శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
“అదో పెద్ద పార్పాయిస్ చేపలా వుంది,” అరిచాన్నేను.

“అవును,” ఒప్పుకుంటూ అన్నాడు మావయ్య. “అదుగో అక్కడో పెద్ద సముద్రపు బల్లి కనిపిస్తోంది.”

“మరి కాస్త దూరంలో ఓ రాకాసి మొసలి. బాబోయ్, దాని దవడలు చూడు, పలువరుస చూడు. మళ్లీ నీట్లో మునిగిపోతోంది.”

“అదుగో తిమింగలం, తిమింగలం” అరిచాడు మామయ్య. దాని రెక్కలు చూడు ఎంతేసి వున్నాయో! దాని మూపు మీద కన్నాల లోంచి గాలి, నీరు ఎలా ఎగజిమ్ముతోందో చూడు.”

నిజమే. దాని మూపు లోంచి పైకి తన్నుకొస్తున్న రెండు నీటి ధారలు సముద్రం మీద అంతెత్తుకు లేచి కింద పడుతున్నాయి. దండులు దండులుగా కదులుతున్న ఆ రాకాసి సముద్ర చరాలని సంభ్రమంగా చూస్తూ ఉండిపోయాం. వాటి పరిమాణం చూడబోతే అలౌకికంగా వుంది. వాటిలో అతి చిన్న జీవం కూడా మా తెప్పని అప్పడంలా నమిలేయగలదేమో.

ఇలాంటి ప్రమాదకరమైన పరిసరాల నుండి తప్పించుకుని మరో పక్కకి పోవాలని హన్స్ ఆత్రుత పడుతున్నాడు. కాని ఆ పక్క కూడా పరిస్థితులు అంత సుముఖంగా ఏమీ లేవు. నలభై అడుగులు పొడవున్న ఓ తాబేలు కనిపించింది అటుపక్క. ముప్పై అడుగుల పొడవున్న ఓ పాము కెరటాల మీదుగా తల అంత ఎత్తున ఎత్తి కసిగా మాకేసి చూస్తోంది.

ఇక వీటితో యుద్ధం చేసే ప్రసక్తే లేదు. ఈ సముద్ర చరాలు మా తెప్పని సమీపించి వేగంగా దాని చుట్టూ ప్రదక్షిణలు చెయ్యసాగాయి. అలా ప్రదక్షిణ చేస్తూ అంతకంతకు దగ్గర కాసాగాయి. నేను రైఫిల్ పైకి తీశాను. కాని వాటి కరకు పొలుసుల కఠిన కవచాల ముందు ఈ ఉక్కు బంతి ఏం నిలుస్తుంది?

మేం బిత్తర పోయి చూస్తూ ఉండిపోయాం. తెప్పకి ఒక పక్క మొసలి, మరో పక్క పాము. ఇక మిగతా సముద్ర చరాలు ఎక్కడో మాయమైపోయాయి. రైఫిల్ కాల్చడానికి సిద్ధపడ్డాను. హన్స్ వద్దన్నట్తు వారించాడు. మా తెప్పకి సుమారు నూట యాభై గజాల దూరంలో వున్న ఆ రెండు రాకాసులు ఒకదాని మీద ఒకటి పడి భయంకరంగా పోరుకి దిగాయి.

మాకు మూడొందల గజాల దూరంలో యుద్దం కొనసాగుతోంది. ఘర్షణ పడుతున్న రెండు మహాకాయాల వల్ల సముద్రంలో సంక్షోభం రేగుతోంది. కాస్త శ్రద్ధగా చూస్తే ఈ దొమ్మీలో మిగతా జంతువులు కూడా పాల్గొంటున్నట్టు కనిపిస్తోంది. పార్పాయిస్ చేప, తిమింగలం, సముద్రపు బల్లి, తాబేలు - ఇవి కూడా వాటి వంతు అవి చేస్తున్నాయి. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క జంతువు మెరుపులా కనిపించి మాయం అవుతోంది. అదే మా ఐస్లాండ్ వాసుడికి చూపించాను. కాదంటూ తల అడ్డుగా ఊపాడు హన్స్.

“ట్వా” అన్నాడు.

“రెండు అంటాడేంటి? అంటే అక్కడ రెండే జంతువులు ఉన్నాయని అంటున్నాడా?” అడిగాను.

“అవును. అతడు చెప్పింది నిజమే,” అన్నాడు మావయ్య తన కళ్ళద్దాలు సరి చేసుకుంటూ.

“లేదు, మీరు ఇద్దరూ పొరబడుతున్నారు,” నమ్మలేకుండా అన్నాను.

“లేదు. ఆ రాకాసులలో మొదటి దానికి పార్పాయిస్ చేప ముక్కు లాంటి ముక్కు వుంది, సముద్రపు బల్లి కవచం వంటి కవచం వుంది. మొసలి పళ్ల లాంటి పళ్లున్నాయి. అందుకే ఇందాక మనం పొరబడ్డాం. దీన్నిఇక్తియోథారస్ (అంటే చేప బల్లి) అంటారు. సముద్రపు లోతుల్లో జీవించే ఆదిమ రాకాసులలో కెల్లా ఇది అత్యంత ప్రమాదకరం.”

“మరి రెండవదో?”

రెండవది ప్లెసియోసారస్ (ఇంచుమించు బల్లి). ఇదొక సర్పం. దీనికి తాబేటి పెంకు లాంటి కవచం వుంటుంది. తెడ్ల లాంటి తాబేటి కాళ్లు కూడా ఉంటాయి దీనికి. ఈ రెండూ బద్ధ శత్రువులు.”

హన్స్ సరిగ్గా చెప్పాడు. ఇంత సంక్షోభానికి కారణం ఈ రెండు రాకాసులే. కాని అంత అలజడి లోను ఆదిమ యుగాల నాటి ఈ రాకాసులని చూసి అబ్బురపడకుండా ఉండలేకపోయాను. ఇక్తియోసారస్ కళ్లు నిప్పు కణికల్లా మెరుస్తూ కనిపించాయి. దీని కళ్లు నిజంగా చాలా ప్రత్యేకమైన వస్తువులు. సముద్రపు లోతుల్లో ఉండే అపారమైన ఒత్తిడికి కూడా ఇవి తట్టుకోగలవు. మన ప్రస్తుత కాలానికి చెందిన సారియన్ తిమింగలం లా వుంటుందని దీన్ని అలా కూడా పిలుస్తారు. దీని పొడవు నూరు అడుగులు తక్కువ ఉండదు. దాని తోకతో నీటిని చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతుంటే దాని పొడవు ఎంతుందో అంచనా వెయ్యొచ్చు. దాని దవడలు చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ప్రకృతి శాస్త్రవేత్తల ప్రకారం ఆ దవడల్లో ఒకటి, రెండు కాదు మొత్తం నూట ఎనభై రెండు పళ్లు ఉంటాయని సమాచారం.

ఇక్ ప్లెసియోసారస్ సర్ప జాతికి చెందిన జీవం. శరీరం స్తంభంలా వుంటుంది. చిన్న తోక వుంటుంది. తెడ్ల లాంటి నాలుగు చిన్న కాళ్లు ఉంటాయి. దాని ఒళ్ళంతా పొలుసులతో చేసిన కవచం లాంటిది ఉంటుంది. మెడ మాత్రం హంస మెడలా సన్నగా సులభంగా మెలికలు తిరిగేలా ఉంటుంది. దాని తల అలల మీద ముప్పై అడుగుల ఎత్తుకు కూడా ఎత్తగలదు.

రెండు రాకాసులు భీభత్సంగా కొట్లాడుకుంటున్నాయి. వాటి చుట్టూ చిన్న పాటి నీటి పర్వతాల లాంటివి ఏర్పడి కదిలిపోతున్నాయి. అలా పుట్టిన అలల తాకిడికి మా తెప్ప తబ్బిబ్బు అవుతోంది. ఇంచుమించు ఇరవై సార్లు పడవ మునిగినంత పనయ్యింది. భయంకరంగా బుస కొడుతున్నాయి. ఏ శరీరం ఎవరిదో తెలీనంతగా రెండు శరీరాలు పెనవేసుకుపోయాయి. ఆ దృశ్యం చూస్తుంటే భయం ఆగడం లేదు.

అలా గంట, రెండు గంటలు గడిచాయి. తీవ్రత తగ్గకుండా పోరు సాగుతోంది. ఆ గొడవలో కాసేపు మా తెప్ప దగ్గరిగాను, మరి కాసేపు దూరంగానూ జరుగుతున్నాయి ఆ భీకర జీవాలు. మేం మాత్రం కదలకుండా ఉండిపోయాం. అవసరమైతే తూటా పేల్చడానికి సిద్ధంగా వున్నాం. ఉన్నట్లుండి రెండు రాకాసులు నీట్లోకి బుడుంగున మునిగిపోయాయి. అవి మునిగిన చోట ఓ పెద్ద సుడిగుండం ఏర్పడింది. నీట్లో కూడా వాటి పోరు ఆగినట్టు లేదు. అందుకు నిదర్శనంగా పైన నీరు సంక్షోభంగా కదులుతూనే వుంది. అలా కొన్ని నిముషాల పాటు నీట్లోనే పోరు కొనసాగింది.

తటాలున నీట్లోంచి ఓ పెద్ద తల పైకి లేచింది. అది ప్లెసియోసారస్ తల. దాని శరీరం బాగా గాయపడినట్టు కనిపిస్తోంది. దాని పొలుసుల కవచం ఇప్పుడు లేదు. దాని పొడవాటి మెడ పైకి లేస్తోంది, మళ్లీ వాలిపోతోంది, బాధగా మెలికలు తిరుగుతోంది, కొరడా ఝుళిపించినట్టు నీటి మీద బలంగా మోదుతోంది. అల్లంత దూరం వరకు నీటి తుంపర ఎగసి పడుతోంది. ఆ తుంపరకి అసలు మాకు ఏం జరుగుతోందో కనిపించడం లేదు. కాని క్రమేపీ దాని చలనాలు నెమ్మదించాయి. దాని పొడవాటి సర్పాకృతి నీటి మీద నిశ్చేష్టంగా ఓ దుంగలా తేలుతూ కనిపించింది.

ఇక ఇక్తియోసారస్ ఏమయ్యిందో తెలియలేదు. సముద్రపు లోతుల్లో ఏ నీటి గుహలోనో తల దాచుకుందా? లేక ఏ క్షణాన అయినా మళ్ళీ పైకి తన్నుకు రావడానికి ఆయత్తం అవుతోందా? (ముప్పై మూడవ అధ్యాయం సమాప్తం)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts