శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


(ఈ వ్యాసం ఇటీవలే మాలిక పత్రికలో ప్రచురించబడింది.)
http://magazine.maalika.org/2012/10/02/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%aa%e0%b0%be%e0%b0%9c%e0%b1%80%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8b%e0%b0%a7%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%97%e0%b1%8d/




స్త్రీ స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉన్న యుగంలో, ఇంకా ఇరవైలు దాటని ఓ చక్కని బ్రిటిష్ యువతి, ఒంటరిగా ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ, చింపాజీల ప్రవర్తన గురించి లోతుగా అధ్యయనాలు చేస్తూ, చింపాజీలకి, మనిషికి మధ్య ఉన్న పరిణామాత్మక సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకుని, ఆ రంగంలో అగ్రగామి అయిన శాస్త్రవేత్తగా ఎదిగింది. ఆ యువతి పేరే జేన్ గుడాల్.

1934 లో లండన్ లో పుట్టిన జేన్ కి చిన్నప్పట్నుంచి జంతువులంటే మహా ఇష్టం ఉండేది. జంతువులతో ఆడుకుంటున్నట్టు, మాట్లాడుతున్నట్టు కలలు కనేది. ‘టార్జాన్,’ ‘డాక్టర్ డూలిటిల్’ (ఈ మనుషుల డాక్టరు మనుషుల కన్నా జంతువులకే ఎక్కువగా చికిత్స చేస్తూ ఉంటాడు) వంటి పిల్లల పుస్తకాలు చిన్నతనంలో ఈమెకి ఎంతో స్ఫూర్తి నిచ్చేవి. అందరిలాగానే ‘పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్’ అవ్వమన కుండా తన తల్లి ‘వాన్నే’ కూతుర్ని తనకి నచ్చిన దారిలోనే ముందుకి సాగమని ప్రోత్సహించేది. “నీకు ఏం కావాలంటే అది అవ్వు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో బాగా పైకొస్తావని నాకు తెలుసు,” అనేది ఆ తల్లి.

ఇరవై రెండేళ్ల వయసులో జేన్ కి తన జీవితాన్ని మార్చేసే ఓ గొప్ప అవకాశం దొరికింది. ఓ లండన్ ఫిల్మ్ స్టూడియో తో పాటు ఆఫ్రికాకి వెళ్లే అవకాశం దక్కింది. అయితే ప్రయాణానికి కావలసిన ఖర్చులు కూడా తన వద్ద లేవు. వెంటనే ఓ హోటల్ లో వెయిట్రెస్ గా పనిలోకి దిగి, రాత్రనక పగలనక పని చేసి నాలుగు డబ్బులు వెనకేసింది. తగినంత ధనం పోగవగానే ప్రయాణానికి సిద్ధం అయ్యింది.

ఆ ప్రయాణం 1957 లో మొదలయ్యింది. ముందుగా ఆఫ్రికాలోని మొంబాసా లో దిగింది. మొంబాసాలో ‘లూయీ లీకీ’ అనే పేరుమోసిన పురావస్తు శాస్త్రవేత్త ఉండేవాడు. జేన్ ఆయన్ని కలుసుకుని తన ఆశయాల గురించి విన్నవించుకుంది. జేన్ లోని ఉత్సాహం, శక్తి, జంతువుల పట్ల ఆమెకి సహజంగా ఉండే ప్రేమ మొదలైన లక్షణాలు ఆయన్ని అకట్టుకున్నాయి. వెంటనే తనకి అసిస్టెంటుగా పనిచేసే ఉద్యోగం ఇచ్చాడు. టాంజానియాలో ఓ చెరువు సమీపంలో ఉండే చింపాజీలని అధ్యయనం చేసే పనిలో ఆమెని పాల్గొనమన్నాడు. చింపాజీల జీవన రహస్యాలు అర్థమైతే మనిషి యొక్క పరిణామ గతం గురించి ఎన్నో రహస్యాలు తెలుస్తాయని ఆయన ఆలోచన.

ఈ అధ్యయనాలు 1960 లో మొదలయ్యాయి. ఆ రోజుల్లో జేన్ తల్లి కూడా కూతురుతో పాటు పర్యటించేది. యవ్వనంలో ఉన్న స్త్రీ ఆఫ్రికా అడవుల్లో ఒక్కర్తీ పర్యటించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనుక కూతురితో పాటు ఈ పర్యటనలు ఆ తల్లికి తప్పలేదు. మొదటి రెండు వారాలు జేన్ కి కలిగిన అనుభవాలు కాస్త నిరుత్సాహ పరిచాయి. తనని అంత దూరంలో చూడగానే చింపాజీలు పరుగు అందుకునేవి. పోనీ తను చూసినంత మేరకు కూడా చింపాజీల ప్రవర్తనలో తనకి విశేషంగా ఏమీ కనిపించలేదు. వచ్చిన పని విఫలమయ్యింది అన్న బాధ మనసులో దొలిచేస్తుండగా అనుకోకుండా ఓ సంఘటన జరిగింది.

చింపాంజీలు శాకాహారులు అని అంతవరకు జేన్ అనుకునేది. కాని ఒకరోజు ఓ విచిత్రమైన సంఘట కనిపించింది. ఓ చింపాజీ ఓ చెదల పుట్ట పక్క కూర్చుని ఓ పొడవాటి పుల్లని పుట్టలోకి దూర్చి దాంతో చెదలు “పట్టి” తింటోంది. పుల్లని ఓ పనిముట్టుగా వాడి, దాంతో ఆ పురుగులని “వేటాడి” తినడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది. గిట్టలు, కొమ్ములు, ముక్కులు, పంజాలు మొదలైన దేహాంగాలని కాకుండా మరో వస్తువుని పనిముట్టుగా వాడి ఆహారాన్ని సేకరించడం జంతులోకంలో అరుదైన విషయం. ఆ రోజుల్లో పెద్దగా తెలియని విషయం. పనిముట్లు వాడే దశ ఆదిమానవుడి పరిణామ క్రమంలో ఓ ముఖ్యమైన మలుపుగా చెప్పుకుంటాం. అలాంటి పనిముట్ల వినియోగం ఈ జంతువులలో కనిపించడం విశేషం.

చింపాజీలలో ఈ పనిముట్ల వినియోగం గురించి ప్రొఫెసర్ లీకీ కి వివరంగా ఉత్తరం రాసింది. ఆయన సంతోషం పట్టలేకపోయాడు. “ దీంతో ‘పనిముట్టు’, ‘మనిషి’ మొదలైన పదాలకి కొత్త నిర్వచనాలు ఇవ్వాలి, లేదా చింపాజీలు మనిషితో సమానమని ఒప్పుకోవాలి,” అంటూ ఆయన ఉత్సాహంగా జవాబు రాశాడు.

తరువాత జేన్ ధ్యాస చింపాజీలలో సాంఘిక జీవనం మీదకి మళ్లింది. మనుషులలో లాగానే చింపాజీలలో కూడా విస్తృతమైన సాంఘిక పారంపర్యం ఉంటుంది. ‘నువ్వెక్కువా? నేనెక్కువా?” అన్న భేటీ మగ చింపాజీల మధ్య తరచు వస్తుంటుంది. బలప్రదర్శనతో మగ చింపాజీలు ఇతర చింపాజీల మీద తమ ఆధిక్యతని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ బలాబలాల పోటీ గెలిచిన మగ చింపాజీని ‘ఆల్ఫా మేల్’ (మొదటి మగాడు!) అంటారు. అతడే ముఠా నాయకుడు అవుతాడు. అయితే అంతకన్నా బలమైన చింపాజీ రంగప్రవేశం చేసినప్పుడు, ఇంద్రపదవి లాగా ఈ పదవి చేతులు మారిపోతుంటుంది!


చింపాజీలు సాధు జంతువులు ససేమిరా కాదని తెలుసుకుని జేన్ నిర్ఘాంపోయింది. చింపాజీ ముఠాల మధ్య కొట్లాటలు తరచు జరుగుతుంటాయి. ఒక “ముఠా నాయకుడు” తన ముఠాతో సహా వెళ్లి శత్రు ముఠా మీద యుద్ధం ప్రకటిస్తాడు.


ఆ యుద్ధంలో బలమైన చింపాజీలు బలం తక్కువైన చింపాజీలని తీవ్రంగా గాయపరచి, ఆ గాయలతోనే ప్రాణాలు వొదిలే స్థితికి తెస్తాయి. మనుషుల్లో ‘గ్యాంగ్ వార్’ లకి ఈ కలహాలకి పెద్దగా తేడా ఉన్నట్టు లేదు.

జేన్ చేసిన ఈ ప్రప్రథమ అధ్యయనాలన్నీ చక్కని ఫోటోలతో సహా ఆ రోజుల్లోనే ‘నేషనల్ జ్యాగ్రఫీ’ పత్రికలో అచ్చయ్యాయి. ఆ ఫోటోలు తీసిన హ్యూగో వాన్ లావిక్ ని ఆమె తరువాత వివాహం చేసుకుంది. ఇద్దరి కృషి ఫలితంగా అక్కడ “గోంబే స్ట్రీమ్ రీసెర్చ్ సెంటర్” అనే గొప్ప పరిశోధనా కేంద్రం వెలసింది. కొన్ని దశాబ్దాలుగా ఈ కేంద్రం చింపాంజీల పరిశోధనలో ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలిచింది. కేంద్రంలో సిబ్బంది పెరిగారు. చింపాంజీల జీవన విధానంలో ఎన్నో అంశాలని ఈ బృందం క్రమబద్ధంగా అధ్యయనం చేస్తూ వచ్చింది. ఇరవై అయిదేళ్ల పాటు ఆమె చేసిన పరిశోధనలు 1986 లో “గోంబే చింపాజీస్ – పాటర్న్స్ ఆఫ్ బిహేవియర్” (గోంబే చింపాంజీలు – వాటి ప్రవర్తనలో విశేషాలు) అనే పుస్తకంగా వెలుడ్డాయి. జేన్ గుడాల్ కృషి నుండి స్ఫూర్తి పొందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు చింపాంజీల మీద పరిశోధనలు చేసి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. జేన్ గుడాల్ చేసిన వైజ్ఞానిక కృషికి గుర్తింపుగా ఎన్నో జంతు జాతుల, వృక్ష జాతుల పేర్లలో ఆమె పేరు కలిపారు. ఆమె సుదీర్ఘ వైజ్ఞానిక జీవితంలో ఆమె పొందిన అవార్డులు కోకొల్లలు. స్త్రీలు వైజ్ఞానిక రంగాల్లో కేవలం రాణించడమే కాదు, తలచుకుంటే వారి వారి రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉండగలరని జేన్ గుడాల్ నిదర్శనం మనకి స్పష్టం చేస్తోంది.


References:

http://en.wikipedia.org/wiki/Jane_Goodall http://www.janegoodall.org/

పాతాళంలో కొలంబస్

Posted by V Srinivasa Chakravarthy Sunday, September 23, 2012 1 comments


“వెనక్కివెళ్లిపోవడమా?” తనలో తను ఏదో గొణుగుతున్నట్టుగా అన్నాడు మామయ్య.

“అవును. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యొద్దు. పద వెళ్లిపోదాం.”

మామయ్య కాసేపు ఏం మాట్లడలేదు.

“ఆ కాస్త నీరు తాగాక అయినా నీలో కొంచెం ధైర్యం వస్తుందని అనుకున్నాను.”

“ధైర్యమా?”

“అవును మరి. ఎప్పట్లాగే పిరికిగా మాట్లాడుతున్నావు.”

ఏం మనిషి ఈయన? అసలీయన మనిషేనా? ఈయనకి అసలు భయం అంటే తెలీదా?

“ఏంటి ? వెనక్కు వెళ్ళొద్దు అంటావా మామయ్యా?”

“ఇప్పుడిప్పుడే విజయ పథం మీద అడుగుపెడుతున్న తరుణంలో వెనక్కు వెళ్ళడమా? జరగని పని.”

“అంటే ఈ చీకటి కూపంలో నశించపోవడం తప్ప మనకి వేరే దారి లేదా?”

“ఎందుకు లేదు? నువ్వు కావాలంటే తప్పకుండా వెనక్కు వెళ్ళిపోవచ్చు. హన్స్ నీతో తోడు వస్తాడు. నన్ను మాత్రం నా మానాన వదిలేయ్.”

“నిన్నిక్కడ వదిలేయడమా?”

“ఈ మహా యాత్రని మొదలెట్టాను. ఎలాగైనా ముగించి తీరుతాను. తిరిగి మాత్రం రాను. నువ్వెళ్లు ఏక్సెల్. వెళ్లిపో!”

మామయ్య మాటల్లో ఉద్వేగం కనిపించింది.ఒక నిముషం క్రితం అంత ప్రేమగా, లాలనగా మట్లాడిన మనిషి ఒక్క క్షణంలో అత్యంత కఠినంగా మారిపోయాడు. ఎదుట కనిపించేవన్నీ అసాధ్యాలని తెలిసిన ఒంటరిగా పోరాడడానికి సిద్ధమయ్యాడు. ఈ చీకటి కూపంలో పాపం ఆయన్ని వొదిలిపెట్టి వెళ్లలేను. కాని ఆత్మరక్షణ కోసం ఇక్కణ్ణుంచి పారిపోకుండా కూడా ఉండలేను.

హన్స్ మాత్రం అల్లంత దూరంలో నించుని మా గొడవంతా ఉదాసీనంగా చూస్తున్నాడు. మా మధ్య ఏం జరుగుతోందో సులభంగా గురించి వుంటాడు. ఇక్కడ మేం తీసుకోబోయే నిర్ణయం మీద తన జీవితం కూడా ఆధారపడుతుంది అని తెలిసినా ఏం పట్టనట్టు ఉన్నాడు. తన స్వామి చిన్న సంజ్ఞ చేస్తే చాలు, నిర్దేశించిన మార్గంలో ముందుకు కదలడానికి సిద్ధంగా ఉన్నాడు.

నా బాధ, నా గోడు అతడికి కాస్తంత అర్థమైనా ఎంత బావుండేది అనిపించింది ఆ క్షణం. మా ఎదుట ఎలాంటి ప్రమాదాలు పొంచి వున్నాయో అన్నీ అతడికి బోధపరచగలిగితే ఎంత బావుంటుంది. అప్పుడు ఇద్దరం కలిసి మా మొండి ప్రొఫెసరుని ఒప్పించగలిగి ఉండేవాళ్లం. అందరం కలిసి మరలా స్నెఫెల్ పర్వతాగ్రానికి చేరుకునేవాళ్లం.

హన్స్ కి దగ్గరగా జరిగి ఓ సారి తన భుజం మీద చెయ్యి వేశాను. అతడిలో చలనం లేదు. నేను నోరు విప్పి ఏదో చెప్పబోతుంటే, అతడు మెల్లగా తల తిప్పి మామయ్య కేసి చూపిస్తూ,

“అయ్యగారు!” అన్నాడు.

నాకు ఒళ్ళు మండిపోయింది. “అయ్యగారా? ఆయన నేకీమీ అయ్యగారు కాదు. పద ఇక్కణ్ణుంచి పారిపోవాలి. ఆయన్ని కూడా లాక్కెళ్లాలి. వింటున్నావా? నేను చెప్పేది అసలు నీకేమైనా అర్థమవుతోందా?”

హన్స్ జబ్బ పట్టుకున్నాను. లెమ్మని అదిలించాను. బతిమాలాను. అప్పుడు మామయ్య కల్పించుకుని అన్నాడు,

“మన మార్గానికి అడ్డుపడుతున్నది ఒక్క నీటి సమస్యేగా? ఈ తూర్పు సొరంగంలో లావా శిలలు, చిస్ట్ శిలలు, బొగ్గు మొదలైనవన్నీ కనిపించాయి గాని ఒక్క బొట్టు నీరు కూడా కనిపించలేదు. ఏమో ఏం తెలుసు? పశ్చిమ సొరంగంలో నీరు తగులుతుందేమో?”

నేను నమ్మశక్యం కానట్టు తల అడ్డుగా ఊపాను.

“నేను చెప్పేది సాంతం విను,” మామయ్య ధృఢంగా అన్నాడు. “ఇందాక నువ్వు నిశ్చేష్టంగా పడి వున్న సమయంలో నేను ఆ సొరంగం యొక్క విన్యాసాన్ని పరిశీలించి వచ్చాను. అది నేరుగా కిందికి దిగుతోంది. కొద్ది గంటల్లోనే గ్రానైట్ శిలలని చేరుకుంటాం. అక్కడ పుష్కలంగా మన బాటలో నీటి ఊటలు తగులుతాయి. అక్కడ రాతిని పరిశీలిస్తే నాకు అలాగే అనిపిస్తోంది. పైగా అది నిశ్చయమని నా మనసు చెప్తోంది. ఇప్పుడు నేను చేసే ప్రతిపాదన ఇది. నవ్య ప్రపంచాన్ని చేరుకునే ప్రయత్నంలో కొలంబస్ తన ఓడల సిబ్బందిని మరో మూడు రోజులు గడువు ఇవ్వమని అడిగాడు. అప్పటికే బాగా వేసారిపోయి, విసిగిపోయి, ఆరోగ్యం క్షీణించిన సిబ్బంది తన మాటలలోని నిజాయితీని గుర్తించి ఒప్పుకున్నారు. నవ్య ప్రపంచం వారికి కనిపించింది. ఈ పాతాళా లోకానికి నేను కొలంబస్ ని. మరొక్క రోజు గడువు ఇమ్మంటున్నాను. ఆ ఒక్క రోజులో మనకి నీరు తారసిల్లకపోతే వెనక్కి తిరిగి వెళ్లిపోదాం. ఒట్టేసి చెప్తున్నాను.”

లోపల ఎంత కోపంగా వున్నా మామయ్య మాటలు విని కరిగిపోయాను.

“సరే అలాగే కానివ్వండి. దేవుడు మీకు అతిమానవ శక్తిని ప్రసాదించాలని ఆశిస్తున్నా. మన రాతలు మార్చడానికి మీకు మరి కొద్ది గంటల గడువు వుంది.”

*  ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం *







రాబర్ట్ బ్రౌన్ గురించి డార్విన్

Posted by V Srinivasa Chakravarthy Tuesday, September 18, 2012 2 comments

అలాగే రాబర్ట్ బ్రౌన్ ని (చిత్రం) కూడా ఎన్నో సార్లు కలుసుకున్నాను. (జర్మను తత్వికుడు) హమ్బోల్ట్ ఇతణ్ణి ‘వృక్షశాస్త్రపు మారాజులలో ముఖ్యుడు’ (facile Princeps Botanicorum) అని పొగుడుతాడు. ఇతడు చేసిన అత్యంత సూక్ష్మమైన, నిర్దుష్టమైన పరిశీలనలు, ఇతడికి గొప్ప పేరు తెచ్చాయి. ఇతడికి విస్తారమైన పరిజ్ఞానం ఉండేది. కాని అతడితోనే అదంతా భూస్థాపితం అయిపోయింది. దానికి కారణం ఎక్కడైనా దోషం దొర్లుతుందేమో నన్న అతడి భయమే. తన జ్ఞానాన్నంతా నాకు మాత్రం లేదనకుండా ధారాదత్తం చేసేవాడు. కాని కొన్ని విషయాలలో మాత్రం ఆ ఔదార్యం కొరవడడం విచిత్రంగా అనిపించేది. బీగిల్ యాత్రకి ముందు రెండు, మూడు సార్లు ఆయన్ని సందర్శించాను. అలా ఒక సారి తనని కలుసుకున్నప్పుడు ఓ సూక్ష్మదర్శిని లోంచి చూసి ఏం కనిపిస్తోందో చెప్పమన్నాడు. అలాగే చూశాను. నాకు కనిపించినవి ఏదో వృక్ష కణంలోని జీవపదార్థపు అతిసూక్ష్మమైన ప్రవాహాలు అనుకున్నాను. కాని పూర్తిగా సంశయం తీరక ‘నేను చూసిందేంటి?’ అని అడిగాను. “అదో చిన్ని రహస్యం!” అని ఊరుకున్నాడు బ్రౌన్.




అతడిలో ఎంతో ఔదార్యం లేకపోలేదు. బాగా వయసు పైబడ్డాక, ఆరోగ్యం బాగా క్షీణించాక, ఇక ఏ పనీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా రోజూ ఓ ముసలి పనివాడి ఇంటికి వెళ్లి తనకి ఏదో ఒక పుస్తకం చదివి వినిపించేవాడట. (ఆ పనివాడికి ఆర్థిక సహాయం కూడా చేసేవాడు.) ఇలాంటి ఔదార్యం ముందు ఆయనలో ఏదైనా వైజ్ఞానిక ప్రలోభం గాని, అసూయ గాని ఉన్నా పెద్దగా కనిపించవు.

మరి కొందరు ప్రముఖులతో కూడా పరిచయం ఉండేది. వారిని కొన్ని సందర్భాలలో కలుసుకున్నాను. అయితే వారి గురించి అంతగా చెప్పవలసింది ఏమీ లేదు. సర్ జాన్ హెర్షెల్ అంటే నాకు అపారమైన గౌరవం ఉండేది. ఒకసారి కేప్ ఆఫ్ గుడ్ హోప్ లో ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళాను. తరువాత లండన్ లో కూడా ఓ సారి ఆయన ఇంటికి వెళ్లాను. మరి కొన్ని సందర్భాలలో కూడా ఆయన్ని కలుసుకోవడం జరిగింది. పెద్దగా మాట్లాడేవారు కాదు గాని ఆయన మాట్లాడే ప్రతీ మాట ఎంతో అర్థవంతంగా ఉంటుంది.

ఒకసారి సర్ ముర్చిసన్ ఇంటికి ఉదయానే ఫలహారానికి వెళ్లాను. హంబోల్ట్ నన్ను చూడగోరుతున్నాడంటే వెళ్ళాను. హంబోల్ట్ అంతటి వాడు నన్ను చూడాలని అనుకోవడం నాకు గొప్ప మన్ననలా అనిపించింది. కాని తీరా ఆయన్ని కలుసుకున్నాక కొంచెం నిరాశ చెందాననే చెప్పాలి. బహుశ ఆయన గురించి నేను చాలా గొప్పగా ఊహించుకున్నానేమో. మా సంభాషణలో నాకు ప్రత్యేకించి ఏమీ గుర్తు లేదు. ఆయన చాలా హుషారుగా, చాలా సేపు మాట్లాడడం మాత్రం గుర్తుంది.



ఇలా అంటే నాకు మరో విషయం గుర్తొస్తోంది. హెన్స్లే వెడ్జ్ వుడ్ ఇంట్లో ఒకసారి బకుల్ (Buckle) ని కలుసుకున్నాను.

ఇతగాడు విషయసేకరణ కోసం ఓ ప్రత్యేక పద్ధతి కనిపెట్టాడు. తను చదివిన పుస్తకాలనీ కొనుక్కుంటాడు. ఏవైనా ఆసక్తికర మైన విషయలు చదివితే అవన్నీ ఓ విషయసూచిక రూపంలో వేరేగా రాసుకుంటాడు. ఏ పుస్తకంలో ఎక్కడ ఏ విషయం వుందో ఆ విషయసూచిక చెప్తుంది. అతడికి అద్భుతమైన జ్ఞాపక శక్తి వుంది. తను చదివిన విషయాలు ఏ పుస్తకంలో, ఎక్కడ ఉంటాయో అన్నీ గుర్తుంటాయి. ఈ పద్ధతి వల్ల ఎలాంటి అంశం మీదనైనా అద్భుతమైన సంఖ్యలో పరిచయ గ్రంథాలని పేర్కొనగలిగేవాడు. ఆయన రాసిన ‘మానవ నాగరికతా చరిత్ర’ అన్న పుస్తకంలో ఇలాంటి పరిచయ గ్రంథాలు ఎన్నో పేర్కొనబడ్డాయి. ఈ పుస్తకం అత్యంత ఆసక్తికరంగా అనిపించి రెండు సార్లు చదివాను. అయితే ఆ పుస్తకంలో అతడు చేసిన ప్రతిపాదనలకి ఎంత విలువ ఉందో నాకు సందేహమే. బకుల్ మంచి మాటకారి. అతడు చెప్పిందంతా నోరు మెదపకుండా విన్నాను. అయినా అసలు నాకు నోరు విప్పే అవకాశం ఇస్తేగా? ఇంతలో శ్రీమతి ఫారర్ గానం మొదలుపెట్టింది. అది వినాలని నేను అక్కణ్ణుంచి వెళ్లిపోయాను. అప్పుడు బకుల్ పక్కకి తిరిగి ఓ మిత్రుడితో అన్నాట్ట – “డార్విన్ సంభాషణల కన్నా అతడి పుస్తకాలే బావుంటాయ్!”


(ఇంకా వుంది)

ప్రొఫెసర్ మనసు కరిగింది

Posted by V Srinivasa Chakravarthy Thursday, September 13, 2012 0 comments

అధ్యాయం 21


ప్రొఫెసర్ మనసు కరిగింది



మర్నాడు ఉదయానే బయల్దేరాం. వడిగా అడుగులు వేస్తూ వేగంగా ముందుకి సాగాం. రెండు దారులు కలిసే చోటికి చేరుకోవాలంటే మూడు రోజుల నడక అవసరం.

తిరుగు ప్రయాణంలో మేం పడ్డ కష్టాల గురించి ఇక్కడ ప్రస్తావించబోవడం లేదు. తన పొరబాటుకి తననే తిట్టుకుంటూ అసహనంగా, అలజడిగా ఉన్నాడు మామయ్య. ఎప్పట్లాగే మారని ఉదాసీన భావం వచించాడు హన్స్. దారి పొడవునా తిట్టుకుంటూ, శోకాలు పెడుతూ నేను వెనుకగా నడిచాను.

తిరుగు ప్రయాణం మొదలైన మొదటి రోజు చివరి కల్లా మా దగ్గర మిగిలి వున్న నీరు పూర్తిగా అయిపోయింది. ఇక మా వద్ద మిగిలిన ద్రవం ఒక్కటే – అది జిన్. కాని అదేం పాడు ద్రవమో కాని గుటక వేస్తే చాలు గొంతులో అగ్గి రాజేసినట్టు ఉంటుంది! పైగా పైకి వస్తుంటే ఉష్ణోగ్రత పెరిగి ఊపిరి ఆడడం కూడా కష్టమయ్యింది. కాళ్ళలో నిస్సత్తువ ఆవరించింది. ఒకటి రెండు సార్లు నీరసంతో కుప్పకూలిపోయాను. అలా సోలిపోయిన ప్రతీ సారి మామయ్య, మా ఐస్లాండ్ స్నేహితుడు కలిసి ఏవేవో సపర్యలు చేసి నన్ను తిరిగి నా కాళ్ల మీద నిలబెట్టారు. వేసటకి, దప్పికకి మామయ్య కూడా క్రుంగిపోతున్నాడని అనిపించింది.



చివరికి మంగళవారం, జులై 8, నాడు ఇంచుమించి పాకుకుంటూ, డేకుకుంటూ మొదట రెండు దార్లు కలిసిన చోటికి చేరుకున్నాం. జీవం లేని వస్తువులా నేల మీద చతికిలబడ్డాను. సమయం ఉదయం పది గంటలయ్యింది.



మామయ్య, హన్స్ గోడకి ఆనుకుని, చెరో బిస్కట్టు తిని కొంచెమ్ ఓపిక చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. నేనో సారి బిగ్గరగా మూల్గాను.

కాసేపు అయ్యాక మామయ్య నా చేతులు పట్టుకుని లేవనెత్తాడు.

“పాపం పసివాడు,” అన్నాడు నాకేసి జాలిగా చూస్తూ.

ఎప్పుడూ ఎగిరెగిరి పడే మా ప్రొఫెసరు మామయ్య నోట్లోంచి ఇలాంటి మెత్తని, సానుభూతి మాటలు రావడమ్ అరుదు.

వొణుకుతున్న ఆయన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. ఆయన నా కళ్ళలోకి చూశాడు. అప్పుడు గమనించాను. ఆయన కళ్లు చమర్చాయి.

తన భుజానికి వేలాడుతున్న ఫ్లాస్క్ తీయడం చూశాను. దాన్ని తీసి నా నోటికి ఆనించబోతుంటే ఆశ్చర్యపోయాను.

“తాగు ఏక్సెల్!”

నేను వింటున్నది నిజమేనా? మామయ్యకి ఏమైనా మతిస్థిమితం చెడిపోయిందా? ఆయన ఏం చేస్తున్నాడో నాకు ఆ క్షణం అర్థం కాలేదు.

“తాగు” మళ్ళీ అన్నాడు మామయ్య.

ఫ్లాస్క్ పై కెత్తి అడుగున మిగిలిన నాలుగు అమృతపు బిందువులని నోట్లో పోసుకుని గొంతు తడుపుకున్నాను. ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. చేతులు జోడించి మామయ్యకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.

“అవును ఏక్సెల్. నా ఫ్లాస్క్ అడుగున ఓ గుక్కెడు నీరు మిగిలింది. ఎన్నో సార్లు తగుదామన్న కోరికని అణుచుకుని నీకోసమని ఆ నీరు దాచిపెట్టాను.”

“మామయ్యా!” కన్నీరు ఆపుకోలేకపోయాను.

కాస్త గొంతు తడుపుకున్నాక మళ్లీ కొంచెం ఓపిక వచ్చింది. మామయ్యని అర్థించాను,

“ఇప్పుడు ఇక మన వద్ద ఒక్క బొట్టు నీరు కూడా లేదు. పద మామయ్య ఇక తిరిగి వెళ్ళిపోదాం. అది తప్ప మనకి వేరే గత్యంతరం లేదు.”

(ఇంకా వుంది)

చార్లెస్ లయల్ గురించి డార్విన్

Posted by V Srinivasa Chakravarthy Monday, September 10, 2012 0 comments


లండన్ లో ఉండే తొలి రోజుల్లో సమాజంలోకి వెళ్ళడానికి కావలసినంత ఓపిక ఉండేది. ఆ రోజుల్లో ఎంతో మంది వైజ్ఞానిక మహామహులని కలుసుకున్నాను. ఇతర రంగాలలో కూడా ఎంతో ఎత్తుకు వెళ్ళినవారిని కూడా కలుసుకున్నాను. వారి గురించి నా అభిప్రాయాలని మరో సందర్భంలో వివరిస్తాను.



నా వివాహానికి ముందు తరువాత కూడా లయల్ ని ఎక్కువగా కలుసుకునేవాణ్ణి. ఆయనకి గొప్ప మానసిక స్పష్టత ఉంది. ఏ విషయంతోనైనా తలపడేటప్పుడు తొందరపడకుండా, జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సత్యాపనం చేసేటప్పుడు చాలా కచ్చితంగా ఉంటుంది. ఆయన చింతనలో ఎంతో స్వచ్ఛందత కూడా ఉంది. భౌగోళిక శాస్త్రంలో నేను ఏదైనా చిన్న మాట అంటే దాని నిజానిజాలు పూర్తిగా తేల్చేదాకా ఊరుకునే వారు కాదు. అలాంటి విశ్లేషణతో కొన్ని సార్లు ఆ విషయాన్ని నాకు మునుపు అర్థమైనదాని కన్నా మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తారు. నా ప్రతిపాదనకి సవాలక్ష అభ్యంతరాలు లేవదీససేవారు. వాటన్నిటికీ సమాధానాలు చెప్పాక కూడా నా మొదటి ప్రతిపాదన ఇంకా అగమ్యగోచరంగా కనిపించేది. అతడిలో మరో గొప్ప లక్షణం వైజ్ఞానిక రంగంలో తన తోటి నిపుణుల సృజన పట్ల సద్భావన కలిగి ఉండడం.


బీగిల్ యాత్ర నుండి తిరిగి వచ్చాక ఓ సారి ఆయనతో పగడపు దీవుల మీద నా అభిప్రాయాల గురించి చెప్పాను. ఈ అంశంలో నా అభిప్రాయాలకి ఆయన అభిప్రాయాలకి మధ్య చుక్కెదురు అన్న విషయం నాకు తెలుసు. అయినా కూడా నా మాటల మీద ఆయన చూపించిన ఆసక్తి చూసి ఆశ్చర్యం వేసింది, ప్రోత్సాహకరంగా అనిపించింది. వైజ్ఞానిక విషయాలంటే ఆయనకి గాఢమైన అపేక్ష. అంతేకాక మానవజాతి యొక్క ప్రగతి పట్ల లోతైన ఆకాంక్ష ఉండేది. ఆయనది చాలా మృదుల స్వభావం. మతపరమైన భావాలలో ఆయనది చాలా విశాలమైన దృక్పథం. అవతలి వారి భావాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. కాని వ్యక్తిగతంగా మాత్రం ఆయన అస్తికులే. ఆయన ఆలోచనలలో, దృక్పథాలలో ఎంతో నిజాయితీ ఉండేది. అందుకేనేమే మనిషి పూర్వ జీవుల నుండి పరిణామం చేత అవతరించాడు అన్న భావన (Theory of Descent) ని తదనంతరం ఒప్పుకున్నారు. లామార్క్ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగాయి. పైగా ఇవన్నీ ఆయన వయసు పైబడ్డ తరువాత చెయ్యడం ఆశ్చర్యం. ఎన్నో ఏళ్ల క్రితం నేను ఓ సారి పాతకాలపు భౌగోళిక శాస్త్రవేత్తలు కొత్త భావాలని వ్యతిరేకించే విధానం చూసి విసిగిపోయి ఆయనతో ఇలా అన్నానట – “ప్రతీ శాస్త్రవేత్త కచ్చితంగా అరవై ఏళ్లు నిండగానే చచ్చిపోతే ఎంత బావుంటుంది! ఎందుకంటే ఆ తరువాత ఎలాగూ వాళ్లు కొత్త సిద్ధాంతాలని వ్యతిరేకిస్తూనే ఉంటారు.” నేను అలా అన్న సంగతి లయల్ నాకు ఓ సారి గుర్తు చేశారు. కాని (కొత్త భావాలని వ్యతిరేకించే అలవాటు లేని) ఆయన మాత్రం కొంత కాలం బతకితే బావుంటుందనే అనుకునేవారు.



భౌగోళిక శాస్త్రం మరే ఇతర శాస్త్రవేత్త కన్నా లయల్ కి ఎంతో ఋణపడి వుంది. బీగిల్ యాత్ర మీద నేను బయలుదేరబోయే ముందు అపార ప్రతిభాశాలి అయిన హెన్స్లో నన్ను పిలిచి ఓ సలహా ఇచ్చాడు. అప్పుడే అచ్చయిన చార్ల్స్ లయల్ రాసిన ‘భౌగోళిక శాస్త్రంలో మూల సూత్రాలు’ (Principles of Geology) అనే పుస్తకంలో మొదటి భాగం చదవమన్నాడు. కాని ఎందరో ఇతర భౌగోళిక శాస్త్రవేత్తల లాగానే ‘ఉపద్రవాల పరంపర’ (series of cataclysms) సిద్ధాంతాన్ని నమ్మిన హెన్స్లో ఆ పుస్తకంలోని భావాలని నన్ను నమ్మొద్దు అన్నాడు. కాని ప్రస్తుతం ‘భౌగోళిక శాస్త్రంలో మూల సూత్రాలు’ పుస్తకం గురించి అందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో! నేను సందర్శించిన మొట్టమొదటి ప్రదేశం, సెయింట్ జాగో (ఇది కేప్ ద వర్దీ ద్వీపమాలికలో ఓ ద్వీపం) లో నేను చేసిన భౌగోళిక పరిశోధనల నాకు కచ్చితంగా ఓ విషయం మాత్రం తెలిసింది. తక్కిన ఏ ఇతర భౌగోళిక శాస్త్రవేత్త భావాల కన్నా లయల్ సిద్ధాంతాలు ఎంతో ఉన్నతమైనవి అని బలమైన నమ్మకం కలిగింది.



లయల్ రచనల యొక్క ప్రభావం ఫ్రాన్స్ లోను, ఇంగ్లండ్ లోను విజ్ఞానం పురోగమించిన తీరులోని తేడా బట్టి తెలుస్తుంది. (ఫ్రాన్స్ కి చెందిన) ఎలీ ద బోమోంత్ యొక్క భావాలు ఇప్పుడు మూలన పడ్డాయంటే ఆ ఘనత అంతే లయల్ కే చెందుతుంది. ఈ ఎలీ ద బోమోంత్ కొన్ని ‘ఎత్తైన బిలాలు’ (Craters of Elevation) అని, ‘రేఖాకారంలో ఉన్న ఎత్తైన ప్రాంతాలు’ (Lines of Elevation) అని ఏవేవో విపరీతమైన ప్రతిపాదనలు చేశాడు. (ఆ భావాలని ఓ సారి భౌగోళిక సదస్సులో సెడ్జ్ విక్ ఆకాశానికి ఎత్తేయడం కూడా గుర్తుంది.) లయల్ ప్రభావం వల్ల అవన్నీ ఇప్పుడు మట్టిగొట్టుకుపోయాయి.

(ఇంకా వుంది)



















బాలల సాహసగాధా సాహిత్యం

Posted by V Srinivasa Chakravarthy Thursday, September 6, 2012 0 comments




7. బాలల సాహసగాధా సాహిత్యం (Stories of Adventure for Children)

ఊహా (ఫాంటసీ) సాహిత్యంలో కూడా సాహసం పాలు తప్పకుండా ఉన్నా, ఆ రకమైన సాహిత్యానికి సాహసగాధా సాహిత్యానికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా వాస్తవికత. సాహసగాధా సాహిత్యంలో దేవతలు, బ్రహ్మరాక్షసులు ఉండరు. ప్రకృతి సహజమైన ఉపద్రవాలు, క్రూరమృగాలు, దొంగలు మొదలైన సవాళ్లని ఎదుర్కుని చేసే సాహసం కథాంశంగా ఉండే కథలివి. తెలుగులో ఊహాసాహిత్యం బాగానే వున్నా, ఈ రకమైన వాస్తవికతగల సాహసగాధా సాహిత్యం తక్కువ.



సాహసగాధా సాహిత్యానికి సుదీర్ఘ చరిత్రే వుంది. ఒక విధంగా పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన గొప్ప రచనలు కొన్ని ఈ సాహితీ విభాగానికి చెందినవని చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ రచయిత జూల్స్ వెర్న్ రాసిన ‘Journey to the Center of the Earth,’ ‘Around the world in 80 days,’ మొదలైన రచనలు గొప్ప మేధస్సుతో కూడిన సాహసాన్ని ప్రదర్శించిన వ్యక్తుల కథలకి తార్కాణాలు. స్కాటిష్ నవలా రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్ రాసిన ‘Treasure Island’ ఆ కాలానికి చెందిన సాహసగాధే.



బాలసాహిత్యంలో ఈ విభాగంలో కూడా ఎనిడ్ బ్లైటన్ సృజన బాల పాఠకులని ఆకట్టుకుంది. ఆమె రాసిన ‘సాహసగాధా నవలావాహిని’ (adventure series) లో ‘Island of Adventure,’ ‘Castle of Adventure’ మొదలుకుని మొత్తం 8 నవలలు ఉన్నాయి. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు పాపలు, ఓ పెంపుడు చిలుక ముఖ్య పాత్రలుగా ఉన్న ఈ కథలలో ప్రతీ పుస్తకంలోను ఈ పిల్లలు ఓ కొత్త ప్రదేశానికి వెళ్లడం, అక్కడ ఏదో ప్రమాదంలో ఇరుక్కోవడం, గొప్ప సాహసాన్ని ప్రదర్శించి ఆ ప్రమాదం నుండి బయటపడడం ప్రధానాంశంగా ఉంటుంది. ఉదాహరణకి Valley of Adventure అన్న పుస్తకంలో ఈ పిల్లలు తమ పెద్దవాళ్లతో కలిసి ఏదో ఊరికి వెళ్తూ తప్పుడు విమానం ఎక్కి, కొన్ని భయంకర పరిస్థితుల్లో ఓ లోయలో చిక్కుకుపోతారు. నిరంతరం కీచులాడూకుంటూ ఉండే కొందరు కొండ జాతి వారి మధ్యన, పోగొట్టుకుపోయిన ఏదో పెన్నిధి కోసం ప్రాకులాడే ఓ దొంగల ముఠా మధ్యన నలిగిపోతూ పిల్లలు బయటపడి తప్పించుకోవడం ఈ నవలలో కథాంశం.

ఎన్నో ఇతర రకాల బాలసాహిత్యంతో పాటు ఎనిడ్ బ్లైటన్ సాహసగాధా సాహిత్యం కూడా రాయడం జరిగింది గాని, ప్రధానంగా పిల్లల కోసం సాహసగధా సాహిత్యం మాత్రమే రాసిన రచయితలలో ప్రముఖుడు విలార్డ్ ప్రైస్ (Willard Price, 1887 – 1983). కెనడాలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ విలార్డ్ ప్రైస్ National Geographic Society లో సభ్యుడిగా ప్రపంచం అంతా ఎన్నో ప్రాంతాలు పర్యటించాడు. “చదివే అనుభూతి గొప్ప ఉత్సాహంతో, సాహస స్ఫూర్తితో నిండి వుండాలన్న లక్ష్యంతో ఈ ‘సాహసగాధా మాల’ యొక్క రచనకి పూనుకున్నాను” అని 1983 లో చెప్పుకున్నాడు. ‘Amazon Adventure’ తో మొదలుకుని మొత్తం పద్నాలుగు పుస్తకాలు రాశాడు ప్రైస్. “విలార్డ్ ప్రైస్ పుస్తకాలే నా చదువుకి ఓనమాలు చుట్టాయి” అంటాడు సమకాలీన బాలసాహిత్య రచయిత ఆంతొనీ హోరోవిట్జ్.



ఉపసంహారం

ఇంగ్లీష్ లో బాల సాహిత్యంలో మరి కొన్ని వర్గాలు ఉన్నాయి. సమయాభావం వల్ల వాటి గురించి మరింత విపులంగా ఇక్కడ చర్చించబోవడం లేదు. ఉదాహరణకి ‘బాలల చారిత్రక సాహిత్యం.’ చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో చరిత్ర చదువుకుంటాం. అందులో ‘స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చెను?’ ‘షాజహాను ఎప్పుడు చచ్చెను?’ మొదలైన ప్రశ్నలకి సమాధానాలు బట్టీ పట్టే ప్రయత్నంలో పిల్లలు మునిగిపోయి వుంటారు కనుక చదవాల్సిన రీతిలో – ఓ గొప్ప కథలా - చరిత్రని సరదాగా, హాయిగా చదువుకోవడం జరగదు. అందుకే కాబోలు ‘చివరికి మిగిలేది’ లో బుచ్చిబాబు అంటాడు – “మనిషి చరిత్ర నుండి నేర్చుకునేది ఏంటి అంటే మనిషి చరిత్ర నుండి ఏమీ నేర్చుకోడు అన్న విషయం!” చమత్కృతి బావుంది గాని చరిత్ర నుండి నేర్చుకోవాలంటే నన్నడిగితే పరీక్ష అనే తలనొప్పి నేపథ్యంలో లేకుండా హాయిగా ఓ ‘మిస్టరీ థ్రిల్లర్’ చదువుకున్నట్టుగా చారిత్రక కథలని పిల్లలని చదువుకోనివ్వాలి. అంటే ముందు అలాంటి సాహిత్యాన్ని తెలుగులో సృష్టించాలి. చక్కని చారిత్రక సాహిత్యం చదివిన పిల్లలు ఎలా ఎదుగుతారో తెలుసుకోవాలంటే మనకి నెహ్రూ తన కూతురు ఇందిరకి రాసిన ఉత్తరాలే గుర్తొస్తాయి. ఈ ఉత్తరాలే తదనంతరం ‘Glimpses of World History’ అనే భారీ గ్రంథంగా రూపొందాయి. నెహ్రూ, ఇందిర లాంటి మహామహులకి సరిపోయింది గాని మామూలు పిల్లలకి అంత చరిత్ర అవసరమా? అని కొందరు సందేహించవచ్చు. చచ్చేటంత అవసరం అంటాను. చరిత్ర లేకుండా అసలు చదువు పూర్తికాదని అనిపిస్తుంది. మన దేశంలో చరిత్ర అంటే ఎక్కువగా భారతీయ చరిత్రకే, అదీ గత రెండు వేల ఏళ్ల చరిత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకింత సంకుచిత భావం? ప్రపంచ చరిత్ర మొత్తం – అమెరికాలో ‘అలమో పోరాటం’ (Battle of the Alamo) నుండి ఆస్ట్రేలియాలో ఆదిమవాసుల వికాస క్రమం (evolution of Australian aborigines) వరకు – ఏదీ వదల కుండా తెలుగులోకి తెచ్చుకుని, అందరికీ అర్థమయ్యే సుళువైన భాషలో రాసుకుని, అందరికీ లభ్యమయ్యేలా అంతర్జాలంలో పొందుపరుచుకునే ప్రయత్నం చేస్తే ఎంత బావుంటుంది?



బర్మీస్ భాషలో అనువదించబడ్డ Glimpses of World History



బాల సాహిత్యంలో మరో ముఖ్యమైన వర్గం ‘జీవిత కథలు’ లేదా ‘ఆత్మకథలు.’ ఈ వర్గంలో మనకి సాహిత్యం చెప్పుకోదగ్గ మోతాదులోనే ఉన్నా ఆ కథలలో ఎక్కువగా భారతీయుల, లేదా తెలుగువారి జీవితకథలే ఉంటాయి. తరువాత పాశ్చాత్య సమాజాలలో పుస్తకాలు రాసే సంస్కారం బలంగా ఉంటుంది. సినిమా నటులు, దేశ నేతలు, కంపెనీల సీయీవో లు ఇలా నానా రంగాల వాళ్లు తమ జీవిత కథలు రాసుకుంటుంటారు. మన సంస్కృతిలో అధికంగా సాహితీ రంగంలో ఉన్న వారు మాత్రమే పుస్తకాలు రాయడం జరుగుతుంది. కనుక జీవితకథలలో, ముఖ్యంగా ఆత్మకథలలో, వైవిధ్యం తక్కువగా ఉంటుంది. కనుక మనకి ప్రస్తుతం తెలుగులో ఉన్న జీవితకథల/ఆత్మకథల జాబితాకి ప్రపంచ ప్రముఖుల (ఐన్ స్టయిన్, బిల్ గేట్స్, నెల్సన్ మండేలా మొ॥) జీవిత కథలు జోడిస్తే బావుంటుంది.



బాలసాహిత్యంలో ఇక ఆఖరుగా చెప్పుకోదగ్గ వర్గం ఒకటుంది. ఇన్ని రకాలుగా బాల సహిత్యాన్ని పెంచేసి పిల్లల్ని పుస్తకాల పురుగుల్లా మార్చేయడం వాంఛనీయం కాదు. ఆటపాటలతో హాయిగా ఎదగాల్సిన ప్రాయం బాల్యం. (కాని మరి టీవీ ప్రభావమో, బడి చదువుల ఒత్తిడో, ఖాళీ మైదానాలు అందుబాటులో లేకపోవడమో, - కారణాలు ఏవైనా పిల్లలకి హాయిగా ఆడుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి). కనుక ఆటపాటలకి, వృత్తులకి (activities), వైజ్ఞానిక ప్రయోగాలకి, ప్రాజెక్టులకి సంబంధించిన సాహిత్యం ఈ సందర్బంలో ఎంతో ఉపకరిస్తుంది. ఈ రకమైన సాహిత్యం తెలుగులో లేకపోలేదు. ఉదాహరణకి ‘జన విజ్ఞాన వేదిక’, ‘మంచి పుస్తకం’ లాంటి ప్రచురణలలో ఈ రకమైన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.



అయితే ఈ సాహిత్యాన్ని ఇంకా విస్తరింపజేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివిధ దేశాలకి చెందిన ఆటపాటల వివరాలు అంతర్జాలంలో పుష్కలంగా ఉన్నాయి. అసలు ఈ రంగంలో అవగాహన పెంచేందుకు గాని ఓ అంతర్జాతీయ పిల్లల ఆటల సదస్సే వుంది. వీరికి ఓ వార్షిక సమావేశం కూడా ఉంది. 45 వ అంతర్జాతీయ పిల్లల క్రీడా సమావేశం 2011 లో స్కాట్ లాండ్ లో జరిగింది. అందులో 33 దేశాల నుండి 77 నగరాల నుండి అభ్యర్థులు పాల్గొన్నారు.



ఓ ముద్దులొలికే కప్ప బొమ్మ (http://www.allhallowsguild.org/fm/images/AHG-Frog-big.jpg)



ఈ విధంగా అంతర్జాతీయ సాహిత్యాన్ని, అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని తెలుగులోకి తెచ్చుకుంటే, ఆ రకమైన సాహితీ విస్తరణ లోతైన చిత్తవికాసానికి, గాఢమైన చైతన్య వృద్ధికి దొహదం చేస్తుందని నా నమ్మకం. సామాజిక దృక్పథాలలో కూడా ఎంతో మార్పు వస్తుంది. ఈ రోజుల్లో ఎంతో మంది భారతీయులు ఉద్యోగరీత్యా విదేశాలు సందర్శిస్తున్నారు. అక్కడి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసి, అక్కడి పద్ధతులని నేర్చుకుంటున్నారు. అక్కడి వ్యవస్థకి, సౌకర్యాలకి, భారతీయ పరిస్థితుల్లో మనకి అందే సౌకర్యాలకి మధ్య వేర్పాటు చూస్తున్నారు. అక్కడ పిల్లలకి ఎదగడానికి లభ్యమయ్యే సౌకర్యాల వైభవాన్ని తెలుసుకుంటున్నారు. ఆ తేడా కొన్ని సార్లు భరించరానిది గా ఉంటుంది. ఒక సింగపూర్ లోనో, ఒసాకా లోనో ఉండే జీవన సౌకర్యాలకి, ఓ హైదరాబాద్ లోనో, కొల్కతాలోనో ఉండే జీవన సౌకర్యాలకి మధ్య చెప్పరానంత వారడి వుంది. ఆ వారడి వాస్తవంలో, భౌతికంగా భర్తీ కావాలంటే, ముందు మానసికంగా, అవగాహన పరంగా, పరిజ్ఞానం పరంగా భర్తీ కావాలి. అభివృద్ధి చెందిన దేశాలలో విధానాల గురించి, పని తీరు గురించి, తగిన సాహిత్యం ద్వారా ఇక్కడ అవగాహన పెంచాలి. అలాంటి వికాసం చిన్నతనం నుండి జరిగితే ఆ విధానాలని అర్థం చేసుకుని, ఆకళింపు చేసుకుని, మన సంస్కృతితోను, విధానాలతోను వాటిని సమన్వయపరచుకోవడం సులభం అవుతుంది. ఆ విధంగా సువిస్తారమైన, సమున్నతమైన సాహిత్యంతో మనోభూమిక ముందు సంస్కరించబడితే, విస్తరించబడితే, ఆ సంస్కరణ భౌతిక రూపం దాల్చడానికి ఎంతో కాలం పట్టదు. ఉద్దీప్తమైన భావిభారతం సకాలంలో మన చుట్టూ అందంగా వెల్లివిరుస్తుంది.





(సమాప్తం)


5. భయానక సాహిత్యం (Horror literature):

పిల్లల కోసం భయానక సాహిత్యమా? అసలు ఆ ఆలోచనే చాలా మందికి విడ్డూరంగా ఉంటుంది. సున్నితమైన మనసున్న పిల్లలకి చక్కని ‘నీతి’ కతలు చెప్పాలిగాని దెయ్యాల కథలు చెప్పడమా? ఎక్కడో పిడుగు పడితేనే మంచం కిందకి దూరే పిల్లలకి ‘అర్జున, ఫల్గుణ…’ అంటూ భయం పోగొట్టే చిట్కాలు చెప్పకపోగా, రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే భూతప్రేతాల కథలు పనిగట్టుకుని చెప్పడం ఎంతైనా విపరీతంగానే అనిపిస్తుంది. అందుకేనేమో ఒకప్పుడు గొప్ప సంచనలం సృష్టించిన ‘ఎగ్సార్సిస్ట్’ సినిమా ఇప్పటికీ యూ.కె. లో నిషిద్ధంగా ఉంది. కాని ఒకప్పుడు ఇంగ్లీష్ లో బాలసాహిత్యపు చీకటి సరిహద్దులకే పరిమితమైన భయానక సాహిత్యం, ఇప్పుడు ఓ ముఖ్యమైన బాలసాహితీ విభాగం కాగల స్థాయికి ఎదిగింది.

తెలుగులో కూడా భూత ప్రేతాల కథలు, బ్రహ్మ రాక్షసుల కథలు ఉన్నా అందులో భయం పాలు తక్కువ. బేతాళ కథల్లో భీతి కన్నా నీతి పాలు ఎక్కువ. చందమామ కథలలో అప్పుడప్పుడు దెయ్యాల ప్రసక్తి ఉన్నా పిల్లలని భయపెట్టడం మాత్రం ఆ కథల లక్ష్యాలలో ఒకటి కాదు.

ఇంగ్లీష్ లో భయానక సాహిత్యానికి పితామహుడు అని చెప్పుకోదగ్గ వాడు 'స్టెఫెన్ కింగ్'. ఈయన 49 నవళ్ళు, 5 నాన్-ఫిక్షన్ రచనలు, మరి కొన్ని కథా సంకలనాలు రాశాడు. ఈయన పుస్తకాలు 350 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి.

స్టెఫెన్ కింగ్ రచనలు ప్రత్యేకించి పిల్లల కోసం చేసినవి కావు. పిల్లల భయానక సాహిత్యంలో చెప్పుకోదగ్గ ప్రయోగం ‘Goosebumps’ (రోమాంచితం) అనే నవలా ధారావాహిక. దీన్ని రాసింది అమెరికన్ రచయిత ఆర్. ఎల్. స్టయిన్. 1992 లో విడుదల అయిన ‘Welcome to the Dead House’ (చావు కొంపకి స్వాగతం) అన్న పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. 2008 కల్లా ఈ ధారావాహికకి చెందిన పుస్తకాలు 350 మిలియన్ కాపీలు అమ్ముడుపోయి, 35 భాషలలోకి తర్జుమా అయ్యాయి. Goosebumps కథల ఆధారంగా వచ్చిన టీవీ ధారావాహిక కూడా విజయవంతం అయ్యింది.





భయానక సాహిత్యంలో మళ్లీ ఎన్నో ఉపవర్గాలు ఉన్నాయి. రక్తపిశాచులు (vampires), భీకర అసదృశ మృగాలు (beasts/monsters), మామూలు మనుషుల్లా భూమి మీద సంచరించే జీవచ్ఛవాలు (zombies), వినోదం కోసం హత్యలు చేసే విపరీతపు ఖూనీకోర్లు (serial killers), … మొదలైన ‘దుషటచతుషటయం’తో కిటకిటలడే చీకటి లోకం భయానక సాహిత్యం. ఇవి చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారంటే చాలా మందికి మింగుడు పడదు.


మరి కాకపోతే ఊరికే జడుసుకునే పిల్లలని పనిగట్టుకుని భయపెట్టడం ఏంటి? భయానక సాహిత్యం వల్ల ఏదైనా ప్రయోజనం వుందా? అంటే అందుకు సమాధానంగా అవునంటాడు ‘రాబర్ట్ హుడ్’ అనే సాహితీ విమర్శకుడు. ఎనిడ్ బ్లయిటన్ కథలలో లాగా జీవితం ఎప్పుడూ ఓ తీపి కలలాగా ఉండదు. అనిశ్చయిత్వం, అభద్రత అనుక్షణం పొంచి వుంటాయి. అవాంతరాలు ఎదురైనప్పుడు ఎంతటివాడికైనా భయం కలగడం సహజం. పిల్లలలో అది మరీ సహజం. ఆ భయాన్ని ఊరికే అణిచిపెట్టకుండా, దాన్ని ఈ భయానక సాహిత్యం సహాయంతోనో, భయానక సినిమాల సహాయంతోనో బయటికి తెప్పించి, అది ఉత్తిత్తి ప్రమాదమేనని, భయపడాల్సిన పనిలేదని తెలియజెప్పినప్పుడు, ఆ భయం కాస్తా కాస్తంత ధైర్యంగా పరివర్తన చెందుతుంది. భయంలో ఉన్న ఆనందం ఏంటో అప్పుడు అనుభవం అవుతుంది. అడ్రినలిన్ గోదారి వరదలా పరవళ్లు తొక్కినప్పుడు, గుండె డప్పుల చప్పుడుకి ఛాతీ ఎగసెగసి పడుతున్నప్పుడు, సింపథెటిక్ నాడీమండలం శివాలెత్తిపోతున్నప్పుడు కలిగే ఆ ఉద్రిక్తత, ఉద్వేగం ఎలా ఉంటుందో … మరి ఆ భయానక సాహితీపిపాసులకే తెలియాలి.



(ఇక సినిమా రంగానికి వస్తే, మన దేశంలో ఎప్పుడో అడపాదపా తప్ప, డిపాజిట్లు పోతాయని తెలిసినా, ఓ యజ్ఞంలా హారర్ సినిమాలు తీసే ఏకాంత వీరులు, ఎవరో రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళు తప్ప, బహు అరుదు. ఇక నేడు తెలుగు సినిమాలలో మూడే రుచులు కనిపిస్తాయి – ‘క్యా(?)మెడీ’, ‘వయొలెన్స్’, ‘రొమాన్స్’. మూడిటికి కొన్నిసార్లు తేడా కనిపించక ఇబ్బంది అవుతుంటుంది. అది వేరే సంగతి!)





6. బాలల అపరాధపరిశోధనా సాహిత్యం (Crime and Murder mystery literature for children)

బాగా చిన్నతనంలో చిట్టిపొట్టి జంతువులతో ఆడుకుంటూ, వెండి రెక్కల దేవతలతో సావాసం చేస్తూ ఏవో కలల లోకాలలో తేలాడిన పిల్లలు, కాస్త పెద్దయ్యాక వాస్తవ ప్రపంచంతో తలపడడానికి సిద్ధం అవుతుంటారు. తాము అంతవరకు చూసిన సాహితీ ప్రపంచంలో లాగా కాక నిజ జీవితం అనుక్షణం ఓ పోరాటంలా కనిపిస్తుంది. చుట్టూ కనిపించే కర్కశత్వాన్ని, కుటిలత్వాన్ని, కపటత్వాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి పరిహరించి, దాని స్థానే సత్యాన్ని, సౌందర్యాన్ని ప్రతిష్టించాలి. మన కన్నా బలవత్తరమైన దౌర్జన్యాన్ని ఎదుర్కోవాలంటే తెలివితేటలు కావాలి. పిల్లలలో అలాంటి తెలివితేటలని పోషించే సాహిత్యం అపరాధపరిశోధనా సాహిత్యం.

అపరాధపరిశోధన అనగానే మనసులో మొదట స్ఫురించే పేరు షెర్లాక్ హోమ్స్ (Sherlock Holmes). ‘ఓస్ ఇంతేనా వాట్సన్’ అంటూ ఎంత జటిలమైన నేరపరిశోధనని అయినా గొప్ప తర్కాన్ని, విజ్ఞానాన్ని, లోదృష్టిని ఉపయోగించి సునాయాసంగా పరిహరించే షెర్లాక్ అపరాధపరిశోధనా లోకానికే ఆరాధ్యుడు. షెర్లాక్ హోమ్స్ సాహిత్యం పిల్లలు – కౌమార దశలో ఉండే కాస్త పెద్ద పిల్లలు - కూడా చదివి ఆనందించదగ్గదే గాని ప్రత్యేకించి పిల్లల కోసం రాసింది కాదు.



ఇంగ్లీష్ లో ప్రత్యేకంగా పిల్లల కోసం రాసిన అపరాధపరిశోధనా సాహిత్యంలో అగ్రస్థానంలో ఉన్నది ఫ్రాంక్లిన్ డిక్సన్ రాసిన ‘హార్డీ బాయిస్’ (Hardy Boys) ధారావాహిక అని చెప్పుకోవచ్చు. 1927 లో మొదలైన ఈ నవలా మాలికలో, హైస్కూల్ లో చదువుకునే హార్డీ సోదరులు తమ తీరిక వేళల్లో అపరాధపరిశోధనా వ్యవహారాల్లో మునిగి తేలుతుంటారు. అపరాధపరిశోధన చాతనయ్యింది అబ్బాయిలకేనా అని సవాలు చేస్తూ, ఓ అమ్మాయి ముఖ్య పాత్రగా గల ‘నాన్సీ డ్రూ’ (Nancy Drew) నవలావాహిని పుట్టింది. దీన్ని రాసింది కారొలిన్ కీన్. 1930 లో మొదలైన నాన్సీ డ్రూ నవలవాహినికి చెందిన నవళ్లు 80 మిలియన్ కాపీలు అమ్ముడు పోయి, 12 భాషల్లోకి అనువదించబడ్డాయి.







హార్డీ బాయిస్, నాన్సీ డ్రూ నవలలు కూడా 9-12 ఏళ్ల పిల్లలకి సరిపోతాయి. ఇంకా చిన్న పిల్లలకి కూడా సముచితంగా ఉండే అపరాధపరిశోధనా సాహిత్యం ఉంది. అలాంటి సాహిత్యంలో ప్రఖ్యాత ఆంగ్ల బాల సాహిత్య రచయిత్రి ఎనిడ్ బ్లయిటన్ (Enid Blyton, 1897 –1968) రాసిన నవలలు పేర్కొనవచ్చు. సుమారు 800 నవలల దాకా రాసిన ఈ మహా రచయిత్రి నవలలు 90 భాషల్లోకి అనువదించబడ్డాయి. బ్లైటన్ రచనలు మొత్తం 600 మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. ఈమె నవళ్లలో ‘Famous Five,’ ‘Secret Seven,’ ‘Five Find-outers’ మొదలైన ధారావాహిక నవలలు అపరాధ పరిశోధనలో పాల్గొనే చిన్నపిల్లల కథలే అంశంగా కలిగి ఉంటాయి.



ఈ వర్గపు సాహిత్యంలో ఇటీవలి కాలానికి చెందిన మరో ఉదాహరణ ‘అలెక్స్ రైడర్’ (Alex Rider). బ్రిటిష్ రచయిత ఆంతొనీ హోరోవిట్జ్ (Anthony Horowitz) రాసిన ఈ నవలావాహినిలో అలెక్స్ రైడర్ అనే 14-15 ఏళ్ల పిల్లవాడు ఓ రహస్యగూఢచారిగా పని చేస్తాడు. ఈ వాహినిలో Stormbreaker అనే పుస్తకం 2000 లో విడుదలై, 2006 లో చలనచిత్రంగా వచ్చింది.

(ఇంకా వుంది)




ఇటీవలే మా సంస్థలో NSS కార్యక్రమాలలో భాగంగా కొందరు విద్యార్థులు అరవింద్ గుప్తా సంస్థ రూపొందించిన

సైన్స్ ప్రయోగాల వీడియోలని తెలుగులో డబ్ చేశారు. ఆ వీడియోలు ఈ లింక్ వద్ద ఉన్నాయి.



(Telugu టాబ్ కింద చూడండి.)

http://arvindguptatoys.com/films.html





అంతేకాక ఇటీవల విడుదల అయిన "సౌరశక్తి" కథ పీడీఎఫ్ ఇక్కడ ఉంది -

http://arvindguptatoys.com/arvindgupta/story-solar-telugu.pdf

3. సైన్స్ సాహిత్యం


ఇంగ్లీష్ లో పిల్లల సైన్స్ సాహిత్య సముద్రమే వుంది. వాటి గురించి గణాంక సమాచారం కన్నా కొన్ని మచ్చుతుకలు గమనిస్తే మేలేమో.


1857 లో, మన దేశంలో సిపాయ్ తిరుగుబాటు జరుగుతున్న కాలంలో, ఇంగ్లండ్ లో మైకేల్ ఫారడే రాయల్ సొసయిటీ లో కొంత మంది పిల్లలని పోగేసుకుని రసాయన శాస్త్రం గురించి సరదా కథలు చెప్తూ కొన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆ కథలే A chemical history of a candle అన్న పేరుతో ఓ చిరస్మరణీయమైన పుస్తకంగా వెలువడ్డాయి.



రష్యాకి చెందిన మీర్ ప్రచురణల పుస్తకాలు మనకి విరివిగా, చవకగా, - ముఖ్యంగా తెలుగు అనువాదాలు - దొరికే రోజుల్లో తెలుగులో సైన్స్ సాహిత్యం మంచి ఊపందుకుంది. ఒక తరంలో యాకొవ్ పెరెల్ మాన్ లాంటి రచయితల పేర్లు తెలియని తెలుగు పిల్లలు ఉండరన్నట్టు ఉండేది. పెరెల్ మాన్ రాసిన కళాఖండం ‘Physics for Entertainment’ ఇంటింటా వెలసింది. నాకు తెలిసి ఆ పుస్తకం రెండు సార్లు ‘నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం’గా తెలుగులోకి అనువదించబడింది. మీర్ ప్రచురణలు ఒక మొత్తం తరాన్ని ప్రభావితం చేసి సైన్స్ వృత్తుల దిశగా తెలుగు యువతని మరల్చాయి అనుకోవచ్చు. ప్రస్తుత కాలంలో అవి లేని వెలితి స్పష్టంగా తెలుస్తోంది.



బ్రిటిష్ రచయిత లువిస్ కేరొల్ రాసిన ‘ఏలిస్ ఇన్ వండర్లాండ్’ ఒక విధంగా ఫాంటసీ వర్గానికి చెందినదే అయినా అందులో ఎంతో గణితం గుంభనంగా దాగి వుందని పండితులు వ్యాఖ్యానించారు. పైకి పిట్టకథలా కనిపించినా ఎంతో లోతుగల ఈ కథ అందుకే నేమో నూరేళ్లకి పైగా జీవించింది. అలాగే కణ భౌతిక శాస్త్రవేత్త జార్జ్ గామోవ్ రాసిన ‘Mr. Tompkins in wonderland’ సాపేక్షతావాదం, క్వాంటం సిద్ధాంతాల మూల భావాలని ఎంతో మనోరంజకంగా, నవ్వుపుట్టించే రీతిలో బాలపాఠకుల ముందు ఉంచింది.



ఇక వర్తమాన కాలంలో ఇంగ్లీష్ లో లెక్కలేనన్ని బాలాహితీ ప్రచురణ సంస్థలు వెలశాయి. సైన్స్ చదువు యొక్క ప్రధాన్యత నానాటికి పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ ప్రచురణ సంస్థలు సైన్స్ సాహిత్యానికి పెద్ద పీట వేస్తున్నాయి. అంతరిక్షం నుండి ఆటం బాంబు దాక, పర్యావరణం నుండి పురావస్తు పరిశోధన దాక, పిల్లలకి అక్కర్లేని రంగమే ఉండకూడదు అన్నట్టు ఈ ప్రచురణ సంస్థలు విస్తృతమైన వైవిధ్యం గల బాల సైన్స్ సాహిత్యాన్ని సృష్టిస్తున్నాయి.

ఇంత అందమైన వైజ్ఞానిక సాహితీ వైభవానికి మన భాష ఎప్పుడు నోచుకుంటుందో తెలియదు.



తెలుగులో పిల్లలకి సంబంధించిన సైన్స్ పుస్తకాలు ఉన్నాయా అంటే ఉన్నాయిగాని ఓ ప్రత్యేక సాహితీ విభాగం అని చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. తెలుగులో సైన్స్ సాహిత్యాన్ని పోషించిన రచయితలని చేతి వేళ్ల మీద లెక్కించొచ్చునేమో. వెనుకటి తరంలో ఈ రంగంలో పని చేసిన వాళ్లలో ఇద్దరి పేర్లు ప్రధానంగా చెప్పుకోవచ్చు- నండూరి రామమోహన్ రావు, మహీధర నళినీమోహన్. అర్థం పర్థం లేని సైన్స్ విషయాలని పాఠకుడి నెత్తిన వద్దన్నా రుద్దకుండా, గొప్ప సాహితీ ప్రకర్ష జోడించి, చక్కని చమత్కృతిని కనబరుస్తూ, సమయోచితమైన హాస్యాన్ని చొప్పిస్తూ, కథలు/నవళ్లు/కవితలు తప్ప ప్రాణం పోయినా సరే సైన్స్ విషయాల జోలికి పోనని ఒట్టేసుకున్న సగటు తెలుగు పాఠకుడి చేత ఇష్టంగా సైన్స్ పుస్తకలు చదివింప జేశారు ఈ ఇద్దరూ. ఇక ఇటీవలి కాలంలో ఈ రంగంలో కృషి చేస్తున్న వాళ్ళు – వేమూరి వెంకటేశ్వర రావు, కొడవటి గంటి రోహిణీప్రసాద్, కె.బి. గోపాలం, నాగనూరి వేణుగోపాల్ మొదలైనవారు. తెలుగులో సైన్స్ సాహితీ రంగంలో వచ్చిన మరో సత్పరిమాణం ‘డిస్కవరీ’ అనే ఓ సైన్స్ పత్రిక. ప్రతిభావంతమైన సైన్స్ వ్యాసాలతో, అందమైన బొమ్మలతో ఈ పత్రిక సైన్స్ రంగంలో ఎంతో సేవ చేస్తోంది.



కాని ఈ ఇంటర్నెట్ యుగంలో, విశ్వజనీనమైన సైన్స్ సాహిత్యం కట్టలు తెంచుకుని విస్తరిస్తున్న ఈ దశలో, ఈ రంగంలో మరింతమంది వైజ్ఞానిక రంగంలో ప్రవేశం ఉన్న వ్యక్తులు ప్రవేశిస్తే బావుంటుంది.



4. బాలల కాల్పనిక విజ్ఞాన సాహిత్యం (Children’s science fiction): సైన్స్ ఫిక్షన్ అనగనే ఆ రంగపు త్రిమూర్తులు ఐసాక్ అసిమోవ్, ఆర్థర్ క్లార్క్, రాబర్ట్ హైన్ లైన్ లు గుర్తొస్తారు. కాని వీరి రచనలు చాలా మటుకు ప్రత్యేకించి పిల్లల కోసం రాసినవి కావు. అయితే వీరి రచనల నుండి స్ఫూర్తి తీసుకుని పిల్లల కోసం సై.ఫై. రంగంలో సృజన జరిగిన సందర్భాలు ఉన్నాయి.

ఉదాహరణకి అసిమోవ్ రాసిన ‘ఫౌండేషన్’ దారావాహికే స్టార్ వార్స్ చిత్ర మాలికకి స్ఫూర్తి అని చెప్పుకుంటారు. ఫౌండేషన్ నవళ్ళలో భూమి మీద ఆవిర్భవించిన మానవ జాతి క్రమంగా గ్రహాంతర, తారాంతర యానాన్ని నేర్చుకుని ఇరుగుపొరుగు తారామండలాలని ఆక్రమించి, క్రమంగా మొత్తం పాలపుంత గెలాక్సీ అంతా విస్తరించిన సామ్రాజ్యాలని స్థాపించడం నేపథ్యంగా కథ సాగుతుంది. ఆ కథలలో కిరాతకులైన సామ్రాజ్యవాదులకి, సామ్రాజ్యపు ఉక్కుపిడికిలి నుండి విముక్తి పొందజూస్తున్న విప్లవకారులకి మధ్య సంఘర్షణ ముఖ్యాంశంగా ఉంటుంది. స్టార్ వార్స్ చిత్ర మాలిక చూరగొన్న ఆదరణ నుండి స్ఫూర్తి పొందిన కొందరు సై.ఫై. రచయితలు ‘జెడై (Jedi) సాహిత్యం’ పేరిట విస్తృతంగా స్టార్ వార్స్ ఫక్కీలో సై.ఫై. రచన చేశారు.



సై.ఫై రంగంలో ఎన్నో కథలకి నేపథ్యం అంతరిక్షమే అయినా, ఇతర భూమికల మీద కట్టిన కథలు కూడా కొన్ని చాలా రక్తి కట్టాయి. 1966 లో ఓటో క్లెమెంట్, జెరోమి బిక్స్ బై లు రాసిన ‘Fantastic Voyage’ (ఓ అద్భుత యాత్ర) అన్న కథ అదే పేరుతో సినిమా రూపంలో వచ్చింది. (ఆ కథని పూర్తి నవలగా విస్తరించమని ఐసాక్ అసిమోవ్ ని అడిగారు. ఆ నవల సినిమా కన్నా ముందే విడుదల కావడంతో ఆ కథకి మూల రచయిత అసిమోవ్ అని పొరబడతారు.) ఈ కథలో అమెరికా, సోవియెట్ దేశాలు వస్తువులని విపరీతంగా కుంచించే (miniaturise) సాంకేతిక నైపుణ్యాన్ని వేరు వేరుగా రూపొందించుకుంటాయి. అలాంటి పరిజ్ఞానంలో ఆరితేరిన ఓ రష్యన్ శాస్త్రవేత్త అమెరికాకి పారిపోయే ప్రయత్నంలో హత్యాప్రయత్యం జరిగి మెదడులో రక్తం గడ్డకట్టడం (blood clot) వల్ల కోమా లోకి పోతాడు. అతడి మెదడు లోంచి ఆ రక్తపుగడ్డని తొలగించడానికి సంక్షిప్తీకరించబడ్డ ఓ న్యూక్లియర్ సబ్ మెరిన్ ని (కొంత మంది సిబ్బంది తో పాటు) రష్యన్ శాస్త్రవేత్త రక్త మండలంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అయితే ఆ సంక్షిప్త స్థితి ఓ గంట కాలం మాత్రమే ఉంటుంది. ఆ గంటలో ఆ సబ్మెరిన్ శాస్త్రవేత్త రక్తమండలం అంతా గాలించి రక్తపు గడ్డని కనుక్కుని బాంబులతో ఛిద్రం చెయ్యాలి. ఇదీ కథనం. ఇదే తరహా కథ ఒకటి ఇటీవలి కాలంలో ‘innerspace’ అన్న పేరుతో సినిమా రూపంలో వచ్చింది.





ఇంగ్లీష్ లో బాలల సై.ఫై. సాహిత్యం యొక్క విస్తృతి అవగాహన కావడానికి ఈ లింక్ చూడండి -

http://www.goodreads.com/list/show/2450.Best_Children_s_Science_Fiction_Books



బాలల సైఫై సాహిత్యంలో కథ కాస్త ఉపప్రధానంగా ఉంటూ, విజ్ఞానం ముఖ్యాంశంగా ఉండేలా రాయబడ్డ సాహిత్యం కూడా ఉంది. అలాంటి పుస్తకాలలో మచ్చుకి రెండు -

ఇటీవలి కాలంలో వెలువడ్డ ఓ చక్కని బాలల కాల్పనిక విజ్ఞాన రచన ‘George’s Cosmic Treasure Hunt.’ దీన్ని రాసిన వారు లూసీ మరియు స్టెఫెన్ హాకింగ్ లు (Lucy and Stephen Hawking). సైద్ధాంతిక భౌతిక శాస్త్ర రంగంలో ఐన్స్టయిన్ తరువాత అంత సత్తా ఉన్నవాడు స్టెఫెన్ హాకింగ్ అని చెప్పుకుంటారు. ఆయన కుమార్తె లూసీ తన తండ్రితో కలిసి రాసిన నవల ఇది. ఈ కథలో జార్జ్ అనే పిల్లాడు తన నేస్తం ఆనీ తో పాటు, కాస్మాస్ అనే కంప్యూటర్ దారి చూపిస్తుంటే మొత్తం పాలపుంత గెలాక్సీ అంతా చుట్టి వస్తాడు. ఈ పుస్తకం రాయడానికి ముందు లూసీ హాకింగ్, క్రిస్ గాల్ఫర్డ్ అనే రచయితతో కలిసి, ‘George’s secret key’ అని మరో పుస్తకం రాసింది. ఈ పుస్తకం 38 భాషల్లోకి తర్జుమా అయ్యి 43 దేశాల్లో ప్రచురించబడింది.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts