శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

తరంగము - sin() ప్రమేయము

Posted by V Srinivasa Chakravarthy Saturday, June 28, 2014 3 comments

నిశ్చలమైన నీటి ఉపరితలం మీద ఒక రాయి పడేస్తే తరంగం ఎలా ఏర్పడుతుందో కిందటి సారి చూశాం. అలాంటి తరంగాన్ని నీటి ఉపరితలం  వద్ద, పక్క నుండి చూస్తే పడి లేస్తున్న నీటి ఉపరితలం కనిపిస్తుంది. ఒక ప్రత్యేక తరుణంలో అలాంటి తరంగాన్ని ఫోటో తీస్తే, అందులో కొన్ని చోట్ల నీటి మట్టం కిందికి, కొన్ని చోట్ల పైకి అలా మిట్టపల్లాలుగా కనిపిస్తుంది. అలాంటి మిట్టపల్లాల వక్రాన్ని గణితపరంగా వ్యక్తం చేస్తారు.

గ్రహాలని మనం పరిపూర్ణ గోళాలుగా ఊహించుకుంటాం. అవి నిజంగా పరిపూర్ణ గోళాలు కాకపోయినా గణితపరంగా అదొక అనువైన ఉజ్జాయింపు అవుతుంది. అదే విధంగా తరంగం ఆకారాన్ని గణితపరంగా sin(q)  అనే ప్రత్యేక ప్రమేయంతో వ్యక్తం చేస్తారు. అది ఇలా వుంటుంది.



Y  =sin(q)  అనే ఈ ప్రమేయంలో  q  విలువ పెరుగుతుంటే  y  విలువ పెరిగి తగ్గుతూ వుంటుంది. q =0  వద్ద y =0  అవుతుంది. q  విలువ 90 డిగ్రీల వద్ద  y  విలువ  1 అవుతుంది.  అలాగే వరుసగా,
q =180,  y = 0
q = 270, y = -1
q  = 360, y = 0
అవుతుంది. q   విలువ అలా అనంతంగా పెరుగుతుంటే ప్రతీ 360  డిగ్రీలకి  q  యొక్క విలువలు ఒకే విధంగా మళ్లీ మళ్లీ ఆవృత్తం అవుతుంటాయి. ఇలాంటి ప్రమేయాలని ఆవర్తక ప్రమేయాలు (periodic functions)  అంటారు.

ఆవర్తక ప్రమేయాలు చక్రికంగా మారే రాశులని సూచిస్తాయి. చక్రికంగా మారే అత్యంత సామాన్యమైన ప్రక్రియకి ఉదాహరణని తీసుకోవాలంటే ఒక చక్రం (లేదా వృత్తం) మీద సమ వేగంతో కదిలే బిందువుని తీసుకోవచ్చు. కింద చిత్రంలో సూచించినట్టు  O  కేంద్రంగా  r  వ్యాసార్థంగా గల వృత్తం మీద  P అనే బిందువు కదులుతోంది. OP  అనే రేఖ x-అక్షంతో q  అనే కోణాన్ని ఏర్పరుస్తోంది.  P నుండి x-అక్షం  మీదకి లంబాన్ని గీస్తే అది x-అక్షాన్ని N వద్ద కలుస్తోంది. PN  విలువని  h  తో సూచిద్దాం. అప్పుడు sin(q) ని ఈ విధంగా వ్యక్తం చెయ్యొచ్చు.




Sin(q) = h/r

Sin()  ప్రమేయాన్ని తరంగానికి వర్తింపజేసినప్పుడు sin(q)  బదులుగా sin(x)  అని వాడుతాం. ఇక్కడ x  అనే రాశి నీటి ఉపరితలం మీద దూరాన్ని సూచిస్తుంది. (అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవ తరంగాలు అన్నీ అచ్చం sin(x) మాదిరిగానే వుండవు. వాటిని ఉజ్జాయింపుగా మాత్రమే sin(x) తో వ్యక్తం చేస్తారు. ఓ పరిపూర్ణమైన, ఆదర్శవంతమైన తరంగం sin(x)  లాగా వుంటుంది అనుకోవాలి. )
తరంగంలో అత్యున్నత స్థానాలని శృంగం అంటారు. అట్టడుగున వున్న స్థానాలని ద్రోణి అంటారు (చిత్రం).

ఇందాక నీటి తరంగం ఒక ప్రత్యేక తరుణంలో చిత్రం ** లోని sin(x) ఆకారంలా ఉండొచ్చు. కాని కాసేపయ్యాక చూస్తే ఆ తరంగ పక్కకి జరుగుతుంది. అలా తరంగం పక్కకి జరిగినప్పుడు, తరంగం యొక్క ఈ కొత్త స్థితిని sin(x) బదులుగా sin(x - a)  అనే ప్రయేయంతో వ్యక్తం చెయ్యొచ్చు. Sin(x)  మరియు sin(x-a)  ప్రమేయాలని ఒకే గ్రాఫులో ప్రదర్శిస్తే ఇలా వుంటుంది.





పై గ్రాఫులో నీలం  రేఖని కుడి పక్కకి కదల్చగా ఏర్పడ్డదే ఆకుపచ్చ  రేఖ. రెండిటికీ మధ్య తేడా a =45  డిగ్రీలు. ఇలా పక్కకి కదల్చడం కాకుండా ఆకుపచ్చ రేఖని నీలం  రేఖ నుండి పుట్టించడానికి మరో విధానం కూడా వుంది.
ఇప్పుడు నీలం రేఖలో ప్రతీ బిందువుని బాణాలతో సూచించినట్టుగా కిందకి గాని, పైకి గాని జరిపామని అనుకోండి. అలా జరపడం వల్ల ఆకుపచ్చ  రేఖ పుడుతోంది. అంటే తరంగం మీది వివిధ బిందువులు కిందకి, పైకి కదులుతుంటే అందుకు ఫలితంగా తరంగం పక్కకి కదిలినట్టు కనిపిస్తుంది అన్నమాట.

వాస్తవంలో ఈ విషయాన్ని  పరీక్షించుకోడానికి నీటి తరంగం మీద ఓ చిన్న కాగితం ముక్కని వేసి చూడొచ్చు. తరంగం వేగంగా పక్కకి జరుగుతున్నా, కాగితం ముక్క మాత్రం ఉన్న చోటే పైకి కిందకి కదులుతుంటుంది.
పైన చిత్రం  లో చూపించిన  ప్రక్రియ ఆధారంగా స్టేడియమ్ లలో ప్రేక్షకులు లయబద్ధంగా పైకి కిందకి లేస్తూ స్టేడియం అంతా వ్యాపించే ఓ ‘మానవ తరంగాన్ని’ సృష్టిస్తారు. అలాంటి ఓ తరంగాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.


ఇలాంటి సరదా ప్రయోగం క్లాసులో కూడా చేసుకోవచ్చు. క్లాసులో పిల్లలని ఒక పెద్ద వలయాకారంలో కూర్చోబెట్టాలి. ముందుగా ఎవరో ఒక పిల్లవాణ్ణి లేచి కూర్చోమనాలి. కాస్త ఆలస్యంగా అతడి/ఆమె పక్క విద్యార్థిని కూడా అలాగే లేచి కూర్చోమనాలి. ఇలా వరుసగా చేస్తూ పోతే విద్యార్థుల వలయంలో తరంగం పుడుతుంది.
(ఇంకా వుంది)

పాతాళ ప్రయాణం ముగిసింది

Posted by V Srinivasa Chakravarthy Wednesday, June 25, 2014 0 comments

“అరె! పిల్లాడు,” ఎగిరి గంతేస్తూ అరిచాను. “మరో మనిషి!”

చూడడానికి ఎవరో పేద పిల్లాడిలా వున్నాడు. చింకి బట్టలు వేసుకున్నాడు. ముఖం కాస్త దీనంగా వుంది… మాలాగ. మమ్మల్ని చూసి దొంగలు అనుకున్నాడో ఏమో. కాస్త భయపడుతున్నట్టు వున్నాడు.
అంతలో హన్స్ వేగంగా ముందుకి రెండు అడుగులేసి ఆ పిల్లవాణ్ణి రెక్క పట్టుకుని మావద్దకి లాక్కొచ్చాడు.
మావయ్య ఆ పిల్లవాడితో అనునయిస్తున్నట్టుగా మాట్లాడుతూ శుద్ధమైన జర్మన్ లో ఇలా అడిగాడు –
Was heiszt diesen Berg, mein Knablein? Sage mir geschwind!"
(ఈ కొండ పేరేంటి నేస్తం? తొందరగా చెప్పు.”)
పిల్లాడు నోరు మెదపలేదు.
“అంటే మనం వున్నది జర్మనీ కాదన్న మాట,” మావయ్య మాకేసి చూసి అన్నాడు.
ఈ సారి మళ్ళీ అదే ప్రశ్న ఇంగ్లీష్ లో అడిగాడు. మళ్లీ అదే మౌనం.
“మూగవాడేమో పాపం,” అన్నాడు ప్రొఫెసర్ పెదవి విరుస్తూ. ఆయన గార్కి బోలెడు భాషలు తెలుసని కాస్త ఇది మరి. ఈ సారి పాపం ఫ్రెంచ్ లో అడిగి చూశాడు.
"Comment appellet-on cette montagne, mon enfant?"

మళ్ళీ అదే నిశ్శబ్దం.
“ఈ సారి ఇటాలియన్ లో అడిగి చూద్దాం.” అంటూ ఇలా అడిగాడు,
“Dove noi siamo?”
“కాస్త చెప్పవూ? ఇప్పుడు మనం ఎక్కడున్నాం?” నేను కూడా ఆత్రంగా అడిగాను.
అయినా సమాధానం లేదు.
“ఏరా? సమాధానం చెప్తవా లేదా?” ఈ సారి చెవి మెలిపెడుతూ  ఇటాలియన్ లోనే మరో మాండలికంలో అడిగాడు మావయ్య,
"Come si noma questa isola?"
స్ట్రోంబోలీ!” ఈ సారి ఠక్కున సమాధానం చెప్పాడు పాపం ఆ పల్లె పిల్లవాడు. మావయ్య తేరుకునేంతలో ఆయన చేతుల్లోంచి జారుకుని అల్లంత దూరంలోని ఆలివ్ చెట్ల వెనుక దాక్కున్నాడు.
స్ట్రోంబోలీ! మేం అసలు కల్లో కూడా ఊహించని విషయం. మేం ఇప్పుడు వున్నది మధ్యధరా సముద్రపు నడిబొడ్డులో. ఎయోలియన్ ద్వీపమాలికలో ఇదొక దీవి అన్నమాట. ఈ ద్వీపమాలికకి ప్రాచీన కాలంలో స్ట్రాంగైల్ అని పేరు. (దీని ఆధునిక పేరు సాంటోరినీ ద్వీపమాలిక – అనువాదకుడు). గ్రీకు పురాణం ప్రకారం ఎయోలస్ అనే వీరుడు ఇక్కడే గాలిని, తుఫానుని గొలుసులతో కట్టేసి, తరువాత బుద్ధి పుట్టినప్పుడు వొదిలేశాడు. అదుగో, దూరాన తూర్పున కనిపిస్తున్న నీలి కొండలే కాలాబ్రియా కొండలు. ఇంకా అల్లంత దూరాన మబ్బులకి మాటేస్తున్న బృహన్నగమే ఎట్నా.
“స్ట్రోంబోలీ! స్ట్రోంబోలీ!” పలవరిస్తున్నట్టుగా నాలో నేనే అనుకున్నాను.
నాతో పాటు మావయ్య, హన్స్ కూడా ఆ దివ్యనామాన్నే కాసేపు ఆనందంగా జపించారు.
మా యాత్ర సమాప్తమయ్యింది. ఒక అగ్నిపర్వతం లోంచి భూగర్భం లోకి దూరి, ఆ స్నెఫెల్ పర్వతం నుండి, ఆ మోడువారిన మంచు భూమి నుండి, ఇంచుమించు రెండు వేల మైళ్ల దూరంలో వున్న మరో జ్వాలాముఖి నోట్లోంచి ఊడి పడ్డాం. ఎన్నో యాదృచ్ఛిక సంఘటనల ఫలితంగా భువి మీద వెలసిన ఈ దివసీమలో వచ్చి పడ్డాం. మరణ తుల్యమైన ఆ భయంకర శీతల లోకం నుండి ఈ అతిసుందరమైన ఇటలీ దేశాన్ని చేరుకున్నాం!
ముగ్గురం ‘ఫల’హారం చేసి, చల్లని నీరు కడుపార తాగి త్వరగా స్ట్రోంబోలీ రేవు చేరుకున్నాం. ఇక్కడికి మేం ఎందుకొచ్చాం, ఎలాగొచ్చాం మొదలైన రహస్యాలన్నీ ఎవరితోనూ పంచుకోదలచుకోలేదు. పడవ మునక వల్ల ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అభాగ్యులం అని పరిచయం చేసుకున్నాం.
దారి పొడుగునా మావయ్య ఏదో సణుగుతూనే వున్నాడు. “మరి ఆ దిక్సూచి! ఏంటి మరి అలా చెప్పింది. అదేమో ఉత్తరానికి చూపించింది. మనమేమో ఇలా దక్షిణానికి వచ్చి చేరాం…”

“నేనో కారణం చెప్పనా,” కాస్త అసహనంగా అన్నాను. “దానికి జబ్బు చేసుంటుంది. ఇప్పుడదంతా ఎందుకు మావయ్యా?”

“అదేంటి ఆలాగంటావు? యోహానియమ్ లో ఆచార్య పీఠాన్ని అలంకరించిన నా బోటి వాడు ఓ మామూలు ఖగోళ రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోవడమా? ఎంత పరాభవం? ఎంత పరాభవం?”
చింకి బట్టలతో, నడుం చుట్టూ ఓ వికారమైన బెల్టుతో, పక్షులు చూసి జడుసుకునే లాంటి ఆకారంతో, ముక్కు కొస మీద ప్రమాదకంగా వేలాడే కళ్లద్దాలతో ప్రతిభ ఉట్టీపడే జర్మను ఖనిజశాస్త్ర ప్రొఫెసర్ మా మావయ్యలో మళ్లీ మూర్తీభవించాడు.
 ఓ గంట తరువాత ముగ్గురం సాన్ విన్సెంజో రేవుని చేరుకున్నాం. హన్స్  కి రావలసిన పదమూడు వారాల జీతభత్యాలు ముట్టాయి. ముగ్గురం ఘాటుగా కరచాలనాలు చేసుకున్నాం.
నాకైతే ఇక ఏడుపు ఒక్కటే తక్కువ. మావయ్య గొంతు కూడా గాద్గదికమయ్యింది.
 ఎప్పుడూ స్నెఫెల్ పర్వతంలా అస్మితంగా ఉండే ఆ వేటగాడి ముఖంలో కూడా ఆ క్షణం ఓ చక్కని చిరునవ్వు ఉషోదయంలా వెల్లివిరిసింది.

(సమాప్తం)


 (పాతాళానికి ప్రయాణం నవల నేటితో సమాప్తం)








పాతాళ లోకపు చీకటి కూపాల్లో ఇంతకాలం కొట్టుమిట్టాడిన మేము ఇలాంటి దృశ్యం చూడడానికి కళ్ళు కాయలు కాచి వున్నాము.
“ఎక్కడున్నాం మనం? అసలెక్కడ ఇదంతా?” పరధ్యానంగా గొణుగుతున్నట్టుగా అడిగాను.
హన్స్ కేసి తిరిగి చూశాను, ఏవంటాడా అని. నిర్లక్ష్యంగా కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు.
మావయ్య మాత్రం ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని పరిసరాలని చూస్తున్నాడు.
“ఈ పర్వతం పేరు ఏవైనా కావచ్చు. కాని ఇక్కడ చాలా వేడిగా వుంది. పర్వతంలో విస్ఫోటాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఇంతా శ్రమ పడి అగ్నిపర్వతం లోంచి బయట పడ్డాక ఏ బెడ్డో నెత్తిన పడి పోవడంలో అర్థం లేదు. కనుక వీలైనంత వేగంగా ఈ ప్రదేశం నుండి తప్పుకుంటే మంచిది. పైగా నాలుక పిడచకట్టుకు పోతోంది. కడుపులో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి,” మావయ్య తన తీర్మానం వెల్లడి చేశాడు.
చూడబోతే మావయ్య ఇక్కడే కూర్చుని ఈ ప్రకృతి ఆస్వాదించే స్థితిలో లేడు. నేనైతే తిండి తిప్పలు లేకుండా మరో రెండు గంటలైనా ఇక్కడే కూర్చుని ఈ దృశ్యాన్ని కన్నార్పకుండా చూసేయగలను. కాని ఏం చేస్తాం? నలుగురితో నారాయణ…

మేం వున్న పర్వతం వాలు అంత తక్కువేం లేదు. కిందకి దిగడానికి నానా తిప్పలూ పడ్డాం. కొన్ని చోట్ల బూడిద దిబ్బల మీద జర్రున జారాం. మరి కొన్ని చోట్ల జ్వాలామయ సర్పాల్లా నెమ్మదిగా మాకు అల్లంత దూరంలో పాకుతూ ముందుకు పోయే లావా సెలయేళ్లని ఒడుపుగా తప్పించుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందుకి సాగిపోయాం. దారి పొడవునా మరి నేనైతా ఏవో తలా తోకా లేని ప్రశ్నలతో మా నేస్తాలు ఇద్దరినీ తెగ వేధించానట. తరువాత తెలిసింది.

వాళ్ల దగ్గర్నుండి తృప్తికరమైన సమాధానాలు రాకపోయే సరికి ఇక నేనే చెప్పేశాను.
“మనం వున్నది ఆశియాలో. ఇండియా తీరం మీద వున్నాం. లేదా మలయా దీవుల మీద ఎక్కడో వుండి వుంటాం. అదీ గాక పోతే పసిఫిక్ మహా సముద్రం నడిబొడ్డులో వుండే చిట్టి పొట్టి దీవుల మీద ఎక్కడైనా వున్నామేమో.” నా ఊహలు అదుపు తప్పాయి.  “మనం భూమి కేంద్రం వరకు పోయి, అవతలి పక్క, అంటే అవతలి ధృవం వద్ద బయటికి వచ్చామనుకుంటా.”
“మరి దిక్సూచి మాటేవిటి?” మావయ్య నింపాదిగా అడిగాడు.
“అవును కదూ!” గుర్తు తెచ్చుకుంటూ అన్నాను. “దిక్సూచి ఏదో చెప్పింది నిజమే. దాని ప్రకారం మనం ఉత్తరంగా వెళ్లాం.”
“మరి అది చెప్పింది అబద్ధం అంటావా?” మావయ్య అడిగాడు.
“ససేమిరా కాదు. పాపం అదెందుకు అబద్ధం చెప్తుందీ?”
“పోనీ ఇది ఉత్తర ధృవం అంటావా?”
“ఇది ధృవం అని మాత్రం అనను. దీనికి ధృవానికి ఉండాల్సిన లక్షణాలేవీ లేవు.”
ఎంత ఆలోచించినా ఎక్కడున్నామో పట్టుపడడం లేదు. ఏం అనలేక ఇక నోరు మూసుకున్నాను.

మేం అలా నడుస్తూ ముందుకి సాగిపోతుంటే ఒక చోట ఓ పచ్చని పరిసరాలలోకి ప్రవేశీంచాం. అందులోకి ప్రవేశించగానే నా ఆకాలి, దాహం ఒకే సారి లోపలి నుండి తన్నుకొచ్చాయి. చుట్టూ ఆలివ్, దానిమ్మ, ద్రాక్ష మొదలైన చెట్లు నోరూరిస్తున్నాయి. కోసుకోమని, దోచుకోమని ఆహ్వానిస్తున్నాయి. మేం అదే చేశాం. ద్రాక్ష గుత్తుల్ని కోసుకుని మెత్తగా నోట్లోకి తోసుకుని ఆరగిస్తుంటే … పాతాళ లోకం లోంచి సూటిగా స్వర్గ లోకం లోకి వచ్చినట్టు అనిపించింది! అల్లంత దూరంలో స్వచ్ఛమైన నీరు నీట్లోంచి ఉబుకుతోంది. ఆత్రంగా వెళ్లి అక్కడ ముఖం, కాళ్లు, చేతులు కడుక్కున్నాం.


అలా మాకు చేతనైన మేరకు ఏవో ఐహిక సుఖాలు అనుభవిస్తుంటే అంతలో ఆలివ్ చెట్ల మాటు నుండి ఓ చిన్న పిల్లవాడు బయటికి వచ్చాడు.

అధ్యాయం  44
మధ్యధరా సముద్రపు సుమధుర తీరంపై

నాకు మళ్లీ తెలివి వచ్చేసరికి మా గైడు ఒక చేత్తో నా బెల్టు పట్టుకుని వున్నాడు. మరో చేత్తో మావయ్యని కాస్తున్నాడు. నాకు తీవ్రమైన గాయాలేం తగల్లేదు గాని చర్మం బాగా చెక్కుకుపోయింది. చుట్టూ చూసుకుంటే అగ్నిపర్వత బిలానికి కేవలం రెండు గజాల దూరంలో కొండ వాలు మీద పడి వున్నాను. కాస్త పక్కకి జారి వుంటే మళ్లీ అగ్నిపర్వత బిలంలో పడి నామరూపాల్లేకుండా మాయపైపోయి వుండేవాణ్ణి.
“ఇంతకీ ఎక్కడ పడ్డాం మనం?” మావయ్య చిరగ్గా అన్నాడు చుట్టూ చూస్తూ. ఆ చిరాకు ఎవరి మీద? దేని కోసం? హాయిగా ఆ పాతాళంలో దేవుళ్ళాడక మళ్లీ ఈ భూమ్మీద పడ్డామేంటని కోపమా?

తెలీదన్నట్టు తల అడ్డుగా ఊపాడు హన్స్.
“ఐస్లాండా?”
“నెజ్” అన్నాడు హన్స్ నిశ్చయంగా. ఐస్లాండ్ మాత్రం కాదన్నమాట.
“ఏంటీ! ఐస్లాండ్ కాదా?” ఆశ్చర్యంగా అడిగాడు మావయ్య.
“హన్స్ పొరబడి వుంటాడు,” నెమ్మదిగా పైకి లేచి దుమ్ము దులుపుకుంటూ అన్నాను.
మా అద్బుత, అలౌకిక యాత్రకి ఇదో కొసమెరుపు. ఎక్కడో ఉత్తర ప్రపంచంలో, ఆకాశాన్నంటే హిమవన్నగాలచేత పరివేష్టితమైన తెల్లని మంచు భూముల మీద ఎక్కడో పైకి తేలతాం అనుకున్నాను. కాని చర్మాన్ని కాల్చేసే వాడి రవికిరణాల కింద వ్రేలిపోతూ ఇలా ఓ కొండ వాలు మీద దిగబడతాం అని కల్లో కూడా ఊహించలేదు.
చుట్టూ నిండి వున్న కాంతికి కళ్లు బైర్లు క్రమ్ముతున్నాయి. ఆ వెలుగుకి అలవాటు పడి చుట్టూ ఏవుందో అర్థం చేసుకోడానికి కొంత సమయం పట్టింది. నాకైతే మేం చేరుకున్నది కచ్చితంగా స్పిట్జ్‍బెర్గెన్ దీవేనని అనిపిస్తోంది.

నా ఆలోచనలని చెదరగొడుతూ మావయ్య అన్నాడు –
“ఇది ఐస్లాండ్ లాగా అనిపించడం లేదు.”
“పోనీ ఇది యాన్ మాయెన్ దీవి అయ్యుంటుందా?” అడిగాన్నేను.
“అది కూడా కాదు,” మావయ్య బదులిచ్చాడు. “ఇదసలు ఉత్తర ప్రాంతంలో వుండే కొండే కాదు. ఇక్కడ మంచు శిఖరాలు లేవు. ఏయ్ ఏక్సెల్, అటు చూడు!”

మా నెత్తి మీద ఐదొందల అడుగున పైన అగ్నిపర్వతం యొక్క నోటి అంచు కనిపిస్తోంది. అందులోంచి పది పదిహేను నిముషాల కొకసారి అగ్నిధారలు ఎగసెగసి పడుతున్నాయి. అగ్నిపర్వతం నోట్లోంచి రగిలే లావా ద్రవం అంత ఎత్తుకి ఎగజిమ్మబడుతోంది. కొండ వాలు మీదుగా అగ్నిద్రవపు సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. కాని కొండ దిగువన అంతవరకు కనిపించని పచ్చని చెట్ల గుబుళ్ళు కనిపించాయి. ఆలివ్, అత్తిపండు, ద్రాక్ష మొదలైన చెట్ల ఆనవాళ్లు స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఇది ససేమిరా ఆర్కిటిక్ మాత్రం కాదు.

ఈ పచ్చని పరిసరాల కావల విశాల, వీనీల జలాశయమేదో కనిపించింది. కేవలం కొద్దిపాటి కోసుల మేరలో ఆ జలాశయం కొండని కౌగిలిస్తోంది. కాస్త తూర్పు దిశగా చూస్తే ఓ ముద్దులొలికే చిన్నారి రేవు ఏదో కనిపిస్తోంది.  చిత్రమైన నిర్మాణం గల ఓడలేవో పడి లేచే కెరటాల మీద అక్కడ ఊయలలాడుతున్నాయి. అల్లంత దూరంలో ఎన్నో చిట్టి చిట్టి ద్వీపాలు విశాలమైన నీలి నీటి మైదానం మీద చుక్కల్లా మెరిసిపోతున్నాయి. కాస్త పశ్చిమంగా చూస్తే ఏవో సుదూర తీరాలు నింగి నేల కలిసేచోట మసక వెలుగులో లీలగా గోచరిస్తున్నాయి. ఇంకా దూరాన వున్న మరో తీరం మీద ఓ గంభీరమైన హిమవన్నగం మేఘమండలాన్ని ఛేదిస్తోంది. ఉత్తరంగా అనంతంగా విస్తరించిన మహార్ణవం  మీద మహోగ్ర భాను కిరణాలు పడగా నీటిపై ఓ అద్భుత రశ్మి రహదారి  ఏర్పడింది. ఆ దారిని కోసుకుంటూ అప్పుడప్పుడు ఓ ఓడ తెల్లని రెపరెపలాడే తెరచాపల ప్రోద్బలానికి ఠీవిగా నీటి దారుల వెంట ముందుకు సాగిపోతోంది.



పాతాళ లోకపు చీకటి కూపాల్లో ఇంతకాలం కొట్టుమిట్టాడిన మేము ఇలాంటి దృశ్యం చూడడానికి కళ్ళు కాయలు కాచి వున్నాము.

“అవును. సందేహమే లేదు,” మావయ్య అన్నాడు తన కళ్ళద్దాల్లోంచి నన్ను అదో రకంగా చూస్తూ. భూమి ఉపరితలాన్ని చేరుకోడానికి ఇంతకన్నా అనువైన మార్గమే కనిపించడం లేదు.”

మావయ్య మాటల గురించి కాసేపు శ్రద్ధగా అలోచించాను. ఆలోచించి చూస్తే ఆయన చెప్పేది నిజమే ననిపిస్తోంది. విప్లవాత్మకమైన, అవాస్తవికమైన ఉపాయాలు ఆయన బుర్రలో పుట్టడం ఇది మొదటి సారి కాదు. ఎందుకో మరి ఈ సారి మాత్రం అయన చెప్పేది నిజం అవుతుందని అనిపిస్తొంది. వింటి నుండి బాణంలా అగ్నిపర్వతం నడి బొడ్డు లోంచ మేము, మా తెప్ప ఆకాశంలోకి వెళ్ళగక్కబడబోతాం అన్నమాట!

కాలం గడుస్తున్న కొద్ది మా ఆరోహణ కొనసాగుతూనే వుంది. మా చుట్టూ శబ్దాలు ఇంకా ఇంకా తీవ్రతరం అవుతున్నాయే తప్ప సద్దుమణిగా సూచనలు కనిపించడం లేదు. మర్త్య ఘడియ అనుకున్నది మా జీవితాల్లోనే ఓ అమృత ఘడియ కాబోతోందన్న ఆశాభావం మనసంతా అక్రమించుకుంది.

సలసల కాగే నీటి కెరటం మా తెప్పని ఆగకుండా పైపైకి తీసుకుపోతోంది. ఏదో అగ్నిపర్వతం లోని సొరంగ మార్గంలో మేము ఎలాగో చిక్కుకున్నాం. మమ్మల్ని అది వాంతి చేసుకునే శుభతరుణం కోసం బిక్కుబిక్కు మంటూ ఎదురుచూస్తున్నాం.

కేప్ సాక్నుస్సేం నుండీ కొన్ని వందల కోసులు ఉత్తరంగా కదిలి వచ్చినట్టు వున్నాం. మళ్ళీ ఐస్లాండ్ కిందకి వచ్చామేమో మరి తెలీదు. హెక్లా మొదలుకొని ఏడు నగరాజాల్లో ఏది మమ్మల్ని వెళ్లగక్కనుందో తెలియడం లేదు. మరి కాస్త పశ్చిమంగా మరో ఐదొందల కోసుల వ్యాసార్థంలో,  అమెరికా ఖండం యొక్క  ఉత్తర-తూర్పు కొసలో, ప్రస్తుత అక్షాంశానికి సమాంతరం అక్షాంశంలో అంత తెలియని కొన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక తూర్పు దిశగా చూస్తే 80  డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఎస్క్ అనబడే మరో అగ్నిపర్వతం వుంది. యాన్ మాయెన్ దీవి మీద వున్న ఈ అగ్నిపర్వతం (ఆధునిక నార్వే లోని) స్పిట్జ్‍బెర్గెన్  దీవికి ఎంతో దూరంలో లేదు. ఆ అగ్నిపర్వతాలలో కొన్నిటి బిలాలు ఎంత విశాలంగ వుంటాయంటే, ఒక్క బుల్లి తెప్ప కాదు గదా, ఇలాంటి తెప్పలు కుప్పలు తెప్పలుగా ఆ పర్వతాలు అవలీలగా వెళ్లగక్కగలవు!

పాతాళంలోంచి భూలోకానికి మమ్మల్ని తీసుకుపోయే ఆ నిర్గమ ద్వారం ఇంతకీ ఏ అగ్నిపర్వతంలో వుందో తెలుసుకోవాలని మాత్రం చాలా ఆత్రంగా వుంది.

ఉదయం అవుతున్న కొద్ది మా ఆరోహణా వేగం మరింత పుంజుకుంది. వేడిమి కూడా తగ్గకపోగా మరింత హెచ్చయ్యింది. మమ్మల్ని పైకి తోస్తున్న శక్తి ఎలాంటిదో నెమ్మదిగా అవగతం కాసాగింది. వాతావరణ పీడనానికి కొన్ని వందల రెట్లు అధిక పీడనం ప్రచండ వేగంతో మమ్మల్ని పైకి నెట్టుకుపోతోంది.

పైకి పోతున్న కొద్ది వికారమైన కాంతులు మా చుట్టూ గోడల మీద తారాడడం కనిపించింది. అక్కడక్కడ గోడల లోని నోళ్ళు భుగభుగమని పొగలు కక్కుతున్నాయి. అగ్నికీలలు గంగవెర్రులెత్తి నాట్యం చేసున్నాయి.

“అమ్మో! చూడు మావయ్యా!” భయంగా మంటల్ని మావయ్యకి చూపించాను.
“అదేం ఫరవాలేదులే,” మావయ్య ఎపట్లాగే నింపాదిగా అన్నాడు. అవన్నీ గంధకిక ధూమాలు. అగ్నిపర్వతాలలో అతి సహజాలు.”
“కాని అవి మనని పూర్తిగా కబళిస్తాయేమో.”
“అలాగేం చెయ్యవు.”
“ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక పోతామేమో.”
“అలాగేం కాదంటున్నానా!”
“అలా ఎలా చెప్పగలవు?”
“మనం ప్రయాణ్నిస్తున్న సొరంగ మార్గం క్రమంగా విశాలమవుతోంది. కనుక పొగలు మనని ఉక్కిరిబిక్కిరి చెయ్యవు. అంతగా అయితే సకాలంలో ఈ తెప్పని వొదిలేసి ఏ బిలం లోనో దూరి తలదాచుకుందాం.”

“కాని మరి ఈ వేణ్ణీళ్ళ మాటేమిటి?”
“ఇక నీళ్ళు లేవు ఏక్సెల్. కావాలంటే చూడు. మన కింద వున్నది ఇప్పుడు లావా చూర్ణం మాత్రమే. ఉపరితలం వద్దకి మనని మోసుకుపోతున్నది అదే.”

మా తెప్పని మోసి పట్టుకున్న చూర్ణం లాంటి  పదార్థం  ఏంటో గాని కుతకుతలాడుతోంది. ఉష్ణోగ్రత 150  వరకు ఉంటుందేమో. నాకైతే చర్మం కాలిపోతోంది. పైకి వేగంగా కదులున్నాం గనుక సరిపోయింది గాని  లేకుంటే ఈ పాటికి ఉడికిపోయేవాళ్లం.

సుమారు ఉదయం  8  గంటలకి తెప్ప కదలడం ఆగిపోయింది.
“ఏంటి? విస్ఫోటం ఆగిపోయిందా?” ఆదుర్దాగా అడిగాను.

“అబ్బ! నువ్వు ఊరికే కంగారు పడతావు ఏక్సెల్. ఈ నిశ్చల స్థితి ఎంతో సేపు ఉండదని అనిపిస్తోంది. ఇప్పటికి ఐదు నిముషాలు గడిచాయి. మరో రెండు నిముషాల్లో మళ్లీ కదులుతాం చూడు.”
మావయ్య చెప్పినట్టే కాసేపట్లో తెప్ప మళ్లీ దాని ఆరోహణ కొనసాగించింది. అలా గజిబిజి గతిలో మరో పది నిముషాలు పైకి కదిలి మళ్లీ ఆగిపోయింది. అలా ఆగాగి కదిలే కార్యక్రమం ఎన్ని సార్లు జరిగిందో గుర్తులేదు.
అయితే కదిలిన ప్రతీ సారి ఇంకా ఇంకా బలంగా మా తెప్ప పైకి నెట్టబడుతోంది. అలా జరిగిన ప్రతి సారి ఆ దెబ్బకి నా గుండె ఆగినంత పనయ్యేది. ఇలాంటి సమయంలో ఆ ఆర్కిటిక్ అతిశీతల తలాల మీదనో హాయిగా చేరగిలబడితే ఎంత బావుంటుందో? హిమావృతమైన తెల్లని తిన్నెలని ఊహించుకుంటూ ఎటో కలలలో తేలిపోయాను. కాని ఇంతలో హన్స్ నన్ను జబ్బ పట్టుకుని పక్కకి ఈడ్చకపోయి వుంటే నా తల ఓ రాతి చూరుకి తగిలి పగిలి వుండేది.

ఆ తరువాత కొన్నిగంటల పాటు ఏం జరిగిందో అంతా గందరగోళంగా వుంది. ఆ సన్నివేశానికి చెందిన జ్ఞాపకాలన్నీ అస్తవ్యస్తంగా వున్నాయి. ఎడతెగని విస్ఫోటాలతో మా పరిసరాలు అతలాకుతలం అవుతున్నాయి. చెవులు చిల్లులు పడేలాంటి చప్పుళ్లతో నేపథ్యం మారుమ్రోగిపోతోంది. ఉవ్వెత్తున ఎగసిపడే అగ్నికీలలు సొరంగం మొత్తాన్ని కబళిస్తున్నట్టున్నాయి.

ఏ శక్తి మా తెప్పని ఆఖరి తాపు తన్నిందో తెలీదు గాని, తెప్పతో పాటు దాన్నే నమ్ముకున్న మేం ముగ్గరమూ ఫిరంగి లోంచి దూసుకొచ్చే గుండులా ఆ అగ్నిపర్వత ముఖం లోంచి గాల్లోకి దూసుకుపోయాము.

(నలభై మూడవ అధ్యాయం సమాప్తం)






శబ్దం – భౌతిక శాస్త్రం పాఠం.

Posted by V Srinivasa Chakravarthy Friday, June 20, 2014 0 comments

శబ్దం – భౌతిక శాస్త్రం పాఠం.   ఐసాక్ అసిమోవ్ రచనల ఆధారంగా…

శబ్దం

శబ్దం ఒక తరంగం అని తరచు వింటుంటాం. అసలు తరంగం అంటే ఏమిటి?
తరంగం అంటే ఏమిటో, తరంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోడానికి నీటిలోని అలలని నమూనాగా తీసుకోవచ్చు.

నిశ్చలమైన నీటిలో ఒక చిన్న రాయిని నెమ్మదిగా పడేశాం అనుకోండి.


రాయి పడ్డ చోట నీరు కాస్త లోపలికి నొక్క బడుతుంది. గాలి లాకా కాక నీటి మీద ఒత్తిడి చేసినప్పుడు దాని ఘనపరిమాణంలో పెద్దగా మార్పు రాదు. కనుక నీటి మీద ఒక చోట ఒత్తిడి చేస్తే, అక్కడ నీరు కాస్త కిందికి పోతుంది. కాని ఆ నీరు కేవలం ఆ ప్రదేశం నుండి పక్కకి జరుగుతుంది. కనుక రాయి పడ్డ చోటికి కాస్త అవతలగా నీటి మట్టం కాస్త పెరుగుతుంది.



మరి రాయి పడ్డ చోటికి ఎటుపక్క అలా నీటి మట్టం  పెరుగుతుంది? రాయి పడింది ఓ బిందువు వద్ద అనుకుంటే, అక్కడ నుండి స్థానభ్రంశం చెందిన నీరు అన్నిపక్కలకి కదలగలదు అనుకుంటే, ఆ మధ్య బిందువుకి చుట్టూరా నీటి  మట్టం పెరగాలి అని అనుకోవలసి వుంటుంది. అందుచేత రాయి పడ్డ చోటి చుట్టూ ఓ వలయాకారంలో నీటి మట్టం పెరుగుతుంది.

అలా పైకి లేచిన నీరు గురుత్వం వల్ల మళ్లీ కిందకి పడుతుంది. అలా కిందకి పడుతున్న నీరు, మొదట నీట్లో పడ్డ రాయిలాగానే ప్రవర్తిస్తుంది. నీరు కిందకి దిగిన చోట ఓ చిన్న లొత్త ఏర్పడుతుంది. అక్కడి నీరు స్థానభ్రంశం చెంది అన్నిపక్కలకి కదులుతుంది. కాస్తంత దూరంలో మళ్లీ నీటి మట్టం పెరుగుతుంది. ఈ సారి మొదట ఏర్పడ్డ నీటి వలయం వ్యాపిస్తూ కేంద్రానికి దూరం అవుతూ వుంటుంది.



రాయి నీట్లో పడ్డప్పుడు కేవలం ఒకే వలయం పుట్టి, కేంద్రం నుండి వ్యాపిస్తూ పోదు. మొట్టమొదటి వలయం పుట్టినప్పుడు అది కేవలం దానికి అవతల మాత్రమే నీటి మట్టాన్ని పెంచదు. దాని లోపల కూడా అంటే కేంద్రం వద్ద నీటి మట్టాన్ని పెంచుతుంది. ఆ విధంగా కేంద్రం వద్ద నీటి మట్టం పెరుగుతుంది. అలా కేంద్రం వద్ద పైకి లేచిన నీరు మళ్లీ కింద పడుతుంది. అలా కింద పడ్డ నీరు మొదట పడ్డ రాయిలాగే ప్రవర్తిస్తుంది. మరో వలయం పుడుతుంది. అది కేంద్రం నుండి వ్యాపిస్తూ పోతుంది.

ఆ విధంగా మొదట మనం పడేసిన రాయి ప్రభావం వల్ల ఆ పడ్డ బిందువు కేంద్రంగా పలు వలయాలు పుట్టి, అవి క్రమంగా కేంద్రం నుండి వ్యాపిస్తూ పోతాయి. అయితే ఆ చలనం అనంతంగా సాగుతూ పోదు. పడి లేస్తున్న నీటిలోని గతి శక్తి క్రమంగా నీట్లోని ఉష్ణంగా మారిపోతుంది. ఆ విధంగా నిజానికి నీరు కాస్త వేడెక్కుతుంది. గతి శక్తి పూర్తిగా ఉష్ణంగా మారినప్పుడు ఇక చలనం ఆగిపోతుంది. (రోడ్డు మీద దొర్లించిన బంతి కాస్త దూరం దొర్లాక ఆగిపోడానికి కారణం కూడా ఇదే – రోడ్డుకి, బంతికి మధ్య ఉండే రాపిడి వల్ల బంతి యొక్క గతి శక్తి ఉష్ణంగా మారుతుంది. ఆ కారణం చేత బంతే కాక రోడ్డు కూడా కాస్త వేడెక్కుతుంది.) కనుక రాయిని నీట్లో పడేసినప్పుడు, రాయి యొక్క గతిశక్తి నీటి యొక్క గతిశక్తిగా మారుతుంది. ఆ గతిశక్తి నీటి మీద పుట్టే వలయాల రూపంలో రాయి పడ్డ కేంద్ర బిందువు నుండి దూరంగా తరలించబడుతుంది. అయితే కాలక్రమేణా ఆ గతిశక్తి ఉష్ణం కింద మారి నష్టమైపోతుంది.

రాయి పడేయడం వల్ల నీట్లో పుట్టిన వలయాలనే తరంగం అంటారు.

1. తరంగాన్ని పుట్టించడానికి మొదట ఒక అలజడి (disturbance) వుండాలి.  పై సందర్భంలో రాయి వల్ల అలజడి పుట్టింది.
2. తరంగంలో శక్తి వుంటుంది. పై సందర్భంలో పైకి కిందకి కదిలే నీటి గతిశక్తి రూపంలో ఆ తరంగం యొక్క శక్తి వుంది.
3. తరంగం వల్ల  ఒక చోటి నుండి మరొక చోటికి శక్తి ప్రసారం (propagate) అవుతుంది. రాయిని పడేసింది ఒక చోట అయితే తరంగంలోని వలయాలు, ఆ చోటి నుండి దూరంగా కదులుతాయి.
4. తరంగానికి మాధ్యమం కావాలి. పై సందర్భంలో నీరు ఆ మాధ్యమం.

తరంగం యొక్క కదలిక, పదార్థం యొక్క కదలికతో సమానం కాదు. పై సందర్భంలో వలయాలు కేంద్ర బిందువు నుండి వేగంగా వ్యాపిస్తూ దూరం కావడం చూస్తాం. కాని నీటి మీద ఒక బిందువు వద్ద నించుని, అక్కడ నీటి మట్టంలో కదలికలని గమనిస్తూ, అక్కడ నీరు కేవలం పైకి కిందకి మాత్రమే కదలడం కనిపిస్తుంది. దీన్ని పరీక్షించడానికి నీటి ఉపరితలం మీద చిన్న కాగితం ముక్క వేసి చూసుకోవచ్చు. కాగితం ముక్క ఉన్న చోటనే పైకి కిందికి కదలడం కనిపిస్తుంది గాని, వలయాలతో సమానంగా కేంద్రం నుండి దూరంగా కదలదు.
పై లక్షణాలు తరంగాన్ని నిర్వచిస్తాయి. తరంగం యొక్క విలక్షణతని వ్యక్తం చేస్తాయి.

(ఇంకా వుంది)










కొత్త పుస్తకాలు

1. జంతు సమాజాలు - అవి మనకి నేర్పే పాఠాలు




2.  ఐజాక్ అసిమోవ్ రాసిన 'ఎలా తెలుసుకున్నాం?' సీరీస్ లో 'కాంతివేగం'




ప్రచురణకర్త
http://www.manchipustakam.in/

పై నుండి కిందకి వదిలేయబడ్డ ట్రాన్స్‍పోర్టర్ పరిభ్రమిస్తున్న పెద్ద పెద్ద వలయాల మధ్య నుండి కిందికి పడుతూ సూటిగా కింద వున్న సముద్రంలో పడిపోతుంది. అల్లంత దూరంలో కంట్రోల్ రూమ్ నుండి ఈ తంతంతా చూస్తున్న సిబ్బంది అదిరిపోతారు. కంట్రోల్ రూమ్ లో కలకలం మొదలవుతుంది.

ఇంత ఖర్చుతో నిర్మించిన యంత్రం విఫలమయ్యింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. బహుశ తార నుండి వచ్చిన సందేశాన్ని డీకోడ్ చేసే ప్రయత్నంలో పొరబడి వుంటారు.  పోనీ ఎల్లీ ప్రాణాలతో సురక్షితంగా ఉంటే చాలు. కంట్రోల్ రూమ్ లోని సిబ్బంది ఆలోచనలు ఈ రకంగా సాగుతుంటాయి.

ఎల్లీని సురక్షితంగా కంట్రోల్ సెంటర్ కి తెచ్చి విశ్రమించనిస్తారు. పూర్తిగా మతిస్థిమితం తప్పినట్టుగా మాట్లాడుతుంటుందామె.

“నేనిప్పుడు ఎక్కడున్నాను? ఈ రోజు ఏం తారీఖు? నేను ఎంత కాలం వెళ్లాను?” చుట్టూ వున్న వారి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.
“అయామ్ సారీ! నువ్వు ఎక్కడికీ వెళ్ళలేదు ఎల్లీ! ట్రాన్స్‍పోర్టర్ నేరుగా నీళ్లలో పడిపోయింది,” అంటాడు పాజెక్ట్ మేనేజర్.
“నీళ్లలో పడిపోవడం ఏంటి? నేను నిజంగా వెళ్లాను…” అంటూ తనకి కలిగిన అనుభవాలన్నీ పూస గుచ్చినట్టు చెప్తుంది. తను కనీసం పది, ఇరవై గంటలు వెళ్లి వుంటుందని తనకి అనిపించినట్టు చెప్తుంది.
కావలిస్తే తను రికార్డ్ చేసిన వీడియో చూడమంటుంది. కాని కామ్ కార్డర్ లోని అంశాలని చూస్తే అంతా వట్టి రొద తప్ప మరింకేమీ రికార్డు కాలేదని తేలుతుంది.
ఎల్లీ నిర్ఘాంతపోతుంది. తను చెప్పింది ఎవరూ నమ్మరు. బయటికి మర్యాదగా ఊరుకున్నా తనకి నిజంగానే మతిస్థిమితం తప్పిందని అందరూ అనుకుంటూ వుంటారు.
ఈ విషయం మీద పెద్ద వివాదం చెలరేగుతుంది. మీడియా ఈ విచిత్రం గురించి హోరెత్తిస్తూ ఉంటుంది.
యూ.ఎస్. లో ఓ న్యాయస్థనంలో ఈ వివాదం విచారణకి వస్తుంది. బయటి నుండి చూసే వారికి కొద్ది క్షణాల్లో జరిగిపోయినట్టు అనిపించిన ఘటన, లోపల ట్రాన్స్‍పోర్టర్ లో వున్న ఎల్లీ కి ఎన్నో గంటల పాటు జరిగినట్టు అనిపించడం ఎలా సాధ్యం? ట్రాన్స్‍పోర్టర్ లో కాలం నెమ్మదించినట్టు అనుకోవాలా? అసలు అలాంటిది భౌతిక శాస్త్రం ప్రకారం సాధ్యమేనా? మొదలైన ప్రశ్నలు తలెత్తుతాయి.

భౌతిక శాస్త్రవేత్త అయిన ఎల్లీ అలాంటిది సైద్ధాంతికంగా సాధ్యం కావచ్చేమోగాని వాస్తవంలో అలాంటి పరిణామానికి దాఖలాలు లేవంటుంది. ఉదాహరణకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విశ్వంలో సుదూర స్థలాలని కలుపుతూ ఐన్‍స్టయిన్-రోసెన్ వంతెనలు (Einstein-Rosen bridges)  అనేవి వుంటాయని, వీటి ద్వార ఎంతో దూరాలని అతి తక్కువ సమయంలో దాటే అవకాశం వుంటుందని అంటుంది. కాని ఇలాంటి వంతెనలు వాస్తవంలో వున్న ఆధారాలు లేవు కనుక న్యాయస్థానానికి నమ్మశక్యం కానట్టుగా తోచుతుంది.
(http://en.wikipedia.org/wiki/Wormhole)

ఎల్లీ పరిస్థితి పూర్తిగా ఇరకాటంలో పడుతుంది. ఒక విధంగా అస్తికులు ఎదుర్కునే సమస్యే శుద్ధ నాస్తికురాలైన తను కూడా ఎదుర్కున్నట్టు అయ్యింది. అస్తికులు, అందులో ఎంతో కొంత “అనుభవం” వున్న వారు, తమ అనుభవానికి రకరకాల పేర్లు పెడతారు. ఏదో దేవత కనిపించిందనో, కాంతి కనిపించిందనో, ఆనందాతిరేకం అనుభవం అయ్యిందనో పట్టుపడతారు. అయితే ఆ అనుభవానికి బాహ్య ఆధారాలు ఉండవు కనుక, అవతలి వారికి దాన్ని నిరూపించడం సాధ్యం కాదు. కనుక అలాంటి అనుభవాన్ని నమ్మినవాళ్లు నమ్ముతారు. నమ్మని వాళ్లు నవ్విపోతారు.

న్యాయవిచారణ పూర్తవుతుంది. ఎల్లీ చేసిన తప్పేమీ లేదని నిర్ణయిస్తుంది న్యాయస్థానం.
కాని కోర్ట్ కొడవ పూర్తైన కొంత కాలం తరువాత ఓ ఆశ్చర్యకరమైన విషయం బయట పడుతుంది. ఎల్లీ రికార్డ్ చేసిన వీడియోని మరో సారి పరిశీలించిన మీదట అందులో వున్నది మొత్తం రొదే అయినా ఆ రొద యొక్క వ్యవధి పద్దెనిమిది గంటలు అని తేలుతుంది! కేవలం కొన్ని క్షణాల్లో అంత బారైన వీడియో ఎలా రికార్డ్ అవుతుంది?
ఆ చిన్న సూక్ష్మం వల్ల ఎల్లీ చెప్పిన కథనం నిజమని బయటపడుతుంది.

మతానికి, విజ్ఞానానికి మధ్య వుండే వివాదం ఒక విధంగా నేపథ్యంగా ఉన్న ఈ సినిమా ఈ విధంగా ఆ రెండు దృక్పథాలకి మధ్య సమన్వయం చూపడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమన్వయం అందరూ ఒప్పుకుంటారని కాదు. ఎందుకంటే ఆ రెండు ధృవాలకి మధ్య సమన్వయమనేది ప్రస్తుతానికి ఒక ఆశ, లేక ఆశయంగానే వుంది గాని అది ఇంకా వాస్తవం కాదు.

ఏదేమైనా ఆ సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎన్నో లోతైన ప్రశ్నలు తలెత్తేట్టు చేస్తుంది, ఆ ప్రశ్నల గురించి ప్రేక్షకులని ఆలోచింప జేస్తుంది.
మరి మంచి సినిమా యొక్క ప్రయోజనం అదే కదా?







అధ్యాయం  43
అగ్నిపర్వతం మమ్మల్ని విసిరేసింది

అవును. దిక్సూచి ఇక పని చెయ్యనని మొరాయించింది. పిచ్చి పట్టి నట్టు అటు ఇటు దిక్కులు చూసింది గాని ఏది ఎటో చెప్పలేకపోయింది.
ప్రస్తుతం చలామణిలో వున్న భౌగోళిక సిద్ధాంతాల ప్రకారం భూమి మీద ఉండే ఖనిజ సంపద ఇప్పుడూ పూర్తి నిశ్చల స్థితిలో వుండదు. దాని రసాయనిక కూర్పులో వచ్చే మార్పుల  వల్లనైతేనేమి, అందులోని అపారమైన ద్రవప్రవాహాల వల్లనైతేనేమి, తత్ఫలితంగా పుట్టే తీవ్రమైన అయస్కాంత క్షేత్రాల వల్లనైతేనేమి ఖనిజ విస్తరణలో రకరకాల మార్పులు వస్తుంటాయి. పైన జీవించే అమాయక మానవాళికి మాత్రం లోపల అంతా స్థిరంగా, స్తబ్దుగా వుందని అనిపిస్తుంది.

కాని ప్రస్తుత స్థితిలో భూ గర్భంలో ఎంత అల్లకల్లోలంతో కూడిన వాతావరణం ఉంటుందో స్వానుభవంలో తెలుస్తోంది. కోటి రధాలు ఒక్కసారిగా దూసుకొస్తుంటే భూమి దడదడలాడినట్టు, ఎడతెగని పర్జన్య గర్జనతో దిక్కులు పిక్కటిల్లుతున్నట్టు మా పరిసరాలు చెవులు చిల్లులు పడే నినదాలతో మారుమోగిపోతున్నాయి.
మా దిక్సూచి పాపం వెర్రెక్కి గిరికీలు కొడుతోంది. ఇక సందేహం లేదు. భూతలపు పైపొర ఇక ఛిన్నాభిన్నం అవుతోంది. బలమైన బండలు బద్దలై భూమిని పెల్లగించుకుని పైకి తన్నుకొస్తాయి. పెద్ద పెద్ద చీలికలు ఏర్పడి భూమి లోతుల్లో వుండే సలసల మరిగే పాషాణద్రవం పైకి వెళ్ళగక్కబడుతుంది. ఇక మేమంతా ఈ పాతాళ ప్రళయంలో చిక్కుకుని భూస్థాపితం కావడం ఖాయం.

“మావయ్యా!” ఇక ఆపుకోలేక బావురు మన్నాను. “అంతా అయిపోయింది మావయ్యా. ఇక ఆశ వదులుకున్నాను.”
“ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకిలా డీలా పడిపోతున్నావు? ఇప్పుడేవయ్యిందని?” మావయ్య ఎప్పట్లాగే నింపాదిగా అడిగాడు.
“ఏవయ్యింది అంటావేంటి మావయ్యా?అసలు చుట్టూ ఏం జరుగుతోందో చూస్తున్నావా? నీటి కుతకుతలు వినిపించటంలా? మంటల భుగభుగలు వినిపించడంలా? భూకంపం రాబోతోంది, మావయ్యా. భూకంపం రాబోతోంది!” ఆవేశంగా అన్నాను.
మావయ మత్రం నిశ్చింతగా తల అడ్డుగా ఊపాడు.
“భూకంపం వస్తోందంటావా? నాకలా ఏమీ అనిపించడంలేదే!”
“నా కనిపిస్తోంది మరి!”
“నువ్వు పొరబడ్డావు అనుకుంటా.”
“మరైతే ఇదంతా ఏంటి నీ ప్రకారం?”
“ఇదో విస్ఫోటం ఏక్సెల్,” తాపీగా అన్నాడు మావయ్య.
“విస్ఫోటమా?” అరిచినంత పని చేశాను. “అంటే మనం ఇప్పుడు అగ్నిపర్వతంలో వున్నామా? ఆ అగ్నిపర్వతం లోని సొరంగం లోంచి పైకి తన్నుకొస్తున్నామా?”
“అవునని నా అభిప్రాయం. అంతే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంతకన్నా సత్పరిమాణాన్ని ఆశించలేము.”
“ఇది సత్పరిమాణం అంటావా?” నమ్మశక్యం కానట్టు అడిగాను.
“అవును. భూమి ఉపరితలాన్ని వేగంగా చేరుకోడానికి ఇంత కన్నా మంచి మార్గాంతరం కనిపించడం లేదు నాకు.”
మంచి మార్గమా? ఇక సందేహమే లేదు. మా మావయ్యకి నిజంగా పిచ్చే! కొండ పిండి కాబోతోంది, లావా వరదల్లె ప్రవహించబోతోంది, ఆకాశమంతా మసిమయం కాబోతోంది. ఇక ఆ పాషాణ ప్రయణంలో మేం మిడుతల్లా మాడబోతున్నాం. ఇంత కన్నా మంచి మార్గం కనిపించలేదట మా మావయ్యకి … చావటానికి! 

అన్య ప్రజ్ఞతో ప్రథమ సమాగమం

Posted by V Srinivasa Chakravarthy Sunday, June 15, 2014 2 comments

ట్రాన్స్‍పోర్టర్ ని పై నుండి కింద పడేయగానే అందులో ప్రయాణిస్తున్న ఎల్లీకి తానో సొరంగంలో పడిపోయిన అనుభూతి కలుగుతుంది. ఆ సొరంగంలో తను జర్రున జారుతూ ప్రచండ వేగంతో కదులుతున్నట్టు అనిపిస్తుంది. మెలికలు తిరుగుతూ అంతరిక్షంలో విస్తరించి వున్న ఆ సొరంగం ఎటు పోతోందో, తనను ఎటు తీసుకుపోతోందో అర్థం కాదు. తనకు కలుగుతున్న అనుభూతులని తన మౌత్ పీస్ లో చెప్తూ రికార్డ్ చేసుకోడానికి ప్రయత్నిస్తుంది.


అలా ఎన్ని నిముషాలు, గంటలు ప్రయాణించిందో తెలియదు. ఉన్నట్టుండి ఒక చోట ఉక్కిరిబిక్కిరి చేసే ఆ చలనం ఆగిపోతుంది. తను ఎక్కడో అంతరిక్షంలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఎదుట కనిపించిన దృశ్యానికి తనకి నోట మాటరాదు. ఆ అందాన్ని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఎదుట ఓ ప్రకాశవంతమైన గెలాక్సీ! మామూలుగా టెలిస్కోప్ ల నుండి సుదూర గెలాక్సీలని పరిశీలించి వాటి ఆకారాలని అందంగా చిత్రీకరిస్తారు. కాని ఇక్కడ తను కళ్లార ఓ అద్భుతమైన ‘స్పైరల్ గెలాక్సీ’ ని చూడగలుగుతోంది. అలాంటి  అనుభూతి పొందిన మొదటి మనిషి తనే. ‘అబ్బ! ఇంత అందాన్ని వర్ణించడానికి నాకే గాని కవిత్వం వస్తే ఎంత బావుంటుంది!’  అనుకుంటుంది మనసులో. మరు క్షణం మళ్ళీ ఆ ఉధృతమైన చలనం మొదలవుతుంది. సొరంగంలో ఎటో కొట్టుకుపోవడం మొదలెడుతుంది.

మళ్ళీ ఓ సారి ప్రయాణం ఒక చోట ఆగుతుంది. కింద చూస్తే ఏదో గ్రహం యొక్క ఉపరితలం మీద బోలెడు సన్నని కాంతులు కనిపిస్తాయి. అదేదో నగరం కాబోలు అనుకుంటుంది. నాగరికతకి చిహ్నం… అలా అనుకునేంతలో మళ్ళీ ప్రయాణం కొనసాగుతుంది.

అలా ఎంతో సేపు ప్రచండ వేగంతో దిక్కు తెన్ను తెలియకుండా ఆ సొరంగంలో  ప్రయాణిస్తుంది. మళ్లీ ఉన్నట్లుండి ఒక చోట చలనం ఆగుతుంది. ఆ కుదుపుకి అంతవరకు నిద్రలో జోగుతున్న తను ఉలిక్కిపడి లేస్తుంది. ఆ క్షణం తను చీకటి ఆకాశంలో నిశ్చలంగా ఒక చోట నిలిచి వుంటుంది. కింద కొంత దూరంలో ఏదో గ్రహం యొక్క ఉపరితలం లాంటిది కనిపిస్తుంది. మెల్లగా ఏదో శక్తి తనని మోస్తున్నట్టు కిందకి దిగుతుంది లేదా దింపబడుతుంది.

అదో సముద్ర తీరంలా వుంటుంది. దూరంగా అంతా చీకటి గా వున్నా సముద్ర తీరం మాత్రం ఏదో చిత్రమైన కాంతితో ప్రకాశిస్తుంటుంది. ఆకాశంలో దూరంలో సన్నని కాంతితో ఇద్దరు సూర్యుళ్లు ప్రకాశిస్తుంటారు. నల్లని తెర మీద వజ్రాలు పొదిగినట్టు పైన తారలు తీక్షణమైన కాంతితో మెరిసిపోతుంటాయి. ఒక విధమైన అలౌకిక సౌందర్యం ఆ ప్రాంతం అంతటా పొటమరిస్తుంటుంది.

కాసేపు ఆ పరిసరాలని తేరిపార చూశాక ఎందుకో ఆ ప్రదేశం కాస్త అవాస్తవికంగా తోస్తుంది ఎల్లీ కి. చేయి చాచి చూస్తుంది. ఆ చేయి దేనికో తగిలి చుట్టూ ఉండే దృశ్యం రాయి విసిరిన నీట్లోని ప్రతిబింబం చెదిరిపోయినట్టుగా విచిత్రంగా చెదిరిపోవడం కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తనకి. తను చూస్తున్న పరిసరాలు యదార్థం కాదు. అదొక కృతక యదార్థం (virtual reality).

అంతలో అల్లంత దూరంలో తీరం మీద నడుచుకు వస్తూ ఓ ఆకారం కనిపిస్తుంది. ముందు అలుక్కుపోయినట్టుగా, మసక మసకగా వున్న ఆ ఆకారం దగ్గర అవుతున్న కొద్ది మరింత స్పష్టం అవుతూ వస్తుంది. ఆ ఆకారం దగ్గరికి వచ్చాక అదెవరో చూసి అదిరిపోతుంది! అది మరెవరో కాదు. తన తండ్రి! ఎప్పుడో తన చిన్న తనంలో చనిపోయిన తండ్రి!


వెంటనే ఏదో ఆలోచన వచ్చి ఆ వ్యక్తిని తాకి చూస్తుంది. ఇందాక పరిసరాల లాగానే ఆ ఆకారం కూడా చెదిరిపోవడం కనిపిస్తుంది. తన తండ్రి ని పోలిన ఆ ఆకారం కూడా నిజం కాదు!

ఎల్లీ మనసు నిండా కోటి ప్రశ్నలు వున్నాయి. ఏంటి ఇదంతా? అసలు ఎవరు మీరు?  ఆ సందేశం ఎందుకు పంపారు? మా చేత ఈ యాత్ర చెయ్యించడంలో మీ ఉద్దేశం ఏంటి?
ఆ తండ్రి లాంటి ఆకారం చెప్పుకొస్తుంది.

“మీ దగ్గర్నుండి సందేశం (జర్మన్ ఒలింపిక్స్ సందర్భంలో హిట్లర్ టీవీ ఉపన్యాసం) అందగానే మీ ఉన్కి గురించి తెలిసింది. మా ఉన్కిని తెలపడం కోసం దాన్ని రికార్డ్ చేసి తిరిగి మీకు పంపాము. దాంతో పాటు ఈ యాత్ర చెయ్యడానికి కావలసిన సమాచారం పంపాం.”
ఎల్లీ ఆ సొరంగాల గురించి అడుగుతుంది. “అవన్నీ మీరే నిర్మించారా?”
“లేదు. అవి ఎప్పట్నుంచో వున్నాయి. మేం వాటిని కనుక్కుని వాటిని వాడుకుంటూ వుంటాము.”
“ఈ పరిసరాలు, ఇవన్నీ కృతకం కదా. ఇవేవీ నిజం కావుగా?”
“అవును. నీతో సంభాషించడం కొసం, నీకు మరింత అనువుగా ఉండడం కొసం ఇలా చేశాం. ఈ తీరం, ఈ చెట్లు, నేను – ఇవేవీ నిజం కావు. ఇవన్నీ ఓ  కృతక యదార్థం లో మేం చేసిన సృజన మాత్రమే.”
“మరి మా నాన్నగారి గురించి మీ కెలా తెలుసు?”
“నువ్వు ట్రాన్స్‍పోర్టర్ లో ప్రయాణిస్తున్నప్పుడు నీ మెదడులోని స్మృతులని మేం డౌన్ లోడ్ చేసుకున్నాం. ఆ విధంగా నువ్వు మాట్లాడే భాష గురీంచి, నీ అయిన వాళ్ల గురించి, నువ్వు చిన్నప్పుడు పెరిగిన పరిసరాల గురించి తెలుసుకున్నాం. కనుక ఆ రీతిలో నీతో సంభాషణ జరపాలని నిశ్చయించాం. ఎందుకంటే మేం మేముగా నీ ముందుకు వస్తే నువ్వు ఇబ్బంది పడతావు. మా భాషలో నీతో మాట్లాడితే నువ్వు అర్థం చేసుకోలేవు. కనుక మరో గత్యంతరం కనిపించలేదు మాకు.”

ఎల్లీ కాసేపు ఏమీ మాట్లాడదు. జరుగుతున్న అనుభవాలని జీర్ణం చేసుకోడానికి తనకి కష్టంగా వుంది. పైగా ఇన్నేళ్ళ తరువాత తనకి అత్యంత ప్రియమైన తండ్రి ఇలా తనకి తారసపడడం… ఆ వ్యక్తి నిజం కాదని తెలిసినా, అదో యాంత్రికమైన కల్పన అని తెలిసినా, తనలో భావావేశం కట్టలు తెంచుకుంటుంది.

ఇంతలో ఆ తండ్రి లాంటి ఆకారం వీడ్కోలు చెప్తుంది. ఇక తిరుగు ప్రయాణానికి వేళయ్యింది అంటుంది.
కాని ఎల్లీ వెంటనే వెళ్లిపోవడానికి సిద్ధంగా లేదు. ఇంకా ఎన్నో సందేహాలు. వాటన్నిటికీ సమాధానాలు రాబట్టాలి. బోలెడంత కొత్త పరిజ్ఞానంతో తిరిగి వెళ్లాలి. తనని నమ్మి ఇంత వ్యయప్రయాసలతో కూడుకున్న యాత్ర మీద తనని పంపినందుకు మానవాళికి న్యాయం చెయ్యాలి.

“ప్రగతి ఎప్పుడూ చిన్న చిన్న అడుగులతోనే సాధ్యం అవుతుంది,” అంటుందా ఆకారం. “ఈ సారికి ఇంతకు మించి సాధ్యం  కాదు.”
“మళ్లీ ఎప్పుడు?” అడుగుతుంది ఎల్లీ.
“ఏమో చెప్పలేను,” అంటాడు చిరునవ్వు నవ్వుతూ ఆ వ్యక్తి వీడ్కోలు చెప్తాడు.
చుట్టూ పరిసరాలు క్రమంగా ఓ కలలాగా కరిగిపోవడం మొదలెడతాయి. తారలు ధూళిలా రాలి పడిపోతుంటాయి. గాలిలో ఊగుతున్న తాళ వృక్షాలు చీకట్లో నీశ్శబ్దంగా కరిగిపోతుంటాయి.
తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
(ఇంకా వుంది)



సల సల కాగే నీటిపై సవారి

Posted by V Srinivasa Chakravarthy Saturday, June 14, 2014 0 comments

“ఫొర్ ట్రేఫిగ్” అన్నాడు హన్స్ ఉత్సాహంగా డచ్ లో.
“అద్భుతం,” బదులు ఇచ్చాడు మావయ్య.
ఆ కాస్త పదార్థం కడుపులో పడ్డాక మళ్లీ ప్రాణం లేచొచ్చింది. అంతవరకు మొద్దు బారిపోయినట్టు ఉన్న మనసులో ఇప్పుడు ఏవో జ్ఞాపకాలు మెదుల్తున్నాయి. కోనిగ్స్‍స్ట్రాసే లో మా ఇంట్లో నా కోసం కలలుకంటున్న నా బంగారు గ్రౌబెన్ తీపి గుర్తులు లోనుంచి తన్నుకొస్తున్నాయి. పాపం మార్థా ఎలా వుందో?
నేనిలా చివరి ఘడియలు లెక్కెట్టుకుంటూ పరధ్యానంగా వుంటే మావయ్య మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు. మా ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నాడు కాబోలి. మావయ్యలో ఇదే అత్యద్భుతమైన లక్షణం. ఎంత విపరీత పరిస్థితుల్లో అయినా స్థిమితం కోల్పోకుండా తక్షణ కర్తవ్యం గురించే ఆలోచిస్తాడు గాని తబ్బిబ్బు కాడు.

ఏదో సణుగుతున్నాడు. ఆ సణుగుడులో కూడా అక్కడక్కడ ఏదో భౌగోళిక శాస్త్ర పరిభాష జాలువారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భౌగోళిక శాస్త్రం గురించి, పురావస్తు పరిశోధన గురించి ఆలోచించేవాణ్ణి ఏవంటారో తెలీదు గాని ఆ వ్యక్తి ససేమిరా మనిషి కాడు!
“ఇది విస్ఫోటక కంకర!” తేల్చి చెప్తున్నట్టుగా అన్నాడు మావయ్య. మా ఎదుట గల రాతి గోడ మీద వ్యాఖ్యానిస్తున్నాడు.
“ఇది నైస్ ( gneiss) జాతి రాయి. ఇదో మైకా షిస్ట్. దీన్ని బట్టి మనం సంక్రమణ దశని దరిజేరుతున్నాం అని అర్థమవుతోంది.. దీని తరువాత…”
ఏంటి మా ప్రొఫెసరు అనేది? చుట్టూ ఉన్న రాతి లక్షణాల బట్టి మా నుండు ఉపరితలం ఇంకా ఎంత ఎత్తున వుందో అంచనా వేస్తున్నాడా? ఎలా కుదుర్తుంది? ఈయన వద్ద బారోమీటర్ కూడా లేదు. ఇది వట్టి ఊహాగానం తప్ప మరేం లేదు.
పైకి పోతున్న ఉష్ణోగ్రత ఇంకా ఇంకా పెరుగుతోంది. ఒళ్ళు ఉడికిపోతోంది. కొలిమి నోట్ళోకి ఉరకబోతున్న కరిగిన లోహం లా వుంది మా పరిస్థితి.
“ఏంటిది మావయ్యా? మనం ఏ రాతి కొలిమి లోకైనా ప్రవేశించబోతున్నామా?”
“లేదు  లేదు. కచ్చితంగా లేదు, అది అసంభవం,” ధీమాగా అన్నాడు మావయ్య.
“మరి ఇదేంటి ఇంత వేడిగా వుంది.”
అడుగున వున్న నీట్లోకి ఓ సారి వేలు ముంచితే చుర్రు మంది.
“నీళ్లు ఉడికిపోతున్నాయి,” గట్టిగా అరిచాను.
మావయ్య విసుక్కుంటూ నోరు ముయ్యమన్నట్టుగా వారించాడు.
ఇక నాకున్న ఆఖరి ఆశ కూడా మాయమైపోయింది. మనసంతా నిస్పృహ ఆవరించింది. ఎంత నిగ్రహించుకున్నా భయం ఆగడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రత… కుతకుతలాడుతున్న నీరు… ఇక ఇంతే సంగతులు. మేం ఎక్కడున్నామో? ఏమై పోతున్నామో? ఎటు పోతున్నామో?
వెంటనే ఆ పక్కనే వున్న దిక్సూచి కేసి చూశాను. అది మా కన్నా ముందే చచ్చిపోయింది!

(నలభై రెండవ అధ్యాయం సమాప్తం)






“ఉంది. కాస్తంత ఉప్పుడు మాంసం వుంది. దాంతో ముగ్గురం సరిపెట్టుకోవాలి.”
ఆ తరువాత ఎవరం కాసేపు మాట్లాడలేదు. ఓ గంట గడిచింది.
కడుపులో ఆకలి పేగులు తోడేస్తున్నట్టు వుంది. ఆ మిగిలిన కాస్తంత ఆహారాన్ని ముట్టుకోవడానికి ఎవరికీ  మనసు రాలేదు.
మా వేగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని సార్లు గాలి ధాటికి ఊపిరి సలిపేది కాదు. చుట్టూ గాలి వేడెక్కుతున్నట్టు అనిపిస్తోంది. ఉష్ణోగ్రత 100  ఫారెన్ హీట్ ఉంటుందేమో.

ఇలాంటి పరిణామానికి కారణం ఏవై వుంటుందో? ఇంత వరకు మాకు కలిగిన అనుభవాల మేరకు డేవీ గారి, మా లీడెన్ బ్రాక్ మావయ్య గారి సిద్ధాంతాలు నిజమని తేలింది. మరిప్పుడు మా చుట్టూ ఉండే రాళ్ల ఉష్ణవాహక శక్తి మహిమో, లేక విద్యుదయస్కాంత శక్తుల లాస్యమో ఏమో తెలీదు గాని మా పరిసరాలు నులి వెచ్చగా మాత్రమే ఉండడంతో మేం బతికిపోయాం. కాని పృథ్వీ కేంద్రంలో మహోగ్రమైన ఉష్ణోగ్రత ఉంటుందనే సిద్ధాంతం నిజమే అయితే మా ఈ తిరుగు ప్రయాణంలో నైనా అలాంటి అత్యుష్ణమైన ప్రాంతం లోంచి పోవాలిగా?
సందేహ నివారణ కోసం మావయ్య కేసి తిరిగాను.

“మునిగి పోవాల్సింది. ముక్కలు అవ్వాల్సింది. మింగమెతుకు లేక ఎప్పుడో పోవాల్సింది. కాని ఎలాగో తప్పించుకున్నాం. కాని ఇక ముందైనా మండి మసి కామని నమ్మకం ఏంటి?”
‘నాకు మాత్రం ఏం తెలుసు?’ అన్నట్టు భుజాలు ఎగరేశాడు మావయ్య.
మరో గంట గడిచింది. ఉష్ణోగ్రత మరి కాస్త పెరగడం తప్ప మరేమీ జరగలేదు.

“మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి రావాలి,” నెమ్మదిగా అన్నాడు మావయ్య.
“నిర్ణయమా? ఏంటది?”
“మన వద్ద మిగిలిన ఆ కాస్త ఆహారాన్ని పొదుపుగా వాడుకుని, ఈ చివరి ఘడియల్లో జాగ్రత్తగా నెట్టుకురావాలి.”
“ఏంటి మావయ్యా నువ్వనేది? ఈ కాస్త మాంసం తింటే మన ఆయుర్దాయం మరి రెండు గంటలు పెరుగుతుందేమో. ముందసలు మనం బతికి బయటపడాలిగా.”
“అందులో ఏం సందేహం?”
“మనం బతికి బయటపడతామని నీకు నమ్మకం వుందా?”

“నిశ్చయంగా వుంది. గుండె కొట్టుకుంటున్నంత కాలం, దేహం నిలిచి వున్నంత కాలం, ఆత్మ లోన వెలుగారుతున్నంత కాలం, ప్రాణం భయాన్ని దరిజేర నివ్వాల్సిన పని లేదు,” మావయ్య ధీమాగా అన్నాడు.
ఆ మాటల్లో వజ్రం లాంటి సంకల్పబలం తొణికిసలాడింది. ఆ మాటలు అన్న మనిషి సామాన్యుడు కాడని అనిపించింది.

మావయ్య ఇంకా ఇలా అన్నాడూ. “ఉన్న దాంతో ఎలాగో సరిపెట్టుకుందాం. ఆ కాస్త తింటే కాస్త ఓపిక వస్తుంది. గాలి తీసిన తిత్తిల లాగా మిగిలిపోక, కాక జీవం వున్న వ్యక్తులం అవుతాం.”

ఉన్న కాస్త ఆహారాన్ని ముగ్గురం పంచుకుని ఆత్రంగా తిన్నాం. ఇంతలో హన్స్ కి ఎలా దొరికిందో ఏమో హోలాండ్స్ జిన్ గల ఓ ఫ్లాస్క్ దొరికింది. ఆ మధుర పానీయంతో కృతజ్ఞతాపూర్వకంగా గొంతులు తడుపుకున్నాం.

(ఇంకా వుంది)

ఇంచుమించు ట్రిలియన్ డాలర్ల  పై చిలుకు వ్యయంతో నిర్మించబడుతున్న ట్రాన్స్‍పోర్టర్ ఓ మూఢుడి దుడుకు చేష్ట  మూలంగా కళ్ల ముందే అలా నీళ్లపాలు అవ్వడం చూసి కేప్ చుట్టూ బారులు తీరి వున్న ప్రేక్షక వర్గం నిర్ఘాంతపోతారు.

ఎన్నో ఎదురుదెబ్బలు రుచి చూసిన ఎల్లీ కూడా ఆ దెబ్బకి వెంటనే తేరుకోలేకపోతుంది. తను వెళ్లలేకపోయినా ఏదో విధంగా ప్రాజెక్ట్ విజయవంతమై, ఎవరో ఒకరు ఆ యాత్ర చేసి సుదూర గ్రహ వాసులని సంపర్కించి రాగలిగితే తనకి అంత కన్నా సంతోషకరమైన విషయం లేదు. కాని ఇప్పుడా ఆశలన్నీ నీటగలిశాయి.

అంతలో ఎస్. ఆర్. హాడెన్ మళ్లీ తనని సంపర్కిస్తాడు. విచారపడవలసిన పని లేదని, గుట్టుగా అదే యంత్రం యొక్క మరో నమూనాని జపాన్ లో హొకాయ్డో దీవి మీద నిర్మిస్తున్నారని చెప్తాడు. ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే, దీని నిర్మాణంలో మీడియా జోక్యం వుండదు. అనవసరమైన రాజకీయ పితలాటకం వుండదు. ఎందుకంటే అందులే హాడెన్ పెట్టుబడి ఎంతో వుంది.

ఇక ట్రాన్స్‍పోర్టర్ లో ప్రయాణించబోయేది ఎవరో కాదు – హాడెన్ కి ఎంతో ప్రీతి పాత్రమైన, అతడి గౌరవాన్ని, విశ్వాసాన్ని మొదటి నుండి చూరగొన్న డా. ఎలియనోర్ ఏరోవే!

అది విన్న ఎల్లీ ఎగిరి గంతేస్తుంది.
ప్రయాణానికి సన్నాహాలు మొదలవుతాయి.  అందులో భాగంగా ఓ సయనైడ్ కాప్సూల్ అవసరమైతే వుంటుందని ఇస్తారు. మాన్యుయల్ లో వున్నది తప్ప మరే ఇతర జాగ్రత్తలూ తీసుకోవద్దని వాదిస్తుంది ఎల్లీ. ఆ మాన్యుయల్ మీద, తార నుండి వచ్చిన సందేశం మీద ఆమె నమ్మకం అలాంటిది!

గోళాకారంలో వుండే ట్రాన్స్‍పోర్టర్ మధ్యలో వున్న ఓ కుర్చీలో కూర్చుంటుంది ఎల్లీ. అందులో ఇంకేమీ వుండవు, కంట్రోల్ పానెళ్లు, మానిటర్లు, రంగురంగుల ఎల్. ఈ.డి…. ఇవేమీ వుండవు. హెల్మెట్ కి ఓ చిన్న కామ్ కార్డర్ తగిలించి వుంటుంది. అప్పట్నుంచి జరగబోయేదంతా రికార్డ్ చేసి తిరిగి వచ్చాక భూలోకానికి ప్రకటించాలనే ఉత్సాహంతో వుంది ఎల్లీ!

మూడు వలయాలలో కరెంటు స్థాయిని క్రమంగా పెంచుతూ పోతారు. వాటి నడి బొడ్డులో తీక్షణమైన విద్యుదయస్కాంత క్షేతం ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలో ఉన్నట్లుండి ఓ చిన్నపాటి సూర్యుడు ప్రత్యక్షమైనట్టుగా ప్రచండమైన కాంతి ఉత్పన్నమవుతుంది.


లోపల కుర్చున్న ఎల్లీకి ట్రాన్స్‍పోర్టర్ దేహం అంతా కంపిస్తున్నట్టుగా తోస్తుంది. అంతే కాక దాని పదార్థంలో ఏవో చిత్రమైన మార్పులు రావడం కనిపిస్తుంది. వెండి రంగులో వున్న గోడలు కాస్త క్రమంగా పారదర్శకంగా అయిపోతున్న అనుభూతి కలుగుతుంది.

అనుకున్నట్టుగానే ట్రాన్స్‍పోర్టర్ ని పై నుండి ఆ వలయాల మధ్య పడేట్టుగా కింద పడేస్తారు.
ఆ క్షణం ఎల్లీకి కలిగిన అనుభూతి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

(ఇంకా వుంది)





అధ్యాయం 42
పైపైకి ఇంకా పైకి … చీకటి గుయ్యారం లోకి

రాత్రి పది అయ్యుంటుంది. ఒళ్లు హూనం చేసి, బతుకుని అతలాకుతలం చేసిన అనుభవాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. వశం తప్పిన ఇంద్రియాలు నెమ్మదిగా వశపడుతున్నాయి. ముందుగా తెప్పరిల్లిన ఇంద్రియం – వినికిడి.
అంతవరకు మా చుట్టూ మారుమ్రోగిపోయిన ప్రళయ భీకర ఘోష స్థానంలో ఇప్పుడు చిక్కని నిశ్శబ్దం నెలకొంది.
ఆ నిశ్శబ్దంలో గుసగుసగా మావయ్య మాటలు వినిపించాయి.
“మనం పైకి పోతున్నాం.”
“ఏంటి నువ్వనేది?” అర్థం కాక అరిచాను.
“అవును. పైకి పోతున్నాం.”
చేయి చాచి గోడని తాకబోయాను. వేళ్లు చెక్కుకుపోయి రక్తం కారుతున్న చేతిని వెనక్కి తీసుకున్నాను. ప్రచండ వేగంతో  మేం పైకి కదులుతున్నాం.
“టార్చ్ కావాలి. టార్చ్ ఏది?” అరిచాడు మావయ్య.
పెద్దగా ఇబ్బంది పడకుండా హన్స్ టార్చ్ వెలిగించాడు. దాని కాంతిలో మేం ఎక్కడున్నామో నెమ్మదిగా అర్థం కాసాగింది.
“నేను అనుకున్నట్టే అయ్యింది,” అన్నాడు ప్రొఫెసర్. “మనం ఉన్న సొరంగం వ్యాసం ఇరవై నాలుగు అడుగులు వుంటుందేమో. నీరు సొరంగం అట్టడుగు స్థానానికి చేరుకుంది. ఇప్పుడు మళ్లీ పైకి లేస్తోంది.”
“ఎక్కడికి లేస్తోంది?”
“ఏమో చెప్పలేను. కాని దేనికైనా సిద్ధంగా ఉండాలి. చూడబోతే మన ఆరోహణా వేగం సెకనుకి పద్నాలుగు అడుగులు ఉంటుందేమో. అంటే గంటకి పది మైళ్లు!”
“ఇలా ఎంత సేపని పైకి కదులుతాం? ఎప్పటికీ ఆగమా? ఈ సొరంగం పైన ఏవుందో? పైన గాలి మందిరం వుండి, నీరు పైపైకి పోవడం వల్ల ఆ మందిరంలోని గాలి సంకోచించబడి, ఒత్తిడి విపరీతంగా పెరిగి, ఆ ఒత్తిడికి మనం నుజ్జు నుజ్జు అయితే?”
“ఏక్సెల్” మవయ్య అనునయిస్తున్నట్టుగా అన్నాడు. “మన పరిస్థితి అంత హర్షనీయంగా ఏమీ లేదని నాకూ తెలుసు. అనుక్షణం మన ఆఖరి క్షణం కావచ్చు. అలాగే మనకి విముక్తి నిచ్చే అమృత క్షణాలు ఏ క్షణానైనా రావచ్చు నని అనుకోవడంలో తప్పేమీ లేదు. కనుక మంచే జరుగుతుందని ఆశిస్తూ సిద్ధంగా వుందాం.”

“మరి ఇప్పుడేం చేద్దాం?”
“తిందాం!”
“తినడమా?” సరిగ్గ విన్నానో లేదో సందేహం కొద్దీ అడిగాను.
మావయ్య హన్స్ కేసి తిరిగి డేనిష్ లో ఏదో అన్నాడు. హన్స్ తల అడ్డంగా ఊపాడు.

“తినడానికి అస్సలేమీ లేదా?” మావయ్య అరిచినంత పని చేశాడు.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts