే కాక, మరింత లాభదాయకం కూడా.

(సశేషం...)

పారాసెల్సస్

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, January 21, 2011 0 comments

సుస్పష్టమైన శైలిలో రాయబడ్డ ఆ పుస్తకంలో గనులలో వాడే యంత్రాంగానికి సంబంధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. త్వరలోనే ఆ పుస్తకానికి గొప్ప పేరొచ్చింది. వైజ్ఞానిక సాహితీ చరిత్రలో ఓ గొప్ప స్థానాన్ని ఆక్రమించింది. 1700 కి పూర్వం రసాయనిక సాంకేతిక విజ్ఞానం మీద రాయబడ్డ కృతులలో కెల్లా ముఖ్యమైనదైన De Re Metallica ఖనిజ విజ్ఞానాన్ని ఓ శాస్త్రవిభాగంగా స్థాపించింది. (అగ్రికోలాకి ముందు లోహవిజ్ఞానంలో, రసాయన శాస్త్రంలో అంత గొప్ప పుస్తకాన్ని రాసినవాడు థియోఫైలస్. ఇతగాడు క్రీ.శ. 1000 కి చెందిన గ్రీకు సాధువు.)

ఇక ఫాన్ హోహెన్హైమ్ కి మరో పేరు కూడా ఉంది. అది పారాసెల్సస్. అంటే “సెల్సస్ కన్నా గొప్పవాడు” అని అర్థం. ఈ సెల్సస్ అన్నవాడు వైద్య విషయాల గురించి రాసిన ఓ రోమన్ రచయిత. ఇతడి పుస్తకాలకి మంచి పేరు వచ్చింది. అతడి పేరుని పోలిన పేరు కలిగి ఉండడంతో ఈ పారాసెల్సస్ కి కూడా కొంత ఉత్తుత్తి ఘనత దక్కింది!

అంతకు ఐదు శతాబ్దాల క్రితం అవిసెన్నా చేసినట్టే, ఈ పారాసెల్సస్ కూడా పరుసవేదంలో తన ధ్యాసని బంగారం తయారీ నుంచి వైద్య ప్రయోజనాల మీదకి మళ్లించాడు. పరుసవేదానికి లక్ష్యం పదార్థాల రూపాంతరీకరణ కాదని, మేలైన మందులు తయారు చేసి వాటితో రోగాలు నయం చెయ్యడమని వాదించేవాడు. అంతకు పూర్వం ఎక్కువగా మొక్కల నుండి తీసిన మూలికలనే ఔషధాలుగా వాడేవారు. కాని ఖనిజాలని మందులుగా వాడొచ్చని పారాసెల్సస్ గాఢంగా నమ్మేవాడు.

రూపాంతరీకరణ ముఖ్యం కాదని ఎంత అన్నా, పారాసెల్సస్ కూడా పాత కాలపు పరుసవేదం సాంప్రదాయానికి చెందినవాడే. గ్రీకులు బోధించిన నాలుగు మూలతత్వాలని ఇతడూ స్వీకరించాడు. అరబ్బులు బోధించిన మూడు ముఖ్యపదార్థాలని (సల్ఫర్, పాదరసం, ఉప్పు) కూడా ఇతడు స్వీకరించాడు. అమరత్వాన్ని ప్రసాదించే ‘తత్వవేత్త శిల’ కోసం ఇతడూ విస్తృతంగా శోధించాడు. తన ప్రయత్నంలో విజయం సాధించినట్టు కూడా చెప్పుకున్నాడు. ఇతడు ఆవిష్కరించిన ఓ ముఖ్యమైన పదార్థం జింక్. శుద్ధ రూపంలో జింక్ ని మొట్టమొదట కనుక్కున్నది ఇతడే నని చెప్పుకుంటారు. కాని ముడి సరుకు రూపంలోను, రాగితో కలిసిన మిశ్రలోహం (ఇత్తడి) రూపంలోను జింక్ గురించి మనుషులకి అనాదిగా తెలుసు.

తన మరణం తరువాత ఓ అర్థ శతాబ్దం కాలం పాటు పారాసెల్సస్ ఓ వివాదాస్పద వ్యక్తిగానే మిగిలిపోయాడు. అతడి శిష్యులు అతడి బోధనలలో ఎవరికీ అర్థం గాని తత్వజ్ఞానాన్ని బాగా దట్టించారు. ఆ విధంగా కొన్ని చోట్ల అతడి బోధనలు అర్థం పర్థం లేని మెట్టవేదాంతపు స్థాయికి దిగజారాయి. ఇలాంటి అవాంఛనీయ పరిణామాల వల్ల అప్పుడప్పుడే చీకటి యుగపు నీలి నీడల్లోంచి బయట పడుతూ, విరాజమానమైన హేతువాద లోకంలో తప్పటడుగులు వేయబోతున్న పరుసవేదానికి ఈ విధంగా ముందరి కాళ్లకి బంధం వేసినట్టయింది.
(సశేషం…)


పరుసవేదానికి అవసానదశ

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, January 18, 2011 0 comments

ముద్రణ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అంతకు పూర్వం పెద్దగా పేరులేని పుస్తకాల ప్రతులు తయారుచెయ్యడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కారు. కాని ముద్రణ వచ్చిన తరువాత పెద్ద ప్రాముఖ్యత లేని పుస్తకాలని కూడా సులభంగా అచ్చు వెయ్యడానికి వీలయ్యింది. ఆ కారణం చేతనే లుక్రెటియస్ రాసిన కావ్యం అచ్చయ్యింది. అందుచేతనే పరమాణు సిద్ధాంతానికి యూరప్ లో మంచి ప్రాచుర్యం లభించింది.

1543 లో రెండు విప్లవాత్మక గ్రంథాలు వెలువడ్డాయి. ముద్రణ తెలియని కాలంలో అయితే ఇలాంటి పుస్తకాలని ఛాందసులు కొట్టిపారేసేవాళ్లు. కాని ముద్రణ పుణ్యమా అని ఇలాంటి పుస్తకాలు కూడా ఎంతో ప్రాచుర్యానికి నోచుకున్నాయి. వాటిలో ఒకటి పోలిష్ ఖగోళశాస్త్రవేత్త నికొలాస్ కోపర్నికస్ (1473-1543) రాసిన పుస్తకం. ప్రాచీన గ్రీకు ఖగోళవేత్తలు విశ్వానికి భూమి కేంద్రం అని భావించేవారు. కాని అందుకు భిన్నంగా కోపర్నికస్ సూర్యుడే విశ్వానికి కేంద్రం అని బోధించాడు. ఇక రెండవ పుస్తకం ఫ్లెమిష్ జీవనిర్మాణ శాస్త్రవేత్త (anatomist) ఆంద్రియాస్ వెసేలియస్ (1514-1564) రాసింది. గతంలో ఎన్నడూ జరగనంత సవివరంగా, కచ్చితంగా మానవ శరీర నిర్మాణం అందులో అద్భుతంగా వర్ణించబడింది. ఈ రంగంలో ప్రాచీన గ్రీకుల భావజాలంలో ఉండే ఎన్నో దోషాలని ఈ పుస్తకం సవాలు చేసి, సరిదిద్దింది.

ఆ విధంగా ఏకకాలంలో ప్రాచీన గ్రీకుల ఖగోళశాస్త్రానికి, జీవశాస్త్రానికి కరిగిన పదవీచ్యుతే ఆధునిక “వైజ్ఞానిక విప్లవాని”కి శ్రీకారం చుట్టింది. (అయితే కొన్ని కొన్ని వర్గాలలో మాత్రం గ్రీకుల ఛాందస భావాలు మరో శతాబ్దం పాటు చలామణి అయ్యాయి.) ఈ విప్లవం పరుసవేదుల లోకాన్ని కాస్త నెమ్మదిగానే ప్రభావితం చేసింది. అయితే ఖనిజ, వైద్య రంగాల్లో మాత్రం విప్లవం యొక్క ముద్ర బలంగా పడిందనే చెప్పాలి.


పరుసవేదానికి అవసానదశ

ఆ కాలానికి చెందిన ఇద్దరు వైద్యుల కృషి వల్ల విజ్ఞానం కొత్త ఊపిరి పోసుకుంది. వారిలో ఒకడైన జార్జ్ బాయర్ (1494-1555) అన్నవాడు జర్మన్ దేశస్థుడు. రెండవవాడైన థియోఫ్రాస్టస్ బొంబాస్టస్ ఫాన్ హోహెన్మైమ్ (1493-1541) అన్నవాడు స్విట్జర్లాండ్ కి చెందినవాడు.

బాయర్ కి అగ్రికోలా అని మరో వ్యవహార నామం కూడా ఉంది. అగ్రికోలా అంటే లాటిన్ లో రైతు అని అర్థం (బాయర్ అంటే జర్మన్ లోనూ అదే అర్థం). ఖనిజాలకి ఔషధాలకి సంబంధం ఉండడం వల్ల అగ్రికోలా యొక్క ధ్యాస ఖనిజవిజ్ఞానం మీదకి మళ్లింది. అసలు ఖనిజాలకి ఔషధాలకి మధ్య సంబంధం బలపడడం, వైద్యుడే ఖనిజవేత్తగా చలామణి కావడం అనేది రసాయన శాస్త్ర చరిత్రలో మరో రెండున్నర శతాబ్దాల పాటు ఓ విశేషంగా పరిణమించింది. అగ్రికోలా రాసిన “De Re Metallica” (లోహవిజ్ఞానం) అన్న పుస్తకం 1556 లో ప్రచురించబడింది. అంతవరకు లోహకారులకి తెలిసిన ఆచరణాత్మక జ్ఞానాన్ని, గనులకి సంబంధించిన జ్ఞానాన్ని అంతటిని అందులో పొందుపరిచాడు.

సుస్పష్టమైన శైలిలో రాయబడ్డ ఆ పుస్తకంలో గనులలో వాడే యంత్రాంగానికి సంబంధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. త్వరలోనే ఆ పుస్తకానికి గొప్ప పేరొచ్చింది. వైజ్ఞానిక సాహితీ చరిత్రలో ఓ గొప్ప స్థానాన్ని ఆక్రమించింది.

(సశేషం…)

మొట్టమొదటి ముద్రణ యంత్రం

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, January 15, 2011 2 comments

1261 లో ఆ నగరాన్ని గ్రీకులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. నగరం అయితే చేజిక్కింది గాని మునుపటి శోభ ఇప్పుడు లేదు. రెండు శతాబ్దాల పాటు టర్కిష్ సేనల దాడులు ఈ నగరం మీద ఎడతెగకుండా జరుగుతూనే ఉన్నాయి. చివరికి 1453 లో ఆ దండయాత్రలకి కాన్స్టాంటినోపుల్ లొంగిపోయింది. ఇక అప్పట్నుంచి ఆ నగరం టార్కీ హయాంలోనే ఉండిపోయింది. కాన్స్టాంటినోపుల్ పతనం తరువాత, ముందు కూడా గ్రీకు పండితులు అక్కణ్ణుంచి పాశ్చాత్య యూరప్ కి పలాయనం అయ్యారు. వారితో పాటు వాళ్ళ గ్రంథాలయాల నుండి దొరికినంత సమాచారం మూటగట్టుకు తీసుకుపోయారు. ఆ విధంగా గ్రీకు సారస్వతానికి చెందిన కొన్ని అవశేషాలు పాశ్చాత్య యూరప్ కి దక్కాయి. కాని ఆ కాస్త పాటి జ్ఞానమే యూరప్ లో గొప్ప ప్రగతికి కారణం అయ్యింది.

అది పర్యాటక యుగం. ఉత్సాహవంతులైన పర్యాటకులు ప్రపంచం నలుమూలలకి ప్రయాణించి కొత్త కొత్త ప్రాంతాలని ఆవిష్కరించిన కాలం అది. ఆ కాలంలోనే పర్యాటకులకి ఎంతో ముఖ్యమైన ఓ కొత్త పరికరం కనుక్కోబడింది. అదే దిక్సూచి. దిక్సూచి సహాయంతో ఆఫ్రికా తీరం మొత్తం గాలించడానికి వీలయ్యింది. 1497 లో ఆ ఖండం యొక్క దక్షిణ కొమ్ము చుట్టూ ప్రయాణించడానికి వీలయ్యింది. ఇండియాకి సముద్ర మార్గం కనుక్కోబడింది. మహ్మదీయ ప్రాంతాలతో సంబంధం లేకుండా యూరప్ నుండి తూర్పు ప్రపంచాన్ని చేరుకోడానికి కొత్త మార్గాలు దొరికాయి. ఇది కాకుండా 1492-1504 నడిమి ప్రాంతాల్లో క్రిస్టఫర్ కొలంబస్ ఎన్నో సాహసోపేతమైన యాత్రలు చేసి ప్రపంచం యొక్క ఓ కొత్త ముఖాన్ని చూశాడు. (అయితే ఆ విషయాన్ని అతనే ఎప్పటికీ ఒప్పుకోలేకపోయాడు.)

ఆ విధంగా క్రమంగా గ్రీకు తాత్వికులకి తెలీని ఎన్నో కొత్త కొత్త విషయాలని యూరొపియన్లు కనుక్కోగలిగారు. గ్రీకులకి తెలీంది లేదని అంతవరకు యూరొపియన్లకి వాళ్ల పట్ళ ఉన్న ఆరాధనాభావం క్రమంగా సన్నగిల్లసాగింది. సముద్రయాత్రలలోనే కాక యూరొపియన్లు క్రమంగా ఎన్నో ఇతర రంగాల్లో తమ ఆధిక్యతను నిరూపించుకున్నారు. కనుక తమ పూర్వీకుల పట్ల, వాళ్ల ప్రతిభ పట్ల యూరొపియన్లకి ఉండే అచంచల భక్తి నెమ్మదిగా క్షీణించసాగింది. తమ ప్రాచీనుల భావాలని, బోధనలని ప్రశ్నించడం మొదలెట్టారు.

ఈ పర్యాటక యుగం లోనే జర్మన్ శాస్త్రవేత్త యోహాన్ గుటెన్బర్గ్ (1397-1468) మొట్టమొదటి ముద్రణ యంత్రాన్ని నిర్మించాడు. అవసరమైతే దాని విడి భాగాలని వేరు చేసి మరో చోట తిరిగి కూర్చే వీలు ఉండేలా ఆ యంత్రాన్ని నిర్మించాడు. అలాగే ఎలాంటి పుస్తకాన్నయినా ముద్రించే వీలు కల్పించాడు. మొట్టమొదటి సారిగా పుస్తకాలని భారీ ఎత్తులో, చవకగా తయారుచెయ్యడానికి వీలయ్యింది. లిఖిత పద్ధతిలో ప్రతులు తయారుచేస్తే దొర్లే దోషాలు ఈ ముద్రణ పద్ధతిలో రాకపోవడం కూడా ఓ విశేషం. (అయితే టైప్ సెట్టింగ్ లో దోషాలు వచ్చే అవకాశం ఉంది. అది వేరే సంగతి).

(సశేషం…)

హేమం కన్నా ఆమ్లమే మేలు

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, January 13, 2011 0 comments

ఆ విధంగా శక్తివంతమైన ఖనిజపు ఆసిడ్ల సృష్టి రసాయనిక శాస్త్ర చరిత్ర లో ఓ మైలురాయి అని చెప్పొచ్చు. అంతకు మూడు వేల ఏళ్ల క్రితం, ముడి నుండి ఇనుమును వెలికి తీసిన నాటి నుండి రసాయన చరిత్రలో ఇంత ముఖ్యమైన ఘటన మరొకటి లేదంటే అతిశయోక్తి కదు. ఈ కొత్త ఆసిడ్ తో ఎన్నో కొత్త రసాయన చర్యలు సాధించడానికి వీలయ్యింది. ప్రాచీన గ్రీకులకి, అరబ్బులకి తెలిసిన అత్యంత శక్తివంతమైన ఆసిడ్ అయిన వెనిగార్ లో కరగని ఎన్నో పదార్థాలు ఈ కొత్త శక్తివంతమైన ఖనిజపు ఆసిడ్లలో కరిగించొచ్చని యూరొపియన్లు కనుక్కున్నారు.

అసలు రూపాంతరీకరణ వల్ల బంగారాన్ని ఉత్పత్తి చేయడం సాధ్యమైనా సరే, ఏ రసాయనిక ప్రయోజనమూ లేని జడ పదార్థం అయిన బంగారం కన్నా ఈ ఖనిజపు ఆసిడ్ల వల్ల మానవాళికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అరుదుగా దొరుకుతుందని బంగారానికి అంత విలువగాని అదే సమృద్ధిగా దొరికేటట్టయితే దాని విలువ క్షణంలో పడిపోతుంది. కాని ఖనిజపు ఆసిడ్ల విషయం అలా కాదు. అవి ఎంత సమృద్ధిగా దొరికితే, వాటి విలువ, ప్రయోజనం అంతగా పెరుగుతుంది. కాని ఆ బంగారంలో ఏం మాయ ఉందో ఏమో? పనికొచ్చే ఆసిడ్లని పక్కన పెట్టి, ప్రయోజనం లేని బంగారాన్నే ఆరాధించారు. మరి మనుషుల తీరే అంత!

మొదట్లో కొంచెం ఆశాజనకంగా కనిపించిన పరుసవేదానికి మూడోసారి క్షీణదశ మొదలయ్యింది. గతంలో అప్పటికే గ్రీకుల తరువాత ఒకసారి, అరబ్బుల తరువాత ఒకసారి అలాంటి పతనాన్ని చవి చూసింది. పసిడి కోసం పరుగులాట ఓ పైత్యంలా దాపురించింది. మోసగాళ్ల మాట అటుంచి పదిహేడవ శతాబ్దానికి చెందిన మేధావులైన బాయిల్, న్యూటన్ లాంటి వాళ్లు కూడా ఆ ఆకర్షణకి లోనుగాకుండా ఉండలేకపోయారు.

అంతకు పూర్వం వేయేళ్ల క్రితం డయోక్లిటియన్ కాలంలో జరిగినట్టు, మరొక్కసారి పరుసవేదంలో అధ్యయనాలు నిషేధించబడ్డాయి. నిజంగా బంగారాన్ని పెద్ద ఎత్తులో ఉత్పత్తి చెయ్యడానికి వీలైతే ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకోబోయే కల్లోలం ఆ నిషేధానికి ఒక కారణం. అది కాకుండా పరుసవేదం పేరుతో జరుగుతున్న ఘరానా మోసాన్ని అరికట్టడం కూడా ఆ నిషేధంలోని ఒక ఉద్దేశం. 1317 లో పోప్ జాన్ XXII ఆ నిషేధాన్ని ప్రకటించాడు. దాని ఫలితంగా నిజంగా సత్తా ఉన్న పరుసవేదులు సమాజం కంటికి కనిపించకుండా రహస్యంగా తమ అధ్యయనాలు చేసుకోవడం మొదలెట్టారు. వారు లేని శూన్యంలో మోసగాళ్లు, దగాకోరులు రాజ్యం చేశారు.

ఇదిలా ఉండగా ఒక పక్క యూరప్ లో స్వేచ్ఛావాయువులు బలంగా వీచసాగాయి. కాన్స్టాంటినోపుల్ రాజధానిగా గల తూర్పు రోమన్ సామ్రాజ్యం (దీనికే బైజాంటైన్ సామ్రాజ్యం అని పేరు) అవసాన దశ చేరుకుంది. 1204 లో యూరొపియన్ క్రూసేడర్లు చేసిన దాడికి ఈ సామ్రాజ్యం బాగా చితికి పోయింది. ఆ ఒక్క నగరంలో మాత్రమే పదిలంగా మిగిలాయి అనుకున్న గ్రీకు సారస్వతానికి చెందిన ఆఖరు అవశేషాలు ఆ దెబ్బకి తుడిచిపెట్టుకుపోయాయి.

1261 లో ఆ నగరాన్ని గ్రీకులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. నగరం అయితే చేజిక్కింది గాని మునుపటి శోభ ఇప్పుడు లేదు. రెండ శతాబ్దాల పాటు టర్కిష్ సేనల దాడులు ఈ నగరం మీద ఎడతెగకుండా జరుగుతూనే ఉన్నాయి. చివరికి 1453 లో ఆ దండయాత్రలకి కాన్స్టాంటినోపుల్ లొంగిపోయింది. ఇక అప్పట్నుంచి ఆ నగరం టార్కీ హయాంలోనే ఉండిపోయింది. కాన్స్టాంటినోపుల్ పతనం తరువాత, ముందు కూడా గ్రీకు పండితులు అక్కణ్ణుంచి పాశ్చాత్య యూరప్ కి పలాయనం అయ్యారు. వారితో పాటు వాళ్ళ గ్రంథాలయాల నుండి దొరికినంత సమాచారం మూటగట్టుకు తీసుకుపోయారు. ఆ విధంగా గ్రీకు సారస్వతానికి చెందిన కొన్ని అవశేషాలు పాశ్చాత్య యూరప్ కి దక్కాయి. కాని ఆ కాస్త పాటి జ్ఞానమే యూరప్ లో గొప్ప ప్రగతికి కారణం అయ్యింది.

(సశేషం...)

“ప్రయోగం + గణితం = వైజ్ఞానిక పద్ధతి” - రోజర్ బాకన్

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, January 9, 2011 0 commentsఆల్బర్టస్ మాగ్నస్ కి సమకాలీనుడైన ఓ గొప్ప ఇంగ్లీష్ పండితుడు ఉన్నాడు. క్రైస్తవ సాధువైన ఇతడి పేరు రోజర్ బాకన్ (1214-1292). వైజ్ఞానిక ప్రయాసకి ప్రయోగాత్మక పద్ధతి, గణిత పద్ధతుల వినియోగం జోడైతే గొప్ప ప్రగతి సాధ్యం అవుతుందని ఇతడు గాఢంగా నమ్మేవాడు. ఆ భావాలనే తన రచనల్లో కూడా ఎన్నో చోట్ల వ్యక్తం చేశాడు. కాని నాటి ప్రపంచం అతడి మాటలని అర్థం చేసుకోడానికి సిద్ధంగా లేదు.

బాకన్ ఓ విజ్ఞాన సర్వస్వాన్ని రాయడానికి ప్రయత్నించాడు. తన రచనల్లో మందుపాతరకి సంబంధించిన వివరణ కనిపిస్తుంది. మందుపాతర ప్రస్తావన గల పుస్తకాల్లో అదే మొట్టమొదటిది కావచ్చు. కనుక అసలు మందుపాతరని కనుక్కున్నది బాకన్ అని అపోహ పడతారు. కాని అది నిజం కాదు. అయితే నిజంగా మందుపాతరని కనుక్కున్నది ఎవరు అన్నది కచ్చితంగా తెలీదు.

మందుపాతర ప్రభావం వల్ల కరుడు కట్టుకుపోయిన మధ్యయుగపు సమాజాల పునాదుల్లో పగుళ్ళు బయలుదేరాయి. కఠిన శిలలతో కట్టిన కోట గోడలు నేలమట్టం అయ్యాయి. తుపాకీ చేత పట్టి నేల మీద నిల్చిన వాడు, అశ్వారూఢుడై అతి వేగంతో దూసుకువస్తున్న యోధుణ్ణి క్షణంలో మట్టికరిపించ గలిగాడు. మొట్టమొదటి సారిగా కేవలం సాంకేతిక ఆధిక్యత వల్ల ఒక నాగరికత పరాయి నాగరికతల మీద అధిపత్యం చెలాయించ గలిగింది. 1400 ప్రాంతాల్లో మొదలైన ఆ దండయాత్ర ఐదు శతాబ్దాల పాటు అంటే 1900 వరకు ఇంచుమించు నిరాఘాటంగా కొనసాగింది. అన్ని శతాబ్దాల పాటు అన్ని ఖండాల మీద యూరప్ చేసిన పెత్తనానికి సాంకేతిక నైపుణ్యం కారణభూతం అయ్యింది.

తదనంతరం స్పానిష్ పండితులు ఆర్నాల్డ్ ఆఫ్ విలనోవా (1235-1311) మరియు రేమండ్ లల్లీ (1235-1315) ల రచనలలో పరుసవేదంలో ఓ కొత్త అధ్యాత్మిక ధోరణి బయలుదేరింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వారి రచనలుగా చెప్పబడిన పుస్తకాలు అసలు వారి రచనలేనా కాదా అన్న సందేహం లేకపోలేదు. ఈ పుస్తకాలలో రూపాంతరీకరణ (transmutation) గురించిన చర్చ విస్తృతంగా ఉంటుంది. అసమర్థుడు, వ్యర్థుడు అయిన ఇంగ్లండ్ రాజు ఎడ్వర్డ్ – II కోరిక మీదట లల్లీ కాస్తంత బంగారాన్ని తయారు చేసినట్టు కథలు ఉన్నాయి.


మధ్య యుగానికి చెందిన పరుసవేదుల్లో కెల్లా ప్రముఖుడైన వాడు ఒకడు ఉన్నాడు. అయితే ఆ పెద్దమనిషి తన సొంత పేరు మీద కాక తనకి ఆరు శతాబ్దాల వెనక పుట్టిన అరబిక్ పరుసవేది ’గెబర్’ పేరు మీద రచనలు చేసేవాడు. ఈ “నకిలీ గెబర్” స్పెయిన్ కి చెందినవాడని, రమారమి 1300 కాలంలో జీవించి ఉండొచ్చని తప్ప మనకి పెద్దగా సమాచారం లేదు. ఆధునిక రసాయనిక పరిశ్రమల్లో అతి ముఖ్యమైన (నీరు, గాలి, బొగ్గు, చమురు తరువాత) పదార్థం అయిన సల్ఫురిక్ ఆసిడ్ గురించి మొట్టమొదట రాసినవాడు ఇతడే. శక్తివంతమైన నైట్రిక్ ఆసిడ్ యొక్క ఉత్పత్తి గురించి కూడా ఇతడు వర్ణించాడు. ఈ కొత్త ఆసిడ్లు ఖనిజాల నుండి తయారుచేసినవి. అంతకు పూర్వం తెలిసిన ఆసిడ్లు, వెనిగార్ లోని అసిటిక్ ఆసిడ్ వంటివి, జీవలోకం నుండి వచ్చినవే.

(సశేషం...)

రసాయన శాస్త్ర చరిత్రలో అనువాదాల పాత్ర

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, January 6, 2011 0 comments

అరబ్ సంస్కృతిలో గొప్ప గొప్ప గ్రంథాలు ఉండేవని యూరొపియన్లు తెలుసుకున్నారు. అరిస్టాటిల్ మొదలైన గొప్ప గ్రీక్ తాత్వికుల మూల రచనల అరబిక్ అనువాదాలు లభ్యమై ఉండేవి. అవి కాక అవిసెన్నా మొదలైన అరబిక్ పండితులు అరబిక్ లోనే రాసిన మూల గ్రంథాలు కుడా ఉండేవి.

మొదట్లో బద్ధ శత్రువు రాసిన పుస్తకాల నుండి నేర్చుకోవడానికి అహం, ఆగ్రహం అడ్డొచ్చినా, త్వరలోనే ఆ మానసిక అవరోధాలన్నీ మాయమయ్యాయి. మహత్తరమైన ఈ అరబిక్ రచనలన్నీ లాటిన్ లోకి తర్జుమా అయ్యాయి. అలాంటి ఉద్యమానికి మంచి స్పూర్తి ఇచ్చినవాడిలో ఒకడు గెర్బెర్ట్ (క్రీ.శ. 940-1003) అనే ఫ్రెంచ్ పండితుడు. క్రీ.శ. 999 లో ఇతగాడు సిల్వెస్టర్ – II అన్న పేరుతో పోప్ అయ్యాడు.

పరుసవేదం మీద అరబిక్ లో ఉన్న సాహిత్యాన్ని లాటిన్ లోకి తర్జుమా చేసిన మొట్టమొదటి వాళ్లలో ఒకడు రాబర్ట్ ఆఫ్ చెస్టర్ అనే ఓ ఇంగ్లీష్ పండితుడు. ఈ అనువాద కార్యక్రమాన్నిఅతడు క్రీ.శ. 1144 లో పూర్తి చేశాడు. అతడి తరువాత ఈ అనువాద ఉద్యమంలో పాల్గొన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ అనువాదకుల్లో కెల్లా అగ్రగణ్యుడు జెరార్డ్ (క్రీ.శ. 1114-1187) అనే ఓ ఇటాలియన్ పండితుడు. క్రిమోనాలో పుట్టిన ఇతగాడు తన జీవితంలో అధిక భాగం స్పెయిన్ లోని టోలెడోలో జీవించాడు. (క్రీ.శ. 1085 లో క్రైస్తవ సేనలు టోలెడో నగరాన్ని ఆక్రమించుకున్నాయి.) మొత్తం 92 అరబిక్ గ్రంథాలని ఇతడు అనువదించాడు.

ఇలాంటి కృషి వల్ల క్రీ.శ. 1200 కల్లా యూరొపియన్ పండితులకి గతానికి చెందిన పరుసవేద సాంప్రదాయాలని అర్థం చేసుకోడానికి వీలయ్యింది. తెలుసుకున్న దాన్ని ఆధారంగా చేసుకుని మరిన్ని కొత్త విషయాలని తెలుసుకోడానికి ఉద్యమించారు.

అలా అప్పుడప్పుడే అంకురిస్తున్న యూరొప్ కి చెందిన పరుసవేద సాంప్రదాయంలో మొట్టమొదటి వాడుగా చెప్పుకోబడేవాడు ఒకడున్నాడు. ఇతడు బోల్స్టాట్ కి చెందిన ఆల్బర్ట్ (1200-1280) అనే పండితుడు. ఇతడికే ఆల్బర్టస్ మాగ్నస్ (“మహామహుడైన ఆల్బర్ట్”) అని మరో పేరు కూడా ఉంది. అరిస్టాటిల్ రచనలని ఇతడు లోతుగా చదివాడు. ఇతడి వల్లనే అరిస్టాటిల్ భావనలతో యూరొపియన్ పండితులకి గాఢమైన పరిచయం ఏర్పడింది. ఆ భావనలే మధ్యయుగపు చింతనకే కాక, ఆధునిక యుగపు ఆరంభానికి చెందిన చింతనకి కూడా పునాది రాళ్లు అయ్యాయి.

ఆల్బర్టస్ మాగ్నస్ పరుసవేదం మీద చేసిన రచనల్లో ఆర్సెనిక్ గురించి ఎంత విశదంగా రాశాడంటే అసలు ఆర్సెనిక్ ని మొట్టమొదట కనుక్కున్నది ఇతడేనా అనిపిస్తుంది. కాని అది నిజం కాదు. ఆర్సెనిక్ యొక్క శుద్ధ రూపాల గురించి ఇతడికి తెలిసి ఉండొచ్చేమోగాని, దాని అశుద్ధ రూపాల గురించి గతంలో పరుసవేదులకి బాగా తెలిసి ఉండేది.

(సశేషం...)

యూరప్ లో పరుసవేదం యొక్క పునరుజ్జీవనం

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, January 5, 2011 0 comments


జబీర్ తరువాత పరుసవేదంలో మళ్లీ అంత గొప్ప పేరు సాధించిన పరో పర్షియన్ రసాయనికుడు ఉన్నాడు. అతడి పేరు అల్-రజీ (Al-Razi) (క్రీ.శ. 850-925). యూరొపియన్లు ఇతణ్ణి “రాజెస్” అని పిలిచేవారు. ఇతడు కూడా ఎన్నో రసాయనిక ప్రక్రియలని తన రచనల్లో వివరించాడు. ఉదాహరణకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించి పోత ఎలా పొయ్యాలో, విరిగిన ఎముకలని ఎలా అతికించాలో ఇతడు స్పష్టంగా వర్ణించాడు. మూలకమైన ఆంటిమొనీ యొక్క లక్షణాలని ఇతడు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సులభంగా ఆవిరయ్యే పాదరసానికి, సులభంగా నిప్పు అంటుకునే సల్ఫర్ ని కలిపేటప్పుడు, వీటితో పాటు మరో లవణాన్ని కూడా కలపాలని సూచించాడు.

జబీర్ కన్నా ఈ అల్-రజీ ధ్యాస లోహాల మీద కన్నా వైద్యం మీద ఎక్కువగా ఉండేది. ఆ విధంగా పరుసవేదం వైద్యం దిక్కుగా మొగ్గు చూపే ఒరవడి ఇబిన్-సీనా (Ibn-Sina)(క్రీ.శ. 979-1037) అనే మరో పర్షియన్ పరుసవేది కృషిలో కనిపిస్తుంది. లాటిన్ భాషా ప్రభావం వల్ల ఈ పేరు అవిసెన్నా (Avicenna) అని కూడా చలామణిలో ఉండేది. రోమన్ సామ్రాజ్యం పతనమైన కాలానికి, ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించిన కాలానికి మధ్య నడిమి కాలంలో ఈ అవిసెన్నా కి వైద్యుడిగా మంచి పేరు దక్కింది. శతాబ్దాలుగా తన పూర్వీకుల వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని అసలు ఇతర లోహాల నుండి బంగారాన్ని తయారుచెయ్యడం సాధ్యమా అని సందేహించసాగాడు అవిసెన్నా. తన పూర్వీకులంతా సాధ్యమని నమ్మి ఓడిపోతుంటే, ఇతడు మాత్రం అసాధ్యం అన్న అభిప్రాయంతో ఉండేవాడు. ఆ విధంగా పరుసవేద చరిత్రలో అవిసెన్నా ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాడు.


యూరప్ లో పరుసవేదం యొక్క పునరుజ్జీవనం

అవిసెన్నా తరువాత అరబిక్ విజ్ఞానం వేగంగా క్షీణించసాగింది. ఇస్లామిక్ ప్రపంచంలో అస్థిర వాతావరణం నెలకొన్న రోజులవి. టర్కులు, మోంగోల్ జాతులు మొదలైన కిరాత జాతుల ఎడతెగని దాడుల వల్ల ఆ సంక్షోభం మరింత తీవ్రతరం అయ్యింది. మూడు శతాబ్దాల తరువాత వైజ్ఞానిక స్ఫూర్తి, జ్యోతి, నేతృత్వం అరబ్ ప్రపంచాన్ని పూర్తిగా విడిచివెళ్లిపోయింది. ఆ స్ఫూర్తి ఇప్పుడు పశ్చిమ యూరప్ ప్రాంతాలని ఆవేశించడం మొదలెట్టింది.

ఇస్లామిక ప్రపంచంలో యూరొపియన్ల మొదటి సంపర్కం క్రైస్తవ మత జైత్రయాత్రల (Crusades) వల్ల కలిగింది. ఆ సంపర్కం కొద్దోగొప్పో శాంతియుతంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ జైత్రయాత్రల్లో మొట్టమొదటిది క్రీ.శ. 1096 లో జరిగింది. క్రీ.శ. 1099 కల్లా పశ్చిమ యూరప్ కి చెందిన క్రైస్తవ మతస్థులు జెరూసలేమ్ ని పూర్తిగా చేజిక్కించుకున్నారు. అది జరిగిన రెండు శతాబ్దాల తరువాత సిరియన్ తీరం మీద ఓ పరిమిత ప్రాంతంలో క్రైస్తవ సంస్కృతి నెలకొంది. ఇస్లామక్ సముద్రంలో ఓ చిన్న క్రైస్తవ ద్వీపం ఉన్నట్టు అయ్యింది. అక్కడ జీవించే క్రైస్తవులు అడపాదపా పశ్చిమ యూరప్ లోని తమ జన్మస్థానాలని సందర్శిస్తున్నప్పుడు తమతో పాటు కాస్తో కూస్తో అరేబియన్ విజ్ఞానాన్ని కూడా తీసుకుపోయేవారు. ఆ కాలంలోనే స్పెయన్ కి చెందిన క్రైస్తవులు ఎనిమిద శతాబ్దంలో మహ్మదీయులు ఆక్రమించిన భూభాగాలని తిరిగి క్రమంగా తమ హస్తగతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. స్పెయిన్ లో ’మూర్’ లు (Moors) అనబడే ఓ వర్గం వారు మహ్మదీయ మతాన్ని అనుసరించేవారు. ఈ మూర్ లని జయించే ప్రయత్నంలో యూరొపియన్ క్రస్తవులకి అరేబియన్ నాగరికత యొక్క ఘనత గురించి కొంచెం కొంచంగా అర్థమయ్యింది.


(సశేషం...)

అమరత్వాన్ని ప్రసాదించే రాయి

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, January 1, 2011 2 comments


బ్లాగర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు!


జబీర్ చేసిన ఆవిష్కరణలలో కెల్లా లోహాల రూపాంతరీకరణ (transmutation) కి సంబంధించిన అధ్యయనాలే అతి ముఖ్యమైనవి. పాదరసం ఓ అపురూమైన లోహంగా అతడు భావించేవాడు. మామూలు పరిస్థితుల్లో కూడా ద్రవరూపంలో ఉండే పాదరసంలో పార్థివ తత్వం అతి తక్కువగా ఉంటుంది అనేవాడు. సల్ఫర్ కి ఉండే ప్రత్యేక లక్షణం – జ్వలనీయత (combustibility) – అతణ్ణి ఆకట్టుకుంది. (సల్ఫర్ విషయంలో అతణ్ణి ఆకట్టుకున్న మరో లక్షణం బంగారం లాంటి దాని పచ్చని పసిమి). పాదరసాన్ని, సల్ఫర్ ని వివిధ నిష్పత్తులలో కలపితే వివిధ రకాల లోహాలు తయారు అవుతాయని అతడు అపోహ పడేవాడు. కనుక ఈ రెండు పదార్థాలని కచ్చితంగా ఏ నిష్పత్తిలో కలిపితే బంగారం పుడుతుంది అన్నదే ఇంకా తేలని ప్రశ్న. అయితే అలాంటి మిశ్రమం రూపాంతరీకరణ చెంది అందులోంచి బంగారం పుట్టడానికి మరో మూడో పదార్థం కావలసి ఉంది. అదేంటి అన్నది మరో తేలని ప్రశ్న.

అలా రూపాంతరీకరణ జరగడానికి దొహదం చేసే పదార్థం ఒక రకమైన పొడి అని ప్రాచీన సాంప్రదాయం చెప్తుంది. ఆ పొడిని గ్రీకులు “గ్సెరియాన్” (xerion) అని పిలిచేవారు. గ్సెరియాన్ అంటే గ్రీకులో “తడిలేనిది (అంటే పొడిగా ఉండేది)” అని అర్థం. దాన్ని కాస్తా అరబ్బులు “అల్-ఇక్సిర్” అని మార్చారు. అది యూరొపియన్ల భాషల్లో ఎలిక్సిర్ (elixir) అయ్యింది. కాలక్రమేణా ఆ పొడి పదార్థాన్ని ఇంగ్లీష్ లో philosopher’s stone (తత్వవేత్తల శిల) అని పిలువసాగారు. (1800 ల వరకు కూడా తత్వవేత్తలు అంటే ఆధునిక పరిభాషలో శాస్త్రవేత్తలు అన్న అర్థం ఉండేదని గుర్తుంచుకోవాలి).

నిమ్నజాతి పదార్థాలని బంగారంగా మార్చడానికి అవసరమైన ఈ ఎలిక్సిర్ కి ఇతర అద్భుతమైన లక్షణాలు ఉండేవని కూడా భావించేవారు. ఉదాహరణకి అది సర్వరోగ నివారణి అనుకునేవారు. దాని వల్ల అమరత్వం కూడా సిద్ధిస్తుందని నమ్మేవారు. ఆ విధంగా బంగారాన్ని పండించగోరిన రసాయన శాస్త్రవేత్తలు అమృతమైన జీవనాన్ని కూడా సాధించగోరుతున్నట్టు అయ్యింది.

ఆ కారణం చేత కొన్ని శతాబ్దాల పాటు పరుసవేదులు రెండు మహోన్నత లక్ష్యాల కోసం శ్రమిస్తున్నట్టు అయ్యింది. ఆ లక్ష్యసాధనలో రెండు సమాంతర మార్గాల వెంట పయనిస్తున్నట్టుయ్ అయ్యింది. ఒకటి బంగారం కోసం గాలింపు, రెండు వెలితి లేని స్వస్థత కోసం, మృతిలేని జీవనం కోసం అన్వేషణ.(సశేషం...)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Total Pageviews

There was an error in this gadget
There was an error in this gadget

విజ్ఞానులు

GuestBooker 2.5

Recent Posts

Popular Posts

Follow by Email