శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

న్యూటన్ - హూక్ సంవాదాలు

Posted by V Srinivasa Chakravarthy Tuesday, August 2, 2016


రాయల్ సొసయిటీకి వచ్చిన పరిశోధనా పత్రాలలో వర్ణించబడ్డ ప్రయోగాలు చేసి చూసి వాటి న్యాయాన్యాయాలు విచారించడం హూక్ బాధ్యత. అయితే  కాంతి శాస్త్రం మీద న్యూటన్  రాసి పంపిన పత్రాన్ని హూక్ శ్రధ్ధగా చదవలేదు. అందులో ప్రయోగాలని మళ్లీ చేసి చూసి నిర్ధారించే ప్రయత్నం చెయ్యలేదు. అయినా న్యూటన్ సిద్ధాంతాన్ని ఇంచుమించు సమగ్రంగా సమ్మతించాడు హూక్. కాంతి ఒక కణ ధార అని న్యూటన్ బోధించాడు అన్న విషయం గురించి అంతకు ముందు చర్చించుకున్నాం. దీన్నే కాంతి కణ సిద్ధాంతం అంటారు. కాని రోజుల్లో కాంతి ఒక తరంగం అని నమ్మే ఒక శాస్త్రీయ వర్గం  ఉండేవారు. వారిలో హూక్ ఒకడు. పైగా కాంతి ఒక తరంగం అన్న భావనని సమర్ధించే ఒక ప్రభావం వుంది. దాన్ని వివర్తనం (diffraction) అంటారు

వివర్తనం అంటే ఏంటో తెలుసుకోవాలంటే చిన్న ప్రయోగం చెయ్యొచ్చు. చూపుడు వేలికి, మధ్య వేలికి మధ్య చిన్న సందు వచ్చేలా వేళ్లు బిగించి పట్టుకుని, సందు లోంచి తెల్లని, తగినంత ప్రకాశవంతమైన  నేపథ్యాన్ని చూడాలి. అలా చూస్తున్నప్పుడు రెండు వేళ్లకి మధ్య సన్నని నల్లని చార కనిపిస్తుంది. కాంతి ఒక తరంగం అన్న భావనతో ప్రభావాన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తాడు హూక్. వివర్తనానికి మరో సామాన్యమైన ఉదాహరణని తీసుకుందాం. వర్షం పడ్డ రోడ్డు మీద ఎక్కడైనా పెట్రోల్ కారితే అక్కడ నీటి మీద పెట్రోల్ సన్నని పొరలాగా వ్యాపిస్తుంది. కొన్ని కోణాల నుండి పెట్రోల్ చారలని చూస్తే అవి పలు రంగుల్లో కనిపిస్తాయి. పెట్రోల్ కి రంగు లేదు, నీటికి రంగు లేదు. మరి  రంగులు ఎక్కణ్ణుంచి వచ్చాయి? ఇలాంటి ప్రభావాలని పరిశీలించిన హూక్ కాంతి ఒక తరంగం అన్న భావన వైపే మొగ్గు చూపాడు. న్యూటన్ ప్రతిపాదించిన కాంతి కణ సిద్ధాంతం చాలా వరకు నిజమే కవచ్చునేమో గాని ఇలా కొన్ని ప్రత్యేక సందర్భాలలో  మాత్రం పొరబడిందని హూక్ అభిప్రాయం.


 
తడి రోడ్డు మీద చమురు చిందినప్పుడు కనిపించే రంగురంగుల చారలు.

హూక్ స్పందన విన్న న్యూటన్కాంతి ఒక కణం అన్న విషయంలో ఇక వివాదమే లేదని నా అభిప్రాయం,” అని గట్టిగా జవాబు చెప్పాడు.  కాని కాంతి తరంగ సిద్ధాంతాన్ని సమర్ధించే హూక్, న్యూటన్ చెప్పేది వట్టి నిరాధారిత ఊహాగానం అని కొట్టిపారేశాడు. “అసలు అతగాడు వర్ణించిన ప్రయోగాలు కూడా కాంతి ఒక తరంగం అన్న భావనని, ఒక పారదర్శకమైన, సమమైన మాధ్యమంలో ప్రసారం అయ్యే తరంగం అన్న భావనని సమర్ధిస్తున్నాయి,” అంటూ న్యూటన్ ని వ్యతిరేకిస్తూ రాశాడు. విమర్శ అంటేనే గిట్టని న్యూటన్ ఇలాంటి మాటలకి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. అయినా కోపాన్ని బయటికి ప్రకటించకుండా జవాబు ఇవ్వకుండా ఊరుకున్నాడు.
ఇలా ఉండగా న్యూటన్ కాంతి శాస్త్రం మీద రాసిన పత్రాన్ని ఇతర శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారిలో ఒకడు హోలాండ్ కి చెందిన క్రిస్టియాన్ హైగెన్స్. న్యూటన్ ప్రతిపాదించిన రంగుల సిద్ధాంతంఅత్యంత ప్రతిభావంతమైనదిఅంటూ హైగెన్స్ సిద్ధాంతాన్ని పొగిడాడు. యూరప్ లో అత్యున్నత స్థాయికి చెందిన తాత్వికుడైన హైగెన్స్ నుండి  అలాంటి ప్రశంస రావడం నిజంగా గొప్ప విషయమే.

ఒక పక్కన ప్రముఖల సమ్మతి లభిస్తుంటే మరో పక్క కొందరు అప్రముఖుల వ్యాఖ్యానాలు న్యూటన్ కి చికాకు కలిగించాయి. సర్ రాబర్ట్ మోరే రాయల్ సొసయిటీ కి మాజీ అధ్యక్షుడు. న్యూటన్ పట్టకాలతో చేసిన   కీలక ప్రయోగం’ (experimentum crucis)  ఇతగాడు చెయ్యడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. అందుకు బదులుగా మరేవో పనికిమాలిన ప్రయోగాలు చేస్తే బాగుంటుందేమో నని పెద్దమనిషి చేసిన సూచనని న్యూటన్ పట్టించుకోలేదు.

అలాగే ఫ్రాన్స్ నుండి ఇగ్నన్స్ గాస్టన్ పార్దీస్ అనే వ్యక్తి న్యూటన్ ప్రయోగాల మీద వ్యాఖ్యానిస్తూ బారైన ఉత్తరం రాశాడు. పార్దీస్ భాషా శాస్త్రంలో ఆచార్యుడే కాకుండా ఒక రోమన్ కాథలిక్ ప్రవచకుల బృందంలో సభ్యుడు కూడా. ప్రయోగం చెయ్యలేని చాతకాని తనాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రవచకుడు చేసిన వ్యాఖ్యానం ససేమిరా నచ్చని న్యూటన్నేను సాధించిన ఫలితాలని నిర్ధారించడం కష్టమే. కాని వాటిని కచ్చితంగా నిర్ధారించుకున్నాను కనుకనే అవి నిజాలని బల్ల గుద్ది చెప్తున్నాను. అలా చెయ్యకపోయి వుంటే అవన్నీ వట్టి ఊహాగానాలని  నేనే ఎప్పుడో త్రోసి పుచ్చి వుండేవాణ్ణి,” అంటూ కాస్త దురుసుగా జవాబు చెప్పాడు.

జాబు చదివిన పార్దీస్ సారి తన వాదనని కాస్త సవరించుకున్నాడు కాని మళ్లీ న్యూటన్ కి రాశాడు. సారి ఉత్తరంలో కొత్త సంశయాన్ని వెలిబుచ్చుతూ, ప్రయోగాలు చెయ్యడంలో న్యూటన్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ రాశాడు. వ్యాఖ్యానం చదివి ఒళ్లు మండిన న్యూటన్, ప్రయోగాలు చెయ్యడం ఎవరికి రాదో సారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచిస్తూ, ఊరికేతత్వం మాట్లాడకుండాకచ్చితంగా ప్రయోగాలు చేసి ఎవరికి వారు విషయాలని ఋజువు చేసుకోవడం నేర్చుకోవాలిఅని గుర్తుచేస్తూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. న్యూటన్ రాసిన రాతలు చదివిన పర్దీస్ కి మరి ఏం జ్ఞానోదయం కలిగిందో తెలీదు. సారి న్యూటన్ చెప్పినట్లే ముఖ్యమైన ప్రయోగం చేసి న్యూటన్ సిద్ధాంతాన్ని స్వయంగా నిర్ధారించుకున్నాడు. “కీలక ప్రయోగం విషయంలో నాకు వుండే ఆఖరి సంశయం తొలగిపోయిందిఇంతవరకు అర్థం కాని విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యిందిఇంక నాకు సందేహాలూ లేవు,” అంటూ రాయల్ సొసయిటీ సెక్రటరీ అయిన ఓల్డెన్ బర్గ్ కి సవినయంగా ఉత్తరం రాశాడు.

చిన్న కష్టం తొలగిపోయింది అనుకుంటే పెద్ద కష్టం మళ్లీ దాపురించింది. పార్దీస్ తో తగాదా ఆగిపోయింది అనుకుంటే హూక్ మళ్లీ అందుకున్నాడు. ‘కాంతి తరంగమా కణమా అన్న ప్రశ్నకి న్యూటన్ సరైన సమాధానం చెప్పలేదుఅంటూ హూక్ తన పాత పాట అందుకున్నాడు. సారి రాయల్ సొసయిటీ కి సెక్రటరీ అయిన ఓల్డెన్ బర్గ్హూక్ విమర్శకి వీలైనంత వినమ్రంగా, ఎవరి పేర్లూ పేర్కొనకుండా, రాయవలసిందిఅని న్యూటన్ కి సూచించాడు. న్యూటన్ అలాగే అన్నాడు గాని  అతడి స్పందన వైజ్ఞానిక పత్రంలా లేదు. హూక్ మీద రాసిన నిష్ఠూరాల దండకంలా వుంది!  కాంతి ఒక తరంగమా, కణమా  సైద్ధాంతికంగా తేల్చమని ఊరికే ఒత్తిడి చెయ్యడం వల్ల లాభం లేదు. అంతగా సత్తా వున్న వాడైతే  హూక్ మహాశయుడు నేను చేసిన కీలక ప్రయోగాన్ని తను కూడా చేసి అవే ఫలితాలు సాధించిగలిగితే, అప్పుడు  మళ్లీ నాకు కబురు పెడితే బావుంటుందిఅంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts