శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

పదండి ముందుకు, ఇంకా లోతుకు

Posted by V Srinivasa Chakravarthy Wednesday, July 18, 2012
నడవమనే కన్నా ముందుకు జారమని వుంటే సబబుగా ఉండేదేమో. ఇంత విపరీతమైన వాలు దారిలో ఇంచుమించు జారినట్టుగానే ముందుకు సాగాము. ఇటాలియన్ కవి వర్జిల్ ఒక చోట అంటాడు - facilis est descensus Averni అని. ‘ఇంత కన్నా నరకంలోకి దిగడం సులభం’ అని ఆ వాక్యానికి అర్థం. మా పరిస్థితి ఇంచుమించు అలాగే వుంది. మా దిక్సూచి స్థిరంగా దక్షిణ-తూర్పు దిశనే సూచిస్తోంది. అలనాటి లావాప్రవాహం అటు ఇటు చూడకుండా నేరుగా దూసుకుపోయింది అన్నమాట.




కాని లోపలికి పోతున్న కొద్ది ఉష్ణోగ్రత పెద్దగా పెరుగుతున్నట్టు అనిపించలేదు. కనుక డేవీస్ సిద్ధాంతానికి సమర్థింపు దొరికినట్టు అనిపించింది. ఈ విషయం గురించే ఎన్నో సార్లు థర్మామీటరు కేసి చూసి ఆశ్చర్యపోయాను. మరో రెండు గంటలు నడిచాక చూసుకుంటే ఉష్ణోగ్రత 10 C మాత్రమే వుంది. కేవలం 4 C పెరిగింది. అంటే మేం నిలువుగా కన్నా ఏటవాలుగా ముందుకి సాగుతున్నాం అన్నమాట. ఇక ఎంత లోతుకు వచ్చాం అని ఆలోచించుకుంటే వాలు తెలుసు కనుక, వేగం తెలుసు కనుక లోతు కూడా సులభంగా అంచనా వేసుకోవచ్చు. ప్రొఫెసర్ మామయ్య చాలా కచ్చితంగా ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు కొలుచుకుని నమోదు చేసుకుంటున్నాడు గాని ఆ వివరాలు ఎందుకో రహస్యంగా దాచుకుంటున్నాడు.



రాత్రి ఎనిమిది అయ్యేసరికి ఆగమని సూచన ఇచ్చాడు మామయ్య. హన్స్ వెంటనే కింద చతికిలబడ్డాడు. పైన పొడుచుకొస్తున్న రాతికి లాంతర్లు తగిలించాడు. మేం ఉన్న ప్రదేశం ఏదో గుహలా వుంది. పుష్కలంగా గాలి వుందిక్కడ. పైగా కొన్ని సార్లు గాలి గుప్పు గుప్పున అలల లాగా ముఖానికి తగులుతోంది. ఇంత లోతులో వాతావరణ సంక్షోభం ఎలా సాధ్యం అనిపించింది. దానికి సమాధానం వెంటనే తట్టలేదు. అయినా ఇలాంటి ధర్మసందేహాల గురించి ఆలోచించేటంత ఓపిక లేదు. ఆకలి, నిస్సత్తువల వల్ల ఆలోచన మొద్దుబారిపోయింది. ఏకబిగిన ఏడుగంటలు దిగి వచ్చేసరికి తల ప్రాణాం తోకకి దిగింది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని పరిస్థితి. అందుకే ఆగమని మామయ్య చేసిన సంజ్ఞ నాకు బాగా నచ్చింది. భోజన సామగ్రి అంతా హన్స్ ఓ చక్కని లావా బండ మీద అమర్చాడు. అందరం ఆవురావురని తిన్నాం. కాని నాకు ఒక్క విషయం మాత్రం మనసులో కొంత కంగారు పుట్టించింది. మేం తెచ్చుకున్న నీరు సగానికి వచ్చింది. భూగర్భ జలాల గురించి మామయ్య తెగ చెప్పాడు గాని మేం ఇంతవరకు అలాంటి భాగ్యానికి నోచుకోలేదు. ఈ విషయం గురించే ఆయన్న ఓ సారి కాస్త భయంభయంగా అడిగాను.



“నీటి బుగ్గలు కనిపించ లేదని బుగులు పుడుతోందా?” అడిగాడు మామయ్య.



“బుగులేంటి? చెడ్డ భయంగా వుంది. తెచ్చుకున్న నీరు మరో ఐదు రోజులకి మించి రాదు.”

“కంగారు పడకు ఏక్సెల్. మనకి కావలసినంత నీరు దొరుకుతుంది.” మామయ్య ధీమాగా అన్నాడు.

“అదే ఎప్పుడు అని అడుగుతున్నా.”

“ఈ లావా స్తరాన్ని దాటి పోగానే. ఇంత కఠిన శిలని ఛేదించుకుని నీరు పైకెలా తన్నుకొస్తుంది అనుకున్నావు?”

“బహుశ ఈ సొరంగం చాలా లోతుకి పోతుందేమో. మనం నిలువు దిశలో పెద్దగా పురోగమించలేదని అనిపిస్తోంది.”

“అలా ఎందుకు అనుకుంటున్నావు?” నిలదీశాడు మామయ్య.

“భూమి యొక్క పైపొర లో తగినంత లోతుగా పోయినట్టయితే గొప్ప వేడిమి ఎదురుపడాలి కదా?”

“అది నీ ఆలోచన ప్రకారం,” అన్నాడు మామయ్య. “నీ థర్మామీటర్ ఏం చెప్తోంది?”

“మహా అయితే 15 C ఉంటుందంతే. బయల్దేరిన దగ్గర్నుండి 9 C మాత్రమే పెరిగింది.”

“అయితే దీన్ని బట్టి నీకు తెలుస్తున్నది ఏంటి?”

“నాకు అనిపిస్తున్నది ఇది. కచ్చితమైన పరిశీలనల బట్టి భూమి లోతుల్లోకి పోతున్న కొద్ది ప్రతీ నూరు అడుగులకి 1 C పెరుగుతూ పోవాలి. స్థానిక పరిస్థితుల వల్ల ఈ వేగంలో కొద్దిగా సవరణలు రావచ్చు. మచ్చుకి సైబీరియాలోని యాకూట్స్క్ ప్రాంతంలో అయితే ప్రతీ 36 అడుగులకి ఉష్ణోగ్రతలో అంత మార్పు వస్తుంది. ఆ ప్రాంతపు రాళ్ల యొక్క ఉష్ణవాహక లక్షణాల బట్టి ఆ మార్పు ఆధారపడుతుంది. ఇలంటి మృత జ్వాలాముఖి యొక్క పరిసరాలలో అయితే ప్రతీ 125 అడుగులకి అంత ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్ని బట్టి మనం ఎంత లోతుకి వచ్చామో సులభంగా లెక్కెట్టేయొచ్చు.”

“ఇకనేం? లెక్కెట్టేసేయ్ అల్లుడూ!”

“ఓస్! ఇదెంత సేపు? 9 X 125 = 1125 అడుగుల లోతుకి వచ్చాం,” గర్వంగా సమాధానం ప్రకటించాను.

“బాగా చెప్పావ్.”

ఆయన స్పందనలో ఎక్కడో వెక్కిరింత కనిపిస్తోంది.

“ఏం కాదా?” ప్రతిఘటిస్తూ అడిగాను.

“నా అంచనాల ప్రకారం మన సముద్ర మట్టం కన్నా 10,000 అడుగులు కిందకి వచ్చాం.”

“ఏంటీ? అసలది సాధ్యమా?” అదిరిపోయి అడిగాను.

“సాధ్యం కాకపోతే అసలు అంకెలకి అర్థమే లేదు.”

ప్రొఫెసర్ మామయ్య అంచనాలు చాలా కచ్చితంగా ఉన్నాయి. మానవుడు అంతవరకు చేరుకున్న ప్రగాఢతమమైన లోతు కేవలం 6000 అడుగులు. ఉదాహరణకి కైరోల్ లోని కిట్జ్ బాల్ గనులు, బొహీమియా లోని వుటెన్ బోర్గ్ గనులు మనిషి చేరుకున్న అతి లోతైన ప్రాంతాలకి తార్కాణాలు. మేం అంతకన్నా ఎక్కువ లోతుకి వచ్చేశాం.

మరి లెక్క ప్రకారం ఉష్ణోగ్రత 81 C ఉండాలి. కాని ఎందుకో మరి 15 C కి మించి లేదు.

దీని గురించి కొంచెం లోతుగా ఆలోచించాల్సిందే.



(పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం)





















0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts