శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

గ్రహాలు – వాటి దూరాలు

Posted by V Srinivasa Chakravarthy Friday, November 22, 2013

 
గ్రహాల దిశగా ప్రయాణం అంటే ముందు గ్రహాలు ఎంతెంత దూరాలలో ఉన్నాయో ఒక అవగాహన ఉండాలి. గ్రహాల దూరాలు తెలుసుకోవాలంటే ముందు మన సౌరమండలం పటాన్ని ఓ సారి పరిశీలించాలి.


సూర్యుడి చుట్టూ పరుగులు పెట్టే ఎనిమిది గ్రహాలలో భూమి మూడవది. (ఒకప్పుడు సౌరమండలం శివార్లలో ఉండే ప్లూటో గ్రహంగా పరిగణింపబడేది. కాని ఇతర గ్రహాలతో పోలిస్తే కాస్త చిన్నదని ఇటీవలి కాలంలో దాన్ని లఘుగ్రహం (minor planet)   గా ప్రకటించారు.) సూర్యుడికి భూమి మధ్య సగటు దూరం రమారమి 15  కోట్ల కిమీలు. ఈ దూరాన్ని ఖగోళ ఏకాంకం (Astronomical Unit)   అంటారు. ఇంచుమించు భూమి కక్ష్య వున్న తలం లోనే ఇతర ఏడు గ్రహాలు, అవి కాకుండా కొన్ని లఘుగ్రహాలు, లెక్కలేనన్ని ఉల్కాశకలాలు (asteroids)  సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి.
సూర్యుడితో పోల్చితే వివిధ గ్రహాల పరిమాణాలని ఈ కింది చిత్రంలో చూడొచ్చు.



ప్లూటో కక్ష్యని సౌరమండలానికి సరిహద్దు అని పరిగణించవచ్చు. సూర్యుడికి ప్లూటోకి దూరం 600  కోట్ల కిమీలు. కనుక గ్రహాంతర యానం అంటే అంత బృహత్తరమైన అంతరిక్షాన్ని, ఆ చిక్కని చీకటి శూన్య సముద్రంలో అంతరిక్షనౌకలలో ప్రయాణిస్తూ, రివ్వు రివ్వున దూసుకుపోయే ఉల్కలని, ఉల్కాశకలాల ధాటికి తట్టుకుంటూ, ఉల్కా వర్షాలని (meteor showers) తప్పించుకుంటూ, అత్యంత శక్తి వంతమైన సూర్య గురుత్వానికి ఎదురొడ్డి ప్రయాణిస్తూ, ముందుకి సాగిపోవడమే.

అంతరిక్షంలోకి ప్రయాణించడం అంటే మొట్టమొదట చెయ్యాల్సింది గురుత్వం అనే అవరోధాన్ని అధిగమించడం. భూమి మీద ఉన్న ప్రతీ వస్తువు భూమి కేంద్రం దిశగా ఆకర్షించబడుతుంది. భూమి మాత్రమే కాదు ద్రవ్యరాశి గల ప్రతీ రేణువుకి ఆ ఆకర్షణ శక్తి వుంటుంది. అదే గురుత్వం. మన చుట్టూ ఉండే ప్రతీ వస్తువుకి ఈ గురుత్వం ఉంటుంది. కనుక అవి ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటాయి. కాని ఆ శక్తి చాలా బలహీనమైనది కనుక దాన్ని గమనించం. కాని భూమి చాలా పెద్దది గనుక, దాని గురుత్వం చాలా బలమైనది కనుక దాన్ని అనుక్షణం గుర్తిస్తాం, అనుభవిస్తాం.

గురుత్వమే లేకుంటే భూమి మీద వస్తువులన్నీ ఎప్పుడో భూమి ఉపరితలాన్ని వొదిలేసి అంతరిక్షంలో కొట్టుకుపోయి వుండేవి. అలాగే భూమి సూర్యుణ్ణి వదిలేసేది, చందమామ భూమిని వదిలేసేది. కనుక గురుత్వం మన మనుగడకి అత్యవసరం. కాని అదే గురుత్వం అంతరిక్ష యానానికి ఒక దశలో ముఖ్యమైన అవరోధం.

భూమి వొదిలి ఓ రాకెట్  శాశ్వతంగా దూరం కాగలదా? తప్పకుండా. అది అర్థం కావాలంటే ఓ ఎత్తైన కొండని ఊహించుకోండి. ఆ కొండ యొక్క శిఖరం వాయుమండలం కన్నా ఎత్తున ఉందనుకోండి. కనుక అక్కణ్ణుంచి విసిరిన వస్తువుకి గాలి అడ్డురాదు. అక్కణ్ణుంచి ఓ రాకెట్ ని పంపితే, రాకెట్ వేగం మరీ ఎక్కువ కాకపోతే ఆ రాకెట్ వక్రరేఖలో ముందుకు సాగుతూ చిత్రంలో చూపించినట్టు ఒక దగ్గర భూమి మీద పడిపోతుంది. రాకెట్ వేగం పెంచితే అది భూమి మీద పడిన స్థానం మరింత దూరం అవుతుంది. అలా రాకెట్ వేగం ఇంకా ఇంకా పెంచుతూ పోతే ఒక దశలో రాకెట్ కక్ష్య యొక్క వంపు, భూమి యొక్క వంపుతో సమానం అవుతుంది. అలాంటప్పుడు ఇక రాకెట్ భూమి మీద పడడం అంటూ ఉండదు. అంటే భూమి మీద పడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది గాని భూమి కూడా వంపు తిరుగుతూ ఉంటుంది కనుక, రాకెట్ ఎప్పుడూ కింద పడలేక పోతుంది. ఆగకుండా భూమి చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఉంటుంది. చందమామ లాగానే అది కూడా ఓ ఉపగ్రహంలా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
భూమి చుట్టూ ఓ వస్తువు నిరంతరాయంగా, శాశ్వతంగా ప్రదక్షణ చేస్తూ ఉండాలంటే ఆ వస్తువుకి ఉండాల్సిన వేగాన్నే పరిభ్రమణ వేగం (orbital velocity)  అంటారు. 



వృత్తాకార కక్ష్యలో తిరిగే వస్తువు భూమి మీద పడక పోడానికి ఓ కారణం వుంది.

సరళ రేఖలో ప్రయాణిస్తున్న వస్తువు మీద ఈ అపకేంద్ర బలం ఉండదు. కాని సరళ రేఖ నుండి మళ్లుతూ ప్రయాణించే వస్తువు మీద ఈ బలం పని చేస్తుంది. వస్తువు యొక్క వక్రగతి ఓ వృత్తంలో భాగం అనుకుంటే ఆ వృత్తానికి కేంద్రం నుండి దూరంగ విసిరేస్తున్నట్టుగా వస్తువు మీద ఓ బలం పనిచేస్తుంది. అదే అపకేంద్ర బలం. భూమి ఉపరితలానికి సమాంతరంగా ఓ వస్తువు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు దాని మీద భూమి కేంద్రానికి దూరంగా అపకేంద్ర బలం పని చేస్తుంది. అంటే గురుత్వానికి వ్యతిరేకంగా ఆ బలం పని చేస్తోందన్నమాట. మామూలుగా మనం భూమి మీద కదలకుండా నిల్చున్నా కూడా మన మీద కొంచెం అపకేంద్ర బలం పనిచేస్తుంది. ఎందుకంటే భూమి తన అక్షం మీద అది పరిభ్రమిస్తోంది కనుక, దాంతో పాటు మనం కూడా భూకేంద్రం చుట్టూ తిరుగుతున్నాం కనుక. అలాగే నేలకి సమాంతరంగా ఓ విమానంలో గంటకి 2800  కిమీల వేగంతో ప్రయాణిస్తున్నాం అనుకోండి. దాని మీద పని చేసే అపకేంద్ర బలం దాని బరువులో ఒక శాతం ఉంటుంది. అలా వేగం పెంచుతూ పోతే ఒక దశలో అపకేంద్ర బలం ఆ వస్తువు మీద పని చేస్తున్న గురుత్వాన్ని పూర్తిగ వమ్ము చేస్తుంది. అలాంటి వస్తువు ఇక భూమికి తిరిగి రాదు. సమ వేగంతో భూమి చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఉంటుంది.

(ఇంకా వుంది)




0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts