శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.



“ఆ విధంగా సరైన విధానాన్ని అనుసరించి మెదడుని సిద్ధం చేస్తే ముందుగా డ్యురా మేటర్ కనిపిస్తుంది… మధ్యరేఖకి రెండు వైపులా నిలువుగా పరిచ్ఛేదాలు చేసి వెంట్రికిల్స్ (ventricles) వరకు పోవాలి…  అప్పుడు ఎడమ వెంట్రికిల్ ని కుడి వెంట్రికిల్ తో వేరు చేసే పొర (septum)  ని పరీక్షించే ప్రయత్నం చెయ్యాలి… ఆ విధంగా ఇంతవరకు చర్చించిన మెదడు విభాగాలన్నిటికి బట్టబయలు చేశాక ముందరివైపున (anterior) వున్న రెండు వెంట్రికిల్స్ మధ్యన వున్న మూడో వెంట్రికిల్ కనిపిస్తుంది. దాని అడుగున నాలుగో వెంట్రికిల్ కూడా కనిపిస్తుంది…”

ఈ విధంగా శరీరనిర్మాణ శాస్త్రంలో కూలంకషంగా అధ్యయనాలు చేశాడు కనుకనే అతడికి “శరీరనిర్మాణ శాస్త్రానికి మళ్లీ ఊపిరి పోసిన వాడు” అన్న పేరు దక్కింది. తన అధ్యయనాల సహాయంతో గాలెన్ మెదడు గురించి ఎంతో తెలుసుకున్నాడు. పైన ఇవ్వబడ్డ అంశం ప్రకారం గాలెన్ కి వెంట్రికిల్స్ గురించి, డ్యురా మరియు పయా మేటర్ గురించి, మెదడు యొక్క రెండు అర్థగోళాల గురించి తెలుసని అర్థమవుతోంది. గుండె, ఊపిరితిత్తులు మొదలైన అంతరంగ అవయవాలని శాసించే స్వయంచాలక నాడులు (autonomous nerves)  గురించి అతడికి తెలుసని అర్థమవుతోంది. అలాగే స్వర పేటికని ప్రేరించి శబ్దాన్ని పుట్టించే నాడుల గురించి కూడా అతడికి తెలుసు. (ఈ నాడులని తెంచినప్పుడు మొరిగే కుక్కలలో గాని, మెమ్మే అనే మేకలలో గాని వెంటనే నోరు పడిపోవడం ప్రదర్శించాడు గాలెన్.)

ఆ విధంగా మెదడు యొక్క నిర్మాణం గురించి ఎంతో తెలుసుకున్నా,  మెదడు యొక్క క్రియల గురించి మాత్రం అతడు పప్పులో కాలేశాడనే చెప్పాలి. మెదడుయొక్క నిర్మాణాన్ని సూక్ష్మస్థాయిలో అధ్యయం చెయ్యడానికి కావలసిన సాంకేతిక నైపుణ్యం గాలెన్ కాలానికి ఒకటిన్నర సహస్రాబ్దాల తరువాత వచ్చింది. కనుక మెదడు క్రియల విషయానికి వచ్చేసరికి ఏవో ఊహాగానాలు చేశాడే గాని కచ్చితమైన జ్ఞానాన్ని సాధించలేకపోయాడు. తన పూర్వీకులైన ఎరాసిస్ట్రాసస్ (Erasistrasus) మొదలైన పండితుల లాగానే గాలెన్ కూడా శరీరంలో ఏవో చిత్రమైన “వాయువులు” (pneumata)  ఉంటాయని భావించాడు. ఈ వాయువులు లేదా “ప్రాణాలు” నాళాల్లాంటి నాడుల ద్వార ప్రవహిస్తూ కదలికని కలుగజేస్తాయి. కదలిక లేని స్థితిలో, అంటే ఈ “ప్రాణాలు” పనీ పాటా లేకుండా ఉన్న స్థితిలో, మెదడులో వెంట్రికిల్స్ లో తిష్ఠ వేసి వుంటాయని ఊహించాడు గాలెన్! కనుక  ఈ వెంట్రికిల్స్ మాత్రమే, ఆ ఖాళీ ప్రదేశాలే మనలోని “బుద్ధికి”, “వివేచన”కి ఉపాధి అని నిర్ణయించాడు గాలెన్.

ఒక్క గాలెన్ మాత్రమే కాదు, విడ్డూరం ఏంటంటే తన తరువాత ఒకటిన్నర సహస్రాబ్దాల కాలం పాటు కూడా ఎంతో మంది నిపుణులు మెదడు క్రియల విషయానికి వచ్చేసరికి సరిగ్గా అదే పప్పులో కాలేశారని చరిత్ర మనకి చెప్తోంది. మరి ఎందుచేతనో మెదడు యొక్క భౌతిక నిర్మాణానికి చెందిన జ్ఞానానికి, మెదడు యొక్క క్రియలకి చెందిన జ్ఞానానికి మధ్య చెప్పలేనంత వారడి ఉంటూ వచ్చింది. గాలెన్ తరువాత అదే సాంప్రదాయంలో పని చేసిన లియొనార్డో డా వించీ, వెసేలియస్ (Vesalius) మొదలుకుని ఎందరో శరీరనిర్మాణ శాస్త్రవేత్తలు (anatomists)  మెదడు గురించి గొప్ప అధ్యయనాలు చేశారు. వీళ్లంతా మెదడు నిర్మాణం విషయంలో తమ పూర్వీకులు కనుక్కున్న విషయాలని నిర్ధారించడమే కాక ఎన్నో కొత్త విషయాలు కూడా కనుక్కున్నారు. కాని మెదడు క్రియల విషయంలో మాత్రం “వాయువులు”, “ప్రాణాలు”  మొదలైన నిరాధారిత భావాలన్నీ ఎంతో కాలం చలామణిలో ఉంటూ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే మెదడు నిర్మాణం విషయంలో మన అవగాహనకి, మెదడు క్రియల విషయంలో మన అవగాహనికి మధ్య ఉన్న తేడా ఇప్పటికి కూడా ఉందనే చెప్పాలి. కనీసం రెండు వేల ఏళ్ల పరిశోధనా చరిత్ర ఉన్న రంగంలో మెదడు క్రియలని కచ్చితంగా, సముచితంగా వర్ణించడానికి కావలసిన పరిభాష, భావ జాలం అన్నీ గత శతబ్దపు రెండవ భాగంలో మాత్రమే సమకూరాయని చెప్పాలి. ఈ నూతన భావాలు ఇప్పటికీ ఎక్కువగా పరిశోధనా స్థాయిలోనే వుండిపోయాయి గాని వైద్య ఆచరణ  మీదకి ఈ భావాల ప్రభావం ఇంకా ప్రసరించలేదు. ఆ నూతన భావజాలమే ఈ పుస్తకంలోని ముఖ్యాంశం.

లియొనార్డో డా వించీ:   మహాకళాకారుడు, మోనాలీసా చిత్రానికి  చిత్రకారుడు అయిన లియొనార్డో లో సామాన్యంగా అందరికీ తెలీని మరో పార్శ్వం కూడా వుంది. ఆయన గొప్ప శాస్త్రవేత్త కూడా. మానవాకృతికి చెందిన చిత్రాలు వెయ్యడానికి మనుషులని నమూనాలుగా చిత్రకారులు వాడుకోవడం అనేది పరిపాటి. కాని లియొనార్డో మానవాకారాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలనే లక్ష్యంతో మానవ కళేబరాల అధ్యయనాలు ప్రారంభించాడు. (ఉరి తీయబడ్డ నిందితుల కళేబరాలని కొనుక్కొచ్చి రాత్రికి రాత్రి రహస్యంగా తన స్టూడియో తరలించేవాడట!) మానవ శరీరాలని పైపైన చూసి బొమ్మలు వెయ్యకుండా ఆ శరీరాలని పరిచ్ఛేదించి లోపలి అంగాంగ విన్యాసాన్ని నిశితంగా అధ్యయనం చేసేవాడు. ఈ అధ్యయనాల వల్ల మెదడు నిర్మాణం గురించి ఎంతో పరిజ్ఞానాన్ని సాధించాడు లియొనార్డో.


                                      (లియొనార్డీ గీసిన మెదడు పరిచ్ఛేదాల చిత్రం)

మెదడును పరిచ్ఛేదించడం అంటే ఉల్లిపాయ యొక్క పొరలు ఒక్కటొక్కటిగా తొలగించడం లాంటిదే అంటాడు లియొనార్డో. ముందుగా పైనున్న జుట్టు తొలగించాలి. తరువాత అడుగున ఉన్న చర్మం, ఆ తరువాత సన్నని మాంసపు పొర… ఆ తరువాత కపాలపు గోడని భేదించాలి. అడుగున్న మెదడును కప్పి వుంచే డ్యురా మరియు పయా మేటర్ లని తీసేయాలి. ఇవీ మెదడు యొక్క “ఉల్లిపాయ పొరలు”. తన పూర్వీకులు లాగానే లియొనార్డోకి కూడా వెంట్రికిల్స్ కి సంబంధించిన జ్ఞానం ఉండేది. వారి లాగానే ఈ కళాకారుడు కూడా వెంట్రికిల్స్ లో ప్రతిభ,  బుద్ధి మొదలైన లక్షణాలు నాటుకుని వున్నాయని అపోహ పడ్డాడు. ముఖ్యంగా మూడవ వెంట్రికిల్ లో వివిధ ఇంద్రియాలకి (చూపు, వినికిడి, స్పర్శ మొ॥) సంబంధించిన సమాచారం అంతా ఒక దగ్గరికి చేరుతుందని తప్పుగా భావించాడు. ఏవో కనిపించని “ప్రాణశక్తుల” ప్రభావం వల్ల కాళ్లు చేతులు ఆడుతాయని భావించాడు. ఆ విధంగా మెదడు నిర్మాణానికి సంబంధించిన అవగాహనలోను, క్రియలకి సంబంధించిన అవగాహన లోను తన పూర్వీకుల విషయంలో ఉన్న వ్యత్యాసం లియొనార్డో లోనూ కనిపిస్తుంది. ఆ వ్యత్యాసం ఆ తర్వాత ఎంతో కాలం మిగిలి ఉండడం ఆశ్చర్యం.


(ఇంకా వుంది)




0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts