శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

విశ్వము – కాంతి సంవత్సరాలు

Posted by V Srinivasa Chakravarthy Tuesday, February 25, 2014 1 comments


ఇప్పుడు మనకి కాంతివేగం యొక్క  కచ్చితమైన విలువ తెలుసు కనుక  ఇక విశ్వం గురించిన కొన్ని మౌలిక వాస్తవాల గురించి చెప్పుకుందాము.

చందమామకి భూమి మధ్య సగటు దూరం విలువ 238,867  మైళ్లు. మరి కాంతికి ఇక్కణ్ణుంచి చందమామని చేరుకోడానికి ఎంత సమయం పడుతుంది? సుమారు  1.25  సెకనులు.

ఏ కారణం చేతనైనా చందమామ ఉన్నట్లుండి ఆకాశం నుండి మాయమైపోతే, దాని మీద పడి ప్రతిబింబితమైన సూర్యకాంతికి మనను చేరడానికి అంత సమయం పడుతుంది కనుక, చందమామ మాయమైపోయిన సంగతి మనకి 1.25  సెకనులు ఆలస్యంగా తెలుస్తుంది.

అలాగే సూర్యుడు భూమి నుండి 93,000,000  మైళ్ల దూరంలో వున్నాడు. సూర్యుణ్ణి వదిలి భూమిని చేరడానికి కాంతికి  8  నిముషాల 19  సెకనుల కాలం పడుతుంది. సూర్యుడు ఉన్నట్లుండి మాయమైపోతే ఆ సంగతి మనకి సుమారు  8 1/3  నిముషాల తరువాత గాని తెలీదు.

భూమి యొక్క కక్ష్యలో ఒక వైపు నుండి మరో వైపు వరకు చేరడానికి కాంతికి 16  నిముషాల 38  సెకనులు పడుతుంది. ఏడాదిలో వివిధ కాలాలలో జూపిటర్ ఉపగ్రహాల గ్రహణాలని పరిశీలించిన రోమర్ కి ఈ సంగతి కూడా తెలుసు.

గ్రహాలలో కెల్లా అతి దూరంలో నున్నది చిన్నారి గ్రహమైన ప్లూటో*. సూర్యుడి నుండీ భూమి దూరానికి ప్లూటో దూరం 40  రెట్లు ఉంటుంది. అంటే సూర్యుడి నుండీ బయల్దేరిన కిరణానికి భూమి కక్ష్య ని దాటడానికి పట్టే సమయం కన్నా ప్లూటో కక్ష్యని దాటడానికి పట్టే సమయం 40 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
(ప్లూటోని ఇప్పుడు గ్రహంగా పరిగణించరు. 2006 లో దాన్నొక లఘుగ్రహంగా ప్రకటించారు. – అనువాదకుడు)

ఇక తారల మాటేమిటి?

తారలు మన నుండి ఎంత దూరంలో వున్నాయంటే వాటి దూరాలని కొలవడానికి “కాంతి సంవత్సరం” అనే కొత్త కొలమానాన్ని వాడితే సౌకర్యంగా ఉంటుంది.
ఒక ఏడాదిలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతిసంవత్సరం అంటారు. అది ఎంత దూరమో లెక్కించాలంటే ఏడాదిలో ఎన్ని సెకనులు ఉన్నాయో లెక్కించాలి.

నిముషంలో 60  సెకనులు, గంటకి  60  నిముషాలు వున్నాయి. అలాగే రోజుకి 24  గంటలు. అంటే రోజుకి 86,400 సెకనులు. ఏడాదికి 365.2422  రోజులు కనుక ఏడాదిలో 31,556,926  సెకనులు ఉంటాయి.
అన్ని సెకన్లలో కాంతి ప్రయాణించే దూరం విలువ = 186,282.3959 X 31,556,926 = 5,878,499,776,000  మైళ్ళు. అంటే కాంతి సంవత్సరం విలువ సుమారు 6 ట్రిలియన్ మైళ్ళు అన్నమాట. (1 ట్రిలియన్ = 1,000,000,000,000).

కనుక ఒక కాంతి సంవత్సరం విలువ చంద్రుడికి భూమికి మధ్య దూరం కన్నా 25  మిలియన్ రెట్లు ఎక్కువ. భూమి నుండి చంద్రుణ్ణి చేరుకోడానికి మన వ్యోమగాములకి మూడు రోజులు పడుతుంది. అదే వేగంతో ఒక కాంతిసంవత్సరం అంత దూరాన్ని దాటడానికి రెండు లక్షల ఏళ్లు పడుతుంది.


మరో విధంగా చెప్పాలంటే ఒక కాంతిసంవత్సరం అంటే  ప్లూటో కక్ష్య యొక్క వ్యాసం కన్నా  1600  రెట్లు పెద్దది.

నాడీ వ్యాధులపై తొలి అధ్యయనాలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, February 23, 2014 0 comments


విద్యుత్ రసాయన శాస్త్రం, నాడీ రసాయన శాస్త్రం మొదలైన శాస్త్రాలలో జరిగిన పురోగతి వల్ల న్యూరాన్ల మధ్య సంకేతాల మార్పిడి ఎలా జరుగుంది అన్న విషయం మీద ఎంతో అవగాహన పెరిగింది. అలాగే నాడీ రోగుల మీద జరిగిన అధ్యయనాల వల్ల కూడా ఎనలేని నాడీ విజ్ఞానం బట్టబయలు అయ్యింది. మెదడులో వివిధ విభాగాలు కలిసికట్టుగా పని చేస్తే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని ఎలా శాసిస్తాయో తెలిసింది.

ఫ్రాన్స్ గాల్ రూపొందించిన ఫ్రీనాలజీ అనే కుహనా రంగం గురించి అంతకు ముందు విన్నాం. ఆ నాటి నుండి కూడా మెదడులో వివిధ అంగాలకి, మెదడు యొక్క వివిధ క్రియలకి మధ్య సంబంధం గురించి రెండు పరస్పర విరుద్ధ చలామణిలో ఉన్నాయి. ఆ రెండు సిద్ధాంతాలు నిర్ధారణ కోసం కొన్ని శతాబ్దాల పాటు పోటీ పడుతూ వచ్చాయి.

వీటిలో మొదటి సిద్ధాంతాన్ని ప్రాంతీయతా వాదం (localization view) అంటారు. మెదడు యొక్క ప్రతీ క్రియకి ఓ ప్రత్యేక మెదడు ప్రాంతం బాధ్యత తీసుకుంటుందని ఈ వాదం చెప్తుంది. దీనికి విరుద్ధ సిద్ధాంతాన్ని ‘సమగ్ర క్షేత్ర వాదం’ (aggregate field view) అంటారు. మానవ ప్రవర్తనలోని ప్రతీ అంశం మీదా మెదడులోని అన్ని ప్రాంతాలు ఉమ్మడిగా ప్రభావం చూపిస్తాయని ఈ వాదం నమ్ముతుంది. అసలు ఫ్రీనాలజీయే ఒక విధంగా ప్రాంతీయతా వాదానికి ఒడంబడిన ఒక సిద్ధాంతం. ఎందుకంటే ఫ్రీనాలజీ ప్రకారం వివిధ మెదడు భాగాలు ప్రత్యేక మానవ లక్షణాలకి ప్రతినిధులు. కాని ఫ్రీనాలజీ ఒక వైజ్ఞానిక సిద్ధాంతం కాదు. ఎందుకంటే దానికి ఎలాంటి వాస్తవ ఆధారాలు లేవు. ఒక రకంగా అదొక మూఢనమ్మకం లాంటిది అనుకోవాలి.

ఇలా ఉండగా పందొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్ కి చెందిన పియర్ ఫ్లోరెన్స్ అనే జీవక్రియాశాస్త్రవేత్త ఈ ప్రాంతీయతా వాదాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించదలచుకున్నాడు. ఆ ప్రయోగాల కోసం కొన్ని జంతువులని ఎంచుకున్నాడు. వాటి మెదళ్లలో వివిధ చోట్ల గాయాలు చేస్తూ వచ్చాడు. గాయ పడ్డ జంతువుల ప్రవర్తనలో మార్పులని సూక్ష్మంగా గమనించాడు. తన పరిశీలనల్లో అర్థమైనది ఏంటంటే మెదడులో గాయం ఎక్కడ అయ్యింది అన్నది అంత ముఖ్యం కాదు, గాయం యొక్క విస్తృతి ఎంత అన్నదే ముఖ్యం. గాయం పెరుగుతున్న కొద్ది ప్రవర్తనలో మార్పు అంత ప్రస్ఫుటంగా ఉంటుంది. అంటే మెదడులోని అంగాలన్నీ కలిసికట్టుగా జంతువు యొక్క ప్రవర్తనని శాసిస్తున్నాయన్నమాట. ఈ పరిశోధనలు ‘సమగ్ర క్షేత్ర వాదం’ ని సమర్ధిస్తున్నట్టుగా అనిపించింది.



తదనంతరం ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశల్లో కార్ల్ లాష్లే అనే శాస్త్రవేత్త ఇంచుమించు ఇలాంటి ప్రయోగాలే చేశాడు. ఎలుకలకి చిక్కువ్యూహాల (maze)  లోంచి తప్పించుకుని బయటపడే ఒడుపు ఉంటుంది. ఎంత తక్కువ సమయంలో అలాంటి చిక్కువ్యూహాల నుండి తప్పించుకోగలిగితే ఆ ఎలుక సామర్థ్యం అంత ఎక్కువ అన్నట్టుగా పరిగణించాడు లాష్లే. ఇప్పుడు ఆ ఎలుకల మెదళ్లలో కత్తితో సన్నని కోతలు కోశాడు. అలా కోసిన కోతల మొత్తం పొడవుకి, ఎలుకలు చిక్కువ్యాహాల నుండి తప్పించుకోడానికి పట్టే సమాయానికి మధ్య సంబంధాన్ని పరిశీలించాడు. ఆ ప్రయోగాల బట్టి అర్థమైనది ఏంటంటే మెదడులో కోతలు ఎక్కడ జరిగాయి అన్నది ముఖ్యం కాదు. మొత్తం కోతల పొడవు ఎంత, అంటే మొత్తం గాయం యొక్క విస్తృతి ఎంత, అన్నదే ఎలుక యొక్క సామర్థ్యాన్ని శాసిస్తుంది. గాయం ఎక్కడైనా అది ఎక్కువైతే అంత మేరకు ఎలుక సామర్థ్యం పడిపోతుంది. ఆ విధంగా లాష్లే ప్రయోగాలు కూడా సమగ్ర క్షేత్ర వాదాన్ని సమర్థిసున్నట్టు అనిపించింది.

కాని మెదడు వ్యాధులకి సంబంధించిన కొన్ని పరిశీలనలు ఇందుకు భిన్నమైన కథ చెప్తున్నట్టు అనిపించింది.

(ఇంకా వుంది)





 
పై అంశాల్లోని మొదటి దాంట్లో – అంటే పిల్లల పుస్తకాలని ఇంకా ఎలా అభివృద్ధి చెయ్యొచ్చునన్న విషయంలో – వాళ్లు చెప్పేది ముమ్మాటికీ నిజం. స్కూళ్లలో పిల్లలు విధిలేక చదివే పుస్తకాలు చాలా మటుకు అర్థం లేకుండా, అవాస్తవికంగా, పేలవంగా ఉంటాయి. బోరుకొడతాయి. ఆలోచనని తప్పుదారి పట్టిస్తాయి. ఈ విషయం మీద గణాంక ఫలితాలు చెప్పేదేంటో చూద్దాం.

“1920  లలో ప్రచురించబడ్డ వాచకాలలో సగటున  645  విభిన్న పదాలు ఉండేవి. 1930  ల నాటికి ఆ సంఖ్య 430  పదాలకి పడిపోయింది. నాల్గవ, ఐదవ దశాబ్దాలలో … 350  పదాలే వుండేవి. 1960-1963  ప్రాంతాల్లో ప్రచురితమైన ఏడు వాచకాల సంపుటిలో 113  నుండి 173  పదాలే ఉన్నాయి.  1920  లో సగటున ఒక్క కథలో 333  పదాలు వుండేవి. 1962  నాటికి అది 230  కి దిగింది. మొత్తం పుస్తకంలో విభిన్న పదాల సంఖ్య 1920  లో 425  ఐతే, 1930లో 282 ఐతే, 1940లో  178 ఐతే, 1962లో 153  అయ్యింది.”

పై ఫలితాలని చర్చిస్తూ ప్రచురణ కర్తలు తమ వాచకాల శబ్ద పుష్టిని తగ్గిస్తూ రావడానికి గల కారణాలని రచయితలు ఇలా వివరిస్తున్నారు.

“ఒక కారణం… ఏంటంటే వాచకాలు ఇంకా ఇంకా నిస్సారంగా అవుతున్న కొలది పిల్లల పఠన శక్తి ఇంకా ఇంకా తగ్గుతూ వచ్చింది. కాని దీని నుండి నిపుణులు గ్రహించిన పాఠం ఇది కాదు. పుస్తకాలు పిల్లలకి మరీ కఠినంగా ఉన్నాయి కాబోలు. అందుకే వాటిని ఇంకా సరళికరించాలి కాబోలు. ఇంకా తక్కువ పదాలే వాడాలి కాబోలు అన్న నిర్ణయానికి వచ్చారు. ఆ కారణం చేత వచ్చిన ప్రతీ కొత్త ముద్రణలోను ఇంకా ఇంకా తక్కువ పదాలు కనిపిస్తూ వచ్చాయి. కొన్ని పదాలనే తరచూ వాడుతూ పుస్తకాలు రాయడం జరిగింది. దాంతో అవి చదవడానికి బోరు కొట్టేవి… ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.”
వాచకాలు ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయో ఎత్తి చూపి ఆ పుస్తకం ఎంతో మేలు చేసింది. కనీసం ఆ ఒక్క కారణం కోసమైనా బెటెల్ హైమ్, జలాన్ ల పుస్తకం చదవాలి. ఆ పుస్తకం పుణ్యమా అని వాచకాల నాణ్యత తగ్గుతూ వచ్చే ఒరవడి తిరుగబడిందంటే మంచిదే. వాచకాలు ఉంకా ఉత్సాహకరంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఆనందాన్నివ్వాలి, చదవాలని అనిపించాలి. ఆ పరిణామాన్ని కలుగజేసిందంటే ఆ పుస్తకం గొప్ప పుస్తకమనే అనుకోవాలి.

“On learning to read” (చదవడం ఎలా?) అన్న పుస్తకంలో పిల్లల పొరబాట్ల అంతరార్థం ఎలా తెలుసుకోవాలి అన్న విషయం మీద చాలా చర్చ జరిగింది. ఏదో అజ్ఞానం వల్ల, నిర్లక్ష్యం వల్ల పిల్లలు తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల్ని చప్పున చక్కదిద్దాలి, అవసరమైతే ఓ రెండు ఇచ్చుకోవాలి, నాలుగు అంటించాలి – అసలు ఆ పద్ధతే తప్పు అంటారు రచయితలు. పిల్లలు చేసే పొరబాట్లు వాళ్లకి అర్థవంతంగానే ఉంటాయి. టిచర్లు ఈ విషయాన్ని గమనించి అది వాళ్లకి తెలుసు అన్న విషయాన్ని పిల్లలకి తెలియజేయాలి. పిల్లల పొరబాట్లలో ప్రచ్ఛన్నంగా ఉండే అర్థాలేంటో టీచర్లు వెదికి పట్టుకుని వాటిని పిల్లలకి వెల్లడి చెయ్యాలి. ఇదే ఒక విధమైన ప్రాధమిక మనస్తత్వ విశ్లేషణని పోలిన ప్రక్రియ.

మంచి అనుభవం గల మనస్తత్వ శాస్త్రవేత్తలు కావడంతో, రచయితలు ఈ అంతరార్థాలని వెదికి పట్టుకొవడంలో గొప్ప నేర్పు ప్రదర్శించారు. అలాంటి వాళ్లు పొరబడతారా? పుస్తకంలో వాళ్లు పేర్కొన్న ఉదాహరణలు మాత్రం పిల్లలు చేసే ఎన్నో పొరబాట్లలోని అర్థాలని బోధపరిచేవిగా ఉన్నాయి. కాని రచయితలు చదవడం నేర్పే ప్రతీ టిచరు వాళ్ల పద్ధతినే వాడాలి, వాళ్ల మార్గంలోనే నడవాలి అని పట్టుబడుతున్నారు. ఈ విషయంలో మాత్రం నేను వాళ్లతో ఏకీభవించలేను.

చదవడంలో వచ్చే పొరబాట్లని అంత సూక్ష్మంగా పరిశోధించి ఆ ఫలితాలని వెల్లడించడం నిజంగా విశేషమైన పనే. కాని ఆ పద్ధతి ఆచరణాత్మకం కాదు. ఎందుకంటే రచయితలు సూచించినంత ఓపిగ్గా, మర్యాదగా, వివేకవంతంగా పిల్లల పొరబాట్లకి స్పందించే టిచర్లు చాలా అరుదు. టీచర్లకి అలా చెయ్యడానికి కావలసిన శిక్షణ గాని, సమయం గాని, ఉద్దేశం గాని అన్నిటికన్నా మించి ఇలాంటి కృషిలో ఎంతో అవసరమైన లక్షణాలు – పిల్లల పట్ల ప్రేమాభిమానాలు – ఉండవు. అసలు స్కూళ్లు నిజంగా ఈ పద్ధతిని అమలు జరపాలి అని గట్టిగా అనుకుంటే దాని వల్ల జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ. అసలే ఈ రోజుల్లో పిల్లలు, చదువులు అన్న అంశం మీద కుహనా మనస్తత్వ పరిశోధనలు, తలతిక్క విశ్లేషణలు పెచ్చరిల్లిపోతున్నాయి. దానికి తోడు ఇలాంటి సున్నితమైన పద్ధతిని అందరూ పాటించాలని నిర్బంధిస్తే…

కనుక ఇలాంటి తంటాలవీ అనవసరం అని నా అభిప్రాయం. అసలు టీచర్లు పిల్లల్ని క్లాసులో అందరి ముందు బిగ్గరగా చదవమనడం మానేస్తే మంచిది. అప్పుడు వాళ్ల పొరబాట్లు తెలుసుకోనూ అక్కర్లేదు, వాటికి స్పందించనూ అక్కర్లేదు. పిల్లలకి వారి సరదా కోసం వారికి వారు చదువుకునేలా మంచి ఆసక్తికరమైన పుస్తకాలు అందజేస్తే చాలా మటుకు పొరబాట్లు వాటంతకవే మటుమాయం అయిపోతాయి.



సచేతన భావాలలోని అచేతన అంతరార్థం

Posted by V Srinivasa Chakravarthy Wednesday, February 19, 2014 0 comments

మన స్వప్న జీవనం గురించి ఇంతవరకు అంతో ఇంతో లోతుగా శోధించాం. స్వప్నాలు ఎందుకు ముఖ్యం అంటే స్వప్నాలనే మట్టి లోంచి పుట్టే మొలకలే మానవ ప్రతీకలు. కాని దురదృష్టవశాత్తు కలలని అర్థం చేసుకోవడం కష్టం. సచేతన మానసం చెప్పే కథలకి కలలకి మధ్య ఎంతో తేడా వుంటుందని అంతకు ముందే చెప్పాను. నిజజీవితంలో మనం ఏదైనా అనాలనుకున్నప్పుడు ఆచితూచి మాట్లాడతాం. వాక్యంలో పదాలు పొందిగ్గా వున్నాయో లేదో చూసుకుంటాం. భావాలు సహేతుకంగా అతుకుతున్నాయోలేదో చూసుకుంటాం. ఉదాహరణకి ఓ చదువుకున్న వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాడే ఉపమానాలు కలగాపులగంగా ఉండడానికి ఇష్టపడడు. అలా మాట్లాడితే భావం అవిస్పష్టం అవుతుందని అనుకుంటాడు. కాని కలల నైజం వేరుగా ఉంటుంది. అర్థం పర్థం లేని, పరస్పర విరుద్ధమైన చిత్రాలు స్వాప్నికుడి మానసాన్ని క్రమ్ముకుంటాయి. మామూలుగా ఉండే కాలభావాన సమసిపోతుంది. సర్వసామాన్య విషయాలు కూడా ఏవో విపరీతమైన, విపత్కరమైన అంతరార్థాన్ని సంతరించుకుంటాయి.

జాగృత జీవనంలో మనం మన ఆలోచనల మీద ఎంతో క్రమాన్ని, క్రమశిక్షణని ఆపాదించడానికి ప్రయత్నిస్తాం గాని, అచేతనలోని అంశాలు గందరగోళంగా, కకావికలంగా ఉండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క క్షణం ఏదైనా కలని జ్ఞాపకం తెచ్చుకుని జాగ్రత్తగా గమనిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మామూలుగా మనుషులకి తమ కలలు అర్థం చేసుకోవడం అంత కష్టం అవుతుంది. మన జాగృత జీవనం పరంగా చూస్తే అవసలు అర్థం లేనట్టు కనిపిస్తాయి. అందుకే అవి అర్థం కావడం లేదని తలబద్దలు కొట్టుకుంటూ వుంటారు, లేదా అర్థం కావని వాపోతూ వుంటారు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. మన జాగృత జివనంలో మనకి ఎదురయ్యే భావనలలో ఎంతో క్రమం వుందని అనుకుంటాం గాని వాటిలో నిజంగా మన అనుకున్నంతగా క్రమం గాని, క్రమశిక్షణ గాని లేవని మనం గుర్తించాలి. మన జాగృదావస్థకి చెందిన భావలలో మనం అనుకున్నంత స్థాయిలో నిర్దిష్టత, స్పష్టత ఉండదు.  నిజం చెప్పాలంటే ఆ భావాలని మనం ఎంత నిశితంగా పరిశీలిస్తే వాటిలోని అంతరార్థం (ముఖ్యంగా హార్దికమైన సారం) అంతగా అవిస్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం విన్నది, అనుభూతి చెందినది అంతా మన అచేతనలోకి ప్రవేశిస్తుంది. అంతేకాక మనం మన సచేతన మనస్సులో నిలుపుకున్నది, సంకల్పమాత్రం చేత వ్యక్తం చెయ్యగలిగేది కూడా  ఓ కొత్త అచేతనమైన అంతరార్థాన్ని సంతరించుకుంటుంది. మన జ్ఞాపకాన్ని తిరిగి గుర్తుతెచ్చుకున్న ప్రతీ సారి దానికి ఏదో అచేతనమైన వన్నె అలముకుంటుంది. మన సచేతన జ్ఞాపకాలు  వేగంగా ఓ అచేతన అంతరార్థాన్ని సంతరించుకుంటాయి. ఆ గూఢార్థానికి ఏదో ఆత్మగతమైన విలువ ఉండి వుండొచ్చు. కాని ఆ అర్థమేమిటో, ఆ విలువ ఏమిటో మనకి సచేతనంగా తెలియకపోవచ్చు. అదే ఆ భావన యొక్క బాహ్యార్థాన్ని ఎలా మరుగుపరుస్తుందో మనకి అర్థం కాకపోవచ్చు.

(ఇంకా వుంది)








భూగర్భంలో మహామానవుడు

Posted by V Srinivasa Chakravarthy Sunday, February 16, 2014 0 comments




మా చుట్టూ సమంగా విస్తరించిన కాంతిలో అతి చిన్న వస్తువులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక వాటిని కనిపెట్టడం కష్టం కాదు. మొదట్లో నా కళ్లని నేనే నమ్మలేదు. కాని తేరిపార చూశాక నమ్మక తప్పలేదు. ఆ మహాకాయాలు చెట్ల వెనుక కదలాడుతున్నాయి. అదో మాస్టడాన్ల దండులా వుంది. అవి శిలాజాలు కాదు. సజీవంగా కదలాడే జంతువులు. 1801  లో ఒయహో లో బురదనేలలో ఇలాంటి జంతువుల ఎముకలు దొరికాయి.ఏనుగుల్లాంటి ఆ మహాకాయాలు సర్పాల్లాంటి తమ తొండాలతో చెట్ల కింద మట్టిని తవ్వుతున్నాయి. కుళ్ళిపోయిన చెట్ల మొదళ్లని తమ వాడి అయిన దంతాలతో కుళ్లబొడిచి పెద్ద పెద్ద చెట్లని కూలదోస్తున్నాయి. వాటి ధృఢమైన దవడల మధ్య ఆ చెట్ల కొమ్మలు పటపట విరుగుతున్నాయి.



ఆ విధంగా పూర్వచారిత్రక యుగం గురించి, తృతీయ యుగం, తృతీయోత్తర యుగం గురించి నేను కన్న కల నిజమయ్యింది. కాని కల నిజమయ్యిందని సంబరపడే పరిస్థితిలో లేను!   భూగర్భపు చీకటి లోతుల్లో ఈ మహామెకాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ ముగ్గురం బిక్కుబిక్కుమంటూ నించున్నాం!

మావయ్య మాత్రం ఎంతో ఆసక్తితో వాటి కేసే చూస్తున్నాడు.
“రా!రా!” అంటూ నా జబ్బ పట్టి లాగాడు. “పద కాస్త ముందుకెళదాం.”
“అమ్మో! నేను చచ్చినా రాను,” మొరాయించాను. “అటు చూడండి ఓ సారి. అవి కాళ్లు కావు. మద్ది చెట్లు. వాటి జోలికి వద్దులే మావయ్యా. వాటికి గాని తిక్క రేగిందంటే ఇక మనిషి అన్నవాడు మిగలడు.”
“మనిషి అన్న వాడు మిగలడని అని నువ్వు అనుకుంటున్నావు ఏక్సెల్! కాని ఓ సారి అటు చూడు. వాటి సమక్షంలో ఓ చిన్న ఆకారం కనిపిస్తోంది. అది మానవాకారం కాదూ?”

మావయ్య చూపించిన వైపే చూశాను. నేను ఏం చూస్తున్నానో కాసేపు నాకే అర్థం కాలేదు. కాని నా ఇంద్రియాలు చెప్పే సాక్షాన్ని ఒప్పుకోక తప్పింది కాదు.
నిజమే. మేం ఉన్న చోటికి సుమారు పావు మైలు దూరంలో ఓ పెద్ద కౌరీ చెట్టుకి ఆనుకుని ఓ మనిషి నించున్నాడు.
పాతాళ లోకపు ప్రోటియస్ దేవతలా  ఠీవిగా నించున్నాడు.
అతడిది మానవాకారమే కాని అతడు మామూలు మనిషిలా కనిపించలేదు. అతడు కూడా మహాకాయుడే. ఎత్తు పన్నెండు అడుగులు ఉంటుందేమో. తల ఎద్దు తలలా వికారంగా వుంది. జుట్టు జడల కట్టుకుపోయి వుంది. అది మనిషి జుట్టులా లేదు. ఏదో ఆదిమయుగం నాటి ఏనుగు తల మీది బొచ్చులా వుంది. అతడి చేతిలో ఓ ధృఢమైన దండం కనిపిస్తోంది.
మేం అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాం. ఇంతలో ఒంటి మీదకి తెలివి వొచ్చింది. అతడి కంటబడ్డామంటే ఏం జరుగుతుందో అర్థమయ్యింది.
“పద మావయ్యా! ఇక్కడీ నుండి వెళ్లిపోదాం,” మావయ్యని బలవంతం చేస్తూ అన్నాను. ఏం అనుకున్నాడో ఏమో మావయ్య ఒప్పుకున్నాడు.
ఓ పావుగంట తరువాత ఆ మహాకాయుడి నుండి దూరంగా ఓ సురక్షిత ప్రాంతాన్ని చేరుకున్నాం.

(ఇంకా వుంది)






శూన్యంలో కాంతి వేగం

Posted by V Srinivasa Chakravarthy Saturday, February 15, 2014 0 comments




రోమర్, బ్రాడ్లీ లు అంతరిక్షంలో సుదీర్ఘ దూరాలు ప్రయాణిస్తున్న కాంతి యొక్క వేగాన్ని  వేగాన్ని కొలిచారు. కనుక వాళ్ళు కొలిచింది శూన్యంలో కాంతి వేగాన్ని. కాని వాళ్లు వాడిన పరికరాల్లో సునిశితత్వం ఎంతగా కొరవడిందంటే శూన్యంలో కాంతివేగం కొలిచిన ఫలం దక్కలేదు.

ఫిజో, ఫోకాల్ట్, మికెల్సన్ లు కాంతి వేగాన్ని ఇంకా ఇంకా మెరుగైన, సునిశితమైన పద్ధతులతో కొలిచారు గాని వాళ్లు గాల్లో కాంతి వేగాన్ని కొలిచారు. ఇప్పుడు మికెల్సన్ తన సునిశితమైన పరికరాన్ని ఉపయోగించి శూన్యంలో కాంతి వేగాన్ని కొలవాలని నిశ్చయించాడు.

మికెల్సన్ ఈ సారి తన ప్రయోగంలో ఓ పొడవాటి గొట్టాన్ని తీసుకున్నాడు.  ఎందుకంటే అతడికి ఆ గొట్టం యొక్క పొడవు ఇంచిలో భాగం వరకు కూడా కచ్చితంగా తెలుసు. ఆ గొట్టంలోని గాలిని తొలగించి అందులో శూన్యాన్ని ఏర్పరచాడు. ఆ గొట్టంలోనే అద్దాలు ఏర్పాటు చేసి ఆ అద్దాల మధ్య కాంతి పుంజం పదే పదే ప్రతిబింబితమై ప్రయాణించేలా ఏర్పాటు చేశాడు. ఆ విధంగా కాంతి పది మైళ్ళ దూరం గల శూన్యంలో ప్రయాణించేలా ఏర్పాటు చేశాడు.

చివరి క్షణం దాకా మికెల్సన్ తన ప్రయోగాలు కొనసాగించాడు. చివరికి 1933  లో అతడు చనిపోయిన రెండేళ్ల తరువాత, అతడితో పని చేసిన వారంతా కలిసి తన లెక్కలని సమీకరించి, కాంతి వేగపు కచ్చితమైన విలువని ప్రకటించారు.

ఆ విలువ 186, 271  మైళ్లు/సెకను అది అంతవరకు తను చేసిన అంచనాల కన్నా కాస్త నిర్దుష్టమైనది. అది అసలు విలువ కన్నా కేవలం 11.5  మైళ్ళు/సెకను తక్కువ.

శూన్యంలో కాంతి వేగానికి సంబంధించిన అధ్యయనాల ద్వార మెకెల్సన్ మరో విషయం కూడా సాధించాడు.

వక్రీభవన గుణకం గల మాధ్యమంలో, అది గాలిలో తక్కువ విలువ గలదైనా కావచ్చు, లేక వజ్రంలా ఎక్కువ విలువ గలదైనా కావచ్చు, పొట్టి తరంగాలు గల కిరణాలు (ఉదహరణకి వయొలెట్ రంగు) పొడవైన తరంగాలు (ఉదాహరణకి ఎరుపు రంగు) గల కిరణాల కన్నా ఎక్కువగా వక్రీభవనం చెందుతాయి. దీన్ని బట్టి పొట్టి తరంగాలు గల కాంతి ఆ మాధ్యమంలో పొడవైన తరంగాలు గల కాంతి కన్నా నెమ్మదిగా ప్రయాణిస్తుంది అన్నమాట.

శున్యంలో ఇక వక్రీభవన గుణకం అనేదే వుండదు కనుక అన్ని రకాల కాంతి తరంగాలు ఒకే వేగం వద్ద ప్రయాణించాలి.
(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts